బాబు తలపై రాజకీయ కుంపటి...!

Update: 2017-11-07 15:30 GMT

రాష్ట్ర సమస్యలు, ఉద్యమాలు, పాదయాత్రలతోనే తలబొప్పి కట్టిపోతున్న చంద్రబాబునాయుడికి ఇప్పుడొక కొత్త సమస్య వచ్చి పడింది. ఉమ్మడి రాష్ట్రం విడిపోయినా ఆనాటి రాజకీయ సమస్యలు ఇంకా వెన్నాడుతూనే ఉన్నాయి. తెలంగాణ అసెంబ్లీలో మాదిగ రిజర్వేషన్ల వర్గీకరణపై చర్చ, అఖిలపక్షంతో ఢిల్లీ వెళ్లేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఆంద్రప్రదేశ్ సీఎంకి తలనొప్పి తెస్తోంది. షెడ్యూల్డు కులాలను ఏబీసీడీ లుగా వర్గీకరించి తమ వాటా తమకు ఇవ్వాలంటూ దాదాపు రెండు దశాబ్దాలుగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఉద్యమం చేస్తోంది. అన్ని రాజకీయ పార్టీల నుంచి ఈ డిమాండ్ కు మద్దతు కూడగట్టగలిగింది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కొంతకాలంపాటు వర్గీకరణ రిజర్వేషన్ కూడా అమలైంది. అయితే ఎస్సీలను వర్గీకరించే అధికారం రాష్ట్రానికి లేదంటూ సుప్రీం కోర్టు కొట్టివేయడంతో సమస్య మొదటికి వచ్చింది. ప్రత్యేకంగా పార్లమెంటు చట్టం ద్వారానే ఇది సాధ్యమవుతుంది. దీంతో ఎమ్మార్పీస్ పదిహేను సంవత్సరాలుగా ఆందోళన చేస్తూనే ఉంది. కానీ జాతీయ స్థాయిలో ప్రధాన డిమాండుగా మార్చి రిజర్వేషన్ల వర్గీకరణను సాధించలేకపోతోంది. ఇందుకు ప్రధాన కారణం ఎస్సీ రిజర్వేషన్లలో అధిక వాటా పొందుతున్న వర్గాలు వర్గీకరణ డిమాండుకు అనుకూలంగా లేవు. అందులోనూ ఈ సమస్య ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటి ఒకటి రెండు రాష్ట్రాలకే పరిమితం కావడంతో జాతీయంగా మద్దతు కూడగట్టడం , పార్లమెంటులో బిజినెస్ గా మార్చడం సాధ్యం కావడం లేదు.

తటస్థమే తరుణోపాయం...

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్బంలోనే రిజర్వేషన్ల వర్గీకరణపై కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నించిన ఎమ్మార్పీఎస్ కార్యకర్తల్లో ఒక మహిళ మరణించడంతో సమస్య తీవ్రత అసెంబ్లీలో ప్రతిధ్వనించింది. ఈ అంశంపై అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళతానని ముఖ్యమంత్రి గతంలోనే వివిధ రాజకీయ పార్టీలకు హామీ ఇచ్చారు. కానీ దానిని నిలబెట్టుకోలేదు. కార్యకర్త మరణంతో స్పందించిన సీఎం తాను కచ్చితంగా అఖిలపక్షాన్ని ప్రధాని వద్దకు తీసుకెళతానని మరోసారి సభ సాక్షిగా హామీనిచ్చారు. తెలంగాణలోని అన్నిపక్షాల్లో స్థూలంగా ఈవిషయంలో ఏకాభిప్రాయం ఉంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రభుత్వం కూడా మాదిగ వర్గాల ఓట్లను దృష్టిలో పెట్టుకుని సీరియస్ గానే తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. అటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఈ ఒత్తిడి ప్రభావం పడనుంది. ఆంధ్రప్రదేశ్ లో ఎస్పీ వర్గాల్లో మాల కులస్థుల ఓట్లు అధికం. మూడింట రెండు వంతులు ఆది ఆంధ్ర మాల కులస్థులు కాగా, మూడింట ఒక వంతు మాత్రమే ఆది ఆంధ్ర మాదిగ సామాజిక వర్గానికి చెందిన వారున్నారు. మాల సామాజిక వర్గం రిజర్వేషన్ల వర్గీకరణను వ్యతిరేకిస్తోంది. అదే తెలంగాణలో ఎస్సీ వర్గాల్లో మాదిగ సామాజిక వర్గం 60శాతం వరకూ ఉంది. గతంలో తెలంగాణలో రాజకీయ ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని వర్గీకరణను టీడీపీ అమలు చేసింది. ఇప్పుడు కూడా వర్గీకరణను సమర్థిస్తే ఏపీలో మాలలు దూరమవుతారు. ఎన్నికల్లో ఇది ప్రతిబంధకంగా మారుతుంది. అందువల్ల టీడీపీ గట్టిగా వర్గీకరణను సపోర్టు చేయలేకపోతోంది. మందకృష్ణ వంటి ఉద్యమ నాయకులు చంద్రబాబునాయుడిపై ఈ విషయంలో ఒత్తిడి చేస్తున్నారు. గత వైఖరికి కట్టుబడి ఉన్నామని చెబుతున్నారే తప్ప మరోసారి వర్గీకరణ డిమాండ్ ను పార్టీ పరంగా వినిపించేందుకు, ఉద్యమించేందుకు టీడీపీ సిద్దపడటం లేదు.

