ప‌వ‌న్ చుట్టూ కోట‌రి...అదే దెబ్బేస్తోందా..!

Update: 2017-11-10 12:30 GMT

జ‌న‌సేన పార్టీ ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల్లో ప్ర‌త్య‌ర్థులతో త‌ల‌ప‌డ‌క‌ముందే చ‌తికిల‌ప‌డుతోంది. త‌ల‌తెగిపడుతున్నా అడుగులు ముందుకే అన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆవేశ‌పూరిత నినాదాలు సినిమా డైలాగుల్లా మిగిలిపోతున్నాయి. తెలుగు రాష్ట్రాల‌లో యువ‌త‌ని ఒక ఊపు ఊపేందుకు వ‌చ్చిన జ‌న‌సేన క్ర‌మేపీ శ‌క్తిహీనంగా మారుతుంది. కోట్లాదిమందికి ఆరాధ్యుడైన ప‌వ‌న్ క‌ళ్యాణ్ నిజాయితీగ‌ల మ‌నిషి. అందులో ఎవ‌రికీ సందేహం లేదు. మిగిలిన రాజ‌కీయ నాయ‌కుల్లా లోప‌ల ఒక‌టి, బ‌య‌ట ఒక‌టి మాట్లాడ‌రు. తన మ‌న‌సులో ఉన్న భావాల్సి నిక్క‌చ్చిగా కుండ‌బ‌ద్దలు కొట్టిన‌ట్లు చెప్ప‌డంలో తిరుగులేని నాయ‌కుడు. ప‌త‌న‌మైన రాజ‌కీయాల్లో ఒక వేగుచ‌క్క‌లా వ‌చ్చిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ తెలుగురాష్ట్రాల‌లో విలువలు క‌లిగిన రాజ‌కీయాల‌ను ప్ర‌వేశ‌పెడ‌తార‌ని అనేక‌మంది ఆశ‌లు పెట్టుకున్నారు.

ఇమేజ్ క్రమేపీ.....

2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల ముందు జ‌న‌సేన పార్టీ ఆవిర్భావ స‌మ‌యంలో ప‌వ‌న్ ప్ర‌సంగం తీరు, సూటైన మాట‌లు అన్ని వ‌ర్గాల్ని ఆక‌ట్టుకున్నాయి. ప్రాంతీయ భేదాలు మ‌రిచి రెండు తెలుగు రాష్ట్రాల‌లో ప‌వ‌న్ మానీయా అలుముకుంది. సంప్ర‌దాయ రాజ‌కీయ పార్టీల‌తో విసిగిపోయిన ప్ర‌జ‌ల‌కు మ‌రో ప్ర‌త్యామ్నాయం కింద ప‌వ‌న్ క‌నిపించారు. అక్క‌డ క‌ట్ చేస్తే గ‌త‌మెంతో ఘ‌నం అన్న‌రీతిలో జ‌న‌సేన ప‌రిస్థితి త‌యారైంది. ముఖ్యంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇమేజ్ క్ర‌మేపీ మ‌స‌క‌బారుతోంది. దీని వెనుక కార‌ణాలు ఒక్కసారి ప‌రిశీలిద్దాం. ప్ర‌జారాజ్యం పార్టీ ఎన్నిక‌ల ప్ర‌చార స‌మ‌యంలో కాంగ్రెస్ పెద్ద‌ల పంచ‌లు ఊడ‌దీసి కొట్టాల‌న్న ప‌వ‌న్ మాట‌ల్లో వేడి ఇప్పుడు లేదు. క్ర‌మేపీ ఆ పంచ‌లు ఉన్న నేత‌ల‌కే ద‌గ్గ‌ర‌వుతున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప్ర‌త్యేక హోదా తేవ‌డంలో ఎంపీలు చేత‌కాని ద‌ద్ద‌మ్మ‌లు అని కాకినాడ స‌భ‌లో ప‌వ‌న్ గ‌ర్జించాడు. ప్ర‌త్యేక హోదా ప్రాణాల‌కు తెగించి పోరాడ‌తాన‌ని ప్ర‌తీ స‌భ‌లో ఆవేశ‌పూరిత ప్ర‌సంగాల‌తో యువ‌త‌ని ఉత్తేజితం చేశాడు.

