పోరాటమా? పొలిటికల్ నెగోషియేషనా?

Update: 2017-10-23 15:30 GMT

సభ్యత్వ నమోదు..ప్లీనరీ నిర్వహణ. జిల్లాల వారీ అధికార ప్రతినిధుల ఎంపిక, శిక్షణ ..మొత్తమ్మీద పార్టీకి అవసరమైన ప్రాథమిక కసరత్తు జనసేన మొదలు పెట్టింది. పార్టీ ప్రారంభించి నాలుగు సంవత్సరాలు గడుస్తున్నా ఇంతవరకూ పవన్ కల్యాణ్ అభిమాన సంఘం మాదిరిగానే నడిచింది తప్ప రాజకీయ పార్టీకి ఉండాల్సిన మౌలిక లక్షణాలను సంతరించుకోలేదు. దీనిపై ఆయన శ్రేయోభిలాషుల్లో కొంత అసంతృప్తి ఉంది. పవన్ అభిమానులకు మాత్రం ఆయన ఏం చెబితే అదే వేదం. ఏం చేస్తే అదే రైట్. జనసేన పార్టీయా? లేక ప్రయివేటు ప్రాపర్టీ నా, అన్నదానితో వారికి సంబంధం లేదు. గతంలో ప్రజారాజ్యంలో పనిచేసి తర్వాత అటు వై.సి.పి. ఇటు తెలుగుదేశం పార్టీల్లో సర్దుకుపోయిన చాలామంది నాయకులు కొత్త గాలి కోసం ఎదురుచూస్తున్నారు. టిక్కెట్లు వస్తాయని గ్యారంటీ లేక కొందరు , అధికార, విపక్షాల వైఖరితో విసిగిపోయిన వారు మరికొందరు నూతన రాజకీయం రావాలని మనసారా ఆశిస్తున్నారు. ఇటువంటి వారి ఆలోచనలకు, ఆకాంక్షలకు జనసేన ప్రతీకగా నిలుస్తుందా? లేదా ? అన్న విషయాన్ని పక్కనపెడితే కొన్ని జిల్లాల్లో ఈ పార్టీ బలమైన ప్రభావాన్నే చూపవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. అయితే ఇప్పటికే ఆలస్యమైంది. మూడున్నరేళ్లలో ఏం చేశామంటే చెప్పుకోవడానికి ఏమీ లేదు. పార్టీ సంస్థాగత నిర్మాణం వేగం పుంజుకోవాల్సి ఉంది.

