పోల‘వార్’లో పొలిటికల్ కోణం

Update: 2017-10-17 14:30 GMT

కడుపులో కత్తులు పెట్టుకుని పొత్తులు కొనసాగించడమే రాజకీయం. అవసరాలు మిత్రులు, శత్రువులను నిర్ణయిస్తుంటాయి. అందుకే పాలిటిక్స్ లో పర్మనెంట్ ఫ్రెండ్స్ ఉండరంటుంటారు. రానున్న ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను శాసించే నాలుగు అంశాలపై తీవ్రస్థాయిలో కసరత్తు సాగుతోంది. అధికార తెలుగుదేశం,బీజేపీ ఎన్నికల్లో ఇచ్చిన ప్రధాన హామీలు నాలుగు. అవే రాష్ట్రానికి సంబంధించి జీవనాధారమైన అంశాలు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా, పోలవరం నిర్మాణం, అమరావతి నిర్మాణం, విశాఖకు రైల్వేజోన్. ఇవి రాష్ట్రంలోని ప్రజలందరికీ సంబంధించిన సెంటిమెంటు అంశాలు. కాపులకు రిజర్వేషన్, బీసీల రిజర్వేషన్ల పెంపు, నిరుద్యోగ భృతి, రైతు రుణమాఫీ ఆయా వర్గాలకు లబ్ధి చేకూర్చే అంశాలే కానీ మొత్తమ్మీద కులమతాలకతీతంగా రాష్ట్రప్రగతికి సంబంధించి విషయాలు కాదు. టీడీపీ ఇచ్చిన ఎన్నికల వాగ్దానాల విషయంలోనే కొంత కదలిక కనిపిస్తోంది. కాపుల రిజర్వేషన్ల విషయంలో మంజునాథ కమిషన్ పనిచేస్తోంది. ఏరకమైన ప్రాతిపదికను అనుసరించాలనే విషయమై సుదీర్ఘమైన ప్రక్రియ సాగుతోంది. ఒకవేళ కాపులతోపాటు మరికొన్ని వర్గాలను బీసీల్లో చేర్చాల్సి వస్తే అందుకనుగుణంగా బీసీ రిజర్వేషన్లను పెంచాల్సి ఉంటుంది. సుప్రీం నిర్దేశించిన 50 శాతం పరిధిని దాటితే రాజ్యాంగ పరీక్షకు నిలవాల్సి ఉంటుంది . ఇది వేరే కోణం. నిరుద్యోగ భృతి కూడా వచ్చే జనవరి నాటికి కొలిక్కి తేవాలని తెలుగుదేశం ప్రభుత్వం భావిస్తోంది. రైతు రుణమాఫీ పూర్తిగా అమలైందని చెప్పలేకపోయినా ప్రభుత్వం మాత్రం విడతలవారీగా నిధులు విడుదల చేస్తోంది. వడ్డీలు, అసలు కలిసి తడిసి మోపెడవుతున్నా ఆ భారాన్ని ప్రభుత్వం భరించకతప్పడం లేదు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో చేయాల్సిన పనుల విషయంలో మాత్రం వైఫల్యం వెన్నాడుతోంది. ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యంకాదని కేంద్రం తేల్చేసింది. ప్యాకేజీ ఇస్తున్నామని ప్రకటించింది. ఈ ప్యాకేజీలో ఇంతవరకూ ఎంతమేరకు నిధులు వచ్చాయో అటు రాష్ట్రప్రభుత్వం చెప్పదు. కేంద్రం ప్రకటించదు. విశాఖ రైల్వేజోన్ హుళక్కే. అమరావతి నిర్మాణం 2019 నాటికి కేవలం డిజైన్లుగానే మిగిలిపోవాల్సి రావచ్చు. అయితే రాజమౌళి మెరుగులతో కొత్తగా త్రిడీ గ్రాఫిక్స్ తో ప్రజలను భ్రమ పరచడం ఎలక్షన్ ప్రచార కొసమెరుపుగా ఉండొచ్చు. మూడు చట్టపరమైన హామీల్లో ఒక్క పోలవరం మాత్రమే పట్టాలపై నడుస్తోంది. 2018 నాటికే దీనిని పూర్తి చేస్తామని చంద్రబాబు పూనిక వహించారు. సోమవారాన్ని పోలవారంగా మార్చి సమీక్షలు, వర్చువల్ తనిఖీలు, క్షేత్రస్థాయి సందర్శనలు చేస్తున్నారు. అయినప్పటికీ 2019 ఎన్నికల లోపు ఇది పూర్తవుతుందో లేదో చెప్పలేని పరిస్థితి. అసలు కాంట్రాక్టు పొందిన ట్రాన్స్ ట్రాయ్ తమ వల్ల కాదంటూ చేతులెత్తేసింది. సబ్ కాంట్రాక్టులతో ప్రభుత్వ యంత్రాంగం హడావిడి సృష్టిస్తోంది. నిధులు విడుదల కాకపోవడంతో తాజాగా సబ్ కాంట్రాక్టు సంస్థలు కూడా పనులు నిలిపేసినట్లు అధికారిక సమాచారం. కాంట్రాక్టు సంస్థను మారుస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో బేరసారాలు మొదలు పెట్టింది. అందుకు కేంద్రప్రభుత్వం ససేమిరా అంటోంది. ఆర్థిక కారణాలకు తోడు రాజకీయకారణాలూ ఇందులో దాగి ఉన్నాయనేది పరిశీలకుల అంచనా.