జల్లికట్టు తరహా అంటూ....

త‌మిళ‌నాడులో జ‌ల్లిక‌ట్టు స్ఫూర్తితో విశాఖ‌ప‌ట్నం బీచ్‌లో విద్యార్థులు, యువ‌త ఏర్పాటు చేసిన ప్ర‌త్యేక హోదా యువభేరి కార్య‌క్ర‌మానికి ప‌వ‌న్ మ‌ద్ద‌తు ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ప‌వ‌న్ పిలుపుతో అభిమానులు, జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు పెద్ద ఎత్తున హాజ‌రై పోలీసు లాఠీ దెబ్బ‌లు తిని, అక్ర‌మ కేసుల్లో ఇరుక్కున్నారు. ప‌వ‌న్ విశాఖ‌ప‌ట్నంలో యువ‌భేరి కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌వుతార‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జానీకం అంతా ఎదురు చూసింది. కానీ ప‌వ‌న్ ఎక్క‌డా క‌నిపించ‌లేదు. యువ‌భేరిలో పాల్గోవ‌డానికి విశాఖ‌ప‌ట్నం వెళ్లిన వైఎస్ జ‌గ‌న్‌ని పోలీసులు విమానాశ్ర‌యం నుంచే వెన‌క్కి పంపించేశారు. ఇక్క‌డ జ‌రిగిన హైడ్రామాతో రాష్ట్ర‌వ్యాప్తంగా జ‌గ‌న్‌కు మ‌ద్ద‌తు పెరిగింది. ప్ర‌త్యేక హోదా విష‌యంలో అవ‌స‌ర‌మైతే జ‌గ‌న్‌తో కలిసి ప‌నిచేస్తాన‌న్న ప‌వ‌న్ అస‌లు విశాఖ‌ప‌ట్నం రాక‌పోవ‌డంతో మొట్ట‌మొద‌టిసారిగా అభిమానుల్లో కూడా అసంతృప్తి మొద‌లైంది. ఇది గ‌మ‌నించి రెండో రోజు విలేక‌ర్ల సమావేశం పెట్టిన ప‌వ‌న్ తాను విశాఖ‌ప‌ట్నం వెళితే సంఘ విద్రోహ‌శ‌క్తులు ఉద్యమంలోకి ప్ర‌వేశించే అవ‌కాశం ఉంద‌ని, ఆరోజు జ‌న‌వ‌రి 26వ తేది రిప‌బ్లిక్ డే సంద‌ర్భంగా శాంతిభ‌ద్ర‌త‌ల‌కు ఇబ్బంది క‌లిగించ‌కూడ‌ద‌ని హాజ‌రుకాలేద‌ని చెప్పారు. పోలీసుల నిర్భందాల్ని, అరెస్టులు, లాఠీఛార్జీల విష‌యంపై ఒక్క మాట మాట్లాడ‌లేదు.

ఆత్మగౌరవ సభ ఏదీ....?

ఇక ద‌క్షిణ భార‌త‌దేశంపై ఉత్త‌ర భార‌త‌దేశం వివ‌క్ష చూపిస్తుంద‌ని స‌రికొత్త విచిత్ర వాద‌న తీసుకొచ్చారు. మార్చి నెలాఖ‌రు నాటికి అంటే ఆరోజు నుంచి మ‌రో రెండు నెల‌ల్లో ద‌క్షిణ భార‌త‌దేశ‌పు ఆత్మ‌గౌర‌వ స‌భ ఏర్పాటు చేస్తామ‌ని ఆవేశంగా ప్ర‌క‌టించారు. ప్ర‌త్యేక‌హోదా విష‌యంలో పోరాడుతున్న యువ‌త‌కు మ‌ద్ద‌తు ఇవ్వ‌డంపోయి ద‌క్షిణ‌భార‌త‌దేశం, ఉత్త‌ర భార‌త‌దేశం అని విడ‌గొట్టి మాట్లాడ‌డంతో ప‌వ‌న్ క‌ళ్యాణ్ జాతీయ‌భావాల‌పై విమ‌ర్శ‌లు మొద‌ల‌య్యాయి. భార‌త‌దేశం గొప్ప‌త‌నాన్ని, ఔన్నాత్యాన్ని, స్వాతంత్య్ర‌స్ఫూర్తి, దేశ‌భ‌క్తి వంటి ప‌దాల‌తో యువ‌త‌ని ఆక‌ర్షించే ప‌వ‌న్ తొలిసారిగా దేశంలో ఉత్త‌ర‌, ద‌క్షిణ భార‌తాల్ని విడ‌దీసి మాట్లాడ‌డం చాలామందిని ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ప‌వ‌న్ అభిమానులు మ‌రికాస్తా అభిమానంతో ద‌క్షిణ‌భార‌త‌దేశ రాజ‌కీయాల‌ను ప‌వ‌న్ శాసించ‌డానికే ఆత్మ‌గౌర‌వ స‌భ పెడుతున్నార‌ని ప్ర‌చారం చేశారు. చివ‌రికి మార్చి దాటిపోయి ఏప్రిల్ వ‌చ్చేసినా ఆత్మ‌గౌర‌వ‌స‌భ జాడ‌లేదు. చివ‌రికి ప‌వ‌న్ సగ‌టు రాజ‌కీయ నాయ‌కుడిలా క‌నిపించ‌డం మొద‌లైంది.

