నాయకా, ఖర్చెవరి ఖాతాలో ..?

Update: 2017-11-03 15:30 GMT

యువజన,శ్రామిక,రైతు కాంగ్రెసు అధినేత జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ లో భారీ పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. 2019 ఎన్నికకు ఒక సన్నాహక రాజకీయ కార్యాచరణగా దీనిని పార్టీ వర్గాలు అభివర్ణిస్తున్నాయి. రాష్ట్రంలోని 13 జిల్లాల మీదుగా 3 వేల కిలోమీటర్లు ఏడునెలల పాటు సాగే ఈ యాత్ర పొలిటికల్ సెగలు పుట్టించబోతోంది. ఇదంతా బహిరంగంగా కనిపించే అంశం. పార్టీ అంతర్గతంగా మరో కోణంలో విస్త్రుత చర్చ సాగుతోంది. పాదయాత్ర వ్యయానికి సంబంధించి మల్లగుల్లాలు పడుతున్నారు. అధినేత పర్యటన సందర్బంగా అయ్యే ఖర్చులు, భోజన ఏర్పాట్లు, వసతి తదితర వ్యయాన్ని స్థానిక నాయకులే భరించాలని ఇప్పటికే వైసిపి నాయకత్వం స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. దీనిని ఏ రకంగా పంచుకోవాలనే విషయంలో ద్వితీయ శ్రేణి నాయకత్వంలో కొంత సందిగ్ధత తలెత్తుతోంది. జిల్లా నాయకత్వం, ఎంపీ అభ్యర్థులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ ఛార్జులు ఏ దామాషాలో ఖర్చులను భరించాలనే విషయంలో ఒక అవగాహనకు రాలేకపోతున్నారు. అగ్రనాయకత్వమూ వాటాలను తేల్చడం లేదు.

క్యాష్ కొట్టేదెవరు....?

జగన్ తో పాటు పర్యటనలో పాల్గొనే నాయకులు, పార్టీ క్యాడర్, స్థానికులను మూడు బృందాలుగా వర్గీకరిస్తున్నారు. జగన్ ను తొలి నుంచి చివరి వరకూ వెన్నంటి ఉండే సెక్యూరిటీ సిబ్బంది, వ్యక్తిగతంగా ఏర్పాటు చేసుకున్న రక్షణ కార్యకర్తలు తొలి అంచె గా ఉంటారు. వీరి సంఖ్య 80మంది వరకూ ఉంటుంది. పాదయాత్రకు సంబంధించి గైడ్ చేస్తూ , ఎప్పటికప్పుడు ఫీడ్ బ్యాక్ అందించే ద్వితీయశ్రేణి నాయకత్వం కూడా ఆయన పర్యటనలో అంతర్భాగంగా ఉంటుంది. వీరి సంఖ్య 25 మంది. పాదయాత్ర విధివిధానాలు పార్టీకి సంబంధించి సమాచారంతో పాటు కేంద్రస్థాయి అనుసంధానం చేసే అగ్రనాయకత్వం పదిమందివరకూ ఉంటారు.వీరు అప్పుడప్పుడూ పర్యటనలో పాల్గొంటారు. పొలిటికల్ ఫీడ్ బ్యాక్, పర్యటనలో మార్పులు చేర్పులకు సంబంధించిన నిర్ణయాలను జగన్ తో సంప్రతించి ఈ కీలక బృందమే ఖరారు చేయనుంది. దాదాపు ఏడునెలలపాటు నాయకుడు ప్రజల్లోనే ఉంటారు కాబట్టి కీలకమైన సమావేశాలను కూడా ఆయన సమక్షంలో జిల్లాల్లోనే జరపాలని భావిస్తున్నారు. ఈ సమావేశాల్లో మాత్రం అగ్రనాయకులందరూ పాల్గొంటారు. ఈ పాదయాత్ర, ప్రజాసమూహం కలగలిసి ఒక మాస్ ఇమేజ్ ఏర్పడాలనేది లక్ష్యం . అందువల్ల జగన్ వెంట నడిచే ప్రజలకు పరిమితులు లేవు. స్థానికంగా 12 నుంచి 15 వందల మంది కార్యకర్తలు, ప్రజలు ఆయనతో కలిసి కదులుతారని అంచనా వేస్తున్నారు. వీరు మాత్రం ఎప్పటికప్పుడు మారుతూ ఉంటారు. మొత్తమ్మీద జగన్ పాదయాత్రలో కనీసం 15 వందల మందికి భోజనాలు,అల్పాహారాలు, ఏర్పాట్లు నిత్యం చూడాల్సి ఉంటుంది. మొత్తం 125 నియోజకవర్గాల్లో సాగే పర్యటనలో ఒక్కో నియోజకవర్గానికి కోటి రూపాయల వరకూ వ్యయం అయ్యే అవకాశం ఉంది. దీనిని ఎలా భరించాలని స్థానిక నాయకులు మొత్తుకుంటున్నారు. అధిష్టానం నుంచి సలహాలు, సూచనలు , ఆదేశాలే తప్ప క్యాష్ కొట్టే పరిస్థితి లేదని పార్టీ నాయకులు చెబుతున్నారు. పార్టీ అధికారంలో లేకపోవడంతో గడచిన నాలుగు సంవత్సరాలుగా ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ ఛార్జులు సొంత ఖర్చులతో పార్టీ వ్యవహారాలను నిర్వహిస్తున్నారు. ఇప్పుడు పాదయాత్ర భారం, తర్వాత ఎన్నికల ఖర్చులు మా వల్ల కాదంటున్నారు.

