నేను...నా పార్టీ ...దట్సాల్

Update: 2017-11-16 15:30 GMT

మొహమాటం లేదు. మాట్లాడితే ముక్కుమీద గుద్దినట్టే. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకూ నియమించే రైతు సమన్వయ సమితుల్లో పార్టీ కార్యకర్తలనే నియమిస్తాం. మీకు దిక్కున్న చోట చెప్పుకోండి. మా వాళ్లు అర్హులు. వాళ్లనే అందలం ఎక్కిస్తామంటూ తేల్చి చెప్పేశారు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు. ఎంతోకొంత బెదిరిస్తే అందరికీ చోటుంటుంది అని కేసీఆర్ చెబుతారేమోనని ఆశగా ఎదురుచూసిన విపక్షాలు షాక్ కు గురయ్యాయి. నోళ్లు వెళ్లబెట్టాయి. తమ వాయిస్ ను వినిపించే అతిపెద్దవేదిక అసెంబ్లీలోనే సీఎం నిక్కచ్చిగా, సూటిగా చెప్పేయడంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో పడ్డారు ప్రతిపక్ష నాయకులు. తెలంగాణ ఉద్యమంలో 13 సంవత్సరాలపాటు టీఆర్ఎస్ కార్యకర్తలు కష్టపడ్డారు. కాంగ్రెసు నాయకులు పదవులను అనుభవిస్తుంటే టీఆర్ఎస్ వాళ్లు జైళ్లపాలయ్యారు. ప్రతిఫలంగా మేం అన్ని పదవులనూ వారికే కట్టబెడతామంటూ కుండబద్దలు కొట్టారు కేసీఆర్. నిజానికి టీడీపీ, కాంగ్రెసు హయాంలోని పాత తప్పులనూ వెలికితీశారు. మీకు విమర్శించే అర్హతే లేదంటూ కడిగిపారేశారు. 2003లో తెలుగుదేశం పార్టీ హయాంలో నియమించిన 2 లక్షల పైచిలుకు రైతుమిత్ర బృందాలు, 2005లో కాంగ్రెసు హయాంలో నియమించిన 50 వేల మంది ఆదర్శరైతులు ఏ పార్టీలకు చెందినవారంటూ నిలదీశారు. దీంతో ప్రతిపక్షాల నోళ్లు మూతపడ్డాయి. కానీ ఏకపక్షంగా పార్టీ కార్యకర్తలతో నింపేసే సమన్వయ సమితులతో రైతాంగానికి నిజమైన ప్రయోజనం చేకూరుతుందా? అన్న ప్రశ్నలు వెంటాడుతూనే ఉన్నాయి.

తప్పుకు తప్పే పరిహారమా?

నిజమే, కాంగ్రెసు, తెలుగుదేశం ప్రభుత్వాలు గతంలో తప్పులు చేసి ఉండవచ్చు. తమ పార్టీ కార్యకర్తలనే అన్ని పథకాల్లో చొప్పించి ఉండవచ్చు. దానివల్ల రైతాంగానికి నష్టం కూడా జరిగి ఉండవచ్చు. వారికి ప్రజలు తగిన శిక్ష విధించారు. ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. మళ్లీ వాళ్లు చేసిన తప్పులనే చేస్తామంటూ కార్యకర్తలే తమకు ముఖ్యమని చెప్పడం అహేతుకమే అవుతుంది. రాష్ట్రంలో రైతాంగం అతిపెద్ద కమ్యూనిటీ. అనేక సమస్యలతో, సంక్షోభంలో ఉన్న రంగం వ్యవసాయం. నిజమైన సేవాపరులు, ఆదర్శరైతులు, శాస్త్రవిజ్ణానాన్ని మేళవించే ఆధునికులు సమన్వయసమితుల్లో ఉంటే గరిష్ఠంగా ప్రయోజనం చేకూరుతుంది. కేవలం పార్టీ కార్యకర్తలనే నియమిస్తే సమన్వయ సమితులు పైరవీ కేంద్రాలుగా మారుతాయి. పెత్తనం వారి చేతుల్లో కేంద్రీకృతమవుతుంది. ఎరువుల పంపిణీ మొదలు పెట్టుబడి రాయితీలు, సహకారబ్యాంకురుణాల వరకూ అన్నిటా ఈ సమన్వయ సమితులు అనధికారికంగా చెప్పిందే చెలామణి అవుతుంది. పార్టీ కార్యకర్తలకు అప్పగించడం వల్ల సహజంగానే రాజకీయాలు అన్నివిషయాల్లోనూ ప్రధాన పాత్ర పోషిస్తాయి.

