పరువు తీస్తున్న పోలవరం...!

Update: 2017-12-24 14:30 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ యంత్రాంగం రాష్ట్రం పరువును నిలువునా తీస్తోంది. చంద్రబాబు కేంద్రం ముందు చేతులు కట్టుకుని జవాబులు ఇచ్చుకునే పరిస్థితికి కారణమవుతోంది. పోలవరం ప్రాజెక్టు విషయంలో ఇటీవల గడ్కరీతో జరిగిన సమావేశంలో పలు ప్రశ్నలకు సీఎం సమాధానాలు వెదుక్కోవాల్సి వచ్చింది. కిందామీదాపడి ఈ ప్రాజెక్టు ద్వారా నీళ్లిచ్చి , 2019 ఎన్నికల్లో పనిచేసే ప్రభుత్వాన్ని గెలిపించడంటూ ప్రజలను అభ్యర్థించాలనేది చంద్రబాబు ప్రయత్నం. క్యాజువల్ ధోరణితో , ఆషామాషీ వ్యవహారాలతో పోలవరం వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టు విషయంలోనూ యంత్రాంగం తప్పిదాలకు పాల్పడుతూ తలనొప్పులు తెచ్చిపెడుతోంది. కేంద్రం తలంటుతున్నా వైఖరి మార్చుకోవడం లేదు. నిధుల విడుదలలో జాప్యానికి, సాగదీతకు, కొర్రీలు వేయడానికి ఈ తప్పిదాలే కారణమవుతున్నాయి. ప్రాజెక్టు పూర్తకాదేమోనన్న సందేహాలకు కూడా ఈలోపాలే సాకులుగా మారుతున్నాయి.

షాకిస్తున్న రిపోర్టులు...

పోలవరం పూర్తికాకపోవడానికి కేంద్రప్రభుత్వమే కారణమని నిందించి చేతులు దులిపేసుకుంటే రాజకీయంగా ప్రయోజనం లభిస్తుందేమో కానీ ఎప్పటికీ ప్రాజెక్టు పూర్తికాదు. ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. ఈ నిర్మాణాన్ని కేంద్రమే పూర్తి చేయాల్సి ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ ఆసక్తి చూపుతున్నందువల్ల నిర్మాణ బాధ్యతను అప్పగిస్తున్నట్లు కేంద్రం లిఖితపూర్వకంగానే స్పష్టం చేసింది. పర్యవేక్షణ ను మాత్రం పోలవరం అథారిటీ పేరుతో నియంత్రిస్తోంది. అథారిటీకి రాష్ట్రప్రభుత్వానికి మధ్య 12 నివేదికల్లో విభేదాలు తొంగి చూసినట్లు సమాచారం. నిర్మాణంలో లోపాలు తలెత్తితే ఈ భారీ ప్రాజెక్టు కారణంగా వాటిల్లే నష్టం ఎక్కువగా ఉంటుంది. ఇదే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని టెక్నికల్ గా ప్రతి విషయాన్ని ఒకటికి రెండు మార్లు తనిఖీ చేసి నిర్ధారించుకున్న తర్వాతనే ముందుకువెళ్లాలని అథారిటీ చెబుతోంది. కానీ ముఖ్యమంత్రి ఒత్తిడితో పర్సంటేజీల వారీ టైమ్ బౌండ్ లో పనులు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇందుకు గాను సబ్ కాంట్రాక్టర్లు, ప్రధాన కాంట్రాక్టర్ పై తీవ్రమైన ఒత్తిడి చేస్తున్నారు.

మెప్పు పొందేందుకేనా?