బాబు హడావిడి ..కమలం గడిబిడి

నవ్యాంధ్రలో తమ ముద్ర చూపేందుకు కేంద్రానికి ఉన్న ఏకైక అవకాశం పోలవరం మాత్రమే. పీపీసీ విధానంలో సాగబోతున్న రాజధాని నిర్మాణంలో కేంద్రం పాత్ర అంతంతమాత్రమే. పర్యావరణం, విదేశీ రుణాల విషయంలో ఎక్కడైనా కొర్రీలు వేయవచ్చేమో కానీ క్రెడిట్ తెచ్చుకునే అవకాశం మాత్రం లేదు. ప్రత్యేకహోదా విస్మరణ పాపం కేంద్రం నెత్తిన పడింది. విశాఖపట్నం నుంచి బీజేపీ సొంత ఎంపీ ప్రాతినిధ్యం వహిస్తున్నా రైల్వేజోన్ మంజూరు చేయలేని పరిస్థితి. రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలకు లక్షల కోట్ల రూపాయలు ఇచ్చామని చెబుతున్నా క్షేత్రస్థాయిలో వాటి ఫలితాలు కనిపించడం లేదు. నిజానికి నిధులు మంజూరు చేశారు తప్పితే విడుదల చేయలేదు. బీజేపీ నాయకులు కేంద్రం మంజూరు చేసిన ప్రాజెక్టులకు విలువ కట్టి రాష్ట్రానికి ఆమేరకు నిధులు ఇచ్చేస్తున్నట్లుగా, ఇచ్చేసినట్లుగా చెబుతున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో అసలు కిటుకు అటు తెలుగుదేశం అధిష్టానం, ఇటు బీజేపీ అధిష్టానం బయటపెట్టవు. చాలా ప్రాజెక్టులకు ప్రత్యేకించి రహదారులకు సంబంధించి భూసేకరణ కూడా ఇంకా సాగలేదు. అయినా రాష్ట్రానికి రహదారులకు 60 వేల కోట్ల రూపాయలు ఇస్తున్నట్లు కేంద్రం చెబుతుంది. ప్రత్యేక ప్యాకేజీలోనూ ఇవే గణాంకాలు కనిపిస్తాయి. ఈ పరిస్థితుల్లో కొంత ఆశావహంగా ఉన్న ప్రాజెక్టు పోలవరం మాత్రమే. ఇది జాతీయ ప్రాజెక్టు. డిజైన్ల నుంచి నిర్మాణం వరకూ పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్రానిదే. కానీ చంద్రబాబు దీనిని తానే సొంతంగా చేస్తున్నంత హడావిడి మొదలు పెట్టారు. రాష్ట్రం మొత్తానికి పోలవరంతో లింకు ఉంది. అటు ఉత్తరాంధ్రకు, ఉభయగోదావరి జిల్లాలకు, కృష్ణాడెల్టాకు నీటి తరలింపు, కృష్ణా నది నుంచి కృష్ణా డెల్టాకు కేటాయించిన నికర జలాలను మిగిల్చి, ఆ నీటిని శ్రీశైలం నుంచి రాయల సీమకు తరలింపు ఇలా బహుళార్థకంగా రాష్ట్రమంతటికీ నీటిని వినియోగించుకునే అవకాశం పోలవరం పూర్తయితే లభిస్తుంది. ఏకబిగిన 300టీఎంసీలు నిల్వచేసుకుని అవసరానికి అనుగుణంగా వాడుకోవచ్చు. అందుకే ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తే చరిత్రలో నిలిచిపోవడమే కాదు. రాజకీయంగా తెలుగుదేశానికి లభించే ప్రయోజనాలు అపరిమితం. అందుకే దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకుని చంద్రబాబు సమీక్షిస్తున్నారు. చిత్తశుద్ధితోనే పూర్తి చేయాలని భావిస్తున్నారు. కేంద్రం పాత్ర మాత్రం కనిపించనీయకుండా జాగ్రత్త పడుతున్నారు. పైకి కేంద్రం చేపడితే జాప్యం చోటు చేసుకుంటుంది కనుక తాను దీని విషయంలో నేరుగా రంగంలోకి దిగానంటున్నారు. దీనిపై బీజేపీ నాయకులు కారాలు మిరియాలు నూరుతున్నారు. కానీ ఏం చేయలేని నిస్సహాయత. ఇటీవల నితిన్ గడ్కరీ రాష్ట్ర పర్యటన చేసిన సందర్భంలో ఇదే విషయాన్ని బీజేపీ నాయకులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. పోలవరం తప్ప రేపటి ఎన్నికల్లో బీజేపీ చెప్పుకోవడానికి ఏమీ ఉండదన్న విషయాన్ని అధిష్టానం కూడా గ్రహించడంతో చంద్రబాబు దూకుడు కు కళ్లెం వేయాలనే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.

