బలవంతుడ నాకేమని...?

Update: 2018-03-16 15:30 GMT

‘ఈశాన్యంలో కూడా పాగా వేసేశాం. ఉత్తరాది ఎలాగూ మనదే. దక్షిణాదిన సమీకరణలు సరిచేసుకుంటే చాలు. 2019లోనూ అధికారం ఖాయం. ’ అనుకుంటున్న బీజేపీకి వరసగా రెండు దెబ్బలు. ఒకటి జాతీయంగా రాజకీయ ప్రబావం చూపే అంశమైతే, మరొకటి బలమైన రాష్ట్రాల్లో కోల్పోతున్న ప్రజామద్దతు. ఆందోళన కలిగించే ఈ రెండు పరిణామాలు ఈ వారమే చోటు చేసుకోవడంతో భారతీయ జనతాపార్టీ అంతర్మథనంలో పడింది. నాలుగేళ్లుగా కలిసి నడుస్తున్న తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి నుంచి బయటకు నడిచింది. ఎన్డీఏ కూటమిలో చీలికకు ప్రత్యక్షనిదర్శనగా దీనిని చెప్పవచ్చు. దక్షిణాది నుంచి అతిపెద్ద భాగస్వామిగా ఉన్న టీడీపీ బయటికి రావడానికి విశ్వాసరాహిత్యమే కారణమని విపక్షాలు బలంగా ఆరోపించేందుకు ఆస్కారం ఏర్పడింది. త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ లలో తాము ఆశించినట్లు ప్రభుత్వాలను నెలకొల్ప గలిగామని జోరుమీదున్న బీజేపీకి యూపీ,బీహార్ లు చుక్కలు చూపించాయి. ప్రధాని స్వయంగా ఎన్నికైన రాష్ట్రం. ఏడాది క్రితమే అపూర్వ విజయంతో గద్దెనెక్కిన ఉత్తరప్రదేశ్ లో పరాభవం పెద్ద తలవంపే. సీఎం యోగి ఆదిత్యనాథ్, ఉపముఖ్యమంత్రి పదవిని చేపట్టిన కేశవప్రసాద్ మౌర్య రాజీనామా చేసిన రెండు లోక్ సభ స్థానాలు చేజారిపోయాయి. లెక్కలన్నీ సరిపోతాయని బేరీజు వేసుకున్న తర్వాతనే రాజీనామా చేసినా రాజకీయంగా ఎదురుగాలులు వీచాయి. ఈ రెండు పరిణామాలు 2019 ఎన్నికల్లో బీజేపీకి ఎదురుగాలికి సంకేతాలుగా కనిపిస్తున్నాయి.

టీడీపీ విడాకుల విలువెంత?