సబ్ కాంట్రాక్టుల పనులకు సంబంధించి సాధారణ టెండరు నిబంధనల్లో కూడా అనేక మినహాయింపులు ఇస్తూ నోటిఫికేషన్లు జారీ చేస్తున్నారు. టెండర్లు పిలిచి ఇవ్వాల్సిన కనీస గడువు కూడా ఇవ్వకుండా పనులు అప్పగించాలని చూస్తున్నారు. న్యాయపరంగా, సాంకేతికంగా భవిష్యత్తులో ఇది ఇబ్బందికరమని కేంద్ర జలసంఘం, పోలవరం అథారిటీ అభిప్రాయపడుతున్నాయి. అంతేకాకుండా అంచనా వ్యయం కూడా భారీగా పెంచేస్తున్నారని కేంద్ర యంత్రాంగమే చెబుతోంది. సాధారణంగా ఈవిషయంలో ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తాయి. కానీ సొంత యంత్రాంగంలోనే ఈ అభిప్రాయం నెలకొనడం తో కేంద్ర ప్రభుత్వం కూడా మంత్రిత్వశాఖ స్థాయిలో కొర్రీ వేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడితో పనులు సాగినప్పటికీ తమ తప్పు ఏమీ లేదని చెప్పుకోవడానికి అధికారులు రాష్ట్రానికి నోటీసులు ఇస్తున్నారు. తమ అభ్యంతరాలను వెల్లడిస్తున్నారు. పనులు నిలిపివేయమంటూ ఇటీవల కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి రాసిన లేఖను ఈకోణంలోనే చూడాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్టులో అంచనాల పెంపుదలలో హేతుబద్ధత లోపించింది. నిర్మాణం విషయంలో న్యాయస్థానాల్లో కేసులు దాఖలైనా, దర్యాప్తు సంస్థలు అవినీతి కోణంలో పరిశోధన మొదలు పెట్టినా రాష్ట్రప్రభుత్వానికి చిక్కులు తప్పవు. అటువంటి సందర్బంలో కేంద్ర అధికారులు ఇచ్చిన నోటీసులు, చేసిన హెచ్చరికలు ప్రధాన ఆధారంగా నిలుస్తాయి. రాష్ట్రప్రభుత్వ అధికారులను ఈవిషయమే ఆందోళనకు గురి చేస్తోంది.

ఆ సంగతి గుర్తు లేదా?

వై.ఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో భూములు, గనులకు సంబంధించి తమ వంతు అధికారిక బాధ్యతలు నిర్వహించిన ఐఏఎస్ లు అనేకమంది ఈనాటికీ కేసులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం నుంచి లబ్ధి పొందిన సంస్థలు జగన్ పెట్టిన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారనే అభియోగాలతో క్విడ్ ప్రో కో అధికారులకు విచారణ తప్పలేదు. నిజానికి అధికారులు పొందిన లాభం అంతంతమాత్రమేనని అందరికీ తెలుసు. కేవలం రాజకీయ బాసుల మెప్పు పొందడానికి తందానా తాన అన్నట్టుగా సంతకాలు పెట్టి సమస్యల్లో కూరుకున్నారు. ఇప్పుడు పోలవరం విషయంలో కూడా ఇది పునరావృతం అవుతుందేమోనన్న భయం వెన్నాడుతోంది. సాంకేతిక అంశాలు లేవనెత్తడం ద్వారా రాజకీయ ఒత్తిడిని ఎదుర్కోవాలని చూస్తున్నారు. కేంద్ర అధికారులకు రాష్ట్ర అధికారులు ప్రాజెక్టుకు సంబంధించి నిబంధనల ఉల్లంఘనల సమాచారాన్ని అందిస్తూ లోపాయికారీగా సహకరిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాము చిక్కుల్లో పడకుండా ఉండాలంటే ఇదే తరుణోపాయమని ఉన్నతాధికారులు భావించడమే ఇందుకు కారణం.

ఆషామాషీ అంచనాలు...

రాష్ట్రప్రభుత్వం సమర్పించిన ప్రాజెక్టు నిర్మాణ అంచనాలపై అనేక కొర్రీలు వేస్తూ, అభ్యంతరాలను ప్రకటిస్తూ రిపోర్టును కేంద్రం తాజాగా తిప్పి పంపింది. కార్యాలయాల్లో కూర్చుని రాజకీయ బాసులు చెప్పినట్లుగా అంచనాలను వండి వారుస్తున్నారనేది ప్రధాన అభియోగం. 2010 నాటికి మూడు వేల కోట్ల వరకూ ఉన్న భూ పరిహారాన్ని 33 వేల కోట్ల రూపాయలకు చేర్చారు. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం నష్ట పరిహారం ఎక్కువ ఇవ్వాల్సి వస్తోందన్న మాట వాస్తవం. కానీ భూమి విలువను నిర్ణయించాల్సింది రాష్ట్రమే. స్థానికంగా ఉండే రిజిస్ట్రేషన్ మార్కెట్ వాల్యూను విపరీతంగా పెంచేయడం వల్ల తడిసిమోపెడై కూర్చుంది. వాస్తవాల ప్రాతిపదికన ప్రభుత్వం పరిగణించి ఉంటే ఒక్కో రైతుకు నాలుగు రెట్లు పరిహారం ఇచ్చినా 15 వేల కోట్ల రూపాయలకే భూపరిహారం పరిమితమై ఉండేదంటున్నారు. కానీ రాష్ట్రప్రభుత్వం తమది కాని సొమ్ము ధారపోస్తే పోయిందేమన్నట్లుగా భూ పరిహారాన్ని పెంచేసి కేంద్రం తలపై చేయి పెట్టాలని చూసింది. బారీగా పరిహారం ఇప్పించి స్థానిక రైతుల మన్నన పొందాలని యోచించింది. ఈ ప్రయత్నం వికటిస్తున్నట్లు తాజాగా కేంద్రం ప్రకటనలు చూస్తే తెలుస్తుంది. మూడు వేల కోట్లు ముప్పైమూడువేల కోట్లు ఎలా అయ్యిందో తెలుసుకునేందుకు భూవిలువపై తామే సర్వే చేస్తామనేంతగా కేంద్ర ఆర్థిక శాఖ అధికారులు గట్టి వార్నింగ్ ఇచ్చారు.

