పాక్ గొంతులో పచ్చి వెలక్కాయ్?

Update: 2017-09-24 16:30 GMT

పసలేని కశ్మీర్ అంశాన్ని ప్రతిసారీ అంతర్జాతీయ వేదికలపై ప్రస్తావిస్తూ భారత్ ను ఇరుకున పెట్టడం దాయాది దేశం పాకిస్థాన్ కు అలవాటే. ఐక్యరాజ్యసమితి సర్వ ప్రతినిధి సభ కావచ్చు. ఇతర ప్రాంతీయ కూటముల వేదిక కావచ్చు. సమయం...సందర్భం లేకుండా... అరిగిపోయిన రికార్డులా కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించడం పాక్ పెద్దలకు వెన్నతో పెట్టిన విద్య. వారికి వంత పాడటం మిత్రదేశమైన చైనాకు ఎంతో ఇష్టమైన పని. కాని ఈసారి చైనా తన పాత విధానానికి భిన్నంగా వ్యవహరించి అందరినీ ఆశ్చర్యపరిచింది. కశ్మీర్ సమస్యను రెండు దేశాలూ చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించడంతో పాక్ నోట్లో పచ్చి వెలక్యాయ పడినట్లయింది. కశ్మీర్ పై ఐక్యారాజ్యసమితి తీర్మానాన్ని అమలు చేయాలంటూ ఇస్లామిక్ సహకరా సంస్థ (ఐఓసీ) ఇచ్చిన పిలుపుపై చైనా విదేశీ వ్యవహారాల అధికార ప్రతినిధి లుకాంగ్ చేసిన వ్యాఖ్యలు పాక్ పట్ల మారుతున్న చైనా వైఖరిని సూచిస్తున్నాయి. సర్వకాల సర్వావ్యవస్థల్లో పాక్ కు మిత్రదేశంగా పరిగణించే చైనా వ్యాఖ్యలు దాయాది దేశానికి గట్టి ఎదురుదెబ్బ అని దౌత్యరంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

పాక్ కు విలువ లేకుండా పోయిందా?

చైనా వైఖరిలో వచ్చిన మార్పునకు తెరవెనక బలమైన కారణాలే ఉన్నాయి. ఇప్పటికే క్షిపణి ప్రయోగాలతో సంచలనం సృష్టిస్తున్న ఉత్తరకొరియాను వెనకేసుకు వచ్చి అంతర్జాతీయంగా అప్రదిష్ట పాలయింది. అనుంగు మిత్రదేశంగా దాన్ని అదుపులో పెట్టలేక అంతర్జాతీయంగా వచ్చే విమర్శలను ఎదుర్కొనలేక ఆపసోపాలు పడుతోంది. దాదాపు పాక్ దీ అదే పరిస్థితి. ఉగ్రవాద ఉత్పత్తి దేశంగా, ఉగ్రవాద ఎగుమతి దేశంగా అది ముద్రపడింది. ఓ విఫలదేశంగా పేరు తెచ్చుకుంది. భారత్, పాక్ లకు ఒకేసారి స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ భారత్ అభివృద్ధి చెందిన దేశంగా, పరిపూర్ణ ప్రజాస్వామ్య దేశంగా, ప్రపంచ వ్యాప్తంగా గౌరవాన్ని అందుకుంటోంది. భిన్నత్వంలో ఏకత్వాన్ని పాటిస్తూ ముందుకు సాగుతోంది. పాక్ ది ఇందుకు పూర్తిగా భిన్నమైన ప్రస్థానం. అది మతప్రాతిపదికగా ఏర్పడిన రాజ్యం. అక్కడి ప్రజాస్వామ్యం నేతి బీరకాయ చందం. ఇంతవరకూ ఏ ప్రధాని పూర్తికాలం పదవిలో కొనసాగిన చరిత్ర లేదు. తాజాగా నవాజ్ షరీఫ్ పదవీ త్యాగం చేసిన పరిస్థితి తెలిసిందే. ఇంతటి విస్తృత నేపథ్యంలో పాక్ కు అదేపనిగా వంతపాడటం తమకు ప్రతికూలంగా పరిణమిస్తుందని భావించి గతానికి భిన్నంగా మాట్లాడింది. ఫలితంగా 72వ ఐక్యరాజ్యసమితి సర్వ ప్రతినిధి సభలో కశ్మీర్ పై ఐక్యారాజ్యసమితి భద్రతామండలి తీర్మానాన్ని అమలు చేయాలన్న పాక్ ప్రధాని అబ్బాసీ డిమాండ్ కు విలువ లేకుండా పోయింది. కనీసం ఇస్లామిక్ దేశాలు కూడా పాక్ ప్రధాని ప్రసంగాన్ని శ్రద్ధగా ఆలకించలేక పోయాయి. అదేసమయంలో మరోపక్క భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ పదునైన ప్రసంగం ద్వారా పాక్ తీరును ఎండగట్టారు. ఒసామా బిన్ లాడెన్, ముల్లా ఒమర్ వంటి ఉగ్రవాదులకు ఆశ్రయమిచ్చిన దేశం నీతిని వల్లించడం తగదన్నారు. ఉగ్రవాద ముఠాగా ఐక్యరాజ్యసమితి పేర్కొన్న లష్కరే తోయిబా నాయకుడు హఫీజ్ సయ్యద్ ను రాజకీయ నేతగా చూపుతూ అతనికి క్లీన్ సర్టిఫికేట్ ఇస్తుందని ధ్వజమెత్తారు. కరడుగట్టిన ఉగ్రవాది దావూద్ ఇబ్రహీం పాక్ లో ఉన్నట్లు స్వయంగా ఆయన సోదరుడు ఇక్బాల్ కస్కర్ ప్రకటించినా అదేమీలేదనడం పాక్ ద్వంద ప్రవృత్తిని చాటుతోందన్న సుష‌్మ ఆరోపణను ఎదుర్కొనడం దాయాది దేశానికి శక్తికి మించిన పనే. పాక్ ప్రస్తుత నేపథ్యం చూసి సార్క్ (సౌత్ ఆసియన్ అసోసియేషన్) ఫర్ రీజనల్ కో-ఆపరేషన్), దక్షిణాసియా ప్రాంతీయ సహకార మండలి సమావేశాల పట్ల సభ్య దేశాలు అనాసక్తిని చూపుతున్నాయి. గత ఏడాది నవంబర్ లో పాక్ లో జరగాల్సిన సార్క్ సమావేశాలను భారత్ తో పాటు బంగ్లాదేశ్, ఆఫ్ఫనిస్తాన్ లు బహిష్కరించాయి. పాక్ ఉగ్రవాద వైఖరి కారణంగా చూపుతూ 2016లో ఇస్లామాబాద్ సార్క్ సమావేశాన్ని ఈ మూడు దేశాలూ బహిష్కరించాయి. ఈసారి కూడా సార్క్ సమావేశాల ప్రస్తావనను పాక్ తీయకుండా తిరస్కరించాయి.

