బీజేపీ బలం పెరుగుతోందా?

Update: 2018-03-27 16:30 GMT

పెద్దల సభలో అధికార భారతీయ జనతా పార్టీ బలం క్రమంగా పెరుగుతోంది. నిన్న మొన్నటి దాకా రెండో అతి పెద్ద పార్టీగా ఉన్న కమలం ఇప్పుడు అతి పెద్దపార్టీగా అవతరించింది. ఇప్పటిదాకా విపక్ష కాంగ్రెస్ ఈ స్థానంలో ఉంది. ఇటీవల జరిగిన రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో అధిక స్థానాలు గెలుచుకోవడం ద్వారా కమలనాధులు మొడటి స్థానంలో ఉన్నారు. 245 స్థానాలు గల సభలో కమలనాధుల సొంత బలం 68. కూటమిగా వారి బలం 86. ఇక 54 స్థానాల్లో కాంగ్రెస్ రెండో అతి పెద్ద పార్టీగా నిలిచింది. యూపీఏ కూటమి 68 స్థానాలతో ఇప్పటికీ చక్రం తిప్పగల పరిస్థితుల్లో ఉంది. అయినప్పటికీ ఎగువ సభలో బీజేపీకి సొంత మెజారిటీ రావడం కష్టమే. 2019 ఎన్నికల తర్వాతే బలం చేకూరగలదు. అప్పటిదాకా బిల్లులు నెగ్గించుకునేందుకు మిత్రులు, స్వతంత్రులపై ఆధారపడక తప్పని పరిస్థితి కమలనాధులది.

బలం సరిపోక పోయినా.....

ప్రస్తుతం ఎన్డీఏ కూటమిలో బీజేపీ 68, జనతాదళ్ (యు) 6, శివసేన 3, అకాళీదళ్ 3, పీపుల్స్ డెమొక్రటిక్ ఫ్రంట్ 2, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అధవాలే), సిక్కిం డెమొక్రటిక్ ఫ్రంట్, బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్, నాగా పీపుల్స్ ఫ్రంట్ ఒక్కోస్థానాన్ని కలిగి ఉన్నాయి. నిజానికి వివిధ బిల్లులను నెగ్గించుకోవడానికి ఈ బలం చాలదు. బిల్లుల ఆమోదానికి మొత్తం 245 మంది సభ్యుల్లో సగం అంటే 123 మంది మద్దతు అవసరం. అందువల్ల స్వతంత్రులు, తటస్థ సభ్యుల మద్దతు అనివార్యం. 8 మంది నామినేటెడ్, 30 మంది తటస్థులు, మరికొన్ని చిన్నా చితకా పార్టీలు సాధారణంగా అధికార పార్టీకి అండగా నిలుస్తుంటారు. నేరుగా మద్దతు ఇవ్వక పోయినా, కీలక సందర్భాల్లో గైర్హాజయినా అధికార పార్టీకి మేలు చేసినట్లే అవుతుంది.

ఇప్పటి వరకూ ఇబ్బందులు....

ఇప్పటివరకూ తగినంత మెజారిటీతోనే అధికార పార్టీ అనేక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. లోక్ సభలో సంపూర్ణ మెజారిటీ ఉన్నప్పటికీ రాజ్యసభలో సంకట పరిస్థితి ఎదుర్కొనేది. రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలు కమలం పార్టీకి బాగా కలిసి వచ్చాయి. కాంగ్రెస్ నుంచి ఎక్కువమంది పదవీవిరమణ చేయగా, బీజేపీ నుంచి కొత్తగా చాలా మంది ఎన్నికయ్యారు. ఇందులో సింహభాగం యూపీ నుంచే ఎన్నికయ్యారు. ఇక్కడి నుంచి మొత్తం పది మంది సభ్యులు ఎన్నికవ్వగా వారిలో 9 మంది కమలనాధులే. ఒక్క స్థానాన్ని సమాజ్ వాదీ పార్టీ గెలుచుకుంది. వాస్తవానికి బీజేపీ బలం 8 మందిని గెలిపించుకోవడానికే సరిపోతుంది. కాని 9వ అభ్యర్థిని నిలబెట్టి, విపక్ష కూటమిని చీల్చడం ద్వారా ద్వితీయ ప్రాధాన్య ఓట్ల ద్వారా విజయం సాధించింది. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, ఆంధ్రప్రదేశ్ కు చెందిన పార్టీ జాతీయ అధికార ప్రతనిధి జీవీఎల్ నరసింహారావు తదితరులు ఉత్తరప్రదేశ్ నుంచి పెద్దల సభకు ఎన్నికయ్యారు.

వ్యూహాత్మకంగా వ్యవహరించి....