అంతర్జాతీయ వేదికపై కూడా....

ఆ త‌ర్వాత అమెరికాలోని హార్వ‌ర్డ్ విశ్వ‌విద్యాల‌యంలో ప్ర‌సంగించేందుకు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి అరుదైన ఆహ్వానం ల‌భించింది. జ‌న‌సేన‌కి అంత‌ర్జాతీయ స్థాయిలో గుర్తింపు వ‌చ్చింద‌ని అభిమానులు ప్ర‌చారం మొద‌లు పెట్టారు. అమెరికా వెళ్లి హార్వ‌ర్డ్ విశ్వ‌విద్యాల‌యంలో ప‌వ‌న్ ప్ర‌సంగం ఎలా ఉంటుందో ఎంతో ఉత్కంఠ‌తో ఎదురుచూస్తున్న‌వారికి ఒక్క‌సారిగా నిరాశ మిగిలింది. భార‌త‌దేశంలో ఒక రాజ‌కీయ పార్టీ అధినేత‌గా, కోట్లాదిమందికి ప‌రిచ‌యం ఉన్న వ్య‌క్తిగా ప‌వ‌న్ భార‌త‌దేశం ఔన్నత్యాన్ని, గొప్ప‌త‌నాన్ని చాటిచెప్పాల్సిందిపోయి ద‌క్షిణ భార‌త‌దేశంపై ఉత్త‌ర భార‌త‌దేశం వివ‌క్ష చూపిస్తుంద‌ని మాట్లాడారు. ప‌వ‌న్ మాట‌లు ఎవ‌రూ హ‌ర్షించ‌లేక‌పోయారు. తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ఈవో అనిల్ కుమార్ సింఘాల్ నియామ‌కం విష‌యంలో జ‌న‌సేన మ‌రింత గంద‌ర‌గోళానికి గురైంది. ఉత్త‌ర భార‌త‌దేశానికి చెందిన ఐఏఎస్ అధికారిని తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ఈవోగా ఎలా నియ‌మిస్తార‌ని ప‌వ‌న్ ప్ర‌శ్నించారు. ద‌క్షిణాదికి చెందిన ఐఏఎస్ అధికారుల‌ను ఉత్త‌రాది రాష్ట్రాల‌లో ఎందుకు నియ‌మించర‌ని నిల‌దీశారు. ఈ అంశంపై పెద్ద ఎత్తున దుమారం రేగింది. తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానానికి ఉత్త‌ర‌, ద‌క్షిణ భార‌త దేశం వివ‌క్ష అంట‌గ‌ట్ట‌డ‌మేమిట‌ని చాలా మంది ప‌వ‌న్‌పై అసంతృప్తి వ్య‌క్తం చేశారు. ఐఏఎస్ పోస్టు అన్న‌ది కేంద్ర స‌ర్వీసు. దేశంలో ఎక్క‌డైనా ప‌నిచేయాల్సి ఉంటుంది. ఈ విష‌యం కూడా తెలియ‌క‌పోతే ఎలా తెదేపా నేత‌లే పవ‌న్‌పై విరుచుకుప‌డ్డారు. ఎమ్మెల్సీ బాబూ రాజేంద్ర‌ప్ర‌సాద్ లాంటి నేత‌లు ఒక అడుగు ముందుకేసి ప‌వ‌న్ వైఖ‌రిని ఎండ‌గ‌ట్టారు.

