పొలిటికల్ డర్టీ పిక్చర్

Update: 2018-03-29 15:30 GMT

గొప్ప విలువలు ఏనాడో పోయాయి. ప్రజాస్వామ్య సంప్రదాయాలూ మంటగలిసిపోయాయి. కనీసం మనిషిని మనిషిగా గౌరవించుకునే మర్యాద,మన్ననలకూ నీళ్లొదిలేస్తున్నారు. హోదా,వయసు అన్నింటినీ పక్కనపెట్టి మాటను పరిహాసాస్పదం చేస్తున్నారు. ప్రజల్లో పలచనై పోతున్నారు. ఉన్నత రాజకీయస్థానాల్లోని వ్యక్తుల భాషా సంస్కారం ప్రజల ఛీత్కారానికి గురవుతోంది. ఏదో ఒక సంచలనం కోరుకునే టీవీ చానళ్లు పండగ చేసుకోవచ్చు. తిట్లదండకంతో టెలివిజన్ రేటింగు పాయింట్లు పెరుగుతాయని సంబరం చేసుకోవచ్చు. కానీ పబ్లిక్ లో ఆయా నాయకుల రేటింగు పడిపోతోంది. రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు, దానికి ప్రతిగా మంత్రులు చేసిన వ్యాఖ్యలు, ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి ప్రధానినుద్దేశించి చేసినట్లుగా చెబుతున్న వ్యాఖ్యానాలు మొత్తంగా పొలిటికల్ డర్టీ పిక్చర్ కు దర్పణం పడుతున్నాయి.

అమ్మా..అబ్బా.. హవ్వ......

తల్లిదండ్రులను ఉద్దేశించి కించపరిచేలా పుట్టుకలోని పవిత్రతనే ప్రశ్నిస్తూ ఎంపీ విజయసాయిరెడ్డి సీఎం చంద్రబాబు నాయుడిపై అసభ్యపదజాలంతో విరుచుకుపడ్డారు. ప్రధానికి పాదాభివందనం చేశారంటూ విజయసాయి రెడ్డిపై టీడీపీ ఎంపీలు ప్రచారం ప్రారంభించడంతో ఆయన తీవ్రస్థాయిలో స్పందించారు. తనపై ప్రచారాన్ని మొదలుపెట్టిన వారు కూడా ఎంపీలే. వారిని తిడితే సరిపోయేది. కానీ నేరుగా చంద్రబాబునాయుడినే లక్ష్యంగా చేసుకుంటూ దూషించడం అభ్యంతరకరమే. అవినీతి, అక్రమార్జన, కేసుల వంటివాటిని రాజకీయంగా ప్రస్తావించడం తప్పులేదు. ఆయా అంశాలకే విజయసాయిరెడ్డి పరిమితమై ఉండే బాగుండేదని సీనియర్ పొలిటీషియన్లు పేర్కొంటున్నారు. సీఎం పదవి ఒక రాజ్యాంగ ప్రమాణాలతో కూడినది. చంద్రబాబు నాయుడు అక్కడ శాశ్వతమూ కాదు. రేపొద్దున్న జగన్ కూడా సీఎం కావచ్చు. కానీ ఆ స్థానంలో కూర్చున్న వ్యక్తి తల్లిదండ్రుల వరకూ దూషణను దిగజార్చడం ఏరకంగా నైతికమంటే సమాధానం దొరకదు. వైసీపీని, బీజేపీతో అంటకలిపేయాలనే ఉద్దేశంతో టీడీపీ పాదాభివందనం ఎపిసోడ్ ను హైలైట్ చేసింది. దానికి విజయసాయి కొంతమనస్తాపానికి గురయినట్లు పార్టీ వర్గాల సమాచారం. దానిని ప్రతిఘటించే ప్రయత్నంలో తాను దారి తప్పి నోరు జారడంతో అసలు విషయం పక్కకి పోయింది. గతంలో శాసనసభలో వైఎస్ కూడా చంద్రబాబు నాయుడి విషయంలో ‘ ఆ తల్లి కడుపున పుట్టినందుకు ’ అంటూ వ్యాఖ్యానించడం దుమారం రేపింది. నాయకులు కొంచెం సంయమనం పాటిస్తే హుందాగా ఉంటుంది. లేకపోతే బజారు మాటలతో సొంత ప్రతిష్ఠకూ భంగం వాటిల్లుతుంది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ మంత్రులు కూడా విజయసాయి నుద్దేశించి అంతే దారుణమైన పదజాలంతో తిట్లదండకం మొదలుపెట్టారు. అమాత్య హోదాలో ఉన్నవారు అలా దిగజారి మాట్లాడటమూ విమర్శలకు తావిచ్చింది.

