బాబు కోడ‌లు.. బ్యాగ్రౌండ్‌ స్టోరీ ఇదే!

Update: 2017-12-04 07:30 GMT

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి రాజ‌ధాని హైద‌రాబాద్ వేదిక‌గా కొద్ది రోజుల కింద‌ట జ‌రిగిన అంత‌ర్జాయ పారిశ్రామిక వేత్తల స‌ద‌స్సు(జీఈఎస్‌)కు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ల‌భించిన విష‌యం తెలిసిందే. అంత‌ర్జాతీయ మీడియా కూడా దీనిని బాగా ఫోక‌స్ చేసింది. పెట్టుబ‌డి దారులు, పారిశ్రామిక వేత్తలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి హాజ‌ర‌య్యారు. ఇక‌, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ ఈకార్యక్రమానికి హాజ‌రై పెద్ద ఎట్రాక్షన్‌గా నిలిచారు. ఇక‌, ఇదే కార్యక్రమంలో ప్రధాని న‌రేంద్ర మోడీ, తెలంగాణ సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌లు కూడా ప్రధాన ఆక‌ర్షణ‌గా నిలిచారు. ఇక‌, ఈ కార్యక్రమాన్ని నీతి ఆయోగ్, తెలంగాణ ప్రభుత్వం సంయుక్తంగా కేంద్ర ప్రభుత్వ సూచ‌న‌ల‌తో ఇక్కడ నిర్వహించాయి. నిజానికి హైద‌రాబాద్‌ను ఎంపిక చేయ‌డం నీతి ఆయోగ్ సీఈవో కృషే న‌ని చెప్పొచ్చు!

ఏ రాష్ట్రం నుంచి కూడా....

ఇక‌, ఈ కార్యక్రమానికి దేశంలోని ఏ రాష్ట్రం నుంచి కూడా ఎవ్వరినీ ఆహ్వానించ‌లేదు. అయితే, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి రాజ‌ధాని హైద‌రాబాద్‌లో నిర్వహిస్తున్న నేప‌థ్యంలో ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబుకు కూడా ఆహ్వానం ల‌భిస్తుంద‌ని అంద‌రూ అనుకున్నారు. చంద్రబాబు కూడా త‌న‌కు ఆహ్వానం అందుతుంద‌ని, గ‌తంలో హైద‌రాబాద్‌ను తానే డెవ‌లప్ చేసిన విష‌యాన్ని అంత‌ర్జాతీయ మీడియా సాక్షిగా వెల్లడించాల‌ని ఆయ‌న ఆశ‌లు పెట్టుకున్నారు. అయితే, అనూహ్యంగా ఈ కార్యక్రమానికి సంబంధించి బాబుకు ఎలాంటి ఆహ్వాన‌మూ అంద‌లేదు. అయితే, దీనివెనుక ఏం జ‌రిగింద‌నే విష‌యం ఇప్పుడు తాజాగా వెలుగు చూసింది. బాబుకు రాజ‌కీయంగా బ‌ద్ధ శ‌త్రువైన కేసీఆర్‌.. ఎట్టిప‌రిస్థితిలోనూ బాబును హైద‌రాబాద్ ఛాయ‌ల‌కు కూడా రానీయ‌కూడ‌ద‌ని నీతి ఆయోగ్‌కి ష‌ర‌తు పెట్టార‌ని తాజాగా ఓ ఆంగ్ల మీడియా వెల్లడించింది.

చంద్రబాబుకు నో....

అయితే, ఈ స‌ద‌స్సులో కేంద్రానికి కూడా పాత్ర ఉంది కాబ‌ట్టి.. ఏపీ, తెలంగాణ‌లు రెండూ కూడా కేంద్రానికి రాజ‌కీయంగా అవ‌స‌రం కాబ‌ట్టి.. కేసీఆర్‌కు న‌చ్చజెప్పేందుకు ఎన్నో ప్రయ‌త్నాలు జ‌రిగాయ‌ని, అయినా కూడా బాబు ఈ కార్యక్రమానికి హాజ‌ర‌య్యేందుకు కేసీఆర్ ఎట్టి ప‌రిస్థితిలోనూ ఒప్పుకోలేద‌ని తెలిసింది. ఈ క్రమంలోనే బాబు కోడ‌లు, హెరిటేజ్ సీఈవో నారా బ్రాహ్మణి హాజ‌ర‌య్యేందుకు కేసీఆర్ ఒప్పుకున్నార‌ట‌. దీంతో ఈ కార్యక్రమంలో బ్రాహ్మణి పాల్గొని హ‌ల్ చ‌ల్ చేశారు. సో.. నారా బ్రాహ్మణి ఎంట్రీ వెనుక ఇంత స్టోరీ న‌డించింద‌న్న మాట‌! ఏదేమైనా చంద్రబాబు ను ఈ కార్యక్రమానికి రాకుండా అడ్డుకోవ‌డం ద్వారా కేసీఆర్ త‌న కుమారుడైన కేటీఆర్‌కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చార‌ని అంటున్నారు విశ్లేష‌కులు. మొత్తానికి ప్రతి విష‌యంలోను పొలిటిక‌ల్ మైలేజీ చూసుకోవ‌డం స‌మంజ‌స‌మేనా? అనే ప్రశ్నలూ ఉత్పన్నమ‌వుతున్నాయి.

Similar News