ఫైనల్ గా పోరాటమే...!

Update: 2018-02-13 15:30 GMT

తప్పనిసరి తద్దినమంటే ఇదే. లేకపోతే సంప్రదాయం ఒప్పుకోదు. రాజకీయంగా నష్టమూ తప్పదు. పవన్ కల్యాణ్ కేంద్రంపై ధ్వజమెత్తడానికి , తన మిత్రపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేయడానికి ఒక వ్యూహం సిద్ధం చేస్తున్నాడు. తనకున్న పరిమితపరిజ్ణానం, రాజకీయ అస్థిరత ప్రజల్లో పలచన చేస్తున్నాయని గ్రహించిన పవన్ తెలివిగా ఇద్దరు మేధావులను ముందు పెట్టి పథక రచనకు శ్రీకారం చుడుతున్నారు. అందులోనూ ఆంధ్రాసెంటిమెంటును అస్త్రంగా మలిచేందుకు రెడీ అయిపోతున్నారు. నిజంగానే ఈపాచిక పారితే అటు తెలుగుదేశానికి, ఇటు వైఎస్సార్సీపీకి చుక్కలు కనిపిస్తాయి. రాష్ట్రవిభజన సెంటిమెంటు కారణంగానే 2014లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. బీజేపీ తో కలిసి టీడీపీ అధికారంలోకి వస్తే ఎంతోకొంత ప్రయోజనం ఉంటుందని ప్రజలు భావించారు. మూడున్నర సంవత్సరాల తర్వాత రాజకీయ లెక్కలు సరిపోవడం లేదు. ఆర్థికలావాదేవీలూ అంతగా కలిసి రావడం లేదు. దీనిని ఫోకస్ చేస్తూ బీజేపీకి దూరం కావాలనే ఎత్తుగడలో ఉంది టీడీపీ. ఒకవేళ అదే జరిగితే ఎన్నికల తర్వాత పోస్టుపోల్ అలయన్స్ కు అవసరమైన సంకేతాలిస్తోంది వైసీపీ. ఈ రెండు పిల్లుల కొట్లాటలో ఆంధ్రప్రదేశ్ అధికారపు రొట్టెను దక్కించుకోవడం సాధ్యమవుతుందేమోననే అంచనా వేసింది జనసేన. ఈ మొత్తం ఉదంతంలో నష్టపోయేది తామేనని గ్రహించిన జగన్ ఆలస్యంగా నైనా రంగంలోకి దిగి ఆందోళనకు సిద్ధమవుతున్నారు.

జనసేనకు చెక్.....

తెలుగుదేశానికి తానే ప్రత్యామ్నాయమనుకుంటున్న జనసేన ఈ దఫా ఎన్నికల్లో ఒంటరిగా వెళుతుందో లేదో ఇంకా క్లారిటీ లేదు. కానీ ఈలోపు బలమైన విధానాన్ని నిర్మించుకోవాలని చూస్తోంది. ఉచిత హామీలు, సంక్షేమ పథకాల్లో టీడీపీ, వైసీపీ ఇప్పటికే పరిధికి మించిపోయాయి. అందువల్ల ప్రత్యేకహోదా, ప్రత్యేక ప్యాకేజీ నిధుల విషయంలో ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం జరిగిందనే భావోద్వేగ విషయాన్ని రాజకీయఅంశంగా మార్చేందుకు రంగం సిద్ధమవుతోంది. ఉండవల్లి అరుణ్ కుమార్, జయప్రకాశ్ నారాయణలు ఇందుకు సాధికారత కల్పించడం ఖాయంగా కనిపిస్తోంది. దాదాపు లెక్కలన్నీ సిద్ధమయ్యాయి. నిజనిర్దారణ లో భాగంగా కేంద్రప్రభుత్వ ఉదారతతో ఆంధ్రప్రదేశ్ కు పెద్దగా ఒనగూడిందేమీ లేదని శాస్త్రీయంగా వీరిద్దరూ తేల్చేస్తారనడంలో ఎటువంటి సందేహాలు లేవు. ఏప్రిల్ నాటికి ఇదంతా పూర్తవుతుందంటున్నారు. ఒకవేళ అదేజరిగితే జనసేనకు బ్రహ్మాస్త్రం లభించినట్లవుతుంది. మూడున్నరేళ్లుగా అంటకాగిన టీడీపీ ఎంతగా గగ్గోలు పెట్టినా ఎన్నికల కేకలుగానే ప్రజలు కొట్టిపారేస్తారు. ఈవిషయాన్ని వైసీపీ ఆలస్యంగా గమనించింది. హైదరాబాదులో, ఢిల్లీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు పార్టీ పుట్టిముంచే ప్రమాదం ఉందని సన్నిహితులు హెచ్చరించడంతో తన మౌనముద్ర వీడి కేంద్రంపై ఆందోళనకు జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. రాష్ట్ర వ్యాప్త ఉద్యమం, ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ధర్నా, పార్లమెంటులో ఆందోళన, ఏప్రిల్ ఆరున ఎంపీల రాజీనామా ప్రకటన చేశారు. రానున్న రెండు నెలల్లో జనసేన కార్యాచరణ రూపుదిద్దుకోకముందే రంగంలోకి దిగాలని వైసీపీ శ్రేణులకు దిశానిర్దేశం చేసేశారు. రాజకీయంగా జనసేనకు చెక్ పెట్టకపోతే ఇబ్బందులు తప్పవని పార్టీలోని ద్వితీయ శ్రేణి నాయకుల సూచనతో రెండురోజులుగా మథనం జరుపుతున్నజగన్ ఫైనల్ గా తన నిర్ణయం ప్రకటించారు.