వై.ఎస్. , బాబుల తో పోలిస్తే...

రాష్ట్రంలో పాదయాత్రతో అధికార గమ్యాన్ని చేరుకున్న నాయకునిగా తొట్టతొలుత వై.ఎస్.రాజశేఖరరెడ్డి పేరు చెప్పుకోవాలి. 2003లో ఆయన ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టిన 1470 కిలోమీటర్ల పాదయాత్ర వై.ఎస్.కు మాస్ లీడర్ గా ఇమేజ్ తెచ్చిపెట్టింది. అప్పట్లో ఆ పాదయాత్రకు చేసిన ఖర్చు నాలుగు కోట్లరూపాయలు మాత్రమే. సెక్యూరిటీ అంతంతమాత్రమే. నాయకులు, కార్యకర్తలు కలిసి వందలోపు ఉండేవారు. అప్పటికి తొమ్మిదేళ్లుగా కాంగ్రెసు అధికారంలో లేకపోవడంతో స్థానిక నాయకులు చిన్నాచితక ఖర్చులే చూసుకోగలిగారు. ప్రధానవ్యయం బాధ్యతను లగడపాటి రాజగోపాల్ తీసుకున్నారు. 2012 -13లో చంద్రబాబు చేపట్టిన 2800 కిలోమీటర్ల 208 రోజుల పాదయాత్ర అప్పట్లో ఒక రికార్డు. రాజు వెడలె అన్నట్లుగా మహార్భాటంగా సాగిందీ పాదయాత్ర. అయిదు వందల నుంచి ఆరువందల మంది వరకూ ఆయన వెంట కలిసి కదిలేవారు. కనీసం వెయ్యిమందికి భోజన ఏర్పాట్లు చూడాల్సి వచ్చేది. వందకు తక్కువ కాకుండా వాహనాల శ్రేణి పాదయాత్రను అనుసరించేది. మొత్తంగా ఈ పాదయాత్ర ఖర్చులో కూడా రికార్డు సృష్టించింది. 120 నుంచి 130 కోట్ల రూపాయల మేరకు ఖర్చు చేసినట్లుగా అంచనా. సుజనా చౌదరి, సీఎం రమేష్, నామా నాగేశ్వరరావు, కేశినేని నాని వంటి పారిశ్రామిక, వ్యాపారవేత్తలు ఖర్చును భరించారు. స్థానికంగా నాయకులు చేసిన ఖర్చు దీనికి అదనం. వై.ఎస్. , బాబు పాదయాత్రల్లో ప్రధాన ఖర్చును పారిశ్రామిక,వ్యాపార వర్గాల్లో కీలకమైన వారికి మాత్రమే అప్పగించడం వల్ల స్థానిక పార్టీ నేతలపై పెద్దగా భారం పడలేదు. జనసమీకరణ, ప్రచారం విషయాలు మాత్రం నియోజకవర్గ నాయకులు చూసుకున్నారు. జగన్ విషయంలో సీన్ రివర్సుగా మారుతోంది. పాదయాత్రకు పెట్టుబడి పెట్టే ప్రధాన వనరును పార్టీ చూడకుండా స్థానిక నాయకత్వాలకు అప్పగించడం వల్ల చేతిచమురు వదిలిపోతోందనే గొడవ ప్రారంభమయ్యింది. టిక్కెట్ల గురించి గ్యారంటీ ఇవ్వాలని కొందరు డిమాండ్లు పెడుతున్నారు. పార్టీకి ఇది భవిష్యత్తులో పెద్ద తలనొప్పిగానే చెప్పుకోవాలి. 2014 ఎన్నికల్లో సైతం పార్టీకి భారీగా విరాళాలు ఇచ్చి టిక్కెట్లు పొందామంటున్న నాయకుల సంఖ్యకూ కొదవలేదు. దీంతో పార్టీ అధినేత కార్యక్రమాన్ని స్వచ్ఛందంగా స్పాన్సర్ చేయడానికి ద్వితీయశ్రేణి నాయకులు వెనకాడుతున్నారు. వై.ఎస్., చంద్రబాబులు పాదయాత్ర ఖర్చు స్పాన్సర్ల సంఖ్యను పరిమితం చేసుకోవడంతో టిక్కెట్ల పంపిణీపై పాదయాత్ర ఒత్తిడి పడలేదు. ఈ విషయంలో సీనియారిటీ , పార్టీ నడపటంలో అనుభవం వారికి కలిసొచ్చింది. మరి జగన్ విషయంలో అలా జరగడం లేదు. టిక్కెట్ల పంపిణీలో జగన్ కు ఇబ్బందులు తప్పేట్లులేవు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News