సంఖ్యాపరంగా చూస్తే లోక్ సభలో తెలుగుదేశం సభ్యుల సంఖ్య 16 మాత్రమే. బయటికి వచ్చేసినా కేంద్రప్రభుత్వానికి మెజార్టీ పరంగా వచ్చిన నష్టమేమీ లేదు. కొంపలంటుకుపోవు. కానీ ఎన్డీఏ కుంపటిలో రాజకీయ వేడి రగులుకుంటుంది. బీజేపీ వైఖరితో కుతకుతలాడిపోతున్న కొన్ని పార్టీలు ఇదే మార్గాన్ని అనుసరించేందుకు దారి తీస్తుంది. నైతికంగా కూటమి మానసిక స్థైర్యం దెబ్బతింటుంది. విపక్షాలు ఉత్సాహం పుంజుకుంటాయి. బీజేపీ నమ్మక ద్రోహి, సొంత మిత్రులనే మోసం చేసిందనే వాదనకు బలం చేకూరుతుంది. టీడీపీ అవిశ్వాసం పెడుతున్నట్లు ప్రకటించగానే జాతీయంగా అనేక పార్టీలనుంచి వెల్లువెత్తిన మద్దతునే దీనికి నిదర్శనగా చూడాలి. వామపక్షాలు, తృణమూల్ కాంగ్రెసు, కాంగ్రెసు వంటి భిన్న వైఖరులున్న పార్టీలన్నీ ఈ పరిణామాన్ని ఆహ్వానించడంతోపాటు టీడీపీకి మద్దతుగా నిలిచాయి. లోక్ సభలో తీర్మానం చర్చకు రాకపోయినా విపక్షాల్లోని ముఖ్యమైన పార్టీలన్నిటికీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక అజెండా దొరికింది. దేశవ్యాప్తంగా చర్చకు దారితీసే అంశంగా మారింది. అవిశ్వాస ప్రతిపాదనను ఆమోదించి సభలో చర్చకు పెడితే బీజేపీ క్రెడిబిలిటీ మరింత దెబ్బతింటుంది. కేవలం ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం, ప్రత్యేక హోదాలకే చర్చ పరిమితం కాదు. కేంద్రప్రభుత్వ నియంతృత్వం, వైఫల్యాలు, నిరుద్యోగం వంటి అనేకానేక అంశాలను ఏదో రూపంలో ప్రస్తావిస్తాయి విపక్షాలు. అవిశ్వాసం సందర్బంగా మాట్లాడేందుకు అన్నిపార్టీలకు అవకాశం లభిస్తుంది కాబట్టి ఇదో రాజకీయ దుమారానికి వేదికగా నిలుస్తుంది. అందుకే టీడీపీ విడాకుల విలువను గణాంకరీత్యా కాకుండా విపక్ష ఐక్యతకు, బీజేపీ వ్యతిరేక శక్తుల పునరేకీకరణకు దారితీసే పరిణామంగా చూడాల్సి ఉంటుంది.

వైసీపీపై పై చేయి...

ప్రత్యేక హోదా అంశం తొలినాటి నుంచి వైసీపీ అజెండాలో ఉంది. ఉద్యమాలు, పోరాటాలు కూడా చేసింది. కానీ పెద్దగా ప్రచారం లభించలేదు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే ఈ డిమాండ్ ను రాష్ట్రప్రభుత్వం పక్కనపెట్టేసింది. ఆర్థికంగా గిట్టుబాటు కాదనే ఉద్దేశంతోనే టీడీపీ ఉద్దేశపూర్వకంగానే దీనిని పట్టించుకోలేదు. బీహార్, రాజస్థాన్ వంటి రాష్ట్రాలు కూడా స్పెషల్ స్టేటస్ డిమాండు చేస్తున్నాయి. బీజేపీకి రాజకీయం గా ఉన్న ఇబ్బందుల దృష్ట్యా నిధుల విషయంలో ఒత్తిడి తేవచ్చని స్టేటస్ అంశాన్ని వదిలేసుకున్నారు. దీనికి బదులుగా ప్రత్యేక ప్యాకేజీ తీసుకునేందుకు ముందుకు వచ్చారు. కానీ ఆశించిన స్థాయిలో నిధులు రాలేదు. ఈలోపు జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర ప్రారంభించి ప్రత్యేక హోదా విషయాన్ని ప్రజల్లోకి విస్తృతంగా ప్రచారంలోకి తేగలిగారు. పవన్ కల్యాణ్ మద్దతు కూడా ప్రత్యేక హోదాకే. ఇది సెంటిమెంటుగా మారి తమ రాజకీయ అవసరాలను దెబ్బతీస్తుందని చంద్రబాబు గమనించారు. దీంతో కేంద్ర బడ్జెట్ సందర్బంగా ఏపీకి అన్యాయం జరిగిందంటూ కేంద్రంపై పోరాటం ప్రారంభించారు. వైసీపీ కంటే ముందుగా టీడీపీ ఈ పోరాటానికి తెర తీసింది. పవన్ డిమాండుతో అవిశ్వాసం ప్రతిపాదనకు వైసీపీ ముందుకు తెచ్చింది. దానికి ప్రతిగా కేంద్రమంత్రులను ఉపసంహరించుకుని టీడీపీ పైఎత్తు వేసింది. కానీ ఎన్డీఏలో కొనసాగుతూ మంత్రులు రాజీనామా చేయడం వల్ల ఎటువంటి ప్రయోజనం లభించలేదు. ప్రజల్లో సానుభూతి లభించలేదు. వైసీపీ నేరుగా అవిశ్వాసాన్ని ప్రతిపాదించింది. ఏదో ఒక నిర్ణయం తీసుకోకపోతే దెబ్బతింటామని గ్రహించిన టీడీపీ తానే సొంతంగా అవిశ్వాసానికి నోటీసు ఇచ్చింది. వైసీపీ అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇచ్చినప్పుడు జాతీయంగా పెద్దగా చర్చనీయం కాలేదు. కానీ మిత్రపక్షమైన టీడీపీ ఎన్డీఏ నుంచి బయటికి వచ్చి మరీ అవిశ్వాసం పెట్టడంతో జాతీయంగా మెయిన్ పొలిటికల్ ఈవెంట్ గా మారింది. బీజేపీ పొడగిట్టని పార్టీలు టీడీపీ చుట్టూ చేరడం ప్రారంభించాయి. వైసీపీ మాట వెనకబడింది.

