నారా...నారా...నడుమ

Update: 2018-03-03 15:30 GMT

చంద్రబాబుకు ఒక కొత్త చిక్కొచ్చి పడింది. తాను ఇన్నాళ్లు ఏ మీడియాను అనుకూలంగా వాడుకున్నారో అదే మీడియా ఇప్పుడు తనపై పెత్తనం చెలాయించాలని చూస్తోంది. రెండు ప్రధాన గ్రూపులు చెరోవైపు ఇన్ఫ్లూయన్స్ చేసేందుకు ప్రయత్నించడం బాబుకు ఇరకాటంగా మారుతోంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి గ్రూపులు చంద్రబాబుకు రాజకీయంగా వేర్వేరు మార్గాలు సూచిస్తూ తమదే సరైన పంథా అంటూ సలహాలిస్తున్నాయి. రెండూ పరస్పర విరుద్దమైన సూచనలు కావడంతో సీఎం ఎటూ తేల్చుకోలేక సతమతమవుతున్నారు. బీజేపీతో తెగతెంపులు భవిష్యత్తులో ఇబ్బంది కరమనేది ఈనాడు సలహా. పరోక్షంగా రామోజీరావు మార్గనిర్దేశం. కమలంతో తాడోపేడో తేల్చేసి థర్డ్ ఫ్రంట్ కడితే బాగుంటుందనేది ఆంధ్రజ్యోతి ఆలోచన. తెలుగు రాష్ట్రాల పొలిటికల్ వింగ్ లో చక్రం తిప్పుతున్న రాధాకృష్ణ ఇస్తున్న విలువైన సలహా ఇది. ఇవి రెండూ తెలుగు పాఠక, ప్రేక్షకులను విస్తృతంగా ప్రభావితం చేయగల ప్రధాన మీడియా గ్రూపులు . ఏ గ్రూపు సలహాను ఆచరించినా మరో గ్రూపు నుంచి కొంత వ్యతిరేకత, విముఖత తప్పదు. అంతేకాకుండా వీటిలో ఏదో ఒక సలహా టీడీపీకి కచ్చితంగా నష్టం కలిగిస్తుంది. మరొకటి రాజకీయ ప్రయోజనం చేకూరుస్తుంది. పార్టీకి మంచిచేసేదేమిటి? చెడు కలిగించేదేమిటన్న విషయం పసి గట్టడం ఇప్పుడు చంద్రబాబు ముందున్న తక్షణ కర్తవ్యం.

ఈనాడు ఆసక్తులు...

తొమ్మిదో దశకం మధ్యలో చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా పదవిని అధిష్టించడంలో ఈనాడు పోషించిన పాత్ర చాలా కీలకమైనది. అసాధారణ ప్రజాదరణ కలిగిన ఎన్టీరామారావుకు వ్యతిరేకంగా అతని కుటుంబసభ్యులు గుంపుకట్టి ఎమ్మెల్యేలను సమీకరించిన ఘట్టం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో రికార్డుకెక్కింది. టీడీపీలో రెండు గ్రూపులకు నాయకత్వం వహిస్తున్న చంద్రబాబు, దగ్గుబాటి వెంకటేశ్వరరావులు చేతులు కలిపిన ఆ సందర్భంలో దాదాపు ఎమ్మెల్యేలంతా అటువైపే ఉన్నారన్న భావన కల్పించడంలో ఈనాడు తన అక్షరాయుధాలను ప్రయోగించింది. ఎన్టీరామారావు వైపు ఉన్న ఎమ్మెల్యేలు, తటస్థంగా ఉన్న ఎమ్మెల్యేలు కూడా అల్లుళ్ల వర్గం వైపు రాకతప్పని పరిస్థితికి ఈనాడు వార్తలు దోహదం చేశాయి. అంతకుముందు నుంచే ఈనాడు అధినేత రామోజీరావుతో చంద్రబాబు సత్సంబంధాలు నెరపుతున్నారు. ఈ ఘటన తర్వాత ఆ బంధం మరింత బలపడింది. రామోజీరావు ఏమి చెబితే అదే బాబు సర్కారులో అమలవుతుందన్న భావన వ్యాపించింది. 1998లో కేంద్రంలో బీజేపీకి మద్దతివ్వడం,1999లో ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవడం కూడా రామోజీ సూచనలు, సలహా మేరకే సాగాయనేది జగమెరిగిన సత్యం. రామోజీ మాటకు ఈనాటికీ చంద్రబాబు చాలా విలువనిస్తారు. కానీ 2015 నుంచీ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ప్రాబల్యం తెలుగు రాష్ట్రాల్లో బలపడుతూ వస్తోంది. అటు చంద్రబాబు నాయుడికి, ఇటు కేసీఆర్ కు అత్యంత విశ్వాసపాత్రుడైన మీడియా మిత్రునిగా రాధాకృష్ణ రూపుదాల్చారు. ఈనేపథ్యంలో ఈనాడు రామోజీ ప్రభావాన్ని మించి రాధాకృష్ణ హవా తెలుగు సర్కారుల్లో కొనసాగుతోందనేది రాజకీయ వర్గాల అంచనా.ఇది ఇప్పుడు ఈనాడు రామోజీకి ఇబ్బందికరంగా మారింది. కేంద్రంతో సత్సంబంధాలు ఈనాడు గ్రూపుకు చాలా అవసరం. రిలయన్స్ వంటి సంస్థల పెట్టుబడులూ ఈనాడులో అగ్రభాగం ఆక్రమిస్తున్నాయి. అందుకే రాజకీయంగా చంద్రబాబు బీజేపీతో సన్నిహితంగానే ఉండాలని రామోజీరావు భావిస్తున్నారంటున్నారు. పొత్తు తెగతెంపులు చేసుకోవాలనుకుంటున్న టీడీపీ వైఖరిని ఆయన సమర్థించలేకపోతున్నారనేది వాదన.