టీడీపీకి లక్ ....

నిన్నామొన్నటివరకూ వైసీపీ బీజేపీతో కలిస్తే తనకు రాజకీయంగా ఇబ్బందులు ఎదురవుతాయని టీడీపీ తర్జనభర్జనలు పడుతూ వస్తోంది. 2019 ఎన్నికలలో సీట్లు తగ్గినప్పటికీ తిరిగి ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని టీడీపీ అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రీపోల్ లేదా పోస్టు పోల్ అలయన్స్ లో వైసీపీ చేరితే కేంద్రం అండతో జగన్ చెలరేగిపోతారేమోననే భయం టీడీపీలో నెలకొంది. అందువల్లనే ఒత్తిడి పెంచుతున్నప్పటికీ పొత్తు విచ్ఛిన్నం విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. రాజకీయ సమీకరణలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. జగన్ సైతం ఆందోళన కు కార్యాచరణ ప్రకటించడంతో టీడీపీ ఊపిరిపీల్చుకుంది. దీంతో నిధుల కోసం ఒత్తిడి పెంచేందుకు వెసులుబాటు లభిస్తుందని భావిస్తోంది. అదే సమయంలో వైసీపీని బీజేపీకి దూరంగా ఉంచవచ్చని అంచనా వేస్తున్నారు. మొత్తమ్మీద రాష్ట్రప్రభుత్వ డిమాండ్లను కేంద్రం చాలావరకూ అంగీకరించాల్సిన తప్పనిసరి పరిస్థితి ఏర్పడుతోంది. టీడీపీ ముందస్తుగానే కేంద్రంపై దాడి మొదలు పెట్టడం, జనసేన అవసరమైన సమర సన్నాహాలు చేసుకోవడంతో వైసీపీ కూడా ఉద్యమ బాట పట్టాల్సి వస్తోంది. పొలిటికల్ ఈక్వేషన్స్ లో వెనకబడ కూడదన్న తపన జగన్ లో కనిపిస్తోంది. అయితే రాజకీయంగా ఇది కలిసివస్తుందా? లేదా ? అన్నది కాలమే తేల్చాలి..

ఆలస్యమైనా..అవసర నిర్ణయం....

జనసేన, టీడీపీ కేంద్రంపై ఒత్తిడి పెంచుతున్న మాట వాస్తవం. కానీ వైసీపీ గతంలో చేసిన ఒక ప్రకటన కొంత ఇబ్బందికరంగా మారింది. అవసరమైతే బీజేపీతో చేతులు కలిపేందుకు సైతం సిద్దమంటూ రెండు నెలల క్రితం జగన్ అనడంతోనే రాజకీయం మొదలైంది. ఈలోపు ప్రధాని మోడీ, అమిత్ షా వంటివారితో విజయసాయి రెడ్డి సమావేశమవ్వడం, ఆ పార్టీ అగ్రనేతలతో సన్నిహిత సంబంధాలు నెలకొల్పుకోవడం కూడా వైసీపిని ఇరకాటంలోకి నెట్టేశాయి. అంతేకాకుండా ఏడాదిన్నర క్రితమే ఎంపీలతో రాజీనామా చేయిస్తామని ప్రకటన చేసి పక్కనపడేయడం కూడా వైసీపీ క్రెడిబిలిటీని దెబ్బతీసింది. టీడీపీ కొంతకాలంగా జగన్ కేసులను ప్రస్తావిస్తూ బీజేపీని, వైసీపిని చికాకు పరుస్తోంది. జనసేనకూ ఇది ఒక రాజకీయ అవకాశంగా మారింది. మొత్తం పరిస్థితులను మదింపు చేసుకుని కేంద్రాన్ని నిలదీయకపోతే తమ రాజకీయ మనుగడ కష్టమన్న విషయాన్ని వైసీపీ శ్రేణులు పదే పదే జగన్ కు మొరపెట్టుకున్నాయి. కొంచెం రిస్కు తో కూడినప్పటికీ పకడ్బందీ ప్రకటనగానే తాజా కార్యాచరణను చూడాల్సి ఉంటుంది. అయితే ఏప్రిల్ లో రాజీనామాలు చేసినా అవి ఆమోదం పొంది ఉప ఎన్నికలు వచ్చే పరిస్థితి మాత్రం లేదు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News