బంగ్లా, ఆఫ్ఫాన్ ల మండిపాటు.....

పాక్ వైఖరిని ఖండించడంలో భారత్, చైనాలకు బంగ్లాదేశ్, ఆఫ్ఫనిస్తాన్ లు కూడా మద్దతు పలకడం గమనార్హం. ఈరెండు పాక్ సమీప పొరుగు దేశాలే. ఉగ్రవాద సంస్థలకు పాక్ అడ్డాగా మారిందని ఆఫ్ఫన్ ధ్వజమెత్తింది. వాటిని ఉక్కు పాదంతో అణిచివేయడం చేతకాక అంతర్జాతీయ సమాజం దృష్టి మళ్లించే చౌకబారు ఎత్తుగడలకు పాల్పడుతుందని ఐక్యరాజ్యసమితి 72వ సర్వ ప్రతినిధుల సభలో మాట్లాడుతూ ఆఫ్ఫాన్ ప్రతినిధి ఆరోపించారు. ఉగ్రవాద సంస్థలను పెంచి పోషించడం ద్వారా దక్షిణాసియాలో అస్థిరతను సృష్టిస్తుందని పేర్కొన్నారు. ఆఫ్ఫాన్ పునర్నిర్మాణ కార్యకలాపాల్లో భారత్ క్రియాశీలక పాత్రను జీర్ణించుకోలేక పాక్ ఉగ్రవాదాన్ని పరోక్షంగా ఉసిగొల్పుతోందన్నారు. పాక్ ను ఎండగట్టడంలో బంగ్లాదేశ్ కూడా దూకుడుగా వ్యవహరించింది. బంగ్లా విమోచన సమయంలో పాక్ సైన్యం నీచమైన పాత్ర పోషించిందని, నీచమైన సైనిక చర్యకు పాల్పడి దారుణ మారణ హోమాన్ని సృష్టించిందని బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా నిప్పులు చెరిగారు. నాటి సామాజిక హననంలో రమారమి 30 లక్షల మంది మృత్యువాత పడ్డారని ఐక్యరాజ్యసమితి సర్వ ప్రతినిధుల సభలో మాట్లాడుతూ హసీనా ధ్వజమెత్తారు.

స్వదేశీయుల నుంచి నిరసన.......

స్వదేశీయుల నుంచి పాక్ కు ఐక్యారాజ్యసమితిలో నిరసనలు ఎదురుకావడం గమనార్హం. పాక్ లోని బలూచిస్థాన్, సింధ్ ప్రావిన్స్ లకు చెందిన పాకిస్థానీయులు ఐక్యరాజ్యసమితి కార్యాలయం ఎదుట పాక్ కు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. పాక్ ఆర్మీ అరాచకాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మరోపక్క నీలం వ్యాలీలో నలుగురు యువకులను పాక్ ఆర్మీ చిత్రహింసలకు గురిచేసిందంటూ పాక్ ఆక్రమిత కశ్మీర్ కు చెందిన పలువురు నాయకులు ఆందోళనకు దిగారు. ఇంటా బయట నుంచి ఎదురైన ప్రతికూలతలతో ఐక్యరాజ్యసమితి సమావేశాల్లో పాక్ భంగపాటుకు గురైంది. ఎప్పిటికైనా వీటి నుంచి దాయాది దేశం పాఠాలను నేర్చుకుంటుందా? అన్నదే అసలైన ప్రశ్న.

 

- ఎడిటోరియల్ డెస్క్

Similar News