ఫైనాన్సియల్ పాలిటిక్స్ ...!

Update: 2018-02-12 15:30 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేక సందర్భాల్లో ఒక మాట చెబుతుంటారు. సంక్షోభం నుంచే తాను అవకాశాలను సృష్టించుకుంటానని అంటుంటారు. తాజాగా బీజేపీ, టీడీపీ సంకీర్ణంలో ఏర్పడిన సంక్షోభాన్ని కూడా సానుకూలంగా మార్చుకుంటున్నారా? అసలు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిలో ఏర్పడిన క్రైసిస్ ను అధిగమించేందుకు దానిని రాజకీయ అవకాశంగా మార్చుకుంటున్నారా? అనే సందేహాలు తలెత్తుతున్నాయి. అప్పుల ఊబిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిండా మునిగిపోయింది. చేతిలో చిల్లిగవ్వ లేదు. వేస్ అండ్ మీన్స్ పద్దు వెక్కిరిస్తోంది. ఓవర్ డ్రాఫ్టు సదుపాయం వట్టిపోతోంది. నెలవారీ జీతాలు, రోజువారీ ఖర్చులకు సైతం కనాకష్టమవుతోంది. ఈ స్థితిలో 2018-19 బడ్జెట్ సమర్పించాలి. ప్రజా పద్దుల కు పెద్దపీట వేయాలి. సార్వత్రిక సమరానికి సంక్షేమ బాట వేయాలి. ఎన్నికల గండం గట్టెక్కాలి. కానీ ఖాళీ ఖజానాతో అవేమీ సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. దాంతో చంద్రబాబులోని నిజమైన రాజకీయవేత్త నిద్ర లేచాడు. ఫైనాన్సియల్ క్రైసిస్ ను పొలిటికల్ క్రైసిస్ గా మార్చి కేంద్రం మెడలు వంచేలా వ్యూహరచన చేశారు.

సంక్షోభం...షాకిస్తోంది...

ఆంధ్రప్రదేశ్ గడచిన మూడున్నర సంవత్సరాల్లో అప్పులమీద అప్పులు చేస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత ఆదాయం పడిపోయిన మాట వాస్తవం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ఆదాయ వనరుగా ఉన్న హైదరాబాదు తెలంగాణకు చెందడంతో ఏపీకి నిధుల లోటు తలెత్తింది. ఆర్థిక క్రమశిక్షణతో పొదుపు పాటిస్తూ ప్రణాళికాబద్దంగా వ్యవహరిస్తే ఒక పదిసంవత్సరాల కాలవ్యవధిలో ఆర్థికంగా రాష్ట్రం స్థిరపడుతుందని నిపుణులు అంచనా వేశారు. కానీ క్రమశిక్షణ కట్టుతప్పింది. రాజకీయంగా స్థిరపడటానికి గాను ఆర్థిక క్రమశిక్షణను బలిపెట్టారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు కోసం వేలాది కోట్ల రూపాయల అప్పులు దూసి తెచ్చారు. ముఖ్యమంత్రినుంచి జిల్లా కలెక్టర్ల వరకూ అంతటా దుబారా కనిపించింది. మూడున్నరేళ్లలోనే లక్షా ముప్ఫై అయిదు వేలకోట్ల అప్పులు చేశారు. విడిపోయిన ఏపీకి రాష్ట్రం వాటాగా 90 వేల కోట్ల రూపాయలు అప్పు పంచారు. ఇప్పుడు అది 2.25 లక్షల కోట్ల రూపాయలకు చేరుకుంది. దీనిని చూసి ప్రభుత్వం భయపడటం లేదు. కొత్త అప్పులు చేయడమెలా? అని చిట్కాలు కనిపెడుతోంది. అయితే రుణదాతలు చేతులెత్తేస్తున్నారు. నెలవారీ జీతాలివ్వడమే కష్టమవుతోంది. వచ్చే ఎన్నికల్లో గట్టెక్కాలంటే కొత్త సంక్షేమ పథకాలు కూడా అమలు చేయాలి. వాటికీ నిధులు కావాలి. కేంద్రం ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్ లో రాష్ట్ర ఖాతాలో పెద్దగా నిధులు పడే అవకాశం కనిపించడం లేదు. దీంతో ప్రత్యామ్నాయం కనిపించకే ఏపీ సర్కారు కేంద్రంపై దాడికి దిగుతోంది.

దారి తప్పిన నిధులు...

