బాబు.. ‘‘భలే’’...కాలం కలిసొస్తుందా...?

Update: 2018-02-06 15:30 GMT

చంద్రబాబు రొట్టె విరిగి నేతిలో పడబోతుందా?గతంలో జాతీయ రాజకీయాల్లో ప్రదానభూమిక పోషించిన చంద్రబాబు నాయుడు గత పధ్నాలుగు సంవత్సరాలుగా తన ప్రాధాన్యాన్ని కోల్పోయారు. 2014 సార్వత్రిక ఎన్నికల తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. దాంతో తన పార్టీ అస్తిత్వాన్ని, జాతీయ రాజకీయాల్లో తన ఉనికిని కాపాడుకోగలిగారు. కానీ గతంలోని ప్రాముఖ్యాన్ని మాత్రం సాధించలేకపోయారు. తాజాగా కేంద్రం ప్రతిపాదించిన బడ్జెట్ ప్రతిపాదనలతో ఏపీ కి అన్యాయం జరిగిందంటూ టీడీపీ ధ్వజమెత్తుతోంది. అవసరమైతే బీజేపీతో పొత్తును వదులుకోవడానికి సైతం సిద్ధమేనంటూ సంకేతాలు ఇస్తోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడిని విపక్ష శిబిరంలోకి లాగే ప్రయత్నాలు ఊపందుకున్నాయి. ఒక్కసారిగా మళ్లీ జాతీయ స్థాయిలో చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకుంటారనే అంశంపై సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది.

విపక్ష రాజకీయాలకు మూలకేంద్రం...

1985- 90 మధ్యకాలంలో నేషనల్ ఫ్రంట్ ఏర్పాటైన తొలిదశలో ఎన్టీరామారావు తరఫున ఢిల్లీ రాజకీయాలతో చంద్రబాబు పరిచయం పెంచుకున్నారు. అప్పట్నుంచీ కీలకమైన నాయకులతో సంబంధబాంధవ్యాలు నెరపుతూ వచ్చారు. బీజేపీ అగ్రనేతలైన వాజపేయి, అద్వానీ, సమతా పార్టీ నేత జార్జిఫెర్నాండజ్, లాలూ ప్రసాద్ యాదవ్ , ములాయం సింగ్ యాదవ్, దేవీలాల్, అజిత్ సింగ్, కరుణానిధి, మమతా బెనర్జీ, నవీన్ పట్నాయక్, సీతారాం ఏచూరి, సురవరం సుధాకరరెడ్డి వంటి వారందరితోనూ చంద్రబాబుకు ముఖాముఖి సంబంధాలున్నాయి. అందువల్లనే 1995లో ఎన్టీరామారావును అధికారం నుంచి దించేసిన సందర్బంలో కూడా జాతీయస్థాయిలో తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తం కాలేదు. చంద్రబాబు నాయుడు తన చాణక్యంతో ఎన్టీయార్ ను ఏయే కారణాలతో ఎమ్మెల్యేలు పదవీ చ్యుతుడిని చేశారో తనదైన శైలిలో వివరించగలిగారు. ఆతర్వాత కాలంలో 1996లో బీజేపీ, కాంగ్రెసేతరపక్షాలతో ఏర్పడిన 13 పార్టీల యునైటెడ్ ఫ్రంట్ ను అధికారంలోకి తేవడంలో కీలకంగా వ్యవహరించారు. దీనికి కాంగ్రెసు పార్టీ మద్దతునిచ్చింది. ఆ తర్వాత బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏకి మద్దతుగా నిలిచారు. కింగ్ మేకర్ గా చంద్రబాబు గుర్తింపు తెచ్చుకున్నారు. దాదాపు ఎనిమిదేళ్ల పాటు కాంగ్రెసేతర పార్టీల సంకీర్ణం, బీజేపీ సంకీర్ణాల యుగానికి నాంది పలికిన కీలక రాజకీయ ఘట్టాల్లో చక్రం తిప్పగలిగారు. విపక్షరాజకీయాలకూ మూలకేంద్రంగా నిలిచారు. ఒకానొక సందర్బంలో చంద్రబాబును ప్రధానమంత్రి అభ్యర్థిత్వానికి కూడా కొందరు సన్నిహిత నాయకులు ప్రతిపాదించినట్లు ప్రచారం సాగింది.

జాతీయ నాయకుల సంప్రతింపులు...