ఎన్నికల వనరు పోలవరమేనా?

ఒకవైపు ట్రాన్సు ట్రాయ్ చేయలేకపోతోందనే ఉద్దేశంతో వేరే కాంట్రాక్టరుకు ఈ పథకాన్ని అప్పగించాలని చంద్రబాబు యోచన చేస్తున్నారు. ప్రాజెక్టు మొదటి అంచనా వ్యయం 16 వేల కోట్లు కాగా ఇప్పటికే అది ఇబ్బడి ముబ్బడిగా పెరిగి 40 వేల కోట్ల పైచిలుకుకు చేరింది. మళ్లీ కొత్త కాంట్రాక్టరు కోసం టెండర్లు పిలిస్తే మరో 30 శాతం అదనపు ఖర్చు పెరిగే అవకాశం ఉందని కేంద్రం అవగాహనకు వచ్చింది. దీనిని సాకుగా చూపి మొత్తం పథకాన్ని తన పరిధిలోకి తెచ్చుకోవాలని కేంద్రం చూస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ కొత్త కాంట్రాక్టరుకు అంగీకరించేది లేదని మంత్రి నితిన్ గడ్కరీ తేల్చేశారు. జరిగిన పనులకు బిల్లులు సమర్పిస్తే 75 శాతం వెంటనే విడుదల చేస్తామని మిగిలిన 25 శాతం పరిశీలన తర్వాత విడుదల చేస్తామని చెప్పేశారు. ఇందులో కేంద్రం వ్యూహాత్మకంగా తప్పించుకునే ధోరణి కనిపిస్తోంది. చంద్రబాబు యోచనకు ఇది చెక్ పాయింటుగానే చూడాలి. కొత్త కాంట్రాక్టరు వచ్చి అంచనాలు పెంచితే అందులోంచి కొంత మొత్తం పర్సంటేజీల రూపంలో దక్కుతుంది. ఇది రానున్న ఎన్నికల ఖర్చుకు ఉపయోగపడుతుందనే రాజకీయ విమర్శలు కూడా ఉన్నాయి. వేల కోట్ల రూపాయల మొత్తాన్ని సమీకరించడానికి పోలవరం ఆర్థిక వనరుగా కూడా తోడ్పడుతుందనే విమర్శలను బీజేపీ కూడా విశ్వసిస్తున్నట్లే కనిపిస్తోంది. అందువల్ల కొత్తగా అంచనాలు పెంచే ప్రసక్తే లేదని కేంద్రం మొండిగా చెబుతోంది. చంద్రబాబుకు రాజకీయంగా ఇది సవాల్. పోలవరం విషయంలో కొత్త కాంట్రాక్టరుకు అనుమతులు తెచ్చుకోవాలంటే ప్రధానమంత్రి ఆమోదం అవసరం కావచ్చు. ఇటీవలి కాలంలో ప్రధాని మోడీ చంద్రబాబుకు వ్యక్తిగతంగా అపాయింట్ మెంట్లు ఇచ్చేందుకు ఆసక్తి చూపడం లేదు. వేల కోట్ల రూపాయల పెంపుదలతో ముడిపడిన పోలవరం విషయంలో పీఎంఓ సానుకూలత చూపుతుందనే నమ్మకం తెలుగుదేశంలోనే లేదు. ఈ పరిస్థితుల్లో పోలవరాన్ని సబ్ కాంట్రాక్టులతోనే ఏదోలా నెట్టుకునిరావడం తప్ప గత్యంతరం కనిపించడం లేదు. ఇదే వేగంతో పనులు జరిగితే 2019 ఎన్నికలకు ముందు పోలవరం సాకారం కాదని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. ఏతావాతా పోలవరం గోదాలోకి దిగిన చంద్రబాబు ప్రతిష్ట దెబ్బతింటుందా? లేకపోతే కేంద్ర ప్రభుత్వ నిర్లిప్త వైఖరి కారణంగానే పూర్తి కాలేదంటూ రాజకీయ వ్యూహాన్ని ఆశ్రయిస్తారో వేచి చూడాలి.

 

- ఎడిటోరియల్ డెస్క్

Similar News