బాబుకు కత్తిమీద సామే...!

Update: 2018-01-01 03:30 GMT

దేశంలోని సీనియర్ ముఖ్యమంత్రుల్లో ఒకరైన చంద్రబాబు నాయుడి రాజకీయ నైపుణ్యానికి, పాలన సామర్ధ్యానికి పరీక్షలు పెట్టింది 2017. అటు కేంద్రంతో ఆచితూచి వ్యవహరిస్తూ, ఇటు రాష్ట్రంలోని ఆర్థిక ఇబ్బందులను తట్టుకుంటూ, మరోవైపు నూతన రాజధానిని పరిపాలన కేంద్రంగా మార్చడంలో తలమునకలవుతూ కత్తిమీద సాములా గడిచిందీ సంవత్సరం. హైదరాబాదు వాసానికి అలవాటు పడిన యంత్రాంగం ఇంకా ఆంధ్రారాజధాని అమరావతి వైపు తరలడానికి తటపటాయిస్తున్న దృష్ట్యా పాలన ఇంకా కుదుటపడలేదు. రాజకీయంగా ఎత్తుపైఎత్తులతో ప్రధాన ప్రతిపక్షాన్ని బలహీనపరచగలిగారు. అదే సమయంలో అంతర్గత కుంపట్లు రగులుకుంటున్నాయి. బెంబేలెత్తిస్తున్న ఖజానా, అడుగు ముందుకు పడని అభివృద్ధి,కేంద్రంతో సమస్యలు బ్యాలెన్సింగ్ చేసుకోవడంతోనే ఈ సంవత్సరం సరిపోయింది.

ఆర్థిక ఇక్కట్లు..

వ్యాపార,పారిశ్రామిక, వాణిజ్య రంగాల్లో పరిపుష్టిగా ఉన్న రాష్ట్రాలతోనూ, జనాభా రీత్యా పెద్దవైన రాష్ట్రాలతోనూ ఆంధ్రప్రదేశ్ పోటీ పడుతోంది. వాళ్ల మాదిరిగా ఆదాయం తెచ్చుకోవడంలోనూ,జనాభా అవసరాలకు అనుగుణంగా నిధుల సర్దుబాటులోనూ కాదు, అప్పులు తెచ్చుకోవడంలో. వాస్తవ పరిస్థితులను పూర్తిగా విస్మరించి అప్పుదొరికితే చాలు దూసి తెస్తోంది ఆంధ్రప్రదేశ్. ఉత్తరప్రదేశ్ జనాభాతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ నాలుగోవంతు. పశ్చిమబంగ జనాభాలో సగానికే పరిమితం. కానీ ఆర్థికంగా కష్టాల్లో ఉన్న ఈ రెండు రాష్ట్రాలతో పోటీ పడుతూ రుణ సంక్షోభంలో కూరుకుంది ఏపీ. వినోద, వాణిజ్య, పారిశ్రామిక సేవా రంగాల్లో మహారాష్ట్ర కు లభించే ఆదాయం చాలా ఎక్కువ. వ్యాపార,పారిశ్రామిక రంగాల్లో గుజరాత్, పారిశ్రామిక రంగంలో చెన్నై కు ఆదాయం ఎక్కువ. వీటికి అప్పు తీర్చే సామర్థ్యం కూడా ఎక్కువ. జనాభా, ఆదాయ నిష్పత్తి తో పోలిస్తే తాజాగా కేంద్ర ప్రభుత్వ అంచనాల ప్రకారం ఆయా రాష్ట్రాల కంటే 50 శాతం ఎక్కువ నిష్పత్తిలో ఆంధ్రప్రదేశ్ అప్పులు చేస్తోంది. వడ్డీతో కూడిన వాయిదాల చెల్లింపు సామర్థ్యం ఏపీకి 40శాతం మేరకే ఉన్నట్లు అంచనా. అంటే వంద రూపాయల వాయిదా చెల్లించాల్సి ఉంటే ఏపీ సొంత వనరుల నుంచి సమకూర్చుకోగలిగిన మొత్తం 40 రూపాయలు మాత్రమే. మిగిలిన 60 రూపాయలు కొత్తగా అప్పు తెచ్చి పాత అప్పునకు వాయిదా చెల్లించాలి. కనీసం 50 శాతం వాయిదా చెల్లింపు సామర్థ్యం కంటే పరిస్థితి క్షీణిస్తే దివాలా తీసినట్టుగానే చూడాలి. గడచిన మూడు సంవత్సరాలుగా ఇదే పరిస్థితి. ఇప్పటికే ప్రభుత్వ రుణభారం రెండు లక్షల 25 వేల కోట్ల రూపాయలకు చేరింది. ఏపీలోని ప్రతిమనిషి తల మీద 50 వేల రూపాయల అప్పు చేరింది. తాజాగా ఎన్నికల సంవత్సరం ప్రవేశించనుండటంతో కొత్త పథకాలకు రూపకల్పన చేస్తున్నారు. మరో 20 వేల కోట్ల రూపాయల భారం ఖజానాపై పడేలా కొత్తగా సంక్షేమ, పింఛను, రాయితీ, నిరుద్యోగ భ్రుతులను అమలు చేయాలని సర్కారు భావిస్తోంది. నేల విడిచి సాము చేస్తున్న ధోరణి ఆర్థిక రంగంలో కనిపిస్తోంది.