ఎప్పుడొచ్చామన్నదీ... ముఖ్యమే

ఎప్పుడొచ్చామన్నది కాదు..కొట్టామా? లేదా? అన్నదే ఇంపార్టెంటు. ఇది ఒక సినిమా డైలాగ్. ప్రేక్షకుల్లో చప్పట్లు కొట్టించుకోవడానికి చలనచిత్రాలకు సరిపోతుంది కానీ రాజకీయాలకు అస్సలు సరిపడని నినాదం. పాలిటిక్స్ లో టైమింగ్ చాలా కీలకం. 2006 నుంచి దాదాపు రెండేళ్ల పాటు ప్రజారాజ్యం పార్టీకి సంబంధించి విస్తృత చర్చలు సాగాయి. అయితే చిరంజీవి, అల్లు అరవింద్ అండ్ కో తెలుగుదేశం పార్టీ రికార్డును కొట్టేయాలనే ఉద్దేశంతో 2008లో సరిగ్గా ఎన్నికలకు ఎనిమిది నెలలముందు మాత్రమే పార్టీని ప్రారంభించారు. 1982లో తెలుగుదేశం పార్టీ ని ఎన్టీరామారావు స్థాపించి కేవలం తొమ్మిదినెలల కాలంలో అధికారానికి తీసుకొచ్చారు. ఇది ప్రపంచ రాజకీయాల్లోనే ఒక గొప్ప అంశం. ఉక్కు మహిళ ఇందిరాగాంధీ సారథ్యంలోని కాంగ్రెసును ఒంటిచేత్తో జయించడం దేశ రాజకీయాల్లోనే ఎన్టీయార్ సాధించిన పొలిటికల్ విక్టరీ. తమిళనాడులో డీఎంకే పార్టీ స్థాపించిన తర్వాత అధికారంలోకి రావడానికి పదేళ్లు పట్టింది. దానికిముందు 20 ఏళ్లపాటు పెరియార్ రామస్వామి, అన్నాదురై వంటి వారు జరిపిన ఉద్యమాలు డీఎంకే పార్టీకి అవసరమైన రాజకీయ పునాదులను నిర్మించాయి. 1957 లో డీఎంకే పార్టీ పెడితే 1967లో అధికారానికి వచ్చింది. అందులోనూ అన్నాదురై, కరుణానిధి, ఎంజీఆర్ వంటి యోధానుయోధులు దీనికి సమష్టి గా నేతృత్వం వహించారు. ఆ తర్వాత కాలంలో అత్యంత ప్రజాదరణ కల ఎంజీఆర్ 1972లో ఏడీఎంకేను స్థాపిస్తే 1977లో అధికారంలోకి వచ్చింది. ఈ రాజకీయ సమీకరణలను పరిగణనలోకి తీసుకుంటే టీడీపీ రికార్డుకు ఉన్న ప్రాధాన్యం అర్థమవుతుంది. తెలుగుదేశం పార్టీ విజయాన్ని దేశ రాజకీయాలనే మలుపు తిప్పి విపక్షాలకు ఊపిరి పోసిన ఘట్టంగా చూడాల్సి ఉంటుంది. 1984లో ఇందిరాగాంధీ మరణం తర్వాత విపరీతమైన సానుభూతి వెల్లువెత్తింది. విపక్షాలన్నీ ఆ గాలిలో కొట్టుకుపోయాయి. అయినా టీడీపీ లోక్ సభలో అతిపెద్ద పక్షంగా అవతరించి ఒక ప్రాంతీయ పార్టీకి జాతీయస్థాయిని సంతరించిపెట్టింది. 1978 నుంచి 83 మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ లో నలుగురు ముఖ్యమంత్రులు మారారు. కాంగ్రెసు అధిష్టానం చేతిలో వారు కీలుబొమ్మలుగా వ్యవహరించారు. మెజార్టీ ఉన్నప్పటికీ రాజకీయ స్థిరత్వం లోపించింది. వీటన్నిటినీ ఆసరా చేసుకుని తెలుగుదేశం శంఖారావం పూరించింది. సరైన టైమింగ్ తో సక్సెస్ సాధించి సూపర్ హిట్ కొట్టింది. రెండు మూడేళ్ల ముందుగానే పార్టీని ప్రారంభించి ప్రజల్లో పటిష్టం చేసుకోకుండా మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని యావరేజ్ సినిమాను చేసేశారు. వైఎస్సార్ నేత్రుత్వంలోని కాంగ్రెసు , చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని తెలుగుదేశం వ్యూహప్రతివ్యూహాలతో తలపడ్డాయి.మూడో పక్షంగా బరిలో నిలిచిన ప్రజారాజ్యం 70 లక్షల పైచిలుకు ఓట్లతో ప్రజాదరణ చూరగొన్నప్పటికీ సీఎం పీఠమనే మెగా కల నెరవేరలేదు. అదే కొంత ముందుగా టైమింగ్ చూసుకొని ఉంటే ప్రధాన ప్రతిపక్ష స్థాయినైనా అందుకుని ఉండేది. పార్టీ నిలబడేది.

పీఆర్పీ ఇబ్బందులు జనసేనను వెన్నాడతాయా?

రాజకీయ పార్టీని నడపడం చిన్నాచితక వ్యవహారం కాదు. 2009 ఎన్నికలు ముగిసిన రెండు మూడు నెలల కాలంలోనే చిరంజీవి ఈ విషయాన్ని గ్రహించారు. అందుకే ఆ తర్వాత కాలంలో కాంగ్రెసులో కలిపేశారు. ఎన్నో ఉదాత్త ఆశయాలతో పుట్టిన లోక్ సత్తా పార్టీ కూడా కొన్నేళ్లపాటు నడక సాగించి ఇప్పుడు పత్తా లేకుండా పోయింది. జనసేన మూడున్నరేళ్ల ప్రస్థానంలో మిత్రపక్షమో, విపక్షమో తెలియకుండా నడక సాగిస్తోంది. ఇంకో ఏడాదిన్నర కాలంలో ఎన్నికలు పూర్తయిపోతాయి. ఇంతవరకూ పార్టీకి సంబంధించి ఎటువంటి నిర్మాణం లేదు. పవన్ కల్యాణ్ వ్యక్తిగా ముక్కుసూటిగా, నిజాయతీగా ఉంటారు. అదొక్కటే రాజకీయాలకు సరిపోదు. అప్పుడప్పుడు ట్వీట్ల ద్వారాను, మూడు నాలుగు నెలలకోసారి ఏదో జిల్లాలో బహిరంగ సభ పెట్టడం ద్వారాను పార్టీని బ్రతికించలేరు. సంస్థాగత నిర్మాణంతో పార్టీ శ్రేణులు, ద్వితీయ శ్రేణి నాయకత్వం ప్రజల్లో ఉండాలి. పీఆర్ పీ విషయంలో ఇది లోపించింది. పార్టీ పెట్టారు. ఎన్నికలకు వెళ్లారు. తర్వాత కాలంలో మూసేశారు. చిరంజీవి అభిమానులే పార్టీ క్యాడర్ గా భావించారు. ఇప్పుడు జనసేనకు అదే పరిస్థితి పునరావృతం కాకుండా చూసుకోవాలి.

