నిజం చెబితే ఒట్టు..అబద్ధాల కనికట్టు

Update: 2017-10-13 16:30 GMT

మోసం, దగా, వంచన, కుట్ర ..ప్రత్యర్థులపై విరుచుకుపడే పదజాలం ఇది. ఇప్పుడు పాఠక,ప్రేక్షకుల దృష్టిలో మీడియా ఎదుర్కొంటున్నఅభిశంసన కూడా అదే. ‘ఎన్ని గజాలు రాశావన్నది కాదు, ఎన్ని నిజాలు రాశావన్నది ముఖ్యం‘ అంటాడు కాళోజీ నారాయణరావు. ఇప్పుడా మాటలను ఎవ్వరూ పట్టించుకుంటున్నదాఖలాలు లేవు. ఎన్ని గంటలపాటు ప్రేక్షకులను టీవీలకు అతుక్కుపోయేలా కూర్చోబెట్టగలిగాము? ఎన్ని పేజీలను రంగురంగుల హింసతో చదివించగలిగాము? అన్నదే ప్రధానం. అత్యాచారాలు, అక్రమ సంబంధాలు, హత్యలు, కుటుంబ కలహాలు, కుల కుమ్ములాటలు, మత మారణ కాండలు నేటి మీడియా ముడిసరుకు. అంగట్లో అమ్ముడు పోయే హాట్ కేకు. అందుకే నిజాల గురించి, నియమాల గురించి , నైతిక విలువల గురించి చర్చే లేదు. చెవి గూబలు పగిలే రచ్చ తప్ప. అన్నీ తమకే తెలిసినట్లు ప్రజలను మోసగించడం, భ్రాంతికి లోను చేయడం ప్రసార, ప్రచురణ మాధ్యమాల మొదటి మాటగా మారింది. పాఠక,ప్రేక్షకులు ఒక అంచనాకు వచ్చే విధంగా దగా చేయడమూ వ్రుత్తిలో అంతర్భాగమై పోయింది. నిజానిజాల సంగతెలా ఉన్నప్పటికీ వాస్తవాలనే వడ్డిస్తున్నామంటూ వంచించడమూ ఒక వార్తా కోణంగా మారిపోయింది. నిందితులు, బాధితులు, ముద్దాయిలు, సాక్షులన్న తేడా లేదు. అనుమానం రేకెత్తించగల ప్రతి అంశమూ అస్త్రమే. నేర నిరూపణతో సంబంధం లేకుండానే బురద జల్లి బూడిద పూసి దోషులుగా సమాజం ముందు నిలబెట్టే కుట్రలోనూ కొత్త కోణాలనూ వెదుక్కొంటోంది మీడియా. మీడియా ట్రయల్ లో ఒక్కసారి దోషులుగా ముద్ర పడి సమాజం ముందు చులకన అయిపోయిన తర్వాత చేసేదేం లేదు. నిర్దోషులుగా సాధికార న్యాయస్థానాలు తీర్పు చెప్పినా అప్పటికే జీవచ్చవాలుగా మిగిలిపోతారు. తాము స్రుష్టించిన గందరగోళం, కలకలం, సంచలనం ఎక్కడ చిన్నదై పోతుందో? తమను ప్రజలు ఎక్కడ విశ్వసించకుండా పోతారో అనే జంకుతో న్యాయస్థానాల తీర్పులకూ మీడియా పెద్దగా ప్రాధాన్యం ఇవ్వదు. ఏదో మూలన చిన్న వార్త ప్రచురించి వదిలేస్తుంది. నాన్ ప్రైమ్ టైమ్ లో ఒక నిముషం ప్రసారం చేసేసి చేతులు దులిపేసుకుంటుంది. గతంలో దోషులుగా మీడియా కక్ష కట్టి చూపిన వారు నిర్దోషులుగా నిరూపణ అయినా అంతే సంగతులు. చేసేదేం లేదు. మీడియా బాధితుల గోడు అరణ్య రోదనే. తాము చేసిన తప్పులకు కనీసం క్షమాపణ కూడా చెప్పుకోదు నేటి భారతీయ పత్రికా, ప్రసార మాధ్యమం.

ఆరుషి... ఓ అమ్మా నాన్న ...

