పెద్దల సభ పసుపు పార్టీకి అచ్చిరాలేదా?

Update: 2018-01-08 14:30 GMT

ప్రాంతీయ పార్టీ అయిన తెలుగుదేశానికి పెద్దలసభ అచ్చొచ్చినట్లు లేదు. ఇది సెంటిమెంట్ అనుకోవాలా? నిజమేననుకోవాలా? రూపాయి ఖర్చు లేకుండా రాజ్యసభకు ఎన్నికైన నాయకులు కారణాలు ఏమైనప్పటికీ పార్టీకి సుదీర్ఘ కాలం సేవలు అందించలేకపోతున్నారు. పదవీకాలం మధ్యలోనే, పదవీ విరమణ తర్వాతో పార్టీకి దూరం అవుతున్నారు. మరికొందరిని పార్టీ దూరం చేసుకుంటుంది. ఒకసారి ఎగువ సభకు వెళ్లారంటే రాజకీయంగా ఆ నాయకుడి కెరీర్ ముగిసిందనే అభిప్రాయం కలుగుతుంది. అంతేకాక భవిష్యత్ లో పారట్ీ కొనసాగరనే భావనకు పునాది ఏర్పడుతుంది. ఇది నిన్న మొన్నటి చరిత్ర కాదు. పార్టీ అవిర్భావం నుంచి దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. పర్వతనేని ఉపేంద్ర , డాక్టర్ ఎంవీ మైసూరారెడ్డి వరకూ ఇలాంటి ఉదాహరణలు ఎన్నో. ఒక్కసారి చరిత్రను అవలోకిస్తే ఆసక్తికరమైన పలు అంశాలు వెలుగులోకి వస్తాయి. త్వరలో రాజ్యసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ‘‘తెలుగు పోస్ట్’’ ప్రత్యేక కథనం.

ఉపేంద్ర నుంచి ఆరంభం....

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరైన పర్వతనేని ఉపేంద్రఒకరు. 1977లో అప్పటి రైల్వే మంత్రి మధుదండావతేకి వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసేవారు. అనంతరం రాజీనామా చేసి టీడీపీ వ్యవస్థాపనలో తెరవెనక చాలా కృషి చేశారు. దేశ రాజధానిలో పార్టీకి పెద్దదిక్కుగాపనిచేశారు. ఆయన సేవలను పరిగణనలోకి తీసుకుని1983లో జరిగిన హిమాయత్ నగర్ ఉప ఎన్నికలో పోటీకి పార్టీ నిలబెట్టింది. ఆ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ అనంతర కాలంలో 1984లో పెద్దల సభకు ఎన్టీఆర్ పంపారు. రెండోసారి కూడా రాజ్యసభకు పంపారు. వీపీసింగ్ మంత్రివర్గంలో సమాచార ప్రసారశాఖ మంత్రిగా వ్యవహరించారు. పార్టీ నాయకత్వంతో విభేదాల కారణంగా 1992 పార్టీ నుంచి బహిష్కృతుడయ్యారు. అనంతరం కాంగ్రెస్ లో చేరి 1996లో విజయవాడ నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు.

రాజ్యసభకు వెళితే పార్టీ మారినట్లేనా?

