పాపరాచి.. పాచి..కథలు

Update: 2017-11-28 15:30 GMT

మనిషి బలహీనతల చుట్టూ కథలు అల్లడం, దానినే తమ సరుకు అమ్ముకునేందుకు ప్రధాన పెట్టుబడిగా మార్చడం మీడియాకు వెన్నతో పెట్టిన విద్య. తెలుగు ప్రచార, ప్రచురణ మాధ్యమాలు గడచిన వారం రోజులుగా నడుపుతున్న కథనాలు జుగుప్స కలిగిస్తున్నాయి. అసలు కంటే కొసరు ముద్దు. అందులోనూ అందం కలిస్తే అసలు వదిలిపెట్టరు. మీడియా విలువలు, ఆబ్జెక్టివిటీ అటకెక్కించేస్తారు. తమ పేపరును నాలుగు కాపీలు ఎక్కువ అమ్ముకోవడం, తమ టీవీని ప్రేక్షకులు అతుక్కుపోయి చూడటం ఇవే ప్రధాన లక్ష్యాలు. ఎంతో ప్రతిష్ఠాత్మకమైన ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సు కు హైదరాబాదు ఆతిథ్యం ఇస్తోంది. ప్రపంచంలోని 150 దేశాల ప్రతినిధులు ఇందులో పాల్గొంటున్నారు. ఇందులో 50 శాతం మహిళలు ఉన్నారు. అందులోనూ మూడోవంతు మంది 30 ఏళ్లలోపు యువ పారిశ్రామిక వేత్తలు. ఇలా అనేక విధాలుగా ప్రాధాన్యం ఉన్న ఒక ప్రపంచ వేదికను తెలుగు మీడియా అమెరికా అధ్యక్షుని కుమార్తె ఇవాంక ట్రంప్ ఈవెంట్ గా మార్చేసింది. అధిక సంఖ్యలో యువత, మహిళలు పాల్గొంటున్న ఈ సదస్సు ప్రపంచానికి ఏ రకమైన సందేశం ఇవ్వబోతోంది? ఇందులో దేశానికి లభించే ప్రయోజనాలేమిటి? ప్రపంచ వ్యాపార, పారిశ్రామిక ప్రస్థానాన్ని మార్చే కీలకమైన నిర్ణయాలు ఏమైనా ఉంటాయా? వంటి అంశాలను మీడియా పూర్తిగా పక్కన పెట్టేసింది. ఇవాంక రావడమే ఈ సదస్సు లక్ష్యమన్నట్లుగా , దానిని కవర్ చేయడమే తమ జీవితాశయమన్నట్లుగా తెలుగు మీడియా చెలరేగిపోతోంది. పాపరాచి పాచి కథలు వండి వడ్డిస్తోంది.

ఇవాంక చుట్టూ ఇన్ని కథలా..?

ఇవాంక ఏమి తింటుంది? ఎలా ఉంటుంది? ఆమె వ్యక్తిత్వమేమిటి? ఆమె ఎన్నిగంటలకు నిద్ర లేస్తుంది? యోగా చేస్తుందా? చీర కడుతుందా? ఇలా గడచిన కొన్ని రోజులుగా అడ్డగోలు వార్తలతో హోరెత్తించింది తెలుగు మీడియా. నిజానికి ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సుకు ఈ కథనాలకు ఎటువంటి సంబంధం లేదు. కానీ ప్రేక్షకుల్లో, పాఠకుల్లో సెలబ్రిటీల పట్ల ఉండే ఆసక్తిని ఎన్ క్యాష్ చేసుకోవాలనే ఏకైక లక్ష్యంతో మిగిలిన ప్రధానాంశాలను పక్కన పెట్టి గాలివాటం కబుర్లకు తెరతీసింది మీడియా. ప్రపంచంలో బహుళ జాతి సంస్థలకు నేతృత్వం వహిస్తూ తమను తాము నిరూపించుకున్న అనేకమంది మహిళలు ఈ సదస్సులకు వస్తున్నారు. వారిని గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. వారు సాధించిన విజయాల ప్రస్తావన కనిపించదు. ఎందుకంటే అవేమీ మీడియాకు ముడి సరుకు కాదు. విజేతల విజయగాధలు పదిమందికి ప్రేరణ కల్పించడమనేది ప్రసార మాధ్యమాలకు అవసరం లేని అంశం. అందుకే అందాల రాకుమారి చుట్టూ ఊహల ఊయల అల్లి దానిని చూపిస్తూ కాలక్షేపం కహానీలపైనే దృష్టి పెడుతున్నారు. ఒక రకంగా ఇది సమాచార మాధ్యమాల సామాజిక లక్ష్యాలకు తూట్లు పొడవటమే.

పడతి ..ప్రగతికి దిక్సూచి...