మీడియా ట్రయల్ అనే పదం ఈరోజున దేశాన్ని పట్టి కుదిపేస్తోంది. విచ్చలవిడిగా పుట్టుకొచ్చిన టీవీ చానళ్లు, పత్రికలు తమ రేటింగులు పెంచుకోవడానికి, నాలుగు కాపీల సర్క్యులేషన్ అందుకోవడానికి, నిలుపుకోవడానికి పోటీలు పడి సంచలనాలు స్రుష్టిస్తున్నాయి. ప్రసార , ప్రచురణ మాధ్యమాలు న్యాయవ్యవస్థకు సమాంతరంగా జడ్జిమెంటులు ఇచ్చేస్తున్నాయి. ఏ నేరమైనా నాలుగు దశల తర్వాత నిరూపితం కావాల్సి ఉంటుంది. కేసు నమోదు,దర్యాప్తు అంశాలను పోలీసు శాఖ చూసుకుంటుంది. వారు సమర్పించిన సాక్ష్యాధారాల విచారణ, అనంతరం తీర్పు బాధ్యతలను న్యాయస్థానం చూస్తుంది. అప్పుడే నేరం నిర్ధారణ అయినట్లు లెక్క. మీడియాకు మాత్రం ఇవేమీ అక్కర్లేదు తానే పోలీసు, తానే జడ్జి. నేరం జరిగినప్పట్నుంచి ఎలా జరిగిందో తేల్చేస్తుంది. నిందితులను విచారించేస్తుంది. తీర్పు చెప్పి, నేరాన్ని నిర్ధారించేస్తుంది. ప్రజల భావోద్వేగాలు, బలహీనతలను ఆసరాగా చేసుకుంటూ నేరాల పట్ల ఉండే ఆసక్తే ప్రాతిపదికగా మీడియా ఒక ప్రత్యామ్నాయ వ్యవస్థగా రూపాంతరం చెందింది. ఈ మీడియా విచారణ పోలీసు, న్యాయ వ్యవస్థలపై తీవ్ర ఒత్తిడికి కారణమవుతోంది. ఉత్తరప్రదేశ్ లోని నోయిడాలో 14 సంవత్సరాల చిన్నారి ఆరుషి 2008లో హత్యకు గురైంది. ఆమెతో పాటు పనిమనిషి హేమరాజ్ కూడా హత్యకు గురయ్యాడు. ఆ ఇంట్లోకి వేరేవారెవరూ చొరబడే అవకాశం లేదు కనుక ఆ పాపకు, హేమరాజ్ కు సంబంధం అంటకట్టేశారు. చావుకు అదే కారణమని తేల్చేశారు. తల్లిదండ్రులు నుపుర్ , రాజేశ్ తల్వార్లే హత్యకు ఒడిగట్టారంటూ నిర్ధారణకు వచ్చేశారు. పరువు హత్య అనేది మీడియా రేటింగుకు కాసుల వర్షం కురిపించే ఎలిమెంటు. కన్న బిడ్డనే చంపడమంటే మానవ భావోద్వేగంతో కూడిన అంశం. దీంతో పరువు హత్య చుట్టూ చిలువలు పలవలు చేర్చి ప్రత్యక్ష ప్రసారాలతో దేశాన్ని హోరెత్తించారు. ఈ సంఘటనలో ఏం జరిగి ఉంటుంది? ఏం జరగబోతోంది? ఏం జరుగుతూ ఉంది? వంటి భూత, భవిష్యత్, వర్తమానాలను కలగలిపి మీడియా ట్రయల్ మొదలైంది. తీవ్రమైన ఒత్తిడికి గురైన ఉత్తరప్రదేశ్ పోలీసులు సాక్ష్యాధారాల సేకరణను పక్కనపెట్టి మీడియా కోణంలోనే ముందుకు పోయారు. బొక్క బోర్లా పడ్డారు. నేర పరిశోధన కు సంబంధించి ఏ మాత్రం వృత్తి నైపుణ్యం, అవగాహన లేని వారు చేసే వ్యాఖ్యానాలను నమ్ముకుంటే మొదటికే మోసం వస్తుందన్న తత్వం యూపీ పోలీసులకు బోధ పడింది. అప్పటికే సమయం మించి పోయింది. ఆ తర్వాత ఈ కేసు దర్యాప్తు పై సీబీఐ రంగంలోకి దిగింది. నిరూపిత ఆధారాలు లేవంటూనే సర్కమస్టాన్సియల్ ఎవిడెన్సు అంటే పరిస్థితుల ప్రాతిపదికగా తల్లిదండ్రులే హత్యకు పాల్పడి ఉండొచ్చని దర్యాప్తులో తేల్చేశారు. దానిపై సీబీఐ న్యాయస్థానం కూడా ఒక అవగాహనకు వచ్చి రాజేశ్ తల్వార్, నుపుర్ తల్వార్లకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. తాజాగా ఈ తీర్పును అలహాబాద్ హైకోర్టు కొట్టి వేస్తూ ఆరుషి తల్లిదండ్రులను నిర్దోషులుగా విడుదల చేసింది. హత్య చేశారనడానికి తగిన సాక్ష్యాధారాలు లేకుండా కేవలం పరిస్థితులు, మానవ ఉద్దేశాలు ప్రాతిపదికగా శిక్ష విధించలేమంటూ బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద తల్లిదండ్రులను నిర్దోషులుగా ప్రకటించింది.

