పవన్ కు పగ్గం..చంద్రబాబుకు చెక్...!

Update: 2018-02-19 15:30 GMT

జగన్ రాజకీయం రాటుతేలుతోంది. ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ వేడెక్కుతున్న దశలో తాను వెనకబడకుండా ఎత్తుపైఎత్తుల వ్యూహంలో పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. జనసేన నేతృత్వంలోని నిజనిర్ధారణ కమిటీ కేంద్రప్రభుత్వంపై ఎంపీలు అవిశ్వాసం ప్రవేశపెట్టాలని డిమాండ్ చేసింది. తెలుగుదేశం దీనిపై తర్జనభర్జనలు పడుతుండగానే జగన్ అందిపుచ్చుకున్నారు. అవిశ్వాసం పెట్టడానికి తాము సిద్దమని ప్రకటించారు. తెలుగుదేశాన్ని కూడా ఇందుకు ఒప్పించాలని పవన్ కే సలహా ఇచ్చారు. అవిశ్వాసం విషయంలో మీరు మాకు మద్దతిస్తారా?లేక మమ్మల్నే మీకు మద్దతివ్వమంటారా? అని నేరుగానే ప్రశ్నించారు. సూటిగా,ధాటిగా సంధించిన ఈ సవాల్ ను టీడీపీ స్వీకరిస్తుందా? జనసేనాని జయహో అంటారా? ఏదేమైనప్పటికీ జగన్ పక్కా పొలిటికల్ మూవ్ తీసుకున్నారు. కొత్త రాజకీయాలను రాష్ట్రానికి పరిచయం చేయాలని తపించి పోతున్న పవన్ స్పీడుకు పగ్గాలు వేయడంతోపాటు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడికి చెక్ పెట్టే వ్యూహం ఇందులో దాగి ఉంది.

పొలిటికల్లీ కరెక్టు....

తమ ఎంపీలు ఏప్రిల్ ఆరున రాజీనామా చేస్తారంటూ జగన్ చేసిన ప్రకటన పెద్దగా ప్రజామద్దతును కూడగట్టలేకపోయింది. గతంలో కూడా ఈరకమైన ప్రకటన చేసి ఆచరణలో పెట్టకపోవడంతో రాజీనామాలపై సీరియస్ నెస్ లోపించింది. పైపెచ్చు ఏప్రిల్ లో రాజీనామా చేస్తే కనీసం వాటిని పరిశీలించే అవకాశాలు కూడా అంతంతమాత్రమే. ఉపఎన్నికలనేవి వచ్చే ప్రసక్తే లేదు. ఈ నేపథ్యంలో కేంద్రంతోపాటు వైసీపీపైనా తెలుగుదేశం ధ్వజమెత్తుతోంది. తమ కేంద్ర మంత్రుల చేత మార్చి అయిదో తేదీన సభలోనే రాజీనామా ప్రకటన చేయించి పొలిటికల్ మైలేజీ పొందే విధంగా తెలుగుదేశం వ్యూహరచన చేసింది. అదే జరిగితే కచ్చితంగా తెలుగుదేశం పైచేయి సాధిస్తుంది. వైసీపీ ఎంపీల రాజీనామా కంటే ఇదే పెద్ద ఎత్తుగడగా నిలుస్తుంది. మిత్రపక్షం బీజేపీతో పొత్తు తెంచేసుకుని మంత్రులు బయటికి రావడమంటే జాతీయ స్థాయిలో దాని ప్రభావం ఉంటుంది. ఆ తర్వాత వైసీపీ ఎంతయాగీ చేసినా పెద్దగా ప్రయోజనం ఉండదు. వైసీపీ ఆత్మరక్షణలో పడిపోయింది. తాజాగా పవన్ కల్యాణ్ చేసిన అవిశ్వాసం డిమాండ్ వారికి మంచి రాజకీయ ఆయుధంగా కనిపించడంతో తాము దానికి సిద్ధమంటూ ప్రకటించి టీడీపీ, జనసేనలకు కౌంటర్ ఎత్తు వేసింది. రాజకీయంగా సమయోచితంగా తీసుకున్న నిర్ణయంగా సీనియర్ పొలిటీషియన్లు అభిప్రాయపడుతున్నారు.

కేవీపీ ..ఓకే...

ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాపై రాజ్యసభలో కాంగ్రెసు నాయకుడు కేవీపీ రామచంద్రరావు ఒంటరిపోరాటం చేస్తున్నారు. గతంలో వైఎస్ ఆత్మగా పేరుపొందిన కేవీపీ జగన్ విషయంలో మాత్రం కొంత దూరం పాటిస్తూ వస్తున్నారు. విపరీతమైన దూకుడు, పర్యవసనాల గురించి ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకోవడం, అందర్నీ కలుపుకుపోయే తత్వం లేకపోవడంతో జగన్ రాజకీయాలంటే ఆయనకు పెద్దగా గిట్టదు. అలాగని అభిమానం లేకపోలేదు. తన తండ్రి వై.ఎస్. సైతం కేవీపీ సలహాను తూ.చ. తప్పకుండా పాటించేవారు. తాను కూడా ఆయన మాట వినాల్సి వస్తుందేమోననే సందేహం కూడా జగన్ లో ఉంది. దాంతో ఆయనను దూరంగానే పెట్టారు. అయితే రాజకీయ చాణుక్యునిగా పేరున్న కేవీపీని అవిశ్వాసతీర్మానం విషయంలో సంప్రతించినట్టుగా పార్టీ వర్గాల సమాచారం. జగన్ శ్రేయోభిలాషిగా ఇది సరైన సమయంలో, సరైన నిర్ణయమే అన్నట్లుగా ఆయన అభిప్రాయపడినట్లుగా తెలిసింది. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెసు పునరుజ్జీవం అన్నది ముగిసిన చరిత్రగా ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి. అలాగని జీవితం మొత్తం పార్టీకి అంకితం చేసిన కేవీపీ వంటివారు చరమాంకంలో పార్టీ మారే అవకాశాలు అంతంతమాత్రమే. అయినప్పటికీ జగన్ వంటి వారికి అవసరమైతే వ్యక్తిగతంగా సలహాలిచ్చేందుకు సిద్ధంగానే ఉన్నట్లు తాజా ఉదంతం వెల్లడిస్తుంది. ప్రత్యేక హోదా పోరాటానికి అవసరమైన నైతిక మద్దతు కూడగట్టుకునే క్రమంలో భాగంగా కేవీపీతో పొలిటికల్ రాపో కు జగన్ కు మంచి మార్గం ఏర్పడింది.

ఉండవల్లిదే ..వ్యూహం...

ఆంధ్రప్రదేశ్ విభజన సందర్బంగా కాంగ్రెసు పార్టీతో తీవ్రంగా విభేదించిన ఉండవల్లి అరుణ్ కుమార్ 2014లో సొంతపార్టీ ప్రభుత్వంపైనే లోక్ సభలో అవిశ్వాసం ప్రతిపాదించారు. అయితే సమయం తక్కువగా ఉండటంతో స్పీకర్ మద్దతుతో కాంగ్రెసు పార్టీ తెలివిగా దానిని దాటవేయగలిగింది. ఇప్పుడు బీజేపీపైన కూడా అదే అస్త్రాన్ని ప్రయోగించాలని ఆయన గత కొంతకాలంగా డిమాండు చేస్తున్నారు. ఎంపీలు రాజీనామా చేస్తే ఆంధ్రప్రదేశ్ వాదనను వినిపించే వారే కరవు అవుతారు. కేంద్రప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా అనిపించదు. తలపోటు తగ్గిందని సాఫీగా బడ్జెట్ సమావేశాలను ముగించేసుకుంటారు. దీనివల్ల ఎటువంటి ఇంపాక్టూ ఉండదు. దేశ రాజకీయాలపై ఎటువంటి ఎఫెక్టూ పడదు. దీనిని దృష్టిలో పెట్టుకునే కేంద్రప్రభుత్వాన్ని కుదిపేసే విధంగా అవిశ్వాసం పెట్టాలని ఉండవల్లి కోరుతున్నారు. అవిశ్వాసం చర్చకు వస్తే కేంద్రాన్ని, బీజేపీని దోషులుగా నిలబెట్టే అవకాశం వస్తుంది. పార్లమెంటులో ప్రాతినిధ్యం ఉన్న విపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చి కేంద్రాన్ని, బీజేపీని దుయ్యబడతాయి. ఏపీని మాత్రమే దృష్టిలో పెట్టుకోకుండా వివిధ రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయం , కేంద్ర విశ్వాసరాహిత్యం కూడా చర్చనీయమవుతుంది. బీజేపీ పరువు ప్రజాక్షేత్రంలో బజారున పడుతుంది. సర్కారు కుప్పకూలిపోయే ప్రమాదమేమీ లేదు. విపక్షాలకు తగినంత బలం లేదు. ప్రభుత్వ మెజార్టీకి వచ్చిన ఢోకా లేదు. అయినా విపక్షాల ఐక్యతకు, ఐక్య గళానికి లోక్ సభే వేదికగా నిలుస్తుంది. ఇది 2019 ఎన్నికల దిశను మారుస్తుంది. ఇదే వ్యూహంతో ఉండవల్లి తన మాటను ఎవరూ పట్టించుకోరనే ఉద్దేశంతో జనసేనను ఆసరాగా చేసుకుని డిమాండును పైకి తెచ్చారు. వైసీపీ ప్రతిస్పందించింది. ఇప్పుడు టీడీపీదే బాధ్యత. నిర్లక్ష్యం వహిస్తే బీజేపీతో కుమ్మక్కైందనే అపవాదు పడుతుంది. మీరు అవిశ్వాసం పెట్టినా మేం మద్దతిస్తామంటూ జగన్ ఇచ్చిన ఓపెన్ ఆఫర్ టీడీపీని ఇరకాటంలోకి నెట్టేసేదే. తెలుగుదేశం ఎటువంటి ప్రతివ్యూహాన్ని అనుసరిస్తుందనేదే ఇప్పుడు ఉత్కంఠ రేపుతున్న అంశం.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News