అడుగడుగునా ఆటంకాలు...

ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనలకు, ఆచరణలో జరుగుతున్నదానికి పొంతన కుదరడం లేదు. ఈ ఏడాది అనేక లక్ష్యాలను సాధించాలని పెట్టుకున్నప్పటికీ ఏ ఒక్క విషయంలోనూ నూటికి నూరు శాతం ఫలితాలను సాధించలేకపోయారు. డిజైన్లు ఖరారు చేసి , రాజధాని శాశ్వతభవనాలకు ఈఏడాది విజయదశమి నాడు శంకుస్థాపన చేయాలని భావించారు. 2018 చివరి నాటికి అమరావతి భవనాలను ఒక కొలిక్కి తేవాలనేది ప్రణాళిక. కానీ ఇంతవరకూ డిజైన్లే ఫైనల్ చేయలేకపోయారు. ఎన్నికల వరకూ అమరావతి పాలన తాత్కాలిక భవనాల్లోనే కొనసాగే పరిస్థితి కనిపిస్తోంది. ప్రతిష్ఠాత్మకమైన పోలవరం పనులు నిలిచిపోయాయి. 2018 మార్చి నాటికి కాఫర్ డ్యాం పూర్తి చేసి పల్లం ఆధారంగా నీళ్లిచ్చేయాలని చంద్రబాబు భావించారు. మూడు నెలలుగా ప్రాజెక్టు పనులు పడకేశాయి. పెరిగిన అంచనాలకు ఆమోదం లభించలేదు. ప్రధాన కాంట్రాక్టరును తప్పించడం కుదరదంటూ కేంద్రం మెలిక పెడుతోంది. సబ్ కాంట్రాక్టుల టెండర్లకు మోకాలడ్డుతోంద. ఉత్తరాంధ్రలో సెంటిమెంటుగా మారిన విశాఖ రైల్వేజోన్ పై కేంద్రం నుంచి ఉలుకు పలుకు లేదు. ఇవన్నీ 2019 ఎన్నికలకు వెళ్లే ముందు తెలుగు దేశం ప్రభుత్వాన్ని చికాకు పెట్టే అంశాలే.

బలహీన పడిన బంధం...

నోటితో మాట్లాడుకుంటూ నొసటితో వెక్కిరించుకోవడమంటే టీడీపీ,బీజేపీల స్నేహం అంటూ సరదాగా చలోక్తులు విసురుకుంటున్నారు రాజకీయపరిశీలకులు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో భాగస్వాములుగా ఉన్న బీజేపీ, టీడీపీల మధ్య మైత్రీ బంధానికి బీటలు వారుతున్నాయి. ఈ ఏడాది ఈ గ్యాప్ మరింత ఎక్కువైంది. కేంద్రంలో వెంకయ్య నాయుడు చక్రం తిప్పుతున్నప్పుడు బీజేపీ నాయకులు టీడీపీ పట్ల కొంత సంయమనం పాటించేవారు. ఒకవేళ రాష్ట్రప్రభుత్వం పై ఆరోపణలు చేసినా కేంద్ర స్థాయిలో వాటికి ప్రాధాన్యం లభించేది కాదు. వెంకయ్య, చంద్రబాబుల మధ్య స్నేహం ద్వితీయశ్రేణి నాయకుల వైరానికి అడ్డుకట్ట వేసేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. టీడీపీతో స్నేహం వల్ల తమ పార్టీ రాష్ట్రంలో నష్టపోయిందని బీజేపీ నాయకులు ఘాటుగానే విమర్శిస్తున్నారు. దమ్ముంటే పొత్తును వదులుకోవాలంటూ చంద్రబాబుకే సవాల్ విసురుతున్నారు. అగ్రనాయకులెవరూ వీరిని అదుపు చేయడం లేదు. ప్రతిగా చంద్రబాబు కూడా తమ నాయకులను లోపాయికారీగా బీజేపీపైకి, కేంద్రం పైకి ఉసిగొల్పి చోద్యం చూస్తున్నారు. బీజేపీని విమర్శించిన నాయకులపై క్రమశిక్షణ చర్యల ఊసు ఎత్తడం లేదు. ఇరుపక్షాలూ దాగుడు మూతలతో రాజకీయ చదరంగానికి తెరతీస్తున్నాయి. చంద్రబాబు నాయుడు నాలుగు నెలలుగా ప్రధాని అపాయింట్ మెంట్ కోసం ప్రయత్నిస్తున్నా దొరకకపోవడం ఇందుకొక నిదర్శనగానే చూడాలి.

-ఎడిటోరియల్ డెస్క్

Similar News