పుతిన్ మరో చరిత్ర సృష్టించనున్నారా?

Update: 2018-01-01 18:29 GMT

వ్లాదిమిర్ పుతిన్.... ఇప్పుడు రష్యాలో ఎదురులేని నేత. ఆయన మాటకు అక్కడ తిరుగులేదు. ఒక్క మాటలో చెప్పాలంటే అక్కడ ఆయన మాటే వేదం. ఇక అంతర్జాతీయంగా రష్యా అంటే పుతిన్, పుతిన్ అంటే రష్యా అనే అభిప్రాయాన్ని కల్గించారు. అందువల్లే దాదాపు రెండు దశాబ్దాలుగా దేశ రాజకీయాలను తన కనుసైగలతో శాసిస్తున్నారు. తాజాగా మార్చి 18న జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో పుతిన్ గెలుపు నల్లేరుపై నడకేనని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బరిలో ఆయనకు సరితూగగల ధీటైన ప్రత్యర్థులు ఒక్కరూ కూడా లేరు. ఉన్న ఒకే ఒక బలమైన ప్రత్యర్థి అలెక్సీ నవల్నీని ఎన్నికల సంఘం అనర్హుడిగా ప్రకటించడంతో పుతిన్ కు ఎదురు లేకుండా పోయింది.

పుతిన్ ఎదగడానికి....

పుతిన్ ప్రభ ఇంతగా వెలిగిపోవడానికి ఆయన వ్యూహరచన, తెలివితేటలు ప్రధాన కారణాలు. సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం అనంతరం 1999లో నాటి దేశాధినేత బోరిస్ ఎల్సిన్ నుంచి అధికార పగ్గాలు అందుకున్న పుతిన్ అప్పటి నుంచి రాజకీయంగా వెనుదిరిగి చూడాల్సిన పరిస్థితి కలగలేదు. 2000 నునంచి 2008 వరకూ వరుసగా రెండు సార్లు దేశాధ్యక్షుడిగా పనిచేశారు. ఏ నాయకుడూ రెండుసార్లకు మించి అధ్యక్షుడిగా పనిచేసేందుకు రష్యా రాజ్యాంగం అనుమతించదు. దీంతో 2008లో ప్రధాని పదవి చేపట్టి 2012 వరకూ కొనసాగారు. ఆ సమయంలోనే రాజ్యాంగాన్ని తనకు అనుకూలంగా సవరించారు. అధ్యక్ష పదవీకాలాన్ని ఆరేళ్లకు పెంచారు. ఆ మేరకు అద్యక్ష పదవికి పోటీ చేసి మళ్లీ ఎన్నికయ్యారు. ఈ ఆరేళ్ల పదవీకాలం ఈ ఏడాది మార్చితో పూర్తవుతుంది. దీంతో మళ్లీ బరిలోకి దిగారు. ఈ దఫా గెలిస్తే ఏకంగా 2024వరకూ పదవిలో కొనసాగుతారు. అంటే జోసెఫ్ స్టాలిన్ తర్వాత సుదీర్ఘకాలం పదవిలో కొనసాగిన నేతగా చరిత్ర సృష్టించిన వారవుతారు. స్టాలిన్, కృశ్చేవ్, బ్రెజ్నేవ్ మాదిరిగా దేశంపై తన దైన చెరగని ముద్ర వేశారుపుతిన్. దేశాన్ని మలుపు తిప్పిన నేతగా గుర్తింపు పొందారు.

రాజ్యాంగాన్న అనుకూలంగా రాసుకుని...