పరస్పర విరుద్ధ ప్రకటనలతో....

దేశ‌వ్యాప్తంగా ఎంతో కీల‌క‌మైన సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషనర్‌గా తెలుగువాడైన వీరయ్యచౌదరిని నియ‌మించిన విష‌యం ప‌వ‌న్‌కు తెలియ‌దా? అని ప్ర‌శ్నించారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ని ఎవ‌రో త‌ప్పుదారి ప‌ట్టిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఈ విమ‌ర్శ‌ల దాడి ఎక్కువ‌వ్వడంతో జ‌న‌సేన పార్టీ ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ప‌వ‌న్ దేశ‌భ‌క్తిని ఎవ‌రూ శంకించ‌లేర‌ని తెలిపింది. ఉత్త‌ర భార‌తీయుల‌కు ఉన్న ప్రాధాన్యం ద‌క్షిణ భార‌తీయుల‌కు ఉండ‌డంలేద‌న్న బాధ త‌ప్పా దేశ విభ‌జ‌న కోరుకోవ‌డంలేద‌ని వివ‌రించింది. ఆ రోజు నుంచి మ‌ళ్లీ ఉత్త‌ర‌, ద‌క్షిణ భార‌త‌దేశాల ఊసేలేదు. ఇటీవ‌ల రెండు తెలుగు రాష్ట్రాల‌లో 175 స్థానాల్లో పోటీచేస్తాం, మ‌న బ‌లం ఎంత ఉంటే అంతే చేస్తామ‌ని సోష‌ల్ మీడియాలో జ‌న‌సేన అధికారికంగా ప్ర‌క‌టించి 10 నిమిషాల్లోనే ఆ పోస్టు తొల‌గించింది. ఈ ప‌రిణామాలు చూస్తుంటే ప‌వ‌న్‌కి పార్టీపై ప‌ట్టు క‌నిపించ‌డంలేద‌ని చాలా మంది అభిప్రాయ‌ప‌డుతున్నారు. నిల‌క‌డ‌లేని ప‌వ‌న్ మాట‌లు జ‌న‌సేన శ్రేణుల‌ను గంద‌ర‌గోళం ప‌రుస్తున్నాయ‌న్న ఆందోళ‌న ఎక్కువైంది. రిజ‌ర్వేష‌న్లు లేని స‌మాజం కావాలి అంటూ ప్ర‌క‌టిస్తూ కాపు రిజ‌ర్వేష‌న్ల‌పై తెదేపా ప్ర‌భుత్వం ఇచ్చిన హామీని నిల‌బెట్టుకోవాల‌ని ప‌వ‌న్ కోరుతున్నారు. ప‌ర‌స్ప‌ర విరుద్ధ‌మైన త‌న మాట‌ల‌ను ఎలా అర్థం చేసుకోవాలో అభిమానుల‌కు అంతుబ‌ట్ట‌డంలేదు. మ‌రోవైపు గోదావ‌రి మెగా ఆక్వాపుడ్ బాధిత గ్రామాల్లో రైతుల‌కు మ‌ద్ద‌తుగా ప‌ర్య‌టిస్తే అరాచ‌క శ‌క్తులు ప్ర‌వేశించే అవ‌కాశం ఉంద‌ని ప్ర‌క‌టించారు. ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో గ‌ర‌గ‌ప‌ర్రు ద‌ళిత ఉద్య‌మానికి మ‌ద్ద‌తుగా రావాల‌ని ప‌వ‌న్‌ని కోరిన‌ప్పుడు కూడా నేను వ‌స్తే అరాచ‌క శ‌క్తులు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని మాట్లాడారు. ప్ర‌జా జీవితంలో ఉండాల్సిన నాయ‌కులు త‌ర‌చూ త‌న బ‌ల‌హీన‌త కాపాడుకోవ‌డానికి నేను వ‌స్తే అరాచ‌క శ‌క్తులు వ‌చ్చి గంద‌ర‌గోళం చేస్తాయ‌ని చెప్ప‌డం రాజ‌కీయ వ‌ర్గాల్లో విస్మ‌యం వ్య‌క్త‌మ‌వుతోంది.