గాలి ని బట్టే....

తెలుగుదేశం ఎన్డీఏ కూటమి నుంచి బయటికి రావడంలో తీవ్రమైన జాప్యం చేసిందనే చెప్పాలి. మంత్రుల రాజీనామాలతోనే ఈ నిర్ణయం తీసుకుని ఉంటే ఇంకా మైలేజీ లభించి ఉండేది. బీజేపీ ఈశాన్య రాష్ట్రాల విజయం తర్వాత చంద్రబాబు ఈ విషయంలో సాహసం చేయలేకపోయారు. హిందీ హార్ట్ బెల్టుగా భావించే ఉత్తరప్రదేశ్, బిహార్ ఉప ఎన్నికల తర్వాతనే కేంద్రానికి వ్యతిరేకంగా రాజకీయ గాలి వీస్తోందని తెలుగుదేశం అధినేత గ్రహించారు. అందువల్ల 2019 ఎన్నిక ఎలా ఉంటుందోననే సందేహాలకు, శషభిషలకు స్వస్తి పలికేశారు. ఏపీలో కూడా వివిధ కారణాలతో బీజేపీపై వ్యతిరేకత నెలకొన్నట్లు సర్వేల్లో వెల్లడైంది. అందువల్ల బీజేపీని వదిలించుకోవడమే మేలనే నిర్ణయానికి వచ్చేశారు. అందుకు ఇంతకుమించిన సందర్భం దొరకదని ప్రత్యేక హోదా సాకుతో అవిశ్వాసం పెట్టి గుడ్ బై చెప్పేశారు. ఆంధ్రప్రదేశ్ దురవస్థకు కేంద్రాన్ని కారణంగా చూపుతూ ప్రజల్లోకి వెళ్లొచ్చనేది అంచనా. దీనివల్ల వైసీపీని నియంత్రించడంతోపాటు బీజేపీని కూడా దెబ్బకొట్టాలనేది వ్యూహం. నిజానికి బీజేపీపై చంద్రబాబుకు పెద్దగా వ్యతిరేకత ఏమీలేదు. కానీ రాజకీయ అనివార్యత కారణంగానే పొలిటికల్ టూల్ తీయాల్సి వచ్చింది. అయితే బలవంతుడ నాకేమని అన్నట్లుగా ..మిత్రపక్షాలను, ప్రాంతీయ పార్టీలను గుప్పెట్లో పెట్టుకోవాలని చూస్తున్న మోడీ, అమిత్ షా ద్వయానికి మాత్రం పెద్ద ఎదురుదెబ్బగానే చెప్పాలి.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News