పెంచుట తుంచుట కొరకే

Update: 2018-03-21 15:30 GMT

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక సంచలనం. ఏ నిర్ణయం తీసుకున్నా, ఎటువంటి ప్రకటన చేసినా చర్చ రేకెత్తిస్తారు. ఉత్సాహాన్ని ఉరకలెత్తిస్తారు. ఏదో జరిగిపోతోందన్న భావన వ్యాపింపచేస్తారు. ఆయన మాటతీరు. తీసుకునే చర్యలు చాలా వేగంగా ఉంటాయి. ప్రకంపనలు కలిగిస్తాయి. ఒక నిరుత్సాహాన్ని ఆశావహ దిశలోకి నడిపించగల వాగ్ధాటి, సమయస్ఫూర్తి, సమయోచిత కార్యాచరణ కనిపిస్తుంటాయి. తాజాగా ఆయన చేసిన సెక్యులర్ ఫ్రంట్ ప్రకటన, దానిననుసరించి పశ్చిమబంగ పర్యటన తెలంగాణ రాజకీయానికి కొత్త దిశానిర్దేశం చేశాయి. జాతీయంగా ఈ ఫ్రంట్ రూపంలో కేసీఆర్ ఏం సాధిస్తారనే విషయంలో అనేక అనుమానాలున్నాయి. సందేహాలూ నెలకొంటున్నాయి. కానీ ఆయన చర్యలు తెలంగాణలో మాత్రం ఎన్నో సమీకరణలను తలకిందులు చేస్తున్నాయి. ఎందరెందరి రాజకీయ భవిష్యత్తుపైనో నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ప్రస్తుత రాష్ట్రప్రభుత్వంలోని సీనియర్లలో ఆందోళన మొదలైంది. కేసీఆర్ వారసుడు కేటీఆర్ కు సమఉజ్జీగా భావించే హరీశ్ పొలిటికల్ కెరియర్ కూడా కొత్త బాటకు మళ్లాల్సిన అనివార్యత ఏర్పడుతోంది. మొత్తమ్మీద 2019లోపే తెలంగాణలో కీలకంగా వ్యవహరిస్తున్న నేతలు తాము ఊహించని, ఆశించని రీతిలో నూతన పథ ప్రస్థానంలోకి వెళ్లక తప్పదంటున్నాయి రాజకీయ వర్గాలు.

నే‘తలరాత’లకిందులు ....

తెలంగాణ రాష్ట్రం ఇంకా పసికూన. అయిదేళ్ల లోపుప్రాయమే. కానీ నాయకులు మాత్రం సీనియర్లే దొరికారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలుగుదేశంలో రాష్ట్రమంత్రిగా చేయడంతోపాటు ఉపసభాపతిగానూ పనిచేశారు. కాంగ్రెసు సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా వ్యవహరించారు. ఉద్యమ సమయంలోనే బంగారు తెలంగాణ నిర్మాణానికి సంబంధించి ఒక ఆలోచనను రూపొందించుకున్నారు. నిధుల విషయంలో మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణలో కొత్త పథకాలు అమలు చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఉద్యమపార్టీ కావడంతో అనుభవం ఉన్న నాయకుల కొరత తొలిదశలో టీఆర్ఎస్ ను వెన్నాడుతూ ఉండేది. టీడీపీ ఇతర పార్టీల నుంచి సీనియర్ నాయకులు వచ్చి చేరడంతో ప్రభుత్వం బలోపేతమైంది. అనుభవం కూడా తోడైంది. పరిపాలన తొందరలోనే గాడిన పడింది. ఉద్యమంలో పాల్గొన్నవారిని పూర్తిగా విస్మరించకుండానే బయటినుంచి వచ్చిన వారికి కేసీఆర్ పెద్ద పీట వేశారు. బీటీ (బంగారు తెలంగాణ) బ్యాచ్ అంటూ వీరంతా విమర్శలను కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. అయినా కేసీఆర్ వెనుకంజ వేయలేదు. అనుభవం పరిపాలనకు అవసరమని అభిప్రాయపడ్డారు. ఉద్యమం వేరు. రాష్ట్రాన్ని ముందుకు నడపటం వేరన్న స్పష్టమైన భావనతోనే చర్యలు తీసుకున్నారు. మొత్తానికి నాలుగేళ్ల పాలన తర్వాత రాష్ట్రానికి సంబంధించి తన ఆలోచనలు ఒక కొలిక్కి వచ్చాయని కేసీఆర్ స్థిరమైన అభిప్రాయానికి వచ్చారు. తన పాత్రను పెంచుకుంటూ జాతీయ భూమికలోకి మారాలనుకుంటున్నారు. తనతోపాటే మరి కొందరినీ హస్తిన రాజకీయాలకు తీసుకెళ్లాలనే యోచనలో ఉండటమే ఇప్పుడు కొందరి నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తోంది.

అడ్డూ...నిలువూ..

