నెంబర్ వన్ విలన్ ఎవరో

Update: 2018-02-24 15:30 GMT

ఒక జాతీయ పార్టీకి ఇటువంటి దుస్థితి ఎవరూ ఊహించి ఉండరు. ప్రతి వేదికపైనా ఒంటరిగా మిగిలిపోతోంది కమలం. తనవాదన అరణ్యరోదనగా మిగులుతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రజల దృష్టిలో బీజేపీని ప్రధాన దోషిగా నిలపడంలో తెలుగుదేశం ఎత్తుగడలు ఫలిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. వామపక్షాలు , ప్రగతిశీల శక్తులు, ప్రజాసంఘాలు, ఉద్యోగ సంఘాలు మరోసారి టీడీపీకి చేరువ అవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎన్నికల లో ఇది ఫలిస్తుందో లేదో చెప్పలేం. కానీ ప్రస్తుతానికి అయితే రాష్ట్రప్రభుత్వం తన తప్పులనుంచి తప్పించుకునే మార్గం బీజేపీ రూపంలో లభించింది. నాలుగేళ్లలో పెద్దగా రాష్ట్రం సాధించిందేమీ లేకపోయినా టీడీపీని తప్పుపట్టకుండా ప్రజల దృష్టి బీజేపీ వైపు మరల్చే ఎత్తుగడలు ఉధృతంగా సాగుతున్నాయి. ఇది పెద్ద సైకలాజికల్ అడ్వాంటేజీగా అధికార తెలుగుదేశం పార్టీకి ఊరట నిస్తోంది. కాగల కార్యం గంధర్వులే తీర్చారన్నట్లుగా తాము తిట్టాలనుకుంటున్న విషయాలను వామపక్షాలు ప్రతివేదికపై వాడిగా,వేడిగా వినిపిస్తున్నాయి. టీడీపీకి సగం పని జరిగిపోతోంది. కాంగ్రెసు, వైసీపీ ఇతర పార్టీలు కూడా బీజేపీని వేలెత్తి చూపకపోతే తాము రాజకీయంగా దెబ్బతింటామనే విషయాన్నిగ్రహించాయి. అందువల్ల ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు విలన్ నెంబర్ ఒన్ గా బీజేపీ పై ముద్ర వేసే ప్రయత్నాలు జోరందుకున్నాయి.

వామపక్షాల వాడి...

ప్రజాబలంలో అంతంతమాత్రమే అయినప్పటికీ ధాటిగా ఉద్యమాలు చేయడంలోనూ లాఠీచార్జీలకు వెరవకుండా ముందుకు వెళ్లడంలోనూ వామపక్షపార్టీలు హుషారు కనబరుస్తాయి. వాగ్ధాటి కనబరిచే నాయకులు కూడా ఈ పార్టీలకు అసెట్ గానే చెప్పాలి. బీజేపీ పేరు చెబితేనే మండి పడటం వామపక్షాల సిద్దాంతం. ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న విచిత్ర పరిస్థితుల కారణంగా ఇంతకాలం వామపక్షాలకు పెద్దగా ఊతం లభించలేదు. వివిధ అంశాలపై ఉద్యమాలు చేపట్టినప్పటికీ ప్రభుత్వం కఠిన వైఖరితో వాటిని సాధ్యమైనంతవరకూ అణచివేసింది. వైసీపీ, టీడీపీలు రెండూ బీజేపీకి అనుకూల పక్షాలుగానే ఉండటంతో వామపక్షాలు చేపట్టిన కేంద్రప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాలకు మద్దతు కూడగట్టడం కష్టంగా ఉండేది. ఇప్పుడు ఆ సమస్యకు కొంతపరిష్కారం లభిస్తోంది. ప్రత్యేక హోదా సెంటిమెంటును వామపక్ష పార్టీలు పెద్ద ఎత్తున పబ్లిక్ డిమాండ్ గా మలచాలని ప్రయత్నిస్తున్నాయి. ఈనెల ఎనిమిదో తేదీన చేపట్టిన వామపక్షాల బంద్ పిలుపు సూపర్ సక్సెస్ కావడానికి అన్ని రాజకీయ పార్టీలు సహకరించాయి. ప్రభుత్వమూ ప్రత్యక్షంగా, పరోక్షంగా మద్దతుగా నిలిచింది. వామపక్షాల్లో కూడా ఒక పోటీ వాతావరణం నెలకొని ఉంది. తెలంగాణలో వివిధ ఉద్యమాలతో సీపీఐని దాటి సీపీఎం ప్రధాన పార్టీగా ఇటీవలి కాలంలో బాగా బలపడింది. అదే ఆంధ్రప్రదేశ్ లో సీన్ రివర్స్ గా ఉంది. సీపీఐ ప్రతి అంశాన్ని ముందుగా కనిపెట్టి ఆందోళనకు దిగుతోంది. సీపీఎం ఈవిషయంలో కొంత ఆలస్యంగా స్పందిస్తోంది. ఇది ఆ పార్టీలోనే అంతర్గత అసంతృప్తికి కూడా దారితీస్తోంది. దీంతో సీపీఎం నాయకత్వం కూడా స్పీడ్ పెంచింది. సీపీఐ, సీపీఎం ప్రత్యేక హోదా విషయంలో పోటాపోటీగా బరిలోకి దిగి రంగాన్ని వేడెక్కిస్తున్నాయి.