ఎందుకింత కఠిన వైఖరి..?

ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు టీఆర్ఎస్ కార్యకర్తలకే సమన్వయసమితులు అప్పగించాలని దృఢమైన నిర్ణయం తీసుకోవడం వెనక భవిష్యత్ రాజకీయాలు కూడా ఉన్నాయి. భావోద్వేగంతో 2014 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చింది తెలంగాణ రాష్ట్రసమితి. ప్రస్తుతం అటువంటి సెంటిమెంటు ప్రబావం లేదు. ప్రత్యేకించి గ్రామస్థాయిలో ఇంకా టీఆర్ఎస్ కు బలమైన పునాదులు ఏర్పడలేదు. కేసీఆర్ ఇమేజ్ మీద ఆధారపడే టీఆర్ఎస్ మనుగడ సాగిస్తోంది. గ్రామస్థాయిలో రైతులను టీఆర్ఎస్ వైపు ఆకర్షిస్తే పార్టీ పటిష్ఠమైన నిర్మాణాన్ని సంతరించుకుంటుంది. రైతు సమన్వయసమితుల్లో క్యాడర్ కే చోటుంటుందని స్పష్టం చేసిన నేపథ్యంలో ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు కూడా టీఆర్ఎస్ సభ్యత్వం తీసుకోక తప్పనిపరిస్థితి ఏర్పడుతుంది. అటు రైతులకు, ఇటు పార్టీకి ఇది ఉభయతారకంగా ఉపయోగపడుతుంది. విపక్షాలు గగ్గోలు పెడుతున్నప్పటికీ అసెంబ్లీ వేదికగా ఈ ప్రకటన చేయడంలో కేసీఆర్ ఆంతర్యాన్ని పార్టీ కోణంలోనే చూడాల్సి ఉంటుంది. రైతులకు అండగా ఉంటామన్న భరోసాతోపాటు వచ్చే ఏడాది నుంచి ఆచరణలోకి తేనున్న ఎకరాకు ఎనిమిదివేల రూపాయల పెట్టుబడి నిధిని టీఆర్ఎస్ పాలనకు సానుకూలం చేయాలనే ఉద్దేశంలో కేసీఆర్ యోచిస్తున్నారు.

కౌలు చట్టం కథ కంచికే...

2011లో అమల్లోకి వచ్చిన అధీకృత కౌలు దారు చట్టాన్ని కూడా తోసిరాజంటున్నారు. కౌలుదారు చట్టం ప్రకారం ఎవరైతే సాగు చేస్తున్నారో వారికే ఎరువులు, రాయితీలు, పెట్టుబడి నిధులు రావాల్సి ఉంటుంది. కానీ తాజాగా కేసీఆర్ మాత్రం ఈ చట్టంతో సంబంధం లేకుండా పెట్టుబడి నిధిని పట్టాదారు ఖాతాలోనే జమ చేస్తామంటున్నారు. రైతుల రూపంలో ఓటు బ్యాంకును కన్సాలిడేట్ చేసుకునే వ్యూహంగానే దీనిని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. గ్రామప్రాంతాల నుంచి ఒక 30 శాతం మంది వరకూ రైతులు పట్టణాల్లో నివసిస్తూ తమ పిల్లల చదువులు , ఇతర వ్యాపకాల్లో నిమగ్నమవుతున్నట్లు అంచనా. వీరి పొలాలు కౌలుదార్లే సాగుచేస్తున్నారు. అధికారికంగా ఎటువంటి రాతకోతలు ఉండవు. అందువల్ల ప్రభుత్వం ఇచ్చే నిధులు రైతుల కాతాల్లోకే వెళతాయి. కౌలు దారులకు ప్రభుత్వం నుంచి పైసా సాయం అందదు. వలస బాట పట్టిన రైతుల వల్ల పట్టణ ప్రాంతాల్లో కూడా టీఆర్ఎస్ ఓటు బ్యాంకు పెరుగుతుందని భావిస్తున్నారు. అటు గ్రామాల్లో సమన్వయ సమితులు, ఇటు పట్టణాల్లో ఉన్న వలస రైతులు రెండింటా పార్టీకి ప్రయోజనం సమకూర్చుకోవాలనే పక్కా ఆలోచనతోనే టీఆర్ఎస్ కదులుతోంది. ఈ ఆలోచన ఎన్నికల పంట పండిస్తుందో లేదో 2019 వరకూ వేచి చూడాలి.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News