బీసీలు ‘కాపు’ కాచేనా?

Update: 2017-12-12 15:30 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్షం తన ఎన్నికల వ్యూహాన్ని మార్చింది. తెలుగుదేశం పార్టీకి వ్యవస్థాపన దగ్గర్నుంచి వెన్నుదన్నుగా ఉంటూ వస్తున్న వెనుకబడిన తరగతుల ప్రజలను లక్ష్యంగా చేసుకుంటూ మేనిఫెస్టోని ముందుకు తెచ్చేందుకు పథకం సిద్దం చేస్తోంది. మారిన సమీకరణల నేపథ్యంలో బీసీలను పార్టీకి చేరువ చేయాలనే ఉద్దేశంతో ప్రత్యేక ప్రణాళికను రూపొందించేందుకు ఆయా సామాజిక వర్గాల్లోని కీలక నేతలకు గాలం వేస్తోంది. బీసీల స్థితిగతులను అధ్యయనం చేసేందుకు ఒక ప్రత్యేక కమిటీని నియమించారు. బీసీ సబ్ ప్లాన్, ఉద్యోగ కల్పన హామీ, రుణ మంజూరు, సంక్షేమ పథకాల్లో జనాభా నిష్పత్తిని బట్టి గృహ, మౌలిక సదుపాయాలకు నిధుల కేటాయింపు వంటి వాటిపై దృష్టి పెట్టాలని వై.సి.పి. భావిస్తోంది. ప్రశాంత్ కిశోర్ బృందం ఈ మేరకు ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా కొంత సమాచారాన్ని సేకరించింది. దానికి రాజకీయ పరమైన అధ్యయనాన్ని కూడా జోడించి ప్రజల్లోకి తీసుకెళ్లాలని వై.ఎస్.ఆర్ కాంగ్రెసు పార్టీ అధినాయకత్వం నిర్ణయించింది. ఒక కులంగా కాకపోయినా సామాజిక వర్గాలుగా చీలిపోయి ఉన్న బీసీలను ఆకట్టుకోగలిగితే 2019 ఎన్నికలలో సులభంగా విజయం సాధించవచ్చని ఆ పార్టీ అంచనా వేస్తోంది.

మచ్చిక చేస్తే మంచిదేగా..

ఆంధ్రప్రదేశ్ జనాభాలో అన్నికులాలను కలిపి చూస్తే బీసీ వర్గాల జనాభా 42 శాతం వరకూ ఉంటుందని అంచనా. వీరి తర్వాత కాపులు, ఎస్సీలు జనాభా నిష్పత్తిలో అధిక సంఖ్యలో కనిపిస్తారు. దళిత, రెడ్డి, మైనారిటీ వర్గాల్లో తెలుగుదేశం పార్టీకి పెద్దగా ఓటు బ్యాంకు లేకపోయినప్పటికీ బీసీలను ప్రాతిపదికగా చేసుకుంటూ ఆధిక్యం సాధిస్తోంది. కమ్మ, బీసీ కులాల్లో మెజార్టీ ఓటర్లు టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నట్లుగా ఎన్నికల ఫలితాలు గతం నుంచీ నిర్ధారిస్తున్నాయి. 2014లో సానుభూతి పవనాల కారణంగా బీసీ ఓట్లలో కూడా గణనీయమైన నిష్పత్తిలోనే చీలిక వచ్చి వై.సి.పి వైపు ఓట్లు వెళ్లాయి. అయితే పవన్ కల్యాణ్ కారణంగా మెజార్టీ కాపు ఓట్లు టీడీపీ ఖాతాలోజమ కావడంతో బీసీ ఓట్లకు పడిన గండిని పూడ్చుకుని తెలుగుదేశం విజయం సాధించింది. మైనారిటీ, దళిత్, రెడ్డి కాంబినేషన్ వై.సి.పి వైపే మొగ్గు చూపింది. ఈ మూడు వర్గాల సమీకరణ కలిపితే జనాభాలో 30 శాతం వరకూ చేరుకుంటోంది. ఇంకో పదిహేను శాతం ఇతర వర్గాల ఓట్లను దక్కించుకోగలిగితే అధికారం చేరువ అయినట్లే అని వై.సి.పి. అంచనా. కాపులకు రిజర్వేషన్ల హామీ నిచ్చిన తెలుగుదేశం దానిని అమలు చేయలేదు. కాబట్టి కాపు వర్గీయులు తమ వైపు నకు వస్తారని వై.సి.పి. ఇటీవలి కాలం వరకూ ఆశించింది. ఈ ఉద్దేశంతోనే ముద్రగడ ఉద్యమానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా అండగా నిలిచింది. కానీ చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో బిల్లు పెట్టి రిజర్వేషన్లపై తీర్మానం చేసి కేంద్రానికి పంపేశారు. తాను చేయాల్సిందంతా చేశానని చెప్పుకొనేందుకు అవసరమైన ప్రాతిపదిక సిద్దం చేసుకున్నారు. మరోవైపు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆర్థికంగా ఏడాదికి వెయ్యి కోట్ల రూపాయల వరకూ సాయం అందించేందుకు కూడా ప్రయత్నిస్తున్నారు. దీనివల్ల కాపుల్లో టీడీపీ పై పూర్త వ్యతిరేకత వచ్చే అవకాశాలు కొంతమేరకు తగ్గుముఖం పట్టాయి. మరోవైపు పవన్ కల్యాణ్ జనసేన రూపంలో రంగంలో ఉంటానని స్పష్టం చేస్తున్నారు. రిజర్వేషన్లు, టీడీపీ సంగతి ఎలా ఉన్నప్పటికీ వచ్చే ఎన్నికల్లో కాపులు జనసేనకే ఓటేస్తారని వై.సి.పి. భావిస్తోంది. సో, కాపు ఓట్లు తమకెలాగూ దక్కవు కాబట్టి టీడీపీ వైపు మొగ్గు చూపుతున్న బీసీలను ఆకట్టుకుంటే తమ సమీకరణకు అవసరమైన మెజార్టీ దక్కించుకోవచ్చనే వ్యూహంలో బాగంగా వై.సి.పి పావులు కదుపుతోంది.