బలహీనంగా...

తెలుగుదేశం ప్రభుత్వం బీజేపీసారథ్యంలోని కేంద్రంపై రోజురోజుకీ ఒత్తిడి పెంచుతోంది. సింగిల్ వాయిస్ కాకుండా జాతీయపార్టీ అయిన కాంగ్రెసును కూడా ఆసరాగా చేసుకుంటూ టీడీపీ ధ్వజమెత్తుతోంది.బీజేపీ, టీడీపీలు ఏ1, ఏ2 లు అంటూ ప్రత్యేకహోదా విషయంలో తెలుగుదేశాన్ని కూడా కలిపి నిందించాలని వైసీపీ ప్రయత్నిస్తోంది. కేంద్రాన్ని సమర్థిస్తూ బలమైన వాదన వినిపించాలని బీజేపీ తన క్యాడర్ కు స్పష్టమైన ఆదేశాలే ఇచ్చింది. అందుకు సంబంధించిన సాంకేతిక వివరాలను కూడా అందచేస్తోంది. కానీ వాటిల్లోని లెక్కలు క్యాడర్ నే గందరగోళ పరుస్తున్నాయి. మంజూరైన ప్రాజెక్టుల మొత్తం విలువను ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చేసిన సాయంగా చెప్పాలనే సూచన బీజేపీ నాయకులకే రుచించడం లేదు. ఇలా మంజూరైన ప్రాజెక్టులనే కేంద్ర సాయంగా చెప్పాల్సి వస్తే ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలకు 20 లక్షల కోట్ల ప్రాజెక్టులు , గుజరాత్ కు 15 లక్షల కోట్ల రూపాయలు ఇప్పటికే అందచేసినట్లుగా చెప్పాల్సి వస్తుందంటున్నారు. వాస్తవంగా గ్రౌండ్ అయిన ప్రాజెక్టులను మాత్రమే ప్రజలు విశ్వసిస్తారు. ఆచరణలో కనిపించని రోడ్లు, రైలు మార్గాలు, పోర్టులు, విశ్వవిద్యాలయాలు ఇచ్చేశామంటే నమ్మేంత అమాయకత్వం లేదని సీనియర్ బీజేపీ నాయకులే వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో కాగితాల్లో బీజేపీ చూపుతున్న గణాంకాలు లక్షల కోట్లలో కనిపిస్తుంటే వాస్తవంగా ఆ మొత్తం వేల కోట్లను మించడం లేదు. అందుకే బీజేపీ వాదన బలహీనంగా ప్రతిధ్వనిస్తోంది.

బహిష్కరించాలా...?

రేటింగు ల యావలో ఎమోషనల్ అంశం ఏది దొరికినా వదిలిపెట్టని లక్షణం టీవీ మీడియాకు ఉంది. రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు , ప్రజలు ఆంధ్రప్రదేశ్ కు జరిగిన అన్యాయంపై ఆగ్రహంగా ఉన్నారన్న విషయాన్ని ఎంతవరకూ రేటింగుగా మార్చుకోగలమన్న యావలో పడ్డాయి. దీంతో గోరంతలు కొండంతలు చేసి ప్రచారానికి శ్రీకారం చుడుతున్నాయి. ప్రజల్లో ఉండే భావోద్వేగాలు రెచ్చగొట్టడం ఇందులో అంతర్భాగంగా సాగుతోంది. రాష్ట్రంలోని ప్రతి పెద్ద సెంటర్ లోనూ మీడియా చానళ్లు చర్చలు పెడుతున్నాయి. ప్రతిచోటా బీజేపీని అన్ని పార్టీలు కార్నర్ చేస్తున్నాయి. కేంద్ర వాదనలోని బలహీనతలు బయటపెడుతున్నాయి. పూర్తిగా చర్చలు బహిష్కరిస్తే ఎలా ఉంటుందనే వాదన కూడా అంతర్గతంగా పార్టీలో చోటు చేసుకుంది. కానీ యుద్ధం చేయకముందే చేతులు ఎత్తేసినట్లవుతుందనే సందేహాలను కొందరు వ్యక్తం చేశారు. చర్చలో పాల్గొంటే ఓటమి ఖాయం. పాల్గొనపోతే ఏకపక్ష చర్చల్లో బీజేపీ నిజరూపం ఇదంటూ విపక్షాలు దుమ్మెత్తి పోసే అవకాశం ఉంది. దీంతో ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్లుగా తయారైంది బీజేపీ పరిస్థితి. బీజేపీ వాదనను అంగీకరించేందుకు ఏ పార్టీ కూడా ముందుకు రాకపోవడమూ, పౌరసమాజమూ తీవ్రంగా వ్యతిరేకించడమూ కమలనాథులకు చెమట పట్టిస్తోంది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News