రాజకీయంగా గతంలో పొందిన స్థానం మళ్లీ చంద్రబాబు వద్దకు నడిచొస్తుందా? అన్న చర్చ మొదలైంది. టీడీపీ దూరం కాబోతోందన్న ప్రచారం ఊపందుకోవడంతోనే కొందరు జాతీయ నాయకులు చంద్రబాబుతో టచ్ లోకి వచ్చేందుకు ప్రయత్నించినట్లు టీడీపీలోని ఉన్నతస్థాయి వర్గాల సమాచారం. అటు కాంగ్రెసు, ఇటు బీజేపీ పట్ల సమదూరం పాటిస్తున్న మమతా బెనర్జీ, ములాయం సింగ్ యాదవ్, నవీన్ పట్నాయక్ వంటి అగ్రనేతలు కూడా ఈ జాబితాలో ఉన్నట్లుగా ప్రచారం మొదలైంది. ఒకవైపు బీజేపీ,మోడీ క్రమేపీ బలహీన పడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. మరోవైపు కాంగ్రెసు ఇంకా పూర్తిస్థాయిలో పుంజుకోలేదు. ఇదే సందర్బంలో ప్రాంతీయ పార్టీలు, వామపక్షాల సహా కూటమి కడితే దేశరాజకీయాలపై బలమైన ప్రభావాన్ని చూపించవచ్చనే అంచనాలో కొందరు నాయకులున్నారు. కాంగ్రెసు వంటిపార్టీలు తప్పనిసరి పరిస్థితుల్లో ఈ కూటమికి మద్దతు పలకకతప్పదు. యునైటెడ్ ఫ్రంట్ ప్రయోగం మరోసారి పునరావృతం చేయవచ్చనే ఆశాభావం కొన్ని పక్షాల నాయకుల్లో వ్యక్తమవుతోంది. చంద్రబాబునాయుడికి ఈ విషయంలో కొన్ని అడ్వాంటేజీలు కూడా ఉన్నాయి. దక్షిణాదికి చెందిన వ్యక్తి కావడం , తమిళనాడు వంటి రాష్ట్రంలో పార్టీ పెడుతున్న రజనీకాంత్ వంటి వారు కూడా అతనికి సన్నిహితులు కావడం ప్రయోజనదాయకమే. ఉత్తరాది నాయకులతోనూ చంద్రబాబుకు సత్సంబంధాలు ఉండటం వల్ల కాలం కలిసొస్తే మళ్లీ హవా చెలాయించవచ్చనే భావన టీడీపీ వర్గాల్లో నెలకొంది.

నితీశ్ స్థానంలో ‘బాబు’...?

ప్రాంతీయ పార్టీలకు అగ్రనాయకుల కొరత లేదు. శరద్ పవార్, లాలూ, ములాయం, మమత, మాయావతి వంటివారందరికీ జాతీయ స్థాయిలో ప్రాచుర్యం ఉంది. కానీ ఒక్కొక్కరిది ఒక్కో రకం బలహీనత. రాజకీయ సమీకరణలు, జనాకర్షణ మంత్రం , మిగిలిన పార్టీలను ఆకట్టుకోవడంలో లాలూ తీరే వేరు. కానీ అవినీతి కేసుల్లో జైలులో మగ్గడం వల్ల ఫ్రంట్ సారథ్యం ఆయనకు అప్పగించలేరు. యాక్టివ్ రాజకీయాలకూ దూరమయ్యారు. ములాయం సొంత పార్టీలోనే దాదాపు వెలివేతకు గురయ్యారు. శరద్ పవార్ కు ఇతర పక్షాలను కూడగట్టి రాజకీయం నడపటం తెలియదు. ఆయన మిగిలిన పక్షాలను సమఉజ్జీలుగా చూడటానికి ఇష్టపడరు. పెద్ద రాష్ట్రమైన పశ్చిమబంగలో జనాదరణలో తిరుగులేని నాయకురాలిగా వెలిగిపోతున్న మమతా బెనర్జీని ఇతరరాజకీయపార్టీలు విశ్వసించే పరిస్థితి లేదు. చంచల మనస్తత్వం కారణంగా ఆమెజాతీయ కూటమికి నేతృత్వం వహించగల అవకాశాన్ని చేజిక్కించుకోలేకపోతున్నారు. ఒకప్పుడు జాతీయ పార్టీగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుని అట్టడుగు వర్గాల ఆశాదీపంగా వెలుగొందిన బీఎస్పీ కి మాయావతి పెద్ద గుది బండగా మారారు. అవినీతి, అహంకారం పార్టీని భ్రష్టు పట్టించాయి. కాన్షీరాం కాలం నాటి ఐడియాలజీ స్థానంలో ఆత్మస్తుతి ప్రవేశించి ప్రాంతీయంగా పార్టీ కుచించుకుపోయింది. ఏడాది క్రితం వరకూ కాంగ్రెసు, బీజేపీ లతో విభేదించే ఇతర పక్షాలకు జేడీయూ నేత నితీశ్ కుమార్ చుక్కానిగా కనిపించేవారు. మోడీని ఢీకొట్టగల ధీరునిగా, ప్రధాని అభ్యర్థిగా కూడా ముద్ర వేసే ప్రయత్నం సాగింది. లాలూ అవినీతి పరివారాన్ని భరించడం కంటే మోడీతో కలిసిపోవడమే మేలని యూపీ ఎన్నికల తర్వాత నితీశ్ బీజేపీతో జట్టు కట్టారు. దాంతో ఆ ఒక్క ఆశ కూడా అడుగంటిపోయింది. మోడీ, రాహుల్ ల కు ప్రత్యామ్నాయంగా ఇప్పుడు విపక్ష శిబిరానికి కనిపిస్తున్న ఏకైక ఆశాజ్యోతి చంద్రబాబేనని టీడీపీ వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. ఒకవైపు ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం చేస్తూ కేంద్రం నిర్లక్ష్యం గా వ్యవహరిస్తోందని రాష్ట్రప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తుంటే టీడీపీ శ్రేణులు దీనిని మరోరకంగా చూస్తుండటమే విచిత్రం. విషాదంలో ఆనందాన్ని, దురదృష్టంలో అవకాశాన్ని వెదుక్కోవడమంటే ఇదే.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News