కొత్త రాష్ట్రం స్థిరపడటమే కాకుండా నాయకులూ బాగానే సెటిల్ అయ్యారు. అనుభవం ఉపయోగపడుతుందని పాలనలోకి తీసుకున్న మంత్రులు కొందరు కొత్త తరం ఎదగడానికి ఆటంకంగా మారుతున్నారని కేసీఆర్ భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా కేటీఆర్ వంటి వారికి సహకరించే విషయంలో అనుమానాలు నెలకొంటున్నాయి. వీరందరికీ జాతీయ పాత్ర ను సిద్ధం చేస్తున్నట్లు చెబుతున్నారు. కేసీఆర్ వ్యూహాత్మకంగానే ఇందుకు ప్రణాళిక రచన చేస్తున్నారు. పరిపాలన గాడిలోకి వచ్చేశాకా పెద్దగా అనుభవజ్జుల అవసరం లేదనేది ఆయన యోచన. ముఖ్యంగా వారసులకు వీరు అడ్డునిలువుగా కాళ్లకు అడ్డం పడితే రెండు తరాల మధ్య పరిపాలన కట్టుతప్పుతుందనే సాకుతో కొందరు సీనియర్లను ఢిల్లీ బాట పట్టించబోతున్నట్లు టీఆర్ఎస్ లో ప్రచారం సాగుతోంది. ఆరేడుగురు మంత్రులు వచ్చే విడత 2019లో ఎంపీలుగా పోటీ చేయకతప్పనిస్థితి ఏర్పడుతుందంటున్నారు. వీరిని పూర్తిగా పక్కనపెట్టకుండా కేటీఆర్ కు లైన్ క్లియర్ చేసే ఉద్దేశంతోనే ఈ మేరకు చర్యలు తీసుకోబోతున్నట్లు సమాచారం. ఈటెల రాజేందర్, తుమ్మల నాగేశ్వరరావు, తలసాని శ్రీనివాసయాదవ్, మహేందర్ రెడ్డి, కడియం శ్రీహరి వంటి సీనియర్ మంత్రులంతా ఈ కోవలో ఉన్నట్లుగా పార్టీ వర్గాలు చర్చిస్తున్నాయి. వీరంతా సీనియర్ నేత కేకే జాబితాలో చేరబోతున్నారంటున్నారు.

హరీశ్ కు అన్యాయమే...

పార్టీ శ్రేణులతో కలగలసి ఉద్యమం చేసిన నాయకుడు హరీశ్. కాంగ్రెసు పార్టీ లో రాజశేఖరరెడ్డి వంటి బలమైన నాయకుడు ఉండగానే రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ సాధించిన నేత. క్యాడర్ లోనూ, టీఆర్ఎస్ లీడర్లలోనూ కేసీఆర్ తర్వాత అత్యంత పలుకుబడి కలిగిన వ్యక్తి. ఆయనను కూడా ఎంపీగా చేసి ఢిల్లీకి తీసుకెళతారనే ప్రచారం జోరందుకుంది. యువకుడు కావడానికి తోడు కేటీఆర్ ను మించిన రాజకీయానుభవం, శ్రేణులతో సంబంధాలుండటమే ఆయనకు శాపంగా మారిందనవచ్చు. 40 మంది ఎమ్మెల్యేలతో పార్టీ ఫిరాయిస్తాడంటూ సాగిన దుష్ప్రచారాన్ని తిప్పికొడుతూ తన విశ్వసనీయతను పదేపదే హరీశ్ చాటిచెప్పుకోవాల్సి వచ్చింది. తన చావు,పుట్టుక టీఆర్ఎస్ తోనే అంటూ కేసీఆర్ పట్ల విధేయతను ప్రకటించుకోవాల్సి వచ్చింది. తనపై సాగుతున్న ప్రచారంతో విసిగివేసారిపోయినట్లుగా ఆయన సహచరులు కూడా చెబుతున్నారు. సెక్యులర్ ఫ్రంట్ అనేది ఇంకా పురుడు పోసుకోలేదు. దాని ద్వారా కేంద్రంలో రాజ్యాధికారం వస్తుందో లేదో తెలియదు. కనీసం సంకీర్ణంలో భాగస్వాములు అవుతారో లేదో సందేహమే. ఉద్యమాలు చేసి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని త్యాగం చేసి మళ్లీ మబ్బుల్లో నీళ్లు వెదుక్కుంటూ మూడో కూటమి జపం చేయాల్సి రావడం ఉజ్జ్వల భవిష్యత్తు ఉన్న హరీశ్ వంటి యువనేతకు మింగుడుపడని చేదు నిజం. కేటీఆర్ , హరీశ్ ఇద్దరూ రాష్ట్రంలోనే ఉంటే తన రాజకీయ నైపుణ్యంతో హరీశ్ పార్టీపై పట్టు సాధించడం ఖాయం. ఇది భవిష్యత్తులో కేటీఆర్కు ఇబ్బందులు స్రుష్టించవచ్చు. ఇది పార్టీలో అందరికీ తెలిసిన విషయమే. అందుకే మరో ఉద్యమ రంగంవైపు జాతీయ స్థాయిలోకి హరీశ్ శక్తియుక్తులను కేసీఆర్ మళ్లిస్తున్నారంటున్నారు. రాజకీయాల్లో ఎలివేషన్ కూడా ఎత్తుగడే.

- ఎడిటోరియల్ డెస్క్

Similar News