పాలిటిక్స్ లో బ్లడ్ రిలేషన్స్ ను భరించాల్సిందేనా?

Update: 2017-10-12 16:30 GMT

స్వాతంత్రం సిద్ధించిన తొలిరోజుల్లో రాజకీయాలు పూర్తిగా సిద్ధాంత ప్రాతిపదికగా సాగేవి. కులాలు, మతాలు, వర్గాలు, ప్రాంతాల వంటి అవలక్షణాలు మచ్చుకైనా కనిపించేవి కావు. అసాంఘిక శకక్తులకు అసలు ప్రవేశమే ఉండేది కాదు. వ్యాపార వర్గాలు వెనుకాడేవి. కాని అదంతా ఇప్పుడు చరిత్ర. క్రమంగా రాజకీయాలు కలుషితమయ్యాయి. మతం, వర్గం, ప్రాంతం, రౌడీయిజం, వ్యాపారం.... ఇలా అన్ని కలగాపులగమయ్యాయి. ప్రతిపార్టీలోనూ వారిదే పైచేయి. ఇప్పుడు దాదాపు ప్రతి ప్రజాప్రతినిధికి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో వ్యాపారం ఉంది. పదవిని అడ్డం పెట్టుకుని వ్యాపారాన్ని విస్తరించుకోవడం సాధారణమైంది. పదవుల్లోని నాయకులు పలుకుబడిని ఉపయోగించుకుని వారి రక్తసంబంధీకులు లబ్దిపొందడం ఆనవాయితీగా మారింది. ఇది ఏ ఒక్క పార్టీకో పరిమితమైన అవలక్షణం కాదు. అన్ని పార్టీల్లోనూ ఆవహించిన దుస్సంప్రదాయం. విపక్షంలో ఉన్నప్పుడు సుద్దులు చెప్పిన పార్టీలే అధికారంలోకి వచ్చాక అడ్డగోలుగా వ్యవహరించడం అనుభవంలోకి వస్తున్న సత్యం.

ఒకరేమిటి... అందరూ అందరేనా?

ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా కావచ్చు.... ఏపీ సిఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి కావచ్చు.... మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం తనయుడు కార్తీ చిదంబరం, దివంగత ముఖ్యమంత్రి తనయుడు వైఎస్ జగన్, మాీజీ ముఖ్యంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ తనయులు, తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కుమారుడు జై షా.... కంటికి కనపడుతున్న వాస్తవాలు. వెలుగులోకి రాని ఇలాంటి ఉదంతాలకు లెక్కేలేదు. ప్రస్తుతం జై షా వ్యవహారం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. నిప్పులాంటి పార్టీ తమదని, నిజాయితీ తమ నరనరాన జీర్ణించుకుందని అదేపనిగా చెప్పే కాషాయ నాయకులకు తాజా ఉదంతం మింగుడు పడటం లేదు. విపక్షం దాడిని ఎదుర్కొనలేక ఏదేదో మాట్లాడుతున్నారు. మొత్తానికి కాషాయం పార్టీ ఖంగు తిన్నది. 2014 వరకూ నష్టాల్లో ఉన్న జై షా కంపెనీలు అనంతరం అద్భుత పనితీరును కనబరచి లాభాలు సంపాదించిందంటూ ‘ది వైర్ ’ అనే న్యూస్ పోర్టల్ వెలువరించిన కథనం దేశంలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. జై షాకు చెందిన ‘టెంపుల్ ఎంటర్ ప్రైజెస్ ప్రయివేటు లిమిటెడ్’ టర్నోవర్ వేల రెట్లు పెరగిందన్నది కథనం సారాంశం. కంపెనీల రిజిస్ట్రార్ కు సంస్థ సమర్పించిన వివరాలను కూడా కథనంలో ప్రస్తావించారు. జై షా, జితేంద్ర షా డైరెక్టర్లుగా ఇందులో 2004లో ప్రారంభమైన ఈ సంస్థలో అమిత్ షా సతీమణి సోనాల్ షా కూడా ఒక వాటాదారు. 2013-14, 2014-15 ఆర్థిక సంవత్సరంలో నామమాత్రంగా ఉన్న సంస్థ 2015-16లో నిల్వలు, మిగులు కలిపి 19 లక్షల నుంచి 80.20 కోట్ల రూపాయలు చూపడం విపక్షాలకు మంచి ఆయుధాన్ని అందించినట్లయింది. కాంగ్రెస్, సీపీఎం వంటి పార్టీలు సీబీఐ దర్యాప్తుకు డిమాండ్ చేస్తున్నాయి. బీజేపీ మిత్రపక్షాలు కూడా ఈ అంశాన్నినిశితంగా గమనిస్తున్నాయి.

అనైతికం... అభ్యంతరకరం కాదా?