కేసీఆర్ పాచిక ..

ప్రతి కూల పరిస్థితులను కూడా తనకు అనుకూలంగా మలచుకోవడంలో సిద్ధహస్తుడైన తెలంగాణ సీఎం కేసీఆర్ అసెంబ్లీలో గొడవ జరగాల్సిన తరుణంలో పరిస్థితిని కూల్ చేసేశారు. మరణించిన కార్యకర్తకు భారీ నష్టపరిహారంతోపాటు కుటుంబసభ్యులకు ఉద్యోగం, అఖిలపక్షం ఢిల్లీ యాత్ర వంటి హామీలు గుప్పించి మొత్తం ఉద్యమానికి తన సానుభూతి ఉందన్న విషయాన్ని ప్రజల్లోకి పంపగలిగారు. ఇదే సందర్బంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా వర్గీకరణపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘంలో తాను సభ్యునిగా ఉన్నానని కేసీఆర్ చెప్పారు. వర్గీకరణ సిఫార్సును ఈ ఉపసంఘమే చేసిందని చెప్పారు. చంద్రబాబు నాయుడిని కూడా రంగంలోకి లాగారు. కేసీఆర్ ప్రకటనను పరిశీలకులు రెండు రకాలుగా వ్యాఖ్యానిస్తున్నారు. ఇటీవల టీడీపీతో ఏర్పడిన మైత్రి కారణంగా రిజర్వేషన్ల వర్గీకరణ క్రెడిట్లో చంద్రబాబుకు కూడా పాత్ర ఉందని చెప్పడం ఒక ఉద్దేశమై ఉండవచ్చంటున్నారు. రాజకీయంగా వర్గీకరణ విషయంలో టీడీపీ ఎంతదూరంగా ఉంటే అంత ప్రయోజనం. ఆంధ్రప్రదేశ్ లో గరిష్టంగా ఉన్న మాలల ఓట్లు చేజారిపోకుండా ఉంటాయి. ఉమ్మడి రాష్ట్రంలోనే నిర్ణయం తీసుకున్న దృష్ట్యా ఏపీ సీఎం కూడా వర్గీకరణకు కలిసి రావాలనేది కేసీఆర్ ఉద్దేశమై ఉండొచ్చనేది మరికొందరి వ్యాఖ్య. ఏదేమైనప్పటికీ వర్గీకరణ కేసీఆర్ అమలు చేయించగలిగితే తెలంగాణ ఎస్సీలలో గరిష్ట సంఖ్యలో ఉన్న మాదిగ ఓట్లు టీఆర్ఎస్ కు లభించే అవకాశాలుంటాయి. అదే సమయంలో వర్గీకరణను సమర్థిస్తూ బహిరంగంగా ప్రకటన చేసినా, రాజకీయంగా ఢిల్లీ స్థాయిలో సానుకూల వైఖరిని తీసుకున్నా తెలుగుదేశం పార్టీ ఆంధ్ర్రప్రదేశ్ లో గరిష్టంగా ఉన్న మాల సామాజిక వర్గం ఓట్లను కోల్పోయే ప్రమాదం ఉంది. దీంతో చంద్రబాబుకు ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్లుగా తయారైంది పరిస్థితి. గతంలో తన ప్రభుత్వమే అమలు చేసిన మాదిగ రిజర్వేషన్లను మాటకు కట్టుబడి సమర్థించడమా? లేక ఏపీలో తన పార్టీ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని వ్యూహాత్మక మౌనం పాటించడమా? అతి తొందరలోనే రాజకీయ సమాధానం దొరకాల్సిన ప్రశ్న ఇది.

-ఎడిటోరియల్ డెస్క్

Similar News