పొరుగుతో మంచి ...పొత్తుకు సూచి

Update: 2018-03-01 15:30 GMT

‘కనీసమద్దతు ధర రెట్టింపు చేయండి . మీ సొమ్మేం పోతుందం’టూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రానికి విసిరిన సవాల్ సవాలక్ష ప్రశ్నలను రేకెత్తిస్తోంది. రైతులు తిరగబడే రోజొస్తుందంటూ హెచ్చరికలు కూడా జారీ చేశారు. దీని వెనక ఉన్న రాజకీయ కారణాలు, సమీకరణల పై ఆసక్తిదాయకమైన చర్చ సాగుతోంది. కేసీఆర్ ఏం చేసినా, ఏది మాట్టాడినా దాని వెనక ప్రత్యేక కారణాలుంటాయనేది బలమైన నమ్మకం. నిన్నామొన్నటివరకూ అనేక విషయాల్లో కేంద్రాన్ని, ప్రధాని మోడీని వెనకేసుకొచ్చిన ముఖ్యమంత్రి హఠాత్తుగా ప్లేటు ఫిరాయించడం వెనక బలమైన కారణాలే ఉన్నాయనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. స్థానికంగా బీజేపీకి వ్యతిరేకంగా నిలవడం ద్వారా మైనారిటీ ఓటు బ్యాంకును కొల్లగొట్టడం మొదలు యాంటీ మోడీ సెంటిమెంటుతో జాతీయంగా మూడో ఫ్రంట్ ఆలోచనలు రేకెత్తించడం కూడా కేసీఆర్ వ్యాఖ్యల్లో దాగి ఉందనే ప్రచారం జోరందుకుంది. ఏదేమైనప్పటికీ రాజకీయ పార్టీలు ఎన్నికలకు సిద్దమవుతున్న తరుణంలో తెలంగాణ సీఎం బీజేపీపై విరుచుకుపడటం మాత్రం విశేషమే. అమిత్ షా ను గతంలోనే కడిగిపారేసిన కేసీఆర్ మోడీని కూడా వదిలిపెట్టేది లేదని తాజాగా తన ప్రసంగాల ద్వారా స్పష్టం చేస్తున్నారు. కేంద్ర మంత్రులొచ్చి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశంసించడమూ, తాను గతంలో కేంద్రానికి మద్దతివ్వడమూ ఇంతటితో సరి అని తేల్చేస్తున్నారు. ఇక రాజకీయమే నడుస్తుందని సంకేతాలిస్తున్నారు.

మోడీ కానివాడయ్యాడు...

రాష్ట్రప్రభుత్వం ఏర్పడ్డాక ఒక ఏడాది కాలం పాటు కేసీఆర్ కు కేంద్రంతో సత్సంబంధాలేమీ లేవు. మోడీ ని నియంత అంటూ విమర్శలు కూడా గుప్పించారు. ఆ తర్వాత ఇరువురి మధ్య సఖ్యత ఏర్పడింది. ఒకరినొకరు ప్రశంసలతో ముంచెత్తుకున్నారు. నీతి అయోగ్ సమావేశాల్లో సీఎం వాగ్ధాటి, విజన్ చూసి ప్రధాని ముచ్చట పడ్డారు. దీంతో మాటమాట కలిసింది. ఆ తర్వాత నోట్ల రద్దు, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు వంటి కీలక విషయాల్లో బీజేపీకి కేసీఆర్ అండగా నిలిచారు. నిజానికి మోడీని భుజానికెత్తుకున్నారు. బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు సైతం సందేహిస్తున్న సమయంలో అసెంబ్లీ వేదికగా కేంద్రానికి దన్నుగా నిలిచారు. ఒకానొక సమయంలో టీఆర్ఎస్, బీజేపీ కలిసి పోటీ చేస్తాయనే వరకూ ఊహాగానాలు సాగాయి. కేంద్ర ప్రభుత్వంలో మిత్రపక్షంగా టీఆర్ఎస్ చేరుతోందని కూడా విస్తృతంగా ప్రచారం సాగింది. కానీ అవేవీ నిజం కాలేదు. గడచిన రెండున్నర సంవత్సరాలుగా నడిచిన ఈ మైత్రికి స్వస్తి వాక్యం పలకాల్సిన సమయం ఆసన్నమైంది. దీనిని కేసీఆర్ ముందుగానే గ్రహించారు. మోడీపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత పెరుగుతోందని పసి కట్టి తాను సైతం అన్నట్లుగా కొత్త పల్లవి మొదలు పెట్టారు.