కేసీఆర్ కూ చురుకెక్కువే...

మాటల మాంత్రికుడైన కేసీఆర్ పదాల విరుపు, ప్రత్యర్థిని తిట్టడంలో ముందు వరసలో ఉంటారు. ఉద్యమకాలంలో ఆయన ఏంచేసినా, చెప్పినా చెల్లుబాటయ్యేది. ఇప్పుడు ముఖ్యమంత్రి పీఠం పై కూర్చున్న తర్వాత కొంచెం నోటిని సంభాళించుకోవాల్సి ఉంటుంది.కానీ ఆ తరహా జాగ్రత్త ఆయన మాటల్లో కనిపించడం లేదు. ఇటీవల ప్రధానినుద్దేశించి గాడు వంటి పదం వాడారంటూ దుమారం చెలరేగింది. ఎలక్ట్రానిక్ మీడియా విజృభించి రాజ్యం చేస్తున్న ఈ కాలంలో తప్పించుకోవడం సాధ్యం కాదు. ప్రతి అంశమూ రికార్డు అవుతుంది. అందుకే దీనిపై టీఆర్ఎస్ సమర్థమైన ప్రతివాదనను వినిపించలేకపోయింది. అంతకు ముందు వరకూ బీజేపీ, టీఆర్ఎస్ ల మధ్య ఉన్న కొద్దిపాటి సత్సంబంధాలకూ గండి పడింది. ఎంతో వాగ్ధాటి కలిగి అందర్నీ మంత్రముగ్ధం చేయగల కేసీఆర్ కు సైతం ఈ జంజాటం తప్పడం లేదు. నోరు జారి నాలుక కరచుకోవాల్సి రావడం , బురద తొక్కి కాలు కడుక్కోవడం కంటే తీవ్రమైనదే. అందులోనూ రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారు పరస్పరం తిట్టుకోవడమంటే తమ స్థాయిని పతనానికి తీసుకెళ్లడమే.

చంద్రబాబు చమత్కారం...

తనపైకి ప్రయోగించిన తిట్టును కూడా అస్త్రంగా ప్రయోగించి వాడుకోగల సమర్థుడు చంద్రబాబు. విజయసాయిరెడ్డి దూషణను ప్రజల దృష్టిలో పెట్టి భూతద్దంలో చూపించేందుకు చంద్రబాబు నాయుడు అసెంబ్లీనే వేదికగా వినియోగించుకున్నారు. నిజానికి రాజకీయ విమర్శను రాజకీయంగానే ఎదుర్కోవాలి. చర్చలకు, చట్టాలకు వినియోగించుకోవాల్సిన సభలో రాజ్యసభ సభ్యుని ఆరోపణలను ప్రస్తావించడమంటే సానుభూతి చూరగొనాలనే ప్రయత్నమే. బీజేపీ జాతీయ అధ్యక్షునిగా అమిత్ షా , టీడీపీ అధ్యక్షుడైన చంద్రబాబు కు లేఖ రాశారు. ఇది రెండు పార్టీల మధ్య వ్యవహారం. ఎన్డీఏ నుంచి టీడీపీ ఎందుకు బయటికి వచ్చిందో చెబుతూ చంద్రబాబు అంతకుముందు లేఖ రాశారు. మీరు రావడంలో ఉద్దేశం వేరంటూ వివరాలతో అమిత్ షా బదులిచ్చారు. అంతటితో సరి. పార్టీ వేదికలపై దీనిని దుయ్యబట్టవచ్చు. కానీ నేరుగా అసెంబ్లీలోనే గవర్నమెంట్ బిజినెస్ అన్నతరహాలో లేఖలోని ప్రతి వాక్యాన్నీ ప్రస్తావిస్తూ ప్రసంగాలు చేయడమంటే ఏ నిబంధనల పరిధిలోకి వస్తుందో ఎవరికీ అంతుచిక్కదు. రాజకీయాల్లో తెలివితేటలంటే ఇలా ఉండాలి. అందుకనే మాట విసిరేముందు అది తిరిగి మనకే తగులుతుందేమో చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా, పార్టీపైనా ఉంటుంది.

 

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News