నెహ్రూ-గాంధీ వార‌సుల‌ కోటలే బీజేపీ టార్గెట్‌

Update: 2017-10-15 15:30 GMT

ఉత్తర‌ప్రదేశ్‌లోని రెండు కీల‌క‌ ఎంపీ స్థానాల‌పై బీజేపీ నేత‌లు పూర్తిగా దృష్టిసారించారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలాగైనా ఈ రెండు స్థానాల్లో గెలిచి తీరాల‌నే దృఢ నిశ్చయంతో ఉన్నారు. 2014 ఎన్నిక‌ల్లో దేశ‌మంతా బీజేపీ గాలి బ‌లంగా వీచి 300 పైచిలుకు స్థానాలు సాధించినా.. ఆ రెండు స్థానాల్లో గెల‌వ‌లేక‌పోయామనే నిరుత్సాహం వారిని వెంటాడుతోంది. అందుకే 2019 ఎన్నిక‌ల్లో అక్కడ కూడా కాషాయ జెండా రెప‌రెప‌లాడించేందుకు ఇప్పటి నుంచే వ్యూహాలు ర‌చిస్తున్నారు. ఆ రెండు స్థానాలు ఏంటంటే.. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఆయ‌న త‌న‌యుడు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న రాయ‌బ‌రేలి, అమేథీ! ఈ కాంగ్రెస్ కంచుకోట‌ల‌ను బ‌ద్దలు కొట్టేందుకు బీజేపీ నేత‌లు సిద్ధమవుతున్నారు!! ఇందుకోసం మోడీ ప్రత్యేకంగా ఈ రెండు స్థానాల‌పై కాన్‌సంట్రేష‌న్ చేస్తున్నారు.

అధికారానికి దూరమై 27 ఏళ్లు....

వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి దేశ‌మంతా బీజేపీ జెండా రెప‌రెప‌లాడాల‌ని ఆ పార్టీ అధ్య‌క్షుడు అమిత్ షా, ప్రధాని మోడీ సంక‌ల్పంతో ఉన్నారు. ఇప్పటికే ఈ దిశ‌గా ప్రణాళిక‌లు ర‌చించి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. 2014 ఎన్నిక‌ల్లో మోడీ హ‌వాతో కాంగ్రెస్ దిక్కుతోచ‌ని స్థితిలో ప‌డిపోయింది. యూపీలో మొత్తం 80 ఎంపీ సీట్లకు బీజేపీ ఏకంగా 72 సీట్లు గెలుచుకున్నా అమేథీ, రాయ‌బ‌రేలీలో నియోజ‌క‌వ‌ర్గాల్లో మాత్రం ఆ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. ఇది మోడీకి అస్సలు మింగుడు ప‌డ‌లేదు. ఇక నాయ‌క‌త్వ లేమి, కుంభ‌కోణాలు.. ఇలా ఆ పార్టీ పరాజయం లో కీల‌క పాత్ర పోషించాయి. ఉత్తర్‌ ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ అధికారానికి దూరమై 27 ఏళ్లు దాటినా.. అమేథీ, రాయ్‌బరేలీ లోక్‌సభ నియోజకవర్గాలు మాత్రం గాంధీ - నెహ్రూ కుటుంబ వారసులకు కంచుకోటలుగా మిగిలాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఎలాగైనా ఈ సీట్లను కైవసం చేసుకోవాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది.

అమేథిలో అత్తెస‌రుతో గ‌ట్టెక్కిన రాహుల్ ....

అమేథీ లోక్ సభా నియోజకవర్గాన్ని 1967లో కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఏర్పాటు చేసింది. ఈ నియోజకవర్గంలో ఇప్పటివరకూ తొమ్మిది సార్లు నెహ్రూ - గాంధీ వారసులు విజయం సాధించారు. ఎమర్జెన్సీ తరువాత జరిగిన 1977లో ఒకసారి. అటల్‌ బిహారీ వాజ్‌పేయి మీదున్న సానుభూతితో మరోసారి కాంగ్రెస్‌ ఇక్కడ ఓటమి పాలైంది. రాజీవ్‌ గాంధీ వరుసగా 1981, 1984, 1989, 1991లో గెలుపొందారు. 1999లో సోనియా గాంధీ విజయం సాధించారు. రాహుల్‌ గాంధీ 2004, 2009, 2014 ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్‌ సాధించారు. గత లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్‌ గాంధీకి స్మృతి ఇరానీ గట్టి పోటీ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో రాహుల్‌ గాంధీ కేవలం 1.08 లక్షల ఓట్ల తేడాతో గెలుపొందారు. నెహ్రూ వారసుల్లో అతి తక్కువ ఓట్లతో విజయం సాధించడం ఇదే ప్రథమం. మోడీ ఈ నియోజ‌క‌వ‌ర్గంపై ప్రత్యేకంగా దృష్టి సారించ‌డంతో రాహుల్ ఇత‌ర నియోజ‌క‌వ‌ర్గాల‌పై దృష్టి పెట్టలేక‌పోయారు. ప్రియాంక అయితే పూర్తిగా ఇక్కడే మ‌కాం వేయాల్సి వ‌చ్చింది.

రాయ్‌బ‌రేలీ సోనియాకు కంచుకోటే...

ఇక రాయ్‌బరేలీ విషయానికి వస్తే.. ఈ నియోజకవర్గం కూడా కాంగ్రెస్‌ పార్టీకి కంచుకోట. 1951లో ఏర్పాటైన ఈ నియోజకవర్గానికి ఇప్పటివరకూ 19 లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. ఇందులో కేవలం మూడు సార్లు మాత్రమే కాంగ్రెస్‌ ఓటమి పాలైంది. ఇక్కడ నుంచి ఫిరోజ్‌ గాంధీ 1951, 1957 ఎన్నికల్లో విజయం సాధించారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ 1967, 1971, 1980 ఎన్నికల్లో గెలుపొందారు. పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ కుటుంబానికి చెందిన అరుణ్‌ నెహ్రూ వరుసగా 1980, 1984 ఎన్నికల్లో గెలిచారు. ప్రస్తుత కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఇక్కడ నుంచి 2004, 2006, 2009, 2014 ఎన్నికల్లో వరుసగా విజయం సాధించారు.

యోగీ కూడా....

ఉత్తరప్రదేశ్‌ నుంచి గత లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ గెలిచిన సీట్లు అమేథీ, రాయ్‌బరేలీ మాత్రమే. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఈ రెండింటిలో దేన్నయినా సాధించాలన్న లక్ష్యంతో బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. ఈ నియోజకవర్గంలో గెలుపొందితే.. అమేథీలోనే కాంగ్రెస్ పార్టీకి ఆదరణ కరువైందని, ఆ నియోజకవర్గ ప్రజల బాగోగులు పట్టించుకోని రాహుల్ గాంధీ దేశాభ్యున్నతి కోసం ఏం చేస్తారని ఎదురు దాడి చేయాలని కమలనాథులు భావిస్తున్నారు. ఇక మోడీతో పాటు యూపీ సీఎం యోగి కూడా ఇక్కడే బాగా టార్గెట్ పెడుతున్నారు. ఏదేమైనా దేశం నుంచే కాంగ్రెస్‌ను త‌రిమికొట్టాల‌ని మోడీ చేస్తోన్న నినాదం ఇప్పుడు ఏకంగా నెహ్రూ ఫ్యామిలీ కంచుకోట‌ల వ‌ర‌కు వెళ్లిపోయింది. మరి బీజేపీ నేత‌ల వ్యూహాలు ఫ‌లిస్తాయో లేదో వేచిచూడాల్సిందే..!

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News