పాక్ లో ఈసారి విజయం వీరిదేనా?

Update: 2018-01-08 17:30 GMT

ప్రపంచ వ్యాప్తంగా ఈ ఏడాది ఎన్నికల సందడి నెలకొంది. వివిధ దేశాల్లో నూతన అధినేతలు ఎన్నిక కానున్నారు. పదికి పైగా దేశాల్లో ఎన్నికలు జరగనున్నాయి. వివిధ ఖండాల్లోనికోట్లాది మంది ప్రజలు తమ నూతన పాలకులను ఎన్నుకోనున్నారు. ఇప్పటికే కొన్ని దేశాల్లో ఆ ప్రక్రియ ప్రారంభమైంది. రష్యా, పాకిస్థాన్, ఇటలీ, హంగేరి, ఈజిప్టు, ఇరాకో్, మెక్సికో, కంబోడియా, బ్రెజిల్, క్యూబా, జింబాబ్వే దేశాల ప్రజలు తాజాగా తీర్పు ఇవ్వనున్నారు. భారత్ కు సంబంధించినంత వరకూ రష్యా, పాకిస్థాన్ ఎన్నికలు ముఖ్యమైనవి. ఒకటి మిత్రదేశం, మరొకటి శత్రుదేశం, ఈ రెండు దేశాల ఎన్నికల ప్రభావం అంతర్జాతీయంగా కూడా ఎంతో కొంత ఉంటుందనడంలో సందేహం లేదు.

రష్యాలో మళ్లీ పుతిన్...?

మార్చి 18న జరగనున్న రష్యా అధ్యక్ష ఎన్నికల హడావిడి ఇప్పటికే ప్రారంభమైంది. అధ్యక్షుడు పుతిన్ మరోసారి రంగంలోకి దిగారు. 2000 నుంచి అటు ప్రధాని, ఇటు అధ్యక్షుడు ఏదో ఒక పదవిలో కొనసాగుతూ దేశరాజకీయాలపై పుతిన్ చెరగని ముద్ర వేశారు. విపక్ష నేత అలెక్సీ నావల్నీపై ఎన్నికల సంఘం అనర్హత వేటు వేయడంతో ఆయన పోటీ చేసే అవకాశం లేకుండా పోయింది. కాస్తో...కూస్తో ప్రజాదరణగల నాయకుడు ఆయన ఒక్కరే. కమ్యునిస్ట్ పార్టీకి చెందిన పావలె గ్రుడిన్, లిబరల్ డెమొక్రటిక్ పార్టీకి చెందిన జిరినావోస్కీ సహా సుమారు 40 మంది అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ వారి ప్రభావం నామమాత్రం. ఈ నేపథ్యంలో వ్లాదమిక్ పుతిన్ మరోసారి మాస్కో పీఠాన్ని అధిష్టించడం అనివార్య పరిణామంగా పేర్కొనవచ్చు.

పాక్ లో మాత్రం వీరి మధ్యనే....

దాయాదిదేశమైన పాకిస్థాన్ పార్లమెంటు గడువు ఈ ఏడాది జూన్ 5వ తేదీతో ముగియనుంది. దీంతో అక్కడి పార్టీలు ఎన్నికలపై ఇప్పటికే దృష్టిపెట్టాయి. మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ఆధ్యర్యంలోని ముస్లింలీగ్, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ సారథ్యంలోని పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్, భుట్టోల కుటుంబానికి చెందిన పాకిస్థాన్ పీపుల్స్ (పీపీపీ) ముఖ్యమైన పార్టీలు. 2013 ఎన్నికల్లో నవాజ్ షరీఫ్ పార్టీ విజయం సాధించింది. ప్రావిన్స్ ల ఎన్నికల్లో పీపీపీ సింధ్ లో, ఇమ్రాన్ పార్టీ ఖైబర్ ఫంక్తూన్ క్వాలో, నవాజ్ షరీఫ్ పార్టీ పంజాబ్ ల్లో విజయకేతనం ఎగురవేశాయి. ప్రస్తుతం నవాజ్ షరీఫ్ పార్టీ అధికారంలో ఉంది. పనామా పత్రాల కుంభకోణం నేపథ్యంలో సుప్రీంకోర్టు అనర్హత వేటు వేయడంతో షరీఫ్ ప్రధాని పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. తన మంత్రివర్గంలోని పెట్రోలియం శాఖ మంత్రి అబ్బానీని ప్రధాని పదవిలో కూర్చోబెట్టారు. భార్య కుల్సుమ్ నవాజ్ ను ప్రధానిని చేసేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. తాను రాజీనామా చేసిన లాహోర్ స్థానం నుంచి గత ఏడాది సెప్టంబరులో పాక్ జాతీయ అసెంబ్లీకి ఆమెను పోటీ చేయించి గెలిపించారు. అయితే గొంతు క్యాన్సర్ తో లండన్ లో చికిత్స పొందుతుండటంతో ప్రధాని పదవి చేజారింది. దీంతో వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ ప్రధాని అభ్యర్థిగా షెహబాజ్ షరీఫ్ ను ప్రకటించారు. పంజాబ్ ముఖ్యమంత్రి అయిన షెహబాజ్ ఆయన సొంత సోదరుడు. పంజాబ్ రాజకీయాల్లో ఆయనకు మంచిపట్టుంది. సైన్యం వ్యతిరేకంగా ఉండటం ఆయనకు మైనస్ పాయింట్. పనామా పత్రాల కుంభకోణంలో నవాజ్ షరీఫ్ పాత్రను వెలుగులోకి తీసుకురావడం ద్వారా ఇమ్రాన్ ఖాన్ ప్రతిష్ట పెరిగింది. కొంతవరకూ ఆయనకు ప్రజాదరణ ఉన్నట్లు చెబుతున్నారు. పురాతన పార్టీ అయిన పీపీపీని తక్కువగా అంచనా వేయలేం. జుల్ఫికర్ ఆలీ భుట్టో, ఆయన కూతురు బెనజీర్ భుట్టో, బెనజీర్ భర్త అసిఫ్ ఆలీ జర్దారీ గతంలో పదవులు అందుకున్నారు. ప్రస్తుతం జర్దారీ తనయుడు బిలావల్ భుట్టో పార్టీ సారధిగా ఉన్నారు. 70 ఏళ్ల పాక్ ప్రస్థానంలో అధికారం ఎప్పుడూ పీపీపీ, పాకిస్థాన్ ముస్లిం లీగ్, సైన్యం మధ్యనే తిరిగింది. రేపటి ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచినా సైన్యాన్ని కాదని ముందడుగు వేసే సాహసం చేయలేదు. సైన్యాన్ని కాదని ఏ ప్రభుత్వం బతికి బట్ట కట్టలేదన్నది చేదునిజం. ప్రస్తుతానికి ఏ పార్టీకి అవకాశాలు బలంగా లేవని చెప్పొచ్చు.

