న్యాయానికి నగుబాటు

Update: 2018-03-30 15:30 GMT

నరేంద్రమోడీ ప్రభుత్వ అత్యుత్సాహం న్యాయవ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తికి మచ్చ తెచ్చిపెడుతోంది. ఒక సంఘర్షణాత్మక వైఖరికి దారి తీస్తోంది. ప్రజాస్వామ్య దేశంలో నియంతృత్వాన్ని నియంత్రించడానికి బలమైన రాజ్యాంగ వ్యవస్థలను ఏర్పాటు చేశారు మన పెద్దలు. బలమైన ప్రజాదరణ లభించిన సందర్భాల్లో కొందరు నాయకులు తమకు తిరుగులేదని విర్రవీగి బోల్తా పడిన సందర్భాలు అనేకం మనకు కనిపిస్తాయి. ఈవిషయంలో ఇందిరాగాంధీ అనేక ఉదాహరణలు నెలకొల్పారు. ప్రస్తుతం మోడీ ఈవిషయంలో పాత రికార్డులు చెరిపివేస్తున్నారు. రాజ్యాంగ, చట్టపరమైన అంశాల్లో ప్రభుత్వానికి ఎక్కడికక్కడ కళ్లెం వేసే న్యాయవ్యవస్థకే కళ్లెం వేయాలని చూస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉన్నత న్యాయవ్యవస్థలో తిరుగుబాటుకు కారణమవుతోంది.

పెత్తనానికి పెడ దారులు....

రాచరికంలో న్యాయవ్యవస్థ ను ప్రభువులే నియంత్రిస్తూ ఉంటారు. ప్రజాస్వామ్యంలో మాత్రం ఈ వ్యవస్థకు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించారు. ప్రభుత్వం చేసే నిరంకుశ నిర్ణయాలను, అవసరమైతే పార్లమెంటు చేసే చట్టాలను సైతం కొన్ని సందర్భాల్లో కొట్టివేసే అధికారం సర్వోన్నత న్యాయస్థానానికి ఉంది. ఓట్లు మాత్రమే పరమావధిగా భావించే రాజకీయ కార్యనిర్వాహక వర్గాలు అనేక సందర్భాల్లో అత్యుత్సాహం ప్రదర్శించి తప్పు చేసేందుకు ఆస్కారం ఉంటుంది. ఎన్నికల్లో గెలుస్తామంటే ఏమైనా చేస్తారు. పర్యవసానాలు భవిష్యత్తు తరాలపై పడతాయి. సమాజం చీలిపోయేందుకు అవకాశం ఉంటుంది. వీటిని అంగీకరించకుండా రాజ్యాంగ ప్రమాణంగా రాజ్య వ్యవస్థను న్యాయమైన పథంలో నడపాల్సిన బాధ్యత కోర్టులదే. అయితే తాము తీసుకుంటున్న ఇష్టారాజ్యం చర్యలను న్యాయస్థానాలు తప్పుపడుతున్నాయనో,తమ స్పీడుకు బ్రేకులు వేస్తున్నాయనో ప్రభుత్వాలు నిరంతరం అక్కసు వెళ్లగక్కుతుంటాయి. ఉన్నత న్యాయమూర్తులకు పదవీ విరమణ అనంతరం రాజ్యాంగ పదవులు అప్పగించడం, కీలకమైన బాధ్యతలు ఇవ్వడం వంటి చర్యల ద్వారా ముందస్తుగానే ప్రలోభపరిచే చర్యలు సాగుతున్నాయి. ఇలా సామదానభేదో పాయాలతో వ్యవస్థలో కీలకవ్యక్తులకు వివిధరూపాల్లో ఎరవేసే అనుచిత చర్యలను ప్రభుత్వం అనుసరిస్తూ వస్తోంది. మొండిగా, నిజాయతీ గా వ్యవహరించే జడ్జిల విషయంలో పదోన్నతుల్లో అన్యాయం, కీలక పాత్రల్లోకి వారు రాకుండా చేయడం వంటి నియంత్రణ సాగుతోందని చాలాకాలంగా ప్రచారం సాగుతోంది. మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది మరింత ముదురుపాకాన పడటంతోపాటు బహిరంగంగానే చర్చనీయమవుతోంది.

సంచలనం...