ఆంధ్రజ్యోతి ఆలోచనలు...

చంద్రబాబు నాయుడు 1995లో అధికారం చేపట్టడంలో రాధాకృష్ణ కూడా క్రియాశీలకంగా నే వ్యవహరించారు. అయితే ఆయన అప్పట్లో ఒక విలేఖరి మాత్రమే. అందువల్ల మధ్యవర్తి మంతనాలు, వార్తల కవరేజీ కి పరిమితమయ్యారు. నిర్ణయాలను శాసించే స్థాయిలో లేరు. కానీ అప్పటి పరిచయాలతో చంద్రబాబుకు చేరువ కాగలిగారు. ఆంధ్రజ్యోతి యాజమాన్యాన్ని రాధాకృష్ణ చేపట్టడంలో చంద్రబాబు మద్దతు అంతా ఇంతా కాదు. పార్టీకి చెందిన కొందరు అందులో తొలిదశలో పెట్టుబడులు పెట్టడంలోనూ చంద్రబాబు సహకరించారు. 2004-14 మధ్యకాలంలో తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ పార్టీకి రాధాకృష్ణ తన పత్రిక ద్వారా సాధ్యమైనంతమేరకు సహకరించారు. సలహాలిస్తూ మార్గదర్శకంగా కూడా నిలిచారు. 2014 తర్వాత చంద్రబాబు సర్కారులో ఆంధ్రజ్యోతి మాట చెల్లుబాటు కావడం మొదలైంది. రామోజీరావు తనవద్దకు వచ్చిన వారికిమాత్రమే సలహాలు ఇస్తారు. అది కూడా ఆచితూచి వ్యవహరిస్తారు. కానీ రాధాకృష్ణ శైలి వేరు. తాను విశ్వసించిన విషయాన్ని తన కాలం కొత్తపలుకులో వెల్లడించడంతోపాటు నేరుగా చంద్రబాబు, కేసీఆర్ కు కూడా సలహాలిస్తుంటారు. దీంతో వారికీ, ఆయనకు మధ్య అనుబంధం బలపడింది. మోడీ వంటి వ్యక్తిని నిలువరించి 2019లో తిరిగి అధికారం సాధించాలంటే ఈసారి బీజేపీతో కలిసి పోటీ చేయకూడదనేది ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఆంతరంగిక సలహాగా టీడీపీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. అవసరమైతే కేసీఆర్ , ప్రాంతీయ పార్టీలతో కలిసి మూడో ఫ్రంట్ ను తెరమీదకు తెస్తే బాగుంటుందనేది కూడా జ్యోతి యోచనగా చెబుతున్నారు. దానికి చంద్రబాబు నాయుడు వంటి అనుభవజ్ణుడు నేతృత్వం వహిస్తే జాతీయంగా ప్రభావం ఉంటుందనేది రాధాకృష్ణ విశ్లేషణగా పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది.

బాబుకు బంధనాలు....

అటు రామోజీరావు మనోభావాన్ని తెలుసుకుని ప్రవర్తించడమా? లౌక్యంగా బీజేపీతో కొనసాగుతూనే పనులు చక్కబెట్టుకోవడమా? లేక రాధాకృష్ణ అంచనా ప్రకారం భవిష్యత్తులో బలమైన ఫ్రంట్ కు పునాదులు వేయడమా? అన్న సందిగ్ధ పరిస్థితుల మధ్య చంద్రబాబు కొట్టుమిట్టాడుతున్నారనేది టీడీపీ వర్గాలు అందచేస్తున్న సమాచారం. ఒకవేళ బీజేపీతో తెగతెంపులు చేసుకున్నా రామోజీరావు బహిరంగంగా వ్యతిరేకత వ్యక్తం చేసే అవకాశం లేదు. కానీ రాధాకృష్ణ సలహాను పెడ చెవిన పెడితే టీడీపీ దెబ్బతింటుందని తన కాలంలో స్పష్టంగా నే చెప్పేస్తారు. బలమైన అభిప్రాయం నెలకొనేందుకు కూడా తన మీడియాను వినియోగిస్తారు. ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్లుగా మారింది చంద్రబాబు పరిస్థితి. అందుకే కేంద్రంతో పోరాటం అంటున్నప్పటికీ స్పష్టమైన కార్యాచరణ, విధి విధానాలను చంద్రబాబు ప్రకటించలేకపోతున్నారనేది రాజకీయ వర్గాల విశ్లేషణ.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News