వెబ్ సైట్ పై రూ. 100 కోట్లకు పరువునష్టం దావా వేసిన జై షా తరుపున వాదించేందుకు అసిస్టెంట్ సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ముందుకు రావడం, అందుకు కేంద్రం అంగీకరించడం ఆశ్చర్యకరంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం తరుపున కేసులను వాదించే అసిస్టెంట్ సోలిసిటర్ జనరల్ ప్రయివేటు వ్యక్తి తరుపున ఎలా వాదిస్తారన్న ప్రశ్నకు కేంద్రం చెబుతున్న సమాధానం కూడా వింతగా ఉంది. ఆయన వాదిస్తాననడం ఎంత అనైతికమో... అందుకు కేంద్రం అంగీకరించడమూ అంతకన్నా అనైతికమే. అభ్యంతరకరమే. గుజరాత్ కు చెందిన మెహతా హైకోర్టు సీనియర్ న్యాయవాది. మోడీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సోహ్రబుద్దీన్ ఎన్ కౌంటర్ తదితర కేసుల్లో గుజరాత్ సర్కార్ తరుపున వాదించారు. మోడీ ఢిల్లీ పగ్గాలు అందుకున్నాక అసిస్టెంట్ సోలిసిటర్ జనరల్ గా నియమితులయ్యారు. మోడీ, షా ఆశీస్సులతో పైకి వచ్చిన మెహతా ఇప్పుడు జై షా తరుపున వాదించేందుకు ముందుకు రావడాన్ని తేలిగ్గా అర్థం చేసుకోవచ్చు.

వాద్రా భూ లీల తెలియందా?

సోనియా అల్లుడు రాబర్ట్ వాద్రా కూడా యూపీఏ పదేళ్ల పాలనలో బాగానే లబ్ది పొందారు. యూపీలోని మొరాదాబాద్ కు చెందిన వాద్రా కుటుంబం గార్మెంట్స్ వ్యాపారం చేసేది. సోనియా అల్లుడయ్యాక చకచకా ఎదిగారు. 2004లో హర్యానాలో జరిగిన భూ లావాదేవీల్లో పైసా ఖర్చు పెట్టుబడి పెట్టకుండా రూ.50.50 కోట్ల మేరకు వాద్రా లబ్ది పొందారన్న ఆరోపణలు అప్పట్లో సంచలనం సృష్టించాయి. హర్యానా ప్రభుత్వం నియమించిన జస్టిస్ బి.ఎన్. ధింగ్రా విచారణ సంఘం ఇటీవల ఈ విషయాన్ని నిర్ధారించింది కూడా. 2015 మే నెలలో హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ఈ కమిషన్ ను ఏర్పాటు చేశారు. 2016 ఆగస్టు 31న కమిషన్ నివేదికను సమర్పించింది. దీనిని హర్యానా ప్రభుత్వం జస్టిస్ ఏకే గోయల్, జస్టిస్ లలిత్ లతో కూడిన సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనానికి పంపింది. భూ లావాదేవీల్లో ఎలాంటి అక్రమాలు చోటు చేసుకోలేదని, అంతా పారదర్శకంగానే జరిగిందని, మార్కెట్ ధర ప్రకారమే కొనుగోలు చేశామని, ఆదాయపు పన్ను కూడా చెల్లించామన్న వాద్రా తరుపు న్యాయవాది సుమన్ ఖైతార్ మాటలను ఎవరూ విశ్వసించడం లేదు.

కార్తీ.... ఎంత సంపాదించారు?

ఇక ఎయిర్ సెల్ మ్యాక్స్ కుంభకోణంలో మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం పీకల్లోతు కూరుకు పోయారు. సుప్రీంకోర్టు న్యాయవాది అయిన కార్తీ ప్రస్తుతం సీబీఐ, ఈడీ, కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. కొడుకును కాపాడేందుకు తన రాజకీయ పలుకుబడితో పాటు, న్యాయపరిజ్ఞానానికీ పదును పెడుతున్నారు చిదంబరం. యూపీఏ పదేళ్ల పాలనలో ఆర్థిక, హోం వంటి కీలకశాఖలను నిర్వహించిన తండ్రి పలుకుబడిని అడ్డం పెట్టుకుని కార్తి కోట్లకు పడగలెత్తిన మాట వాస్తవం. ఇక దశాబ్దాలనాటి లాలూ ప్రసాద్ యాదవ్ పశు దాణా కుంభకోణం ప్రతి ఒక్కరికీ సుపరిచితమే. ఇప్పటికీ ఈ కేసులో లాలూ సీబీఐ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. లాలూ తనయులకు కూడా కేసులు తప్పలేదు. లాలూ కూతురికి కూడా ఇందులో మినహాయింపు లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు అధికారంలో ఉండగా ప్రభుత్వ డెయిరీలు పతనం కాగా, ఆయన కుటుంబానికి చెందిన సంస్థ హెరిటేజ్ దినదిన ప్రవర్థమానమైన సంగతి తెలిసిందే. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ హయాంలో ఆయన తనయుడు వ్యాపారాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా ఎదిగిని తీరు సుపరిచితమే. రాజీకీయాల్లో విలువల క్షీణతకు ఇవి నిలువెత్తు నిదర్శనాలు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News