గమ్యంపై .. క్లారిటీ కావాలి

ఇంతవరకూ జనసేన ఏ ఎన్నికలోనూ పోటీ చేయలేదు. 2014 ఎన్నికల్లో టీడీపీ,బీజేపీకి మద్దతు నిచ్చింది. ఇంకా ఆ పొత్తు కొనసాగుతుందో లేదో తెలియదు. 2019 ఎన్నికల్లో పోటీ చేస్తామని పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఎన్నిసీట్లకు పోటీచేస్తామో తెలియదు. మా బలాన్ని అంచనా వేసుకోవాలంటూ సన్నాయి నొక్కులు నొక్కారు. ఇంకా అధినేతకే రాజకీయ చిత్రంపై స్పష్టత లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని పలుసందర్బాల్లో కలవడం కూడా జనసేనానికి రాజకీయంగా నష్టదాయకమే. టీడీపీతో విభేదిస్తున్న పరిస్థితులు ఇప్పటికీ కనిపించడం లేదు. బీజేపీపై విరుచుకుపడుతున్న పవన్ కల్యాణ్ తెలుగుదేశం విషయం వచ్చేటప్పటికి జావకారిపోతున్నారు. ఈ బలహీనతను అటు తెలుగుదేశం నాయకులు, ఇటు వై.సి.పి. నాయకులు తమ రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా వినియోగించుకుంటున్నారు. తమ ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేకతకు అడ్డుకట్ట వేసుకునే క్రమంలో బాగంగా పవన్ కల్యాణ్ తమ వాడే అని తెలుగుదేశం పార్టీ క్లెయిం చేసుకొంటోంది. జనసేనాని చంద్రబాబు చేతిలో మనిషి అంటూ వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు ప్రతిపక్ష స్థానానికి పవన్ కల్యాణ్ పోటీకి రాకుండా ముందస్తుగానే ఎదురుదాడి చేస్తున్నారు. ప్రజారాజ్యం పార్టీ పెట్టిన కొత్తలో యువరాజ్యం అధ్యక్షునిగా పవన్ చాలా స్పీడుగా వ్యవహరించేవారు. విమర్శలు, ఆరోపణల్లో ఆవేశం కనిపించేది. ఆవేదన వినిపించేది. 2014లో తెలుగుదేశం పార్టీతో కలిసిన తర్వాత ఆ ఆవేశం లోపించింది. రాష్ట్రం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యలు , తాము తీసుకుంటున్న చర్యల గురించి వివరించి చంద్రబాబు నాయుడు తనను కలిసిన ప్రతిసందర్భంలోనూ పవన్ కల్యాణ్ ను కూల్ చేసేస్తున్నారు. కొండొకచో కేంద్రం సహకరించడం లేదంటూ బీజేపీపై జనసేనానిని ఉసిగొలుపుతున్నారనే భావన కూడ ఉంది. దాంతో పవన్ మధ్యవర్తిగా మారిపోతున్నారు, తప్పితే రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకునిగా పాత్ర పోషించలేకపోతున్నారు. అందుకే ఇప్పటికైనా పవన్ కల్యాణ్ కేంద్రంలోని, రాష్ట్రంలోని అధికార పక్షాలతో పోరాటమా? లేక సమస్యల పరిష్కారానికి పొలిటికల్ నెగోషియేషనా? అన్న విషయంలో స్పష్టమైన అవగాహనకు రావాలి. అధికారపక్షంతో తాడో పేడో అన్న ధోరణి కనబరచకపోతే ఒక రాజకీయ పక్షంగా జనసేన నిలదొక్కుకోవడం కష్టం.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News