1996లో టీడీపీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన సినీనటి జయప్రద కూడా అనంతర కాలంలో పార్టీకి దూరమయ్యారు. తర్వాత సమాజ్ వాదీ పార్టీలో చేరి యూపీలోని రాంపూర్ నుంచి రెండుసార్లు లోక్ సభకు ఎన్నికయ్యారు. 1986లో పార్టీ తరుపున రాజ్యసభకు వెళ్లిన పార్టీ ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి పార్టీతో పొసగక ఆ తర్వత దూరమయ్యారు. అనంతరం కాంగ్రెస్ లో చేరి ఖమ్మం నుంచి లోక్ సభకు ఎన్నకైన ఆమె కేంద్రమంత్రి పదవిని చేపట్టారు. 1995లో పెద్దలసభకు వెళ్లిన సినీనటుడు మోహన్ బాబుదీ ఇదే పరిస్థితి. చంద్రబాబుతో విభేదాల కారణంగా పార్టీకి దూరమయ్యారు. 2006లో ఎగువ సభకు ఎన్నికైన కడప జిల్లాకు చెందిన ఎం.వి. మైసూరారెడ్డి కూడా 2012లో మళ్లీ సభ్యత్వం ఇవ్వలేదంటూ రాజీనామా చేశారు. కడప జిల్లా కమలాపూరం కు చెందిన మైసూరారెడ్డి కరడుగట్టిన కాంగ్రెస్ వాది. 90వ దశకలంలో కోట్ల విజయభాస్కర రెడ్డి మంత్రివర్గంలో కీలకమైన హోంమంత్రిగా పనిచేశారు. వైఎస్ వ్యతిరేకి అయిన మైసూరా 2004లో అనూహ్య పరిస్థితుల్లో టీడీపీలో చేరారు. కడప జిల్లా వేంపల్లె మండలానికిచెందిన డాక్టర్ తులసిరెడ్డి కూడా 1988-94 మధ్య కాలంలో టీడీపీ రాజ్యసభ సభ్యుడే. కడప రాజకీయాల్లో వైఎస్ వ్యతిరేకి అయిన ఆయన మొదట్లో టీడీపీలో చేరారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 20 సూత్రాల కార్యక్రమం అమలు కమిటీ ఛైర్మన్ గా పనిచేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉన్నారు. ఇదే జిల్లాకు చెందిన సి. రామచంద్రయ్య ఒకప్పుడు సైకిల్ పార్టీ నుంచి ఎన్నికైన రాజ్యసభ సభ్యుడే. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టడంతో 2008లో ఆ పార్టీలో చేరారు. ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉన్నారు. రామచంద్రయ్య ప్రముఖ ఛార్టెడ్ అకౌంటెంట్. ప్రముఖ కవి, హిందీ అకాడమీ మాజీ ఛైర్మన్ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ కూడా 1996 నుంచి 2002 వరకూ టీడీపీ రాజ్యసభ సభ్యుడిగా వ్యవహరించారు. తర్వాత కాలంలో చంద్రబాబుతో విభేదాల ఫలితంగా పార్టీకి దూరమయ్యారు. ఎన్టీఆర్ కుమారుడు హరికృష్ణ కూడా పెద్దల సభ సభ్యుడే. చంద్రబాబుతో విభేదాల కారనంగా పార్టీకి ఆయన కొంతకాలం క్రితం దూరమయ్యారు. వరంగల్ జిల్లాకు చెందిన గుండు సుధారాణి టీడీపీ నుంచి రాజ్యసభకు ఎన్నికైనప్పటికీ తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో 2010 లో రాజీనామా చేసి టీఆర్ఎస్ లో చేరారు. బి సత్యనారాయణరెడ్డి, పుట్టపాగ రాధాకృష్ణ, ప్రొఫెసర్ సి. లక్ష్మన్న, అల్లాడిరాజకుమార్, ఎం.కె. రెహమాన్, సోలిపేట రామచంద్రారెడ్డి, వైశ్రాయ్ హోటల్ యజమాని ప్రభాకర్ రెడ్డి వంటి నాయకులు పార్టీ తరుపున పెద్దల సభకు ఎన్నికైనప్పటికీ ఆ తర్వాత వివిధ కారణాలతో పార్టీకి దూరమయ్యారు. సత్యనారాయణరెడ్డి ఒడిషా, యూపీ గవర్నర్ గా పనిచేశారు.

విషయం ఉన్నా...లేకున్నా....

రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో ప్రతిభాపాటవాలు, దక్షత, విషయ పరిజ్ఞానం, వాగ్దాటి కన్నా సామాజిక, ప్రాంతీయ సమీకరణలకే టీడీపీ ప్రాధాన్యం ఇస్తుందన్న విమర్శలు బలంగా ఉన్నాయి. ఫలితంగా సభలో చర్చల సందర్భంగా పార్టీ వాదనను, విధానాన్ని సమర్థంగా విన్పించేవారు కరువయ్యారన్న వాదన వినపడుతోంది. రాజకీయ పరిస్థితులను, బిల్లుల్లో లోతుపాతులను తెలుసుకుని సభలో మాట్లాడేవారు లేకుండా పోయారు. జీఎస్టీ, ట్రిపుల్ తలాక్ బిల్లు,న్యాయపరమైన ఇతర అంశాలకు సంబంధించి పొడిపొడిగా మాట్లాడటమే తప్ప పకడ్బందీగా వాదనను విన్పించే పరిస్థితి లేదు. ఉదాహరణకు పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి చెందిన తోట సీతారామలక్ష్మి 2014లో రాజ్యసభకు టీడీపీ పంపింది. ఆమెకు పెద్దగా విషయ పరిజ్ఞానం లేదు. కేవలం సామాజిక సమీకరణాల కారణంగానే ఆమె పెద్దల సభ సభ్యులయ్యారు. ఈ మూడేళ్ల కాలంలో అత్యున్నత సభలో ఆమె గళం విప్పిన సందర్భాలు వేళ్ల మీద లెక్కించవచ్చు. ఇలాంటి ఉదాహరణలు చాలానే ఉన్నాయి. రేపు జరగబోయే రెండు సీట్లకు కూడా అభ్యర్థుల ఎంపిక ఇదే ప్రాతిపదిక అవుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News