పెద్దల సభ ఎన్నికల్లో అధికార బీజేపీ వ్యూహత్మకంగా వ్యవహరించి విజయం సాధించింది. వాస్తవానికి యూీపలో బీజేపీ బలం 8 సభ్యులను ఎన్నుకునేందుకే సరిపోతుంది. అయినప్పటికీ తొమ్మిదో అభ్యర్థిని బరిలోకి దింపింది. అయితే తన అభ్యర్థిని నిలపకుండా స్వతంత్ర అభ్యర్థి అనిల్ కుమార్ అగర్వాల్ కు మద్దతిచ్చింది. ఈయనకు పోటీగా బీఎస్పీ తన అభ్యర్థి అంబేద్కర్ ను రంగంలోకి దించింది. ఉత్కంఠ భరితంగా పోటీ జరిగింది. తొలి ప్రాధాన్య ఓట్లలో ఇద్దరిలో ఏ ఒక్కరి విజయానికి సరిపడే 37 మంది సభ్యుల మద్దతు లభించలేదు. దీంతో రెండో ప్రాధాన్య ఓట్లను లెక్కించాలని పోలింగ్ అధికారులు నిర్ణయించారు. అయితే ఈ పరిస్థితిని ముందుగానే ఊహించిన బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. తొలి 8 మంది అభ్యర్థులకు 39 మంది ఎమ్మెల్యేలను కేటాయించింది. ఇక రెండో ప్రాధాన్య ఓట్లను లెక్కించాల్సి వచ్చినప్పుడు 8మంది అభ్యర్థులకు అదనంగా పడిన తొలి ప్రాధాన్య ఓట్లను లెక్చించడంతో బీజేపీ మద్దతిచ్చిన అనిల్ అగర్వాల్ విజయకేతనం ఎగురవేశారు. ఏప్రిల్ 2న ఖాళీ కానున్న మొత్ం 59 స్థానాలకు నోటిఫికేషన్ వెలువడగా 33 ఏకగ్రీవమయ్యాయి. వాటిల్లో 16 బీజేపీ పరమయ్యాయి. ఎన్నికలు జరిగిన 26 స్థానాల్లో 12 బీజేపీ గెలుచుకుంది.

పడిపోయిన యూపీఏ బలం....

ఇక కాంగ్రెస్ బలం 54 స్థానాలకు పడిపోయింది. కూటమిగా యూపీఏ బలం 68 స్థానాలకు తగ్గింది. కూటమిలోని రాష్ట్రీయ జనతాదళ్ 5, నేషనల్ కాంగ్రెస్ పార్టీ 4, డీఎంకే 4, ఇండియన్ యూనియన్ ఆఫ్ ముస్లిం లీగ్ ఒక స్థానాన్ని కలిగి ఉన్నాయి. టీఎంసీకి చెందిన 13 మంది, సమాజ్ వాదీ పార్టీకి చెందిన 11 మంది, ఇతర పార్టీల సభ్యులు, వీరితో పాటు బీఎస్పీ 4, టీడీపీ 6, ఆమ్ ఆద్మీ పార్టీ 3, అజిత్ సింగ్ ఆధ్వర్యంలోని ఇండియన్ నేషనల్ లోక్ దళ్, కేరళ కాంగ్రెస్ (మణి), జనతాదళ్ (సెక్యులర్) ఒక్కొక్కరు సభ్యులు కలిగి ఉన్నారు. వీరు కూడా ఇతర పార్టీల సభ్యులే. అదే సమయంలో తమిళనాడుకు చెందిన 13 మంది అన్నాడీఎంకే సభ్యులు, బిజూ జనతాదళ్ కు చెందిన 9 మంది, తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన ఆరుగురు, వైసీపీకి చెందిన ఇద్దరు సభ్యులు తటస్థంగా ఉన్నారు. వీరంతా అధికార పార్టీకి మద్దతు ఇచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయి. సీపీఎంకు చెందిన 5గురు, సీపీఐకి చెందిన ఏకైక సభ్యుడు సహజంగా ప్రభుత్వ వ్యతిరేక శిబిరంలోనే ఉంటారు. మొత్తం 8మంది నామినేటెడ్ సభ్యుల్లో ముగ్గురు వచ్చే నెల్లో పదవీ విరమణ చేయనున్నారు. వారి స్థానంలో ముగ్గురిని ప్రభుత్వం నామినేట్ చేయనుంది. సహజంగా నామినేట్ సభ్యులు ప్రభుత్వానికి అండగా నిలవడం ఆనవాయితీగా వస్తుంది. మొత్తం మీద వచ్చే రోజుల్లో పెద్దల సభలో అధికార బీజేపీకి పెద్దగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం లేదు. పెరిగిన బలంతో విపక్షాలను సమర్థంగా ఎదుర్కొనే శక్తి లభిస్తుంది. వారి విమర్శలను, ఆరోపణలను తిప్పికొట్టే శక్తి కమలనాధులకు కలుగుతుంది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News