పారిశ్రామిక , వ్యాపార రంగాల్లో మహిళా సాధికారతకు వీలు కల్పించేందుకు ఉద్దేశించిన ప్రపంచ వేదికగా ప్రస్తుతం సాగుతున్న సదస్సును చూడాల్సి ఉంటుంది. నాణ్యమైన సలహాలు, సూచనలు, నైపుణ్య శిక్షణ, పర్యవేక్షణల ద్వారా కొత్త ఆలోచనలను ప్రోత్సహించి పారిశ్రామిక , వ్యాపార రంగాల్లో పనిచేసే మహిళల వాటాను పెంచడానికి ఉద్దేశించిన సదస్సు ఇది. విస్తృత స్థాయి ప్లీనరీలు మూడు, సబ్జెక్టుల వారీ బృంద సమావేశాలు 12, శిక్షణకు సంబంధించి మాస్టర్ తరగతులు 32 నిర్వహిస్తున్నారు. ఇవన్నీ కూడా అంతర్జాతీయంగా పారిశ్రామిక, వ్యాపార రంగాల్లో వస్తున్న మార్పులను అందిపుచ్చుకోవడానికి ఉపయోగపడతాయి. ప్రపంచ దేశాల మధ్య నూతన సంబంధాలతోపాటు పారిశ్రామిక వేత్తలను అనుసంధానిస్తాయి. ఈ సదస్సులో పాల్గొనేందుకు అందరికీ అవకాశం దొరకదు. అందువల్ల ఈ సమావేశ సారాన్ని తెలుగు రాష్ట్రాల మహిళా పారిశ్రామిక వేత్తలకు చేరవేయాల్సిన బాధ్యత ప్రధాన స్రవంతిలోని మీడియాపై ఎంతైనా ఉంది. తెలుగు మహిళ ఈ రోజున చిన్నాచితకా పరిశ్రమల నుంచి కీలకమైన భాగస్వామ్య పరిశ్రమల వరకూ తనవంతు పాత్ర పోషిస్తోంది. రాజకీయ, సినిమా, విద్య, వైద్య రంగాల్లో తమ తండ్రులు, భర్తలకు సంబంధించిన వ్యాపారాలను మహిళలు నిర్వహిస్తున్నారు. కొందరు సొంతంగా ఉపాధి మార్గాలను సృష్టించుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో కొత్త ఆలోచనలకు వేదిక అయిన ప్రపంచపారిశ్రామికవేత్తల సదస్సును కూలంకషంగా అందిస్తే లక్ష్యం నెరవేరుతుంది. 2010లో ఏర్పాటైన ఈ ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సు ఇప్పటికి వాషింగ్టన్ డీసీ, ఇస్తాంబుల్, దుబాయి, మొరాకో, నైరోబి, కౌలాలంపూర్, సిలికాన్ వ్యాలీల్లో ఏడాదికొక ప్రాంతంలో నిర్వహించారు. దక్షిణాసియాలో తొలిసారిగా హైదరాబాదుకు ఈ అవకాశం దక్కింది.

హైదరాబాదే బెస్టు..

ఈ సదస్సును నిర్వహించడానికి గుజరాత్, మహారాష్ట్ర, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పోటీ పడ్డాయి. గుజరాత్ కు ఎన్నికల సమయం ఉంటుందని భావించడంతో భారత ప్రభుత్వం పెద్దగా ఆసక్తి చూపలేదు. ముంబై శాంతిభద్రతల విషయంలో అమెరికాకు ఉన్న సందేహాలతో మహారాష్ట్ర ఆ అవకాశాన్ని కోల్పోయింది. ఢిల్లీ పట్ల కూడా కేంద్రప్రభుత్వం సానుకూలత కనబరచ లేదు. చివరికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు మాత్రం చాలా ప్రతిష్టాత్మకంగానే ప్రయత్నించాయి. విశాఖ నగరంలో ఉన్న వసతి, రవాణా సదుపాయాలు సరిపోవనే ఉద్దేశంతో ఏపీని పక్కనపెట్టాల్సి వచ్చింది. గ్లోబల్ కనెక్టివిటీ విషయంలో కూడా ఏపీ తన అర్హతను నిరూపించుకోలేకపోయింది. కష్టపడి సాధించుకున్న ఈ సమిట్ లక్ష్యం నెరవేరాలంటే ప్రభుత్వం కూడా వివిధ రూపాల్లో ఇక్కడ తీసుకున్న నిర్ణయాలు ప్రజలకు చేరేలా జాగ్రత్త పడటం మంచిది. సదస్సు నిర్వహణకు సోకులు అద్దడం కంటే ఆచరణకు కార్య రూపం ఇవ్వడం వల్లనే రాష్ట్రానికి ఎక్కువ ప్రయోజనం సమకూరుతుంది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News