బాబు చెప్పే లెక్కలన్నీ తప్పులే..! - ఉండవల్లి: తెలుగు పోస్ట్ కి ప్రత్యేకం

Update: 2017-11-24 13:30 GMT

.పోలవరం ప్రాజెక్ట్ పై ఏపీ అసెంబ్లీలో గంట సేపు చెప్పింది చెప్పకుండా ముఖ్యమంత్రి వివరించిన విషయాల్లో ఒక్క ముక్క కూడా తనకు అర్ధం కాలేదన్నారు మాజీ ఎంపి ఉండవల్లి అరుణ కుమార్. సీఎం ప్రసంగాన్ని చూపిస్తూ ఆయన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తెలుగు పోస్ట్ కి ప్రత్యేకంగా ఇచ్చారు. చంద్రబాబు రెండు నాల్కల ధోరణితోనే ఏపీకి జీవనాడి పోలవరం పై మాట్లాడుతున్నారని నిజాలు చెప్పకుండా చట్టసభలో ప్రివిలేజ్ మోషన్ తీసుకువచ్చే రీతిలో మాట్లాడారని ఎత్తి చూపారు. అసెంబ్లీలో బాబు రెండు రకాలుగా మాట్లాడిన అంశాలే నిదర్శనమని ముఖ్యంగా ఆయన గంట ప్రసంగంలో 34వ నిమిషంలో ఈ ప్రాజెక్ట్ రాష్ట్ర ప్రభుత్వం చేస్తామని తామేమీ అడగలేదన్నారని, మరో రెండు నిమిషాల్లో ఆంగ్ల ప్రసంగంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం రిక్వెస్ట్ చేసి ప్రాజెక్ట్ నీతి ఆయోగ్ ద్వారా చేపట్టిందని రెండు రకాల మాటలు సభలో చెప్పడం దారుణమన్నారు ఉండవల్లి.

సభలో విపక్షం లేకపోతే ఇలాగే ఉంటుంది ...

కీలకమైన అసెంబ్లీ సమావేశాలకు వైసిపి దూరం కావడం వల్ల ఇలాంటి దారుణమైన తప్పులు ఎత్తిచూపే అవకాశాన్ని విపక్షం వదులుకుందని ఇది ప్రజలకు అన్యాయం చేయడమే అన్నారు ఉండవల్లి. పోలవరం ప్రాజెక్ట్ పై విపక్షం అధికారపక్షాన్ని ఎండగట్టే ఛాన్స్ కోల్పోయిందని విమర్శించారు. ప్రతిపక్షం ఎప్పుడైతే లేదో అధికారపక్షం పాఠం చదివి తప్పులను ఒప్పులుగా చలామణి చేసుకుంటుందన్నారు అరుణ కుమార్.

17 వ తేదీ ఈనాడు చదువుకోండి ....

పోలవరం పట్టిసీమ సూపర్... సూపర్ అంటూ మంత్రి లోకేష్, బాలకృష్ణ ఇతర ప్రజా ప్రతినిధులు వచ్చిన ఈనెల 16 వ తేదీ తరువాత రోజు 17 న ఈనాడు పత్రిక ప్రచురించిన వార్తను ఉండవల్లి చూపారు. అది టిడిపి వారు చూడాలన్నారు . అందులో పోలవరం పనుల ప్రగతిపై నియమించిన మసూద్ అహ్మద్ కమిటీ కేంద్రానికి ఇచ్చిన నివేదిక లో పోలవరం బాగోతం తెలియచేసేలా తొలి పేజీలో ప్రధాన వార్తగా ప్రచురిస్తే పట్టిసీమ సూపర్, పోలవరం పనులు ఆహా అన్న వార్త లోపలి పేజీలో ప్రాధాన్యత లేకుండా ప్రచురించారని ఆ ఒక్కటి అక్కడ జరుగుతున్న బాగోతం చెప్పడానికి చాలన్నారు మాజీ ఎంపీ. పోలవరం పై పచ్చి అబద్ధాలు నిజాలుగా ప్రజలకు ఎంతకాలం చెబుతారని నిప్పులు చెరిగారు. శ్వేత పత్రాన్ని పోలవరంపై విడుదల చేయమంటే ఇంత వరకు ఎందుకు చేయడం లేదన్నారు ఆయన.

నిధులపైనా రెండు నాల్కలు ....

పోలవరం ప్రాజెక్ట్ పూర్తి కావాలంటే కేంద్రం సహకరించి పూర్తి నిధులు ఇవ్వాలని ఒకసారి, వాళ్ళు ఇవ్వకపోయినా మనం కట్టుకుంటామని మరోసారి చెబుతూ వస్తున్నారు. ఇది ప్రమాదకర ధోరణి . ఏపీ ఆర్ధిక పరిస్థితి దారుణంగా వుంది. జాతీయ ప్రాజెక్ట్ గా కేంద్రం ప్రకటించి పూర్తి చేసి తీరాల్సి ఉంటే ఎందుకు మేం చేస్తామని తెచ్చుకుని వేలకోట్ల రూపాయల అప్పు రాష్ట్ర ప్రజలపై రుద్దాలనుకుంటున్నారో చెప్పాలని నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇదే తీరులో ఉంటే భావితరాలు క్షమించవని చరిత్రహీనులౌతారని దుమ్ము దులిపారు ఉండవల్లి. ఏడు ముంపు మండలాలను కలపాలని మన్మోహన్ సర్కార్ రూపొందించిన ఆర్డినెన్స్ ఎన్నికలు సమీపించడంతో ఆమోదానికి నోచుకోలేదని అదేదో టిడిపి ఘనత గా చెప్పుకోవడం అనవసరమని ఉండవల్లి తాను రచించిన విభజన కధ పుస్తకంలో కాంగ్రెస్ ఆనాడు తీసుకువచ్చిన ఆర్డినెన్స్ ను చూపించారు. ప్రాజెక్ట్ అంచనా వ్యయం 58 వేలకోట్ల రూపాయలుగా చెప్పిన చంద్రబాబు 12 వేలకోట్ల రూపాయలే ఇప్పటికి ఖర్చు చేశామని చెప్పారని గుర్తు చేస్తూ మిగిలిన నిధులు ఎక్కడినుంచి తెస్తారని ప్రశ్నించారు. అదికూడా రాబోయే రెండేళ్ల కాలంలో కేంద్రం ఇస్తుందా ? రాష్ట్ర ప్రభుత్వం అప్పు తెచ్చి ప్రజల నెత్తిన రుద్దుతుందా అని కడిగేశారు ఉండవల్లి

 

-రాజమండ్రి నుంచి స్పెషల్ రిపోర్ట్

Similar News