నేరం మాది కాదు

Update: 2018-03-27 15:30 GMT

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నేరగాళ్ల వెదుకులాట మొదలైంది. దుమ్మెత్తిపోసుకోవడానికి, ఆరోపణలు గుప్పించడానికి, విమర్శలతో రంగాన్ని వేడెక్కించేందుకు నాయకులు సకల యత్నాలు చేస్తున్నారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంలో తమ తప్పేమీ లేదంటూ ఎదుటివారినే దోషులుగా నిర్ధారించేందుకు సర్వ విన్యాసాలకు పాల్పడుతున్నారు. బీజేపీ, తెలుగుదేశం, వైసీపీ, జనసేన, కాంగ్రెసు అయిదు పార్టీలూ ప్రస్తుత సంక్షోభం నుంచి లాభం పొందాలనే చూస్తున్నాయి. ఎత్తుగడలతో ఏదో సాధించాలని తపిస్తున్నాయి. కలిసికట్టుగా నడిచేందుకు మాత్రం ససేమిరా అంటున్నాయి. సై అంటూ సవాళ్లు విసురుకుంటున్నాయి. మొత్తం వ్యవహారంలో రాష్ట్రప్రయోజనాల కంటే రాజకీయమే ఎక్కువగా కనిపిస్తోంది.

చంద్ర‘జాలం’ కి చెక్...

రాష్ట్రానికి సంబంధించి అనేక ప్రధానమైన అంశాలపై గతంలో ఎప్పుడూ అఖిల పక్షం మాట ఎత్తలేదు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు ప్రత్యేక హోదా విషయంలో అఖిల సంఘాల పేరిట సమావేశం నిర్వహించారు. తాను చిత్తశుద్ధితో ఉన్నాను. అందరూ కలిసి రావాలనే సందేశం ఇందులో దాగి ఉంది. అంతేకాకుండా నాలుగేళ్లుగా హోదా స్థానంలో ప్యాకేజీకి ఒప్పుకుని చేసిన తప్పులను ఈ ఒక్కదెబ్బతో కడిగేసుకోవాలనే తాపత్రయమూ ఇందులోని అంతర్భాగమే. అయితే ప్రధాన పార్టీలైన వైసీపీ, జనసేన, బీజేపీ మూడు పక్షాలూ దీనిని బహిష్కరించాయి. దీంతో సమావేశం మొక్కుబడిగా మారిపోయింది. ప్రధానపాత్రదారులు లేకుండా సాగిన ఈ సమావేశాన్ని టీడీపీపై దుమ్మెత్తి పోయడానికి వినియోగించుకున్నాయి వామపక్షాలు. ఆశించిన ప్రయోజనం దక్కలేదు. రాజధాని ఎంపిక, నిర్మాణం, విభజన చట్టం అమలు , పోలవరం ,రైల్వేజోన్ వంటి అనేక ప్రధాన విషయాలపై విపక్షాల సహకారాన్ని కోరడమే నామోషీగా భావించిన చంద్రబాబు తాను సమస్యల వలయంలో కూరుకున్నాడు కాబట్టి అందరూ కలిసిరావాలని కోరడం కేవలం అవకాశవాదమే. దీనివల్ల సాధించేదేమీ ఉండదు. కానీ ప్రజలకు, మీడియాకు తన ఉద్దేశంలోని గొప్పతనాన్ని చాటిచెప్పడమే లక్ష్యం. పొలిటికల్ టార్గెట్ కాబట్టి పొలిటికల్ గానే కౌంటర్ చేశాయి ముఖ్యపార్టీలు.

విభజన విస్పష్టం ....

ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రం మాత్రం స్పష్టమైపోయింది. జెండాలు, అజెండాలు తేలిపోయాయి. వామపక్షాలు, జనసేన ఒక కూటమి కాబోతున్నాయి. వైసీపీ బీజేపీతో వెళుతుందని తొలుత భావించారు. కానీ కమలం పార్టీ పై సాగుతున్న ప్రచారంతో ఫ్యాన్ పార్టీ బెంబేలెత్తిపోక తప్పలేదు. ఎన్నికల వరకూ దూరం పెట్టక తప్పదు. కేంద్రంపై విమర్శలు గుప్పించక తప్పని రాజకీయ అనివార్యత కూడా ఏర్పడింది. తొలి సంతకం ప్రత్యేక హోదాపై చేస్తానని హామీ ఇవ్వడానికి తోడు ప్లీనరీలో తీర్మానం కూడా ప్రవేశ పెట్టడంతో ఏపీలో కాంగ్రెసు కొంత సాఫ్ట్ కార్నర్ సంపాదించగలిగింది. ఓట్లుగా మలుచుకోగలుగుతుందా? లేదా అన్న విషయంలో ఇంకా సందేహాలున్నాయి. కానీ రాహుల్, సోనియా పర్యటిస్తే ఆంధ్రాలో వ్యతిరేకత వ్యక్తమయ్యే పరిస్థితులు పోయాయి. జాతీయ పార్టీగా కాంగ్రెస్ కు ఇది కొంత సానుకూల పరిణామం. టీడీపీ ఒంటరిగానే వెళుతుంది. బహుముఖ పోరు కచ్చితంగా తమకు అడ్వాంటేజీగా మారుతుందని అధికారపార్టీ భావిస్తోంది. కొంతకాలంగా వైసీపీతో నడుస్తున్న దళిత,శ్రామిక వర్గాలు జనసేన, వామపక్షాల కలయికతో కొంతమేరకు చీలిపోతాయనే లెక్కలు వేసుకుంటోంది. టీడీపీకి 30 శాతం వరకూ నికర ఓటు బ్యాంకు ఉందని ఆ పార్టీ అంచనా. సర్కారీ వ్యతిరేక ఓటు మిగిలిన రెండు పక్షాల మధ్య చీలిపోతే మూడోవంతు ఓట్లతోనే అధికారపీఠం చేజిక్కించుకోవచ్చని చంద్రబాబు నాయుడు ఇటీవలే అగ్రనేతల సమావేశంలో ధైర్యం నూరిపోసినట్లు పార్టీ వర్గాల సమాచారం.

ఈ సమస్య ఇక జాతీయం...

ఆంధ్రప్రదేశ్ ను జాతీయ అజెండాలోకి తేవడంలో తెలుగుదేశం పార్టీ సక్సెస్ అయ్యింది. అవిశ్వాసం డిమాండు జనసేనది, దానిని అందిపుచ్చుకుని తొలుత స్పందించింది వైసీపీ. కానీ ఇప్పుడు ఢిల్లీలో తెలుగుదేశం పార్టీ కేంద్రంగా అవిశ్వాసంపై మిగిలిన పార్టీలు స్పందిస్తున్నాయి. వ్యూహాత్మకంగానే వైసీపీకి రావాల్సిన మైలేజీని చంద్రబాబు అడ్డుకోగలిగారు. వచ్చే నెల ఒకటి రెండు తేదీల్లో ఢిల్లీలో మకాం వేసి అన్నిపార్టీలను ఏకం చేసేందుకు చంద్రబాబు నాయుడు సిద్ధమవుతున్నారు. అవిశ్వాసంపై కేంద్రం స్పందించకతప్పని పరిస్థితి ఇప్పటికే ఏర్పడింది. ఒకవేళ సభను నిరవధికంగా వాయిదా వేసుకుంటే కేంద్రం పలాయనం పఠించి పారిపోయిందనే విమర్శలు వెల్లువెత్తుతాయి. ఒప్పుకుంటే కేంద్రం విధానాలను దుయ్యబట్టేందుకు, కర్ణాటక ఎన్నికలలో బీజేపీని డ్యామేజీ చేసేందుకు ఈ వేదికను కాంగ్రెసు వినియోగించుకునే ప్రమాదం ఉంది. కమలం పార్టీకి ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్లుగా తయారైంది. ఏపీ ఇష్యూ నిజానికి కేంద్రానికి ఒక చిన్న అంశమే. కానీ తేనెతుట్టలాంటి అనేక సమస్యలు అవిశ్వాసం చుట్టూ చర్చలోకి వచ్చి సభలో రచ్చ జరగవచ్చు. జాతీయ అంశాలూ ప్రస్తావనకు రావచ్చు. ఈ ప్రభావం నుంచి తప్పించుకోవడమెలాగో అర్థంకాక తలలు పట్టుకుంటున్నారు బీజేపీ ఫ్లోర్ మేనేజర్లు. ఏపీకి నిధులిచ్చామని పాత పాట పాడినా అక్కడితో పరిమితమయ్యే వాతావరణం కనిపించడం లేదు. అసలు వామపక్షాలు, కాంగ్రెసు ఉద్దేశం బీజేపీని ఎండగట్టడమే. అత్యున్నత చట్టసభను వినియోగించుకుని జాతీయ వేదికను నిర్మించుకునే అవకాశం కూడా ఉంది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News