2014 -15 తాలూకు ఆర్థిక లోటును పునర్విభజన చట్టం ప్రకారం కేంద్రం భర్తీ చేయాల్సి ఉంది. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్),14 వ ఆర్థిక సంఘం అంచనాల ప్రకారం ఈ మొత్తం 15 నుంచి 16 వేల కోట్ల వరకూ ఉంటుంది. కానీ కేంద్రం మాత్రం నాలుగువేల కోట్ల రూపాయలే లోటు ఉందంటోంది. ఇంతపెద్ద తేడా ఎందుకొచ్చిందనే ప్రశ్న ప్రతి ఒక్కరిలోనూ తలెత్తుతోంది. రైతు రుణమాఫీ వంటి హామీ తో కాగ్, ఫైనాన్స్ కమిషన్ కు సంబంధం లేదు. దీనిని అమలు చేయడానికి రాష్ట్రప్రభుత్వం నిధులను పక్కదారి పట్టించింది. ఇతరపథకాలు , పెండింగు బిల్లుల చెల్లింపు నిలిపివేసి రాష్ట్రప్రభుత్వం నిధులను పక్కదారి పట్టించింది. దాదాపు నాలుగువేల కోట్ల రూపాయలను రైతు రుణమాపీ చెల్లింపునకు జమ చేసింది. దానిని రెవిన్యూలోటులో చూపించేసింది. పింఛన్ల సంఖ్యను భారీగా పెంచేసింది. రైతు రుణమాఫీ రాష్ట్రప్రభుత్వ ఎన్నికల హామీ కాబట్టి ఆ మొత్తాన్ని రెవిన్యూ లోటులో తీసుకోమని కేంద్రం చెప్పేసింది. పెరిగిన పింఛన్ల భారం కూడా మాది కాదన్నారు. ఇక్కడే కేంద్ర,రాష్ట్ర పద్దుల మధ్య పీట ముడి పడింది. రైతురుణమాఫీని రెవిన్యూ లోటు పద్దులో చేర్చడం రాష్ట్రప్రభుత్వ తప్పిదం. దానికి గాను ఇతర రూపాల్లో నిధులను సమీకరించి సాధారణ పథకాల చెల్లింపులు రెవిన్యూ కాతాలో చేసి ఉంటే కేంద్రం ఇప్పటికే ఆ మొత్తాన్ని లోటుగా పరిగణించి చెల్లించి ఉండేది. తెలివిగా కేంద్రాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేయడమే వికటించి ఇప్పుడు రాజకీయ విపత్తుగా పరిణమించింది. నిలిపివేసిన ఇతర పథకాల నిధులను పరిగణనలోకి ఈ మొత్తాన్ని లెక్కగట్టి కేంద్రం చెల్లించేందుకు ముందుకు వస్తే మరో నాలుగువేల కోట్ల రూపాయలు రాష్ట్రప్రభుత్వానికి వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక శాఖ అధికారులు దీనికి ససేమిరా అంటున్నారు. కేంద్రం రాజకీయ నిర్ణయంతో పరిష్కారాన్ని వెదకాల్సి ఉంటుంది.

రాజకీయ విపత్తు...

పక్కనున్న తెలంగాణ రాష్ట్రప్రభుత్వం రైతు రుణ మాఫీని పూర్తి చేసింది. పెట్టుబడి సాయం కింద ఈ మే నెల నుంచి ఒక్కో పంటకు ఎకరానికి నాలుగు వేలు అందించేందుకు నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ లో ఇంతవరకూ రైతురుణ మాఫీ సగం కూడా పూర్తి కాలేదు. రాజకీయంగా ఇంకా ఇబ్బందికరమైన వాతావరణమే ఉంది. తెలంగాణ మాదిరిగా పెట్టుబడి సాయం అందించకపోతే ఎన్నికల్లో నష్టపోయే ప్రమాదం కనిపిస్తోంది. మరోవైపు నిరుద్యోగ భృతి వంటి ఎన్నికల హామీలు అమలు చేయాల్సి ఉంది. పింఛన్ల వంటి సంక్షేమ పథకాల మొత్తాన్ని, సంఖ్యను పెంచడం కూడా తప్పనిసరి అవసరం. ఎన్నికల ఏడాది కావడంతో పొదుపు కూడా సాధ్యం కాదు. ఆయా అవసరాల రీత్యా రైతు పెట్టుబడి సాయానికి ఆరువేల కోట్ల రూపాయలు, నిరుద్యోగభృతికి మూడువేల కోట్లరూపాయలు, సంక్షేమ పథకాల సంఖ్య, ఇచ్చేమొత్తం పెంచడానికి మూడువేల కోట్లరూపాయలు అవసరమని ప్రాథమికంగా అంచనా వేశారు. అంటే కనీసం పన్నెండు వేల కోట్ల రూపాయల అదనపు అవసరం రాష్ట్రప్రభుత్వానికి ఏర్పడింది. అందుకే రెవిన్యూ లోటు పద్దులో నాలుగువేల కోట్ల రూపాయలు, విదేశీరుణ ప్రాజెక్టుల పద్దులో ఎనిమిదివేల కోట్లరూపాయలను కేంద్రం సమకూరిస్తే పొలిటికల్ ఎకానమిక్స్ సాధ్యమవుతుంది. పొత్తు , సంకీర్ణం, ఏపీ సెంటిమెంటు వంటి కబుర్లన్నీ పైపైకి చెప్పేవే. నిధులు రాబట్టడమే నేటి తక్షణ అవసరం. మార్క్స్ చెప్పిన సిద్ధాంతాన్నే మరోలా నిర్వచిస్తోంది ఏపీ ప్రభుత్వం. మిత్రపక్షాల మైత్రితోపాటు కేంద్ర, రాష్ట్ర సంబంధాలూ ఆర్థిక సంబంధాలే అంటూ కొత్త భాష్యం చెబుతోంది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News