సమీకరణలే సమస్తం...

రాజకీయాల్లో ఈక్వేషన్లు చాలా ప్రాధాన్యం వహిస్తాయి. మైనారిటీల్లో మోడీపై వ్యతిరేకత ఏమాత్రం తగ్గుముఖం పట్టలేదు. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ సంఖ్యలో ముస్లింలు,క్రిస్టియన్లు నివసిస్తున్న ప్రాంతం తెలంగాణనే. బీజేపీతో అంటకాగుతున్నట్లు ఏమాత్రం అనుమానం వచ్చినా ముస్లిం మైనారిటీలు, క్రిస్టియన్లు కాంగ్రెసు పార్టీవైపు మొగ్గు చూపడం ఖాయం. ఇది టీఆర్ఎస్ విజయావకాశాలను దెబ్బతీస్తుంది. అందువల్లనే బీజేపీపై దాడిని రానున్న రోజుల్లో కేసీఆర్ మరింత ఉధృతం చేసే అవకాశం కూడా ఉంది. ముస్లిం రిజర్వేషన్ల ను బీసీ కోటాలో 12 శాతం పెంచుతూ అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపించింది. దానిని హోం శాఖ తొక్కిపట్టింది. దీనిని సాకుగా చూపుతూ కేసీఆర్ కేంద్రంపై ధ్వజమెత్తేందుకు ప్రాతిపదికను ఇప్పటికే సిద్దం చేసుకున్నారు. తద్వారా మైనారిటీల్లో మంచి పాప్యులారిటీ సాధించడం కూడా సాధ్యమవుతుంది. తాను వారి హక్కుల కోసం కేంద్రంపై పోరాడుతున్నట్టుగా సానుభూతి సంపాదించేందుకూ వీలుంటుంది. ఇవన్నీ టీఆర్ఎస్ కు ఎన్నికల్లో లాభదాయకంగా మారతాయి. బీజేపీని టార్గెట్ చేస్తే... ముస్లిం, మైనారిటీ ఓటింగు కాంగ్రెసు వైపు పూర్తిగా మొగ్గు చూపకుండా నిరోధించవచ్చనే వ్యూహంతో ఉంది టీఆర్ఎస్.

బాబు కు స్నేహ హస్తం...

పొరుగుతో మంచిగా ఉండాలి. అప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందనే నూతన రాగం అందుకున్నారు కేసీఆర్. ప్రధానంగా ఈ సంకేతాలు, సందేశాలు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడినుద్దేశించి చేసినవిగా పరిశీలకులు భావిస్తున్నారు. అటు చంద్రబాబు కు కూడా బీజేపీతో పొసగడం లేదు. ఇప్పటికే తెలంగాణలోని బీజేపీ శాఖ టీడీపీతో వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేయడం లేదని స్పష్టం చేసేసింది. నిజానికి తెలంగాణలో బీజేపీ కంటే తెలుగుదేశం బలమైన పార్టీ. సామాజికసమీకరణలు, ఓట్ల సంఖ్య రీత్యా టీడీపీకి , బీజేపీకి పోలికే లేదు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సైతం టీఆర్ఎస్, ఎంఐఎం తర్వాత టీడీపీ ఓట్ల పరంగా మూడో స్థానంలో నిలిచింది. అయితే బీజేపీ సొంతంగా బలపడాలని చూస్తున్న నేపథ్యంలో టీడీపీని దూరం పెడుతోంది. దీనిని అవకాశంగా చేసుకుంటూ టీడీపీకి నియోజకవర్గాల్లో మిగిలి ఉన్న ఓటు బ్యాంకును తనకు అనుకూలంగా మలచుకోవాలనే ఎత్తుగడలో ఉన్నారు కేసీఆర్. తెలంగాణలో టీడీపీ నాయకత్వం దాదాపు ఖాళీ అయిపోయింది.కానీ అభిమానులు, సానుభూతి పరులు , కార్యకర్తలు ఇంకా భారీ సంఖ్యలోనే ఉన్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ సగటున అయిదువేల మంది వరకూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, సానుభూతిపరులు ఉంటారనేది అంచనా. దీనిని దృష్టిలో పెట్టుకుని పొత్తు లేదా స్థానిక అవగాహన ద్వారా పది నుంచి పదిహేను సీట్లలో తెలుగుదేశానికి అవకాశం కల్పిస్తూ మిగిలిన సీట్లలో టీఆర్ఎస్ కు టీడీపీ మద్దతిచ్చేలా వ్యూహరచన చేయాలని భావిస్తున్నారు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News