వాస్తవాలను వడ్డిస్తే చాలు...

కాంగ్రెసు హయాంలో రాజకీయంగా తమకు ప్రాధాన్యం లభించడం లేదన్న భావనతో బీసీలు తెలుగుదేశం వైపు మొగ్గు చూపుతూ వస్తున్నారు. కాంగ్రెసు ఓటు బ్యాంకుతో పాటు వారసత్వాన్ని కూడా దక్కించుకున్న వై.సి.పి కూడా బీసీలను పట్టించుకోదేమోనన్న భావన ఆవర్గాల్లో కొనసాగుతోంది. బీసీల రాజకీయ, సామాజిక ఆకాంక్షల విషయంలో కాంగ్రెసు పార్టీ వైఖరికి తాము పూర్తి భిన్నంగా ఉంటామన్న అంశాన్ని ఆయా వర్గాల్లోకి తీసుకెళ్లాలని వై.సి.పి భావిస్తోంది. 2014 ఎన్నికల్లో ఈ సంగతిని పెద్దగా పట్టించుకోకపోవడం వల్ల నష్టం వాటిల్లిందనే అంచనా కు వచ్చారు. బీసీలను నిర్లక్ష్యం చేసిన కాంగ్రెసు పాపాలు తమను కూడా పట్టి పీడిస్తున్నాయని వై.సి.పి. అగ్రనాయకత్వం అనుకుంటోంది. జిల్లాల వారీ బలమైన బీసీ నాయకత్వాన్ని నిర్మించి వారికి పార్టీ పదవులు కల్పించడం ద్వారా తమపై నెలకొన్న అపోహలను తొలగించాలని యోచిస్తున్నారు. అదే సమయంలో తాజాగా కలిసి వస్తున్న అంశం తెలుగుదేశం కాపులకు రిజర్వేషన్లపై అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టడం. కాపులకు రిజర్వేషన్లు ఇవ్వడం ద్వారా బీసీల ప్రయోజనాలు దెబ్బతింటాయన్న విషయాన్ని టీడీపీకి వ్యతిరేకంగా ప్రయోగిస్తే సరిపోతుందనుకుంటున్నారు. జనాభాలో 42 శాతం మేరకు ఉన్నప్పటికీ నిధుల వినియోగంలోనూ, పదవుల పంపిణీలోనూ వారికి తగినంత ప్రాతినిధ్యం టీడీపీ ప్రభుత్వం కల్పించని విషయాన్ని గణాంకాలతో నిరూపించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇందుకు అవసరమైన సమాచారాన్ని సేకరిస్తున్నారు. కాపుల ఓట్లు ఎలాగూ తమకు వచ్చే అవకాశాలు అంతంతమాత్రమే. కనీసం మెజార్టీ బీసీ ఓట్లను అయినా టీడీపీ నుంచి దూరం చేస్తే తమ రొట్టె విరిగి నేతిలో పడుతుందనే అంచనాతో ఉంది వై.సి.పి. నాయకత్వం.

టీడీపీ డీలా...

తెలుగుదేశం సామాజిక సమీకరణల విషయంలో కొంత ఇబ్బందికరమైన పరిస్థితినే ఎదుర్కొంటోంది. కేవలం అసెంబ్లీ తీర్మానం ద్వారా రిజర్వేషన్లు రావు. జనసేన విడిగా రంగంలోకి దిగితే కాపుల ఓట్లు టీడీపీకి పడటం అనేది కలలోని మాట. ఇంకోవైపు బీసీలు ఆందోళన చెందుతున్నారు. కాపులకు ఇంకా రిజర్వేషన్లు చట్టబద్దం కాలేదు. అయినా తమకు అన్యాయం జరుగుతోందంటూ బీసీ నాయకులను వై.సి.పి. రెచ్చగొడుతోంది. ఈ ప్రయత్నం ఫలిస్తే టీడీపీకి రాజకీయ నష్టం తప్పదు. అందువల్ల కాపు రిజర్వేషన్ల విషయంలో సాధ్యమైనంత లో ప్రొఫైల్ మెయింటెయిన్ చేయాలనేది అధిష్ఠానం నుంచి టీడీపీ శ్రేణులకు అందుతున్న సమాచారం. అటు కాపులూ విశ్వసించక, ఇటు తమనే నమ్ముకున్న బీసీలూ దూరమైతే ఓటు బ్యాంకుకు భారీగా చిల్లు పడటం ఖాయమని టీడీపీ నాయకులే చెబుతున్నారు. తెలుగుదేశం రెంటికీ చెడ్డ రేవడి కాకుండా ఉండాలంటే ప్రతివ్యూహంతో బీసీలను ఆకట్టుకోవాలంటున్నారు. బీసీలు చెయ్యిస్తే టీడీపీకి ఇబ్బందులు తప్పవు. కమ్మ సామాజిక వర్గాన్ని,బీసీలను మినహాయిస్తే మిగిలిన వర్గాల నుంచి శాశ్వతమైన సాలిడ్ ఓటు బ్యాంకు టీడీపీ ఇప్పటికీ నిర్మించుకోలేకపోయింది.

 

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News