హోదాపై ఆ గర్జనలు ఏవీ?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబునాయుడు విష‌యంలో ప‌వ‌న్ అనుస‌రిస్తున్న వైఖ‌రి జ‌న‌సేన‌ని ప‌ట్టి ముంచుతుంద‌న్న అభిప్రాయం ఆ పార్టీ శ్రేణుల్లో వ్య‌క్త‌మ‌వుతోంది. ప్ర‌త్యేక హోదా విష‌యంలో ఎప్పుడూ అధికార పార్టీ ఎంపీల‌ను తిట్టే ప‌వ‌న్ చంద్ర‌బాబుని ప‌ల్లెత్తుమాట అన‌ర‌న్న అభిప్రాయం ఉంది. పార్ల‌మెంటులో కేంద్ర ప్ర‌భుత్వాన్ని నిల‌దీయ‌లేని ద‌ద్ద‌మ్మ ఎంపీలు ఉన్నార‌ని ప‌వ‌న్ విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఈ విష‌యంలో అన‌కాప‌ల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్‌, కేంద్ర మంత్రులు సుజనాచౌద‌రిల‌ను ల‌క్ష్యంగా చేసుకుని మాట్లాడారు. ఒక‌నొక ద‌శ‌లో ఎంపీ అవంతి శ్రీనివాస్‌ని ప్ర‌త్యేక హోదా కోసం ఎంపీ ప‌ద‌వికి రాజీనామా చేయ‌మ‌ని కోరారు. అవ‌స‌ర‌మైతే అన‌కాప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో తాను తిరిగి మ‌ళ్లీ నెగ్గిస్తాన‌ని నిండు స‌భ‌లో ప్ర‌క‌టించారు. దీనిపై వెంట‌నే స్పందించిన అవంతి శ్రీనివాస్ ముందుగా త‌న అన్న చిరంజీవిని గెలిపించుకోవాల‌ని ఎదురుదాడి చేశారు. దీనికి ప‌వ‌న్ నుంచి ఎటువంటి స‌మాధానం లేదు. ఇటీవ‌ల కేంద్ర‌మంత్రి, వివాద ర‌హితుడుగా పేరుండే అశోక్ గ‌జ‌ప‌తిరాజు త‌న‌కు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎవ‌రో తెలియ‌ద‌ని మీడియాతో అన్నారు. వెనువెంట‌నే స్పందించిన ప‌వ‌న్ నేను ఎవ‌రో అశోక్‌గ‌జ‌ప‌తిరాజు గారికి తెలియ‌క‌పోయినా నాకు ఆయ‌న తెలుసు అంటూ ట్వీట్ చేశారు.

బీసీ ఓటు బ్యాంకుకోసమేనా?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర మంత్రి పితాని స‌త్య‌నారాయ‌ణ మాట్లాడుతూ ప‌వ‌న్ క‌ళ్యాణ్ జ‌న‌సేన జెండా రాష్ట్రంలో లేద‌న్నారు. ప‌వ‌న్ పార్టీ నిర్మాణంపై ఆలోచించ‌డంలేదని చెప్పుకొచ్చారు. త‌మ‌కు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై ఆలోచించే స‌మ‌యంలేద‌న్నారు. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైకాపానే త‌మ ప్ర‌త్య‌ర్థి అని ప్ర‌క‌టించ‌గానే పెద్ద ఎత్తున దుమారం రేగింది. ఈ విష‌యంలో ప‌వ‌న్ స్పందించి అశోక్‌గ‌జ‌ప‌తిరాజు గారికి, పితాని స‌త్యనారాయ‌ణ గారికి నేను ఎవ‌రో తెలియ‌దు. చాలా సంతోషం అని ట్వీట్ చేశారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ని గంద‌ర‌గోళ‌ప‌ర‌చ‌డానికి వేస్తున్న ఎత్తుగ‌డ‌ల్లో ప‌వ‌న్ ఇరుక్కుపోతున్నారని రాజ‌కీయ విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. ప‌వ‌న్‌, పితాని మ‌ధ్య వైరం గోదావ‌రి జిల్లాల్లో కాపు, బీసీ వ‌ర్గాల మ‌ధ్య పోరుని త‌ల‌పించే ఎత్తుగ‌డ అని చాలామంది అభిప్రాయ‌ప‌డుతున్నారు. తెదేపా త‌న బీసీ ఓటు బ్యాంక్‌ని సుస్థిరం చేసుకోవ‌డానికి ప‌వ‌న్‌తో స్నేహం చేస్తూనే మ‌రోవైపు వ్యూహాత్మ‌కంగా జ‌న‌సేన‌ని క‌ట్ట‌డి చేస్తున్నార‌ని భావిస్తున్నారు.

