బీజేపీ ద‌క్షిణాది ఆశ‌లు గల్లంతే..!

Update: 2017-11-14 13:30 GMT

ద‌క్షిణాది రాష్ట్రాల్లో ఎలాగైనా పాగా వేయాల‌ని బీజేపీ పెద్ద‌లు తీవ్రంగా ప్ర‌య‌త్నాలు చేస్తూనే ఉన్నారు. 2014 ఎన్నికల త‌ర్వాత మోదీ హ‌వా విప‌రీతంగా పెర‌గ‌డం.. ఇత‌ర రాష్ట్రాల ఎన్నిక‌ల్లో బీజేపీ జ‌య‌కేతనం ఎగ‌ర‌వేయ‌డంతో ద‌క్షిణాది రాష్ట్రాల్లో కాషాయ జెండా రెప‌రెప‌లాడటం చాలా సుల‌భ‌మ‌ని వీరంతా బ‌లంగా విశ్వ‌సించారు. కానీ రోజులు మారుతున్న కొద్దీ.. ఈ అభిప్రాయం మార్చుకోక త‌ప్ప‌డం లేదు. తొలుత నోట్ల‌ర‌ద్దు, ఇప్పుడు జీఎస్టీ వంటి నిర్ణ‌యాలతో ప‌రిస్థితి పూర్తిగా మారిపోయింద‌ని తెలుస్తోంది. ఇక సొంతంగా ఎద‌గడ‌మ‌నే ఆలోచన ఇక మానుకోక త‌ప్ప‌ద‌నేది విశ్లేషకులు అభిప్రాయ‌పడుతున్నారు. బీజేపీకి ద‌క్షిణాది రాష్ట్రాల్లో అంత సీన్ లేదని స్ప‌ష్టంచేస్తున్నారు.

కాంగ్రెస్ కంటే బీజేపీ పైనే....

ముందుగా ఏపీ విష‌యానికొస్తే బీజేపీ ప్రభుత్వం నమ్మించి గొంతు కోసిందన్న అభిప్రాయం రాష్ట్ర ప్రజల నుంచి సర్వత్రా వ్యక్తమ‌వుతోంది. ప్ర‌త్యేక‌హోదా, రైల్వేజోన్‌, నిధులు.. ఇలా ప్ర‌తి అంశంలోనూ ఏపీకి మొండిచేయి చూపిస్తూనే ఉంది. హామీల‌ను తుంగ‌లో తొక్కింది. ఇక ఏదోలా నెట్టుకొస్తున్న సీఎం చంద్ర‌బాబుకు అడ్డంకులు సృష్టిస్తోంది. కాంగ్రెస్‌ కన్నా బీజేపీనే ఎక్కువ ద్రోహం చేసిందన్న భావన వారిలో నిరంతరం వ్యక్తమ‌వుతూనే ఉంది. ఢిల్లీ స్థాయిలో ఆంధ్రాకు అండగా ఉన్న వెంక‌య్య‌ను రాష్ట్రానికి దూరం చేసింది. ఇవ‌న్నీ ప్ర‌జ‌ల్లో నాటుకుపోయాయి. ఇక త‌మిళ‌నాడులో అమ్మ మ‌ర‌ణం త‌ర్వాత కేంద్రం వ్య‌వ‌హ‌రించిన తీరును త‌మిళ తంబీలు ఎప్పుడూ మ‌రిచిపోరు.

తెలంగాణాలోనూ....

జయ లలిత‌ మరణంపై కేంద్రం నివేదిక విడుదల చేయాల్సి ఉన్నా.. ఆమె మరణాన్ని తమ రాజకీయ ఎదుగుదలకు వాడుకోవాలన్న దానిని గ్రహించిన తమిళులు వారికి బుద్ధి చెప్పడానికి సిద్ధం అవుతున్నారు. అన్నదాతలను ఆదుకోవాలని ఢిల్లీలో తమిళ రైతులు పలుసార్లు తీవ్రస్థాయిలో నిరసన తెలిపినా మోడీ ప‌ట్టించుకోలేద‌నే అభిప్రాయం వీరిలో ఉంది. ఇక తెలంగాణ‌లో టీఆర్ఎస్‌కు పోటీ తామేన‌ని గ‌తంలో చెప్పిన నేత‌లు.. ఇప్పుడు చెప్ప‌లేక‌పోతున్నారు. రేవంత్‌రెడ్డి అండ్ గ్యాంగ్ కాంగ్రెస్‌లో చేర‌డంతో ఇప్పుడు అక్క‌డ బీజేపీని ప‌ట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. ఇక కేరళలో వామపక్షాలతో నిత్య శతృత్వం పెంచుకుని ఆ రాష్ట్రాన్ని రావణకాష్టంగా మార్చేసింది. కేరళ హత్యలతో అట్టుడుకుతోంది. వీటికి కేంద్రం, ఆర్‌ఎస్‌ఎస్‌లే కారణమ‌ని కేర‌ళ వాసులు బ‌లంగా విశ్వ‌సిస్తున్నారు.

ఇక్కడా అంత ఈజీ కాదు....

ఇక ఒడిశాలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. ఈ ధీమాతోనే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమదే పీఠం అని గట్టిగా నొక్కి వక్కాణిస్తోంది. అయితే నోట్లరద్దు, జీఎస్టీల ప్రభావం ఒడిశా ప్రజలపై ఉంది. కేంద్రంలో గత నాలుగేళ్ల నుంచి ఉన్న బిజెపి ప్రభుత్వం తమకు ఒరగబెట్టిందేమీ లేదనే అభిప్రాయం ఇక్కడా వ్యక్తమ‌వుతోంది. ఇక కర్ణాటకలో బీజేపీ పరిస్థితి మొన్నటి దాకా ఆశాజనకంగానే ఉంది. ప్రస్తుతం కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి నెలకొంది. కాంగ్రెస్‌ నేతల కన్నా బీజేపీ నేతలే ఎక్కువ అవినీతి పరులని వారు అభిప్రాయ‌పడుతు న్నార‌ట‌. పార్టీ ప‌రంగా ఎలా ఉన్నా సీఎం సిద్ధ‌రామ‌య్య‌పై క‌ర్ణాట‌క జ‌నాల్లో న‌మ్మ‌కం ఉంది. దీంతో అక్క‌డ బీజేపీకి గ‌తంలో ఉన్నంత దూకుడు అయితే క‌న‌ప‌డ‌డం లేదు. దక్షిణాదిలోని ఆరు రాష్ట్రాల్లో ఎదుగుదామని భావించిన నేత‌ల ఆశ‌లు మ‌రీ అంత వీజీకాద‌న్న‌దే రాజ‌కీయ విశ్లేష‌కుల తాజా అభిప్రాయం.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News