కేంద్రం హామీ ఇచ్చిందని...

2013 -14 అంచనాల ప్రకారం నిర్మాణ వ్యయం భరించేందుకు కేంద్రం హామీ ఇచ్చింది. దీంతో భారీగా బడ్జెట్ చూపించి రిపోర్టు పెట్టారు.2010 అంచనాల ప్రకారం 13 వేల కోట్ల రూపాయలు ఉన్న ప్రాజెక్టు కనస్ట్రక్షన్ వ్యయాన్ని 25 వేల కోట్లకు పెంచారు. మూడేళ్లలో దాదాపు రెట్టింపు చేశారు. ఇది పెద్దగా అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ అధికారులే చేసిన మరో పొరపాటు ఈ పెంపుదలపై కూడా ప్రశ్నలు లేవనెత్తేందుకు వీలు కల్పించింది. 2015- 16 నాటికి పెరిగిన నిర్మాణ అంచనాలంటూ పంపిన నివేదికలో కొన్ని పనులకు 2013-14 కంటే తక్కువ వ్యయం చూపించడంతో కేంద్ర ప్రభుత్వ అధికారులకు అనుమానం వచ్చింది. కేంద్రం ఖర్చు భరించే డెడ్ లైన్ 2013-14 కావడంతో తప్పుల తడకగా భారీగా అంచనాలు పెంచినట్లు కేంద్రం పసి గట్టింది. అవే పనులకు 2015-16 అంచనాల్లో తక్కువ మొత్తం చూపడంతో లోపాలను రాష్ట్రమే లిఖితపూర్వకంగానే అంగీకరించినట్లయింది. ఆషామాషీగా వేస్తున్న ఖర్చుల లెక్కలపై నవ్వుకోవడంతోపాటు రిపోర్టు మొత్తం తప్పుల తడక , వాస్తవ విరుద్దమంటూ పెరిగిన అంచనాల ఖర్చు రిపోర్టును కేంద్రం తిప్పికొట్టింది.

చంద్ర బాబు ప్రయాస...

రాజకీయంగా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న చంద్రబాబు పోలవరం విషయంలో కేంద్రంపై రకరకాల రూపంలో ఒత్తిడి పెంచుతున్నారు. దీనికి గడ్కరీ, జైట్లీ వంటి వారు సానుకూలంగానే స్పందిస్తున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వ నివేదికల్లో తప్పులుంటే కేంద్ర అధికారులు దానిపై నోట్ రాస్తారు. అటువంటి సందర్భాల్లో రాజకీయ కార్యనిర్వాహక బాధ్యతల్లో ఉన్నమంత్రులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. నిధుల దుర్వినియోగానికి అవకాశం ఉన్న సందర్భాల్లో అధికారులు ఇచ్చే సూచనలు పట్టించుకోకుండా ముందుకు వెళ్లమని ఏ మంత్రి కూడా చెప్పలేరు. ఒకవేళ అటువంటి సాహసానికి పూనుకుంటే భవిష్యత్తులో ఏదైనా ఇబ్బంది ఏర్పడి దర్యాప్తు సంస్థలు కేసు నమోదు చేస్తే తాము కూడా నిందితునిగా మారాల్సి ఉంటుంది. అందువల్ల కేంద్రమంత్రులు నిబంధనలపై పక్కాగా ఉంటారు. అందుకే చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగ లోపాలను సరిదిద్దుకోవాలి. తప్పుడు నివేదికలను ప్రోత్సహించకుండా నియంత్రించాలి. మనవైపు నుంచి అన్నీ సక్రమంగా ఉన్నప్పుడు రాజకీయ ఒత్తిడి చేస్తే పనులు చకచకా సాగిపోతాయి. కానీ తప్పుడు నివేదికలతో పనికానిచ్చేద్దామనుకుంటే కేంద్ర మంత్రుల నుంచి సానుభూతే తప్ప సహకారం కష్టమవుతుంది.

-ఎడిటోరియల్ డెస్క్

Similar News