రష్యా రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడే కీలకం. ప్రధానిని ఆయనే నియమిస్తారు. అధికారాలన్నీ అధ్యక్షుడి చేతిలో ఉంటాయి. ప్రధాని పాత్ర నామమాత్రం. రష్యా రాజ్యాంగం ప్రకారం సగానికి పైగా ఓట్లను సాధించిన వారే విజేత. అలా రానట్లయితే మొదటి దఫా అనంతరం మళ్లీ ఏప్రిల్ 8న ఎన్నికలు నిర్వహిస్తారు. 65 ఏళ్ల పుతిన్ తన సొంత పార్టీ అయిన యునైటెడ్ రష్యా పార్టీ అభ్యర్థిగా కాకుండా స్వతంత్ర అభ్యర్థిగాపోటీ చేస్తుండటం విశేషం. పుతిన్ పేరు మార్మోగి పోవడానికి కారణాలు లేకపోలేదు. ఆయన పదవి చేపట్టేనాటికి రష్యా పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంది. సోవియట్ యూనియన్ నుంచి 90వ దశకం ప్రారంభంలో అనేక రిపబ్లిక్ లు విడిపోయి స్వతంత్ర రాజ్యాలుగా ఆవిర్భవించాయి. ఈ దశలో మిగిలిన రష్యా అధినేతగా వచ్చారు. విడిపోక ముందు అమెరికాకు ధీటుగా అగ్రరాజ్యంగా వెలుగొందిన రష్యా పరిస్థితి ఆ తర్వాత మారింది. ఈ నేపథ్యంలో పగ్గాలు అందుకున్న పుతిన్ దేశ ఉనికిని కాపాడారు. అమెరికాకు దీటుగా నిలిపారు. ఉక్రెయిన్ నుంచి క్రిమియాను స్వాధీనం చేసుకోవడంలో క్రియాశీలకంగా వ్యవహరించి ప్రజల మన్ననలను పొందారు. సిరియాలో అమెరికా జోక్యానికి అడ్డుకట్ట వేయడం ద్వారా పాత సోవియట్ యూనియన్ ను ప్రజలకు గుర్తు చేశారు. అంతర్జాతీయంగా అనేక విషయాల్లో అమెరికాను నిలువరించడం ద్వారా రష్యా శక్తిని చాటారు. అందువల్లే ఆయనకు ప్రజలు అండగా నిలుస్తున్నారు.

అనేక ఆరోపణలు.. విమర్శలూ....

ఇది నాణేనికి ఒక వైపు పరిస్థితి మాత్రమే. రెండో వైపు చూస్తే లోటు పాట్లు కూడా లేకపోలేదు. రాజకీయ ప్రత్యర్థుల అణిచివేత, పత్రికా స్వేచ్ఛకు అడ్డంకులు, పార్టీలో, ప్రభుత్వంలో ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని ఎదగనివ్వకపోవడం వంటి ఆరోపణలు పుతిన్ పై ఉన్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థ కూడా అంత గొప్పగా లేదు. ద్రవ్యోల్బణంతో ధరలు దిగిరానంటున్నాయి. ఆహారపదార్ధాలు, నిత్యావసరాల ధరలు ప్రజలకు చిక్కులు కల్పిస్తున్నాయి. నిరుద్యోగ సమస్యతో యువత సతమతమవుతోంది. అన్నింటికీ మించి ప్రతిపక్ష నేత అలెక్సీ నేవల్నీ ని రాజకీయంగా అణిచి వేశారన్న విమర్శలు బలంగా ఉన్నాయి. అధ్యక్ష పదవికి ఆయన అభ్యర్థిత్వాన్ని ఎన్నికల సంఘం తిరస్కరించడం వెనక పుతిన్ ప్రమేయం ఉందన్న ఆరోపణలను పూర్తిగా తోసిపుచ్చలేం. ఈసీ నిర్ణయంపై నేవల్నీ సుప్రీంకోర్టును ఆశ్రయించగా అక్కడా ఆయనకు ప్రతికూల నిర్ణయం వెలువడింది. గతంలో కొన్ని కేసుల్లో శిక్ష పడిందన్న కారణంతో నేవల్నీని తిరస్కరించారు. నేవల్నీ ప్రజాదరణ ఉన్న నాయకుడు. న్యాయవాదిగా, ప్రతిపక్ష నేతగా గత ఏడాది కాలంగా పుతిన్ కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. తనపై అనర్హత వేటు నేపథ్యంలో ఎన్నికలను బహిష్కరించాలని నేవల్నీ ప్రజలకు పిలుపునిచ్చారు. నేవల్నీ బరిలో ఉంటే ఎంతో కొంత పోటీ ఇచ్చి ఉండేవారు. ఇప్పుడు ఆయన లేకపోవడంతో పుతిన్ కు ఎదురు లేకుండా పోయింది. కమ్యునిస్టు పార్టీకి చెందిన పావెల్ గ్రుడిన్, లిబరల్ డెమొక్రటిక్ పార్టీకి చెందిన వ్లాదిమిర్ జిరినోవస్కీ వంటి మరి కొందరు అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ వారి ప్రభావం నామమాత్రం. పుతిన్ కు వారు ఏ మాత్రం పోటీ ఇవ్వలేరు. పుతిన్ గెలుపు ఖాయం. అందువల్ల వచ్చే ఆరేళ్ల పదవీకాలాన్ని దేశాభివృద్ధికి వినియోగిస్తే ఆయన దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారు.

 

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News