జనవరి నెలలో సుప్రీం కోర్టులో సీనియర్ జడ్జిలు నలుగురు బహిరంగంగానే చీఫ్ జస్టిస్ పై ధ్వజమెత్తారు. ముఖ్యమైన కేసులను సీనియర్లకు కేటాయించడం లేదంటూ విమర్శించడంతోపాటు రోస్టర్ పాటించడంలోని లోపాలనూ ఎత్తిచూపారు. అన్యాపదేశంగా చీఫ్ జస్టిస్ వ్యవహారశైలిపైనే అనుమానాలు వ్యక్తం చేశారు. అమిత్ షా కేసునకు సంబంధించి కీలకమైన నిర్ణయం తీసుకోవాల్సిన సందర్బంలో వీరు మీడియాను ఆశ్రయించడం ఒక సంచలనంగా నిలిచింది. బార్ అసోసియేషన్, ఉన్నత న్యాయకోవిదుల జోక్యంతో అప్పట్లో టీకప్పులో తుపానులా సద్దుమణిగినట్లు కనిపించింది. మళ్లీ తాజాగా కేంద్రం ప్రభుత్వం తన సహజధోరణిని బయటపెట్టుకోవడంతో రగులుతున్న నిప్పురవ్వ మంటలు మళ్లీ అంటుకున్నాయి. రెండు సార్లు కొలీజియం సిఫార్సు చేసి హైకోర్టు జడ్జిగా పదోన్నతికి సిఫార్సు చేసిన వ్యక్తి విషయంలో హైకోర్టు ద్వారా విచారణ చేయించాలని కేంద్రం ప్రయత్నించింది. సుప్రీం కోర్టు కొలీజియం సిన్సియారిటీ, ఇంటిగ్రిటీలను ప్రశ్నించే చర్య ఇది. ఏమైనా సందేహాలుంటే తిరిగి కొలీజియం కే రిఫర్ చేయాలి తప్పితే హైకోర్టుకు నేరుగా కేంద్ర న్యాయశాఖ సలహా నివ్వడం అంటే అత్యున్నత న్యాయస్థానం పట్ల ఉదాసీన వైఖరి కనబరిచేనట్లే. దాని అధికారాన్ని కించపరిచినట్లే. ఈ అంశాలనే లేవనెత్తుతూ తాజాగా జస్టిస్ చలమేశ్వర్ చీఫ్ జస్టిస్ కు లేఖ రాశారు. చాలావిలువైన ప్రశ్నలనే లేవనెత్తారు. నేరుగా హైకోర్టులను కేంద్రం సంప్రతిస్తుందంటే న్యాయవ్యవస్థ స్వేచ్చలో జోక్యం చేసుకుంటున్నట్లుగానే భావించాలని ఆయన అభిప్రాయపడ్డారు. కోర్టులు, ప్రభుత్వం కలగలిసిపోయి స్నేహం చేస్తే ప్రజాస్వామ్యానికే చెంపపెట్టు అంటూ తీవ్రవ్యాఖ్యలే చేశారు. రెండు వ్యవస్థల మధ్య ఉండాల్సిన లక్ష్మణ రేఖను ఆయన గుర్తు చేశారు. దీనికి అడ్డుకట్ట వేసేందుకుగాను అత్యవసరంగా సుప్రీం కోర్టు న్యాయమూర్తుల సర్వసభ్య సమావేశం జరపాలని ఆయన చేసిన డిమాండు సమంజసమైనది. హేతుబద్ధమైనది.

ఆత్రంలో అసలు రహస్యం...

గతంలో 2016 ఏప్రిల్ లో అప్పటి భారత ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్ ప్రధాని సమక్షంలోనే కన్నీళ్లు పెట్టుకున్నారు. న్యాయవ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం నానాటికీ సన్నగిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. లా కమిషన్ సిఫార్సులు అమలు చేయడం, న్యాయమూర్తుల నియామకాలు పెంచడం వంటి చర్యలు తక్షణావసరంగా ఆయన చెప్పారు. వాటిపై దృష్టి పెట్టాల్సిన ప్రధాని వేరే అంశాలపై ఎక్కువ శ్రద్ధ పెడుతున్నారు. తీవ్రస్థాయి సంస్కరణల అమలు, ఏకకాల ఎన్నికలు వంటి అంశాల్లో న్యాయస్థానాలు ఆటంకాలు సృష్టిస్తాయోమోనన్న అనుమానాలు నెలకొన్నాయి. తాను అనుకున్న పని మంచిచెడ్డలతో నిమిత్తం లేకుండా అయ్యితీరాల్సిందేనన్న మంకు పట్టు మోడీది. న్యాయవ్యవస్థను కూడా ఆయన పెద్దగా లెక్కచేయరు. అయితే మన వ్యవస్థలో ఎక్కువమంది న్యాయమూర్తులు లౌకికభావనతో కూడిన రాజ్యాంగ నిపుణులు. కేంద్రం చెప్పినట్లు ఆడేందుకు ఇష్టపడని వారు చాలామందే ఉన్నారు. పంటిలోని రాయిలా తగులుతున్నారు. ఇది సహించలేకపోవడంతోనే వివిధ రూపాల్లో నియంత్రణ సాధించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని న్యాయకోవిదులు పేర్కొంటున్నారు. ఏదేమైనప్పటికీ ఐక్యభావంతో ఇటువంటి చర్యలను ప్రతిఘటించడం ద్వారానే న్యాయవ్యవస్థ తనను తాను పరిరక్షించుకోగలుగుతుంది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News