ఈ దేశాల్లో కూడా పోటీ....

2013లో సైనిక కుట్ర ద్వారా ఈజిప్టులో అప్పటి అధ్యక్షుడు మహ్మద్ మోర్సీని గద్దెదించిన అబ్బెల్ ఫతాహ్ అల్ సిసి ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి మే లోగా ఎన్నికలను ఎదుర్కొనాల్సి ఉంటుంది. 2014లో 96 శాతం ప్రజల మద్దతుతో ఎన్నికైన సిసి ఇప్పుడు ప్రజావ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. ప్రతిపక్ష నాయకుడు ఖలేదా ఆలీకి ఇటీవల ఒక కేసులో శిక్ష పడటంతో ఆయన పోటీకి అనర్హుడయ్యారు. ఇదంతా ప్రభుత్వ కుట్ర అని ఆయన ఆరోపిస్తున్నారు. ఏప్రిల్, మే నెలల్లో హంగేరి ఎన్నికలు జరగాల్సి ఉంది. ఫిడెజ్ పార్టీకి చెందిన ప్రస్తుత ప్రధాని విక్టోర్ బర్బన్ పనితీరుపై ప్రజల్లో అసంతృప్తి నెలకొంది. న్యాయవ్యవస్థ, స్వేచ్ఛపై నియంత్రణ, పత్రికాస్వేచ్ఛకు అడ్డంకులు కల్పిస్తున్నారు. మే 12న ఇరాక్ పార్లమెంటు ఎన్నికలు నిర్వహించేందుకు రంగం సిద్ధమవుతోంది. దేశంపై ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐసిస్) పట్టుకోల్పోయినప్పటికీ ఇంకా దాని ప్రభావం స్పష్టంగా కన్పిస్తోంది. షియాల ప్రాబల్యం గల ఇస్లామిక్ సుప్రీం కౌన్సిల్ ఆఫ్ ఇరాక్, సద్రిస్ట్ మూవ్ మెంట్ పార్టీలు అధికారం కోసం పోటీ పడుతున్నాయి. మేలో జరగనున్న ఎన్నికలకు ఇటలీ కూడా సిద్ధమవుతోంది. ఫైవ్ స్టార్ మూవ్ మెంట్ పార్టీ, ప్రధాని పాలో గెంటెలోనిస్ పార్టీ అయిన వామపక్ష ప్రజాస్వామ్య పార్టీ మధ్య గట్టి పోటీ ఉంది. నిరుద్యోగ సమస్య పెరుగుతుండటం, శరణార్థుల సమస్యే ఎన్నికల అంశాలుగా మారనున్నాయి. జులై 1న జరగనున్న మెక్సికో ఎణ్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు ఎన్ రిక్ పెననీటో తో పాటాు మరికొందరు పోటీకి సమాయత్తమవతున్నారు. జులై 29న జరగనున్న కంబోడియా ఎణ్నికల్లో ప్రస్తుత ప్రధాని హూన్ సేన్ మళ్లీ పోటీ పడుతున్నారు. 1985 నుంచి ఆయన అధికారంలో ఉంటున్నారు. అక్టోబర్ లో జరగనున్న బ్రెజిల్ ఎణ్నికల్లోన ప్రస్తుత అధ్యక్షుడు మైఖేల్ టెర్మర్ మళ్లీ పోటీ పడుతున్నారు. క్యూబా, కొలంబియా, జింబాబ్వే, కాంగోల్లో కూడా ఈ ఏడాదిలో ఎన్నికలు జరగాల్సి ఉంది. మొత్తం మీద 2018లో కొన్ని దేశాల ముఖచిత్రాలు మారడం ఖాయం. ఇతర దేశాల్లో ఎలా ఉన్నప్పటికీ పాకిస్థాన్ ఎన్నికలు మాత్రం భారత్ లో ఆసక్తిని కలిగిస్తాయి.

 

-ఎడిటోరియల్స్ డెస్క్

Similar News