‘‘పవర్’’ ...పాలిటిక్స్ ఇలాగేనా?

Update: 2018-01-02 15:30 GMT

రాజకీయ భిన్నత్వం ఓట్లు తెచ్చిపెడుతుందో లేదో తెలియదు కానీ చర్చకు మాత్రం కచ్చితంగా దారితీస్తుంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రాజకీయ ప్రస్థానం నిరంతరం మీడియాకు ముడిసరుకుగా మారుతోంది. అంతుచిక్కని రీతిలో నిర్ణయాలతో , అనూహ్య ప్రతిస్పందనలతో నాటకీయశైలితో రాజకీయాలను పండిస్తున్నారాయన. లక్షల సంఖ్యలో అభిమానులు, సగటు మనిషి కోణంలో మాట్లాడటం, ఆడంబరాలు కనబరచకపోవడంతో జనసేనానికి బలమైన మద్దతు లభిస్తోంది. ఆయన చర్యలు, నిర్ణయాలు, ప్రకటనలు అందలమెక్కిస్తాయన్న గ్యారంటీ లేకపోయినప్పటికీ సంచలనం మాత్రం సృష్టిస్తున్నాయి. పవన్ చేసే ప్రకటనలతో మిత్రపక్షం తెలుగుదేశానికి గొంతులో వెలక్కాయ పడుతోంది.

ఆయనే ఓ ప్రశ్న.....

ప్రజల గొంతుకగా ప్రశ్నిస్తానంటూ రాజకీయ రంగప్రవేశం చేసిన పవన్ కల్యాణ్ గడచిన నాలుగేళ్లుగా అనేక రకాల విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చింది. 2014 ఎన్నికల్లో పోటీకి నిలబడకుండా దేశ, రాష్ట్ర అవసరాల పేరిట బీజేపీ, తెలుగుదేశం కూటమికి మద్దతు పలికారు. అనేక సందర్భాల్లో తెలుగుదేశం ప్రభుత్వం ఇబ్బందుల్లో పడుతుందన్న పరిస్థితి తలెత్తినప్పుడల్లా పవన్ కొంతమేరకు రక్షణ కల్పించారు. తెలుగుదేశం బహిరంగంగా అంగీకరించలేని సమస్యల పరిష్కారానికి తాను కృషి చేస్తున్నట్లు ఆయన కనిపిస్తారు . దీంతో తెలుగుదేశం పార్టీకి, ప్రభుత్వానికి ఆపద్బాంధవునిగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలను వై.సి.పి ఎక్కుపెడుతోంది. తెలుగుదేశం పార్టీకి మద్దతిచ్చిన వ్యక్తిగా సమస్య ఏర్పడినప్పుడు ప్రభుత్వాన్ని నిలదీయడం తనబాధ్యత కాబట్టి ఆయా అంశాల్లో జోక్యం చేసుకుంటున్నానని పవన్ చెబుతున్నారు. ఏదేమైనప్పటికీ పవన్ చేపట్టిన సమస్యలను సాధ్యమైనంతవరకూ పరిష్కరించడానికి చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారు. అందువల్ల ఈ రెండు పార్టీల మధ్య సంబంధాలు సజావుగా సాగుతున్నాయి. భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ విభేదాలు తీవ్రస్థాయి విమర్శల స్థాయికి చేరడం లేదు. కొన్నిసార్లు పార్టీ నాయకులు పవన్ పై విమర్శలు ఎక్కపెడుతున్నప్పటికీ సీఎం బాబు జోక్యం చేసుకుని ఎప్పటికప్పుడు సర్దుబాటు చేస్తున్నారు. పవన్ కల్యాణ్ విషయంలో నోరెత్తవద్దని హెచ్చరికలు చేస్తున్నారు. దీంతో పవన్ ది పైమాటగా కనిపిస్తోంది. పవన్ ను ఆశ్రయిస్తే తమ సమస్యలు పరిష్కారమవుతాయనే నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఏపీ ప్రజలు ఏర్పరుచుకుంటున్నారు. ఇది జనసేనకు ప్లస్ పాయింట్ గా మారుతోంది. అయితే జనసేన ప్రస్థానం ఎలా ఉండబోతోందన్న విషయంలో ఎవరికీ స్పష్టత లేదు. కనీసం ఆ పార్టీ అధినేతకైనా క్లారిటీ ఉందా? అనే సందేహాన్నీ పరిశీలకులు వ్యక్తం చేస్తుంటారు. జనసేన విధానమేమిటి? టీడీపీతో కలిసి వెళతారా? సొంతంగానే పోటీ చేస్తారా? ప్రత్యామ్నాయ విధానాలు ఏమి ప్రతిపాదిస్తున్నారు? ఇవన్నీ ప్రశ్నలే. అసలు అధికారమే తనకు వద్దనడమే ఓ ప్రశ్న.

ప్రతిపక్ష స్థానానికి ఎసరు...

ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రజాసమస్యలపై చేపడుతున్న ఆందోళనలు అరణ్య రోదనగా మిగులుతున్నాయి. రైతులు, యువజనులు, విద్యార్థుల సమస్యలపై ధర్నాలు,నిరసనలు, ఉద్యమాలు చేపట్టినా ప్రభుత్వం నుంచి ఉలుకు పలుకు ఉండటం లేదు. అదే సమయంలో పవన్ కదిలితే చాలు ప్రభుత్వం ఎర్రతివాచీలు పరుస్తోంది. జనసేన తనతో కలిసి రాకపోయినా ఫర్వాలేదు కానీ వై.సి.పి మాత్రం అధికారంలోకి రాకూడదనే ధృఢ నిశ్చయంతో తెలుగుదేశం అధినాయకత్వం వ్యవహరిస్తోంది. వై.సి.పి బలపడకుండా జనసేనకు అవసరమైన అధికారిక మద్దతును అందిస్తోంది. సమస్యలను ప్రభుత్వ ద్రుష్టికి తీసుకురావడంతోపాటు ఆందోళన చేపట్టి సర్కారు మెడలు వంచే బాధ్యత ప్రధాన ప్రతిపక్షంపై ఉంటుంది. అప్పుడే ప్రతిపక్షానికి ప్రజల్లో ఆదరణ ఏర్పడుతుంది. కానీ ఏపీలో రివర్స్ గేర్ లో జరుగుతోంది. సమస్యలన్నీ జనసేన టేకప్ చేస్తోంది. గౌరవమర్యాదలతో సర్కారు స్పందిస్తోంది. ప్రతిపక్షాన్ని విస్మరించి జనసేనకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా పవన్ బలపడేలా తెలుగుదేశం ప్రభుత్వమే సంపూర్ణంగా సహకరిస్తోంది. వై.సి.పి స్థానానికి ఎసరు పెట్టి ఆ పార్టీని పూర్తిగా నిర్వీర్యం చేస్తే 2019 ఎన్నికల్లో తమకు తిరుగుండదనే భావనలో ఉంది తెలుగుదేశం. ఒకవేళ పవన్ తమతో కలిసి పోటీ చేస్తే సరేసరి. లేకపోయినా , పవన్ బలపడితే వై.సి.పి, జనసేన మధ్య ఓట్లు చీలి అధికార పక్షం అనాయాసంగా గట్టెక్కుతుందనే ఆలోచనలో ఉన్నారు టీడీపీ నేతలు.

సానుకూల శత్రువు...

జనసేన టీడీపీకి అధికారికంగా ఇంతవరకూ మిత్రపక్షంగానే ఉంది. అయితే పవన్ ఇస్తున్న షాక్ లు అప్పుడప్పుడూ టీడీపీకి నిద్రపట్టనివ్వడం లేదు. నిరంతరం తెలంగాణతో పోలిక తెచ్చుకుని భుజాలు చరుచుకునే టీడీపీకి పవన్ కల్యాణ్ కేసీఆర్ ను నూతన సంవత్సరం సందర్బంగా కలిసి అభినందించడం రుచించడం లేదు. టీఆర్ఎస్ పరిపాలన అద్భుతం. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఘనుడు కేసీఆర్ అంటూ ప్రశంసల జల్లు కురిపించాడు పవన్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, ప్రత్యేకించి చంద్రబాబును ఇది తీవ్రంగా కలచివేసే అభిశంసన ప్రకటన. తెలంగాణ ప్రభుత్వం పత్రికల్లో కొంచెం తమ ఘనత గురించి ప్రకటన ఇస్తే వెంటనే తాము కూడా సాధించామంటూ కౌంటర్ అడ్వర్టయిజ్మెంట్లు ఇచ్చుకునే ఏపీ ప్రభుత్వానికి పవన్ ప్రకటనపై ఎలా స్పందించాలో తెలియడం లేదు. 2014 నుంచి టీడీపీతో కలిసి నడిచినప్పటికీ ఈ స్థాయిలో చంద్రబాబును ఒక్క సందర్భంలో కూడా పవన్ పొగడలేదు. సంక్షోభంలో ఉన్న రాష్ట్రానికి అనుభవజ్ఞుడైన నాయకుడు కావాలి, తీవ్రస్థాయి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వై.సి.పి. కంటే మంచిదనే ఉద్దేశంతోనే టీడీపీకి మద్దతిచ్చినట్లుగా పవన్ చెప్పారు. కాపు రిజర్వేషన్లు, భూసేకరణ వంటి విషయాల్లో టీడీపీని విమర్శించారే తప్ప ప్రశంసించిన దాఖలాలు ఒక్కటీ లేవు. పైపెచ్చు టీడీపీకి చెందిన ఎంపీలపై ఘాటైన వ్యాఖ్యలతో విరుచుకుపడిన సందర్భాలూ ఉన్నాయి. వై.సి.పి దాడికి జనసేనాని అప్పుడప్పుడూ అడ్డుచక్రం వేసినప్పటికీ అవసరమైన సందర్భాల్లో టీడీపీ గాలి తీసేస్తున్నారు. అనుకూల శత్రువు రాజకీయంగా ఎప్పుడు ప్రత్యర్థిగా మారతాడో తెలియక తలలు పట్టుకుంటున్నారు తెలుగుదేశం నాయకులు. పవన్ పర్యటనలు, విమర్శలపై స్పందించొద్దంటూ ఇప్పటికే అధినేత నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉండటంతో మింగలేక కక్కలేక కిందుమీదులవుతున్నారు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News