న్యాయం చెప్పే వారే...ఇలా చేస్తే....!

Update: 2018-01-20 16:30 GMT

భారత రాజ్యాంగం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సర్వోత్కృష్ట స్థానాన్ని కల్పించింది. దేశ ప్రధమ పౌరుడైన రాష్ట్రపతితో సమాన హోదాను కట్టబెట్టింది. రాజ్యాంగ సంరక్షకుడైన రాష్ట్రపతి స్థాయిని కల్పించింది. అందువల్లే రాష్ట్రపతి చేత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణం స్వీకారం చేయిస్తారు. రాష్ట్రపతి మరణించినా, అనారోగ్యం పాలయినా తాత్కాలిక రాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వహిస్తారు. రాజ్యాంగానికే కాలమాన పరిస్థితులను బట్టి భాష్యం చెప్పే అధికారం రాజ్యాంగమే కల్పించడం గమనించదగ్గ విషయం. తన బాధ్యతల నిర్వహణలో ప్రధాన న్యాయమూర్తి కొన్ని నియయ నిబంధనలను పాటించి తీరాలి. సత్సంప్రదాయాలను, పద్ధతులను ఏర్పాుట చేయాలి. రాజ్యాంగ రీత్యా, చట్టరీత్యా తనకు సంక్రమించిన అధికారాలను విశాల దృక్పథంతో వ్యవహరించి సద్వినియోగం చేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ దుర్వినియోగం చేయకూడదు. ఈ విషయాన్ని స్పష్టంగా చెబుతోంది. 124వ అధికరణం సుప్రీంకోర్టు ఏర్పాటును ప్రస్తావిస్తోంది. తొలిరోజుల్లో ప్రధాన న్యాయమూర్తి, ఏడుగురు న్యాయమూర్తులు ఉండేవారు. ఈ సంఖ్యను 1956లో 10కి పెంచారు. న్యాయమూర్తుల సంఖ్యను 1960లో 13 మందికి, 1977లో 17 మందికి, 1986లో 25 మందికి, 2009లో 30 మందికి పెంచారు. అవసరాన్ని బట్టి న్యాయూర్తుల సంఖ్యను పెంచుకునే సౌకర్యం ఉంది.

ఎలాంటి అర్హతలు లేవు....

ప్రధాన న్యాయయూర్తి నియామకానికి రాజ్యాంగం ప్రత్యేకంగా ఎలాంటి అర్హతలను పేర్కొనలేదు. సాధారణంగా సీనియర్ న్యాయమూర్తిని ప్రధాన న్యాయమూర్తిగా రాష్ట్రపతి నియమిస్తారు. తన పదవీ విరమణకు ముందు కొత్త ప్రధాన న్యాయమూర్తి పేరును ప్రభుత్వానికి సూచిస్తారు. సహజంగా తన తర్వాత సీనియర్ పేరును సూచిస్తారు. ఇక సర్వోన్నత న్యాయస్థానం పాలన వ్యవహారాలు పూర్తిగా ప్రధాన న్యాయమూర్తి చేతుల్లోనే ఉంటాయి. సహచర న్యాయమూర్తుల మధ్య పనివిభజన, కేసుల కేటాయింపు, ప్రత్యేక ధర్మాసనాల కేటాయింపు తదితర విషయాల్లో ఆయన తన విచక్షణ మేరకు వ్యవహరించాలి. విచక్షణ అధికారాలను సద్వినియోగం చేయాలి. తమ సమానుల్లో ప్రధముడినే తప్ప ఎవరికన్నా ఎక్కువ కాదన్న విషయాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. అదే విధంగా తన వద్ద పనిచేస్తున్న వారిని తనకన్నా తక్కువ అని భావించరాదు. ధర్మాసనాల ఏర్పాటు అధికారం తనకున్నమాట వాస్తవమే. ఏఏ న్యాయమూర్తులకు ఏమేం కేసులను కేటాయించాలన్న అధికారం ఆయనదే. అయితే అంతమాత్రాన ఏకపక్షంగా వ్యవహరించమని చెప్పడం కాదు. హేతుబద్ధంగా వ్యవహరించాలి. పారదర్శకత పాటించాలి. విషయ ప్రాధాన్యతను బట్టి, వ్యాజ్యాల తీవ్రతను బట్టి వాటి విచారణ బాధ్యతను సీనియర్లకు కేటాయించాలి. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పీబీ సావంత్, ఢిల్లీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎ.పి. షా, మద్రాస్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కె.చంద్రు, బొంబాయి హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ హెచ్ సురేష్ ఇటీవల ఈ విషయాన్ని బహిరంగంగా పేర్కొన్నారు. దీపక్ మిశ్రాకు ముందు పనిచేసిన నలుగురు ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్ ఖేహార్, జస్టిస్ టీఎస్ ఠాకూర్, జస్టిస్ సదాశిం, జస్టిస్ హెచ్.ఎల్. దత్తు మాస్టర్ రోస్టర్ ప్రకారమే వ్యవహరించారు. ఏ కేసు ఏ జడ్జికి కేటాయించాలన్న అధికారాన్ని కలిగి ఉండటమే మాస్టర్ రోస్టర్. అయితే గతంలో లేని ఇబ్బందులు ఇప్పుడు ఎలా ఉత్పన్నమయ్యాయన్న ప్రశ్నకు సమాధానంగా ప్రధాన న్యాయమూర్తి నిలబడక తప్పదు.

1973 నుంచి వివాదాలు....

ప్రధాన న్యాయమూర్తి, న్యాయమూర్తుల వివాదాన్ని పక్కన పెడితే ప్రధాన న్యాయమూర్తుల నియామకంలో కూడా గతంలో వివాదాలు తలెత్తాయి. 1950 నుంచి 1973 వరకూ సీనియర్లనే ప్రధాన న్యాయమూర్తులుగా నియమించే సంప్రదాయం కొనసాగింది. కానీ 1973లో కేశవానంద భారతి కేసు అనంతరం జూనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఎ.ఎన్. రే ను ప్రధాన న్యాయమూర్తిగా నియమించింది నాటి ఇందిరాగాంధీ ప్రభుత్వం.రే కోసం ముగ్గురు సీనియర్ న్యాయమూర్తులు జస్టిస్ జె.ఎం షేలట్, ఎ.ఎన్. గ్రోవర్, కె.ఎస్. హెగ్డేలను పక్కనపెట్టారు. 1977లో ఇదే పరిస్థితి పునరావృత్తమయింది. సీనియర్ న్యాయమూర్తి అయిన జస్టిస్ హెచ్.ఆర్. ఖన్నాను విస్మరించి జూనియర్ అయిన జస్టిస్ ఎం.హెచ్. బేగ్ ను ప్రధాన న్యాయమూర్తిగానియమించారు. దీంతో 1973, 1977ల్లో రెండుసార్లూ దీనిపై విస్తృత చర్చ జరిగింది. రాజ్యాంగం న్యాయవ్యవస్థకు స్వతంత్ర ప్రతిపత్తి కల్పించింది. ఆ స్వతంత్ర ప్రతిపత్తి ఆధారంగానే ప్రస్తుత సంక్షోభాన్ని పరిష్కరించుకోవాలి. ఇరు వైపులా పట్టువిడుపులు ప్రదర్శిస్తేనే పరిష్కారం సాధ్యం.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News