వ్యూహం లేక విల‌విల‌...

జ‌న‌సేన‌, ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ల‌క్ష్యంగా సాగుతున్న కుట్ర‌ల‌ను తిప్పుకొట్టేందుకు అవ‌స‌ర‌మైన వ్యూహం కొర‌వ‌డింద‌ని సొంత పార్టీ కార్య‌క‌ర్త‌లే అసంతృప్తితో ర‌గిలిపోతున్నారు. ప‌వ‌న్ సినిమాల మీద ఉన్న అభిమానం చంపుకోలేక‌, పూర్తి స్థాయి రాజ‌కీయ నేత‌గా మార‌లేక ఒక‌ర‌క‌మైన సందిగ్ధంలో ఉన్న‌ట్లు క‌నిపిస్తున్నార‌ని చాలా మంది అభిప్రాయ‌ప‌డుతున్నారు. జ‌న‌సేన కార్యాల‌యం ప్రారంభించిన‌ప్పుడు, పార్టీ ముఖ్య‌నేత‌ల‌తో స‌మావేశాలు నిర్వ‌హిస్తున్న‌ప్పుడు ఒన్‌మ్యాన్ షోలా విడుద‌ల చేసే వీడియోలే బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. రాష్ట్ర‌వ్యాప్తంగా జ‌న‌సేన పార్టీలోకి ముఖ్య కార్య‌క‌ర్త‌ల‌ను ఎంపిక చేసుకున్నారు. ఇవ‌న్నీ ప‌వ‌న్‌కి ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ ద్వారా చూపిస్తున్నస‌మ‌యంలో ప‌వ‌న్ ఒక్క‌డే సోఫాలో కూర్చున్న‌ట్లు మిగిలిన‌వారంతా చేతులు క‌ట్టుకుని చుట్టూ నించుని ఉన్న వీడియో జ‌న‌సేన అధికారి ఫేస్‌బుక్ పేజీలో పోస్టు చేశారు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌, ప‌వ‌న్ క్లోజప్ షాట్‌లు, హావాభావాలు ఇవ‌న్నీ సినిమా ట్రైల‌ర్‌ని త‌ల‌పించాయి. తన చుట్టూ ఉండే కోట‌రీపై ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా ధ్వ‌జ‌మెత్తుతున్నారు. కృష్ణా జిల్లా ఉయ్యూరుకి చెందిన అన‌గాని రామ్ ప్ర‌సాద్‌, ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా భీమ‌వ‌రం ప‌ట్ట‌ణానికి చెందిన సుంక‌ర క‌ళ్యాణ్ దిలిప్‌లు బ‌హిరంగంగానే విమ‌ర్శ‌ల‌కు దిగుతున్నారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి నిజాలు తెలియ‌కుండా ప‌వ‌న్ చుట్టూ ఉన్న కోట‌రీ జ‌న‌సేన‌ని నాశ‌నం చేస్తున్నార‌ని మండిప‌డుతున్నారు. మ‌రోవైపు ప‌వ‌న్ క‌ళ్యాణ్ నిల‌క‌డ‌ని కోల్పోతున్నార‌న్న బాధ అభిమానుల్లో క‌నిపిస్తోంది. జ‌న‌సేన ప్ర‌త్యేక హోదా ఉద్య‌మం ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాట్లాడిన‌ప్పుడే చ‌ర్చ‌కు రావ‌డం మిగిలిన స‌మ‌యాల్లో స్త‌బ్ధుగా ఉండిపోవ‌డం ప‌ట్ల ఆ పార్టీని ప్ర‌త్యేక హోదా అంశ‌మే ముంచే అవ‌కాశం ఉంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News