హోవర్ క్రాప్ట్ మీడియా ..హల్ చల్

అసలు ఈ కేసు విషయంలో మీడియా ఎక్కడ తప్పటడుగు వేసిందనేది ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అంశం. అత్యుత్సాహం, అతి పోటీ తత్వంతో మీడియా తన పాత్రను,పరిధిని మించి వ్యవహరిస్తోంది. తనకు అతీతమైన అధికారాలున్నట్లుగా అసాధారణ శక్తిగా ప్రవర్తిస్తోంది. నిజానికి రాజ్యాంగంలో పౌరులందరికీ కల్పించిన భావవ్యక్తీకరణ స్వేచ్చలోని భాగమే మీడియాకు కూడా వర్తిస్తుంది. అంతకుమించి అధికారాలేమీ లేవు. అయినా ప్రజలకు సమాచారం తెలుసుకునే హక్కు ఉంటుంది. అందుకనుగుణంగా ఒక సంఘటన చోటు చేసుకున్నప్పుడు ఆ విషయాన్ని వివరించడం మీడియా కర్తవ్యం. దాంతోపాటు విషయ తీవ్రతను బట్టి పరిశోధక సంస్థలనుంచి అదనపు సమాచారాన్ని సేకరించి ఇవ్వవచ్చు. అంతకంటే కూడా ఆసక్తి ఉంటే ఈ తరహా కేసుల పూర్వాపరాలను అందించవచ్చు. పదవీ విరమణ చేసిన నిపుణులను సంప్రతించి దర్యాప్తుపై అవగాహన పెంచుకుని తమ అభిప్రాయాన్ని జోడించవచ్చు. కానీ ఆరుషి హత్య విషయంలో కేసు నమోదు మొదలు దర్యాప్తు, విచారణ, తీర్పు వరకూ మీడియా సకలం తానై సంచలనం సృష్టించింది. తల్వార్ దంపతులే హత్య చేశారన్న బలమైన ముద్ర ప్రజల్లో నాటుకుపోయేలా ప్రసార, ప్రచురణలు సాగించారు. ఒక దశలో మీడియా కథనాలకు వ్యతిరేకంగా దర్యాప్తు చేయాలంటే పోలీసులే హడలెత్తిపోయారంటే అతిశయోక్తి కాదు. చివరికి ఉన్నత న్యాయస్థానంలో కేసు వీగిపోయింది. ఇప్పుడు ఇండియాలో హోవర్ క్రాఫ్ట్ జర్నలిజం దశ కొనసాగుతోందని ఒకానొక సందర్బంలో ప్రముఖ పాత్రికేయులు అరుణ్ పురి వ్యాఖ్యానించారు. ఉపరితలాన్ని పైపైన చిలికేసి తోచింది చెప్పేయడమే తప్ప లోతుల్లోకి వెళ్లి పాఠకులకు మరింత విలువైన సమాచారాన్ని అందివ్వాలన్న ఆసక్తి, బ్యాలెన్సు లోపించిందనేది ఆయన వ్యాఖ్యల సారాంశం. ఒక వైపు ఒక్కగానొక్క బిడ్డను కోల్పోయి మరోవైపు హత్యాభియోగ నేరాన్ని ఎదుర్కొంటూ ఆ దంపతులు పడిన వేదన, మానసిక క్షోభకు బదులెవరు చెబుతారు? ‘ఇజం ఎరిగిన వాడు నిజం చెప్పని నాడు ప్రజకు జరుగును కీడు‘ అంటారు ఆరుద్ర. ఆ ఇజాల జర్నలిజంలో నిజాలనే మీడియా ప్రతిబింబిస్తుందని భవిష్యత్తులోనైనా భరోసా లభిస్తుందంటారా?

 

- ఎడిటోరియల్ డెస్క్

Similar News