నానోకు...నమో... ఇదేంటి చెప్మా...!

Update: 2017-11-29 17:30 GMT

పేదల పేరు చెప్పి అధికారంలోకి వచ్చే పార్టీలు ఆచరణలో వారికి ఒరగపెట్టిందేమీ ఉండదు. ఒకటీ అరా సంక్షేమ, అభివృద్ధి పథకాలు ప్రవేశపెట్టి ప్రచారమోత మోగించడం తప్ప వారి అభ్యున్నతికి త్రికరణ శుద్ధిగా, చిత్తశుద్ధిగా పనిచేయడం సత్యదూరం. తెరవెనుక రాయితీలు, సబ్సిడీలు, రుణాలు, ప్రోత్సాహకాల పేరుతో పెద్దలు, పారిశ్రామికవేత్తలకే చేయూత నందిస్తాయి. ఇది చేదు నిజం. దాదాపు ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఇంతే. ఎవరూ మినహాయింపు కాదు. కార్పొరేటర్ వర్గాలతో సాన్నిహిత్యం గల బీజేపీ, ప్రస్తుతం ఆపార్టీని నడిపిస్తున్న ప్రధాని మోడీ ఈ విషయంలో ఇతర పార్టీలు, ప్రభుత్వాల కన్నా ఒక అడుగు ముందే ఉన్నారు. ఒక్కసారి టాటాకంపెనీ ప్రారంభించిన నానో కార్ల ఫ్యాక్టరీ పూర్వాపరాలను పరిశీలిస్తే గుజరాత్ ముఖ్యమంత్రి హోదాలో 2000 దశకంలో నరేంద్ర మోడీ ఆ సంస్థకు ఎంత లబ్ది చేకూర్చారో అర్ధమవుతుంది. పన్నుల రూపంలోని ప్రజాధనాన్ని ఈ పారిశ్రామిక సంస్థకు ఎంత ఉదారంగా ఇచ్చారో స్పష్టమవుతోంది.

ఎన్ని రాయితీలు...ఎన్ని సబ్సిడీలు...

ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా సామాన్యుడికి సరసమైన ధరతో కారు అందించాలన్న సదుద్దేశ్యంతో నానో కార్ల కంపెనీని ప్రారంభించాలని నిర్ణయించారు. అప్పటి పశ్చిమ బెంగాల్లోని వామపక్ష ప్రభుత్వం ప్లాంట్ కు అవసరమైన స్థలం అందించడంలో విఫలమైంది. ఇదే అదనుగా నాటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ టాటాను సాదరంగా ఆహ్వానించారు. స్థలం, విద్యుత్తు, నీరు వంటి మౌలిక వసతులను కల్పించారు. ప్లాంట్ వల్ల స్థానికులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని, రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందన్న ముందుచూపుతో టాటాలకు స్వాగతం పలికారు. అహ్మదాబాద్ జిల్లాలోని సనద్ ప్రాంతంలో ఏర్పాటు చేసన ప్లాంట్ ను 2008 నవంబర్ లో స్వయంగా మోడీనే ప్రారంభించడం విశేషం. ఏటా రెండున్నర లక్షల కార్లను ఉత్పత్తి చేయగలమన్నది అప్పట్లో లక్ష్యం. భవిష్యత్తులో దాని సామర్ధ్యాన్ని మూడున్నర లక్షలకు పెంచాలన్నది టార్గెట్ గా పెట్టుకున్నారు. 725 ఎకరాల్లో నిర్మించిన ప్లాంట్ లో సకల సౌకర్యాలు కల్పించారు. కేవలం లాభార్జనే తమ ధ్యేయం కాదని సామాన్యుడికి చౌకధరకు కారు అందించాలనే తమ లక్ష్యమని అప్పట్లో రతన్ టాటా ఘనంగా ప్రకటించారు. అన్ని పన్నులతో కలిపి సుమారు లక్షన్నరకు కారు అందించాలన్నది అప్పటి లక్ష్యం. కార్పొరేట్ సామాజిక బాధ్యత లో భాగంగా ప్లాంట్ పరిసర గ్రామాల అభివృద్ధికి టాటా ప్రతిన చేశారు. ప్లాంట్ కు 20 కిలోమీటర్ల పరిధిలోని గ్రామాల్లో విద్య, వైద్య, ఉపాధి అవకాశాలకు కృషి చేస్తానని ప్రకటించారు. ప్లాంట్ వల్ల పర్యావరణానికి హాని కలగకుండా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఆ దిశగా కృషి చేశారు కూడా. ప్రత్యక్షంగా ప్లాంట్ లో 2400 మందికి ఉపాధి కల్పించారు. ఐటీఐ విద్యార్థులకు ఉద్యోగాలు ఇచ్చారు.

33 వేల కోట్ల రాయితీలు....

నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని నాటి గుజరాత్ సర్కార్ర కూడా నానో ప్లాంట్ కు ఉదారంగా సాయం ప్రకటించింది. ఏకంగా 33 వేల కోట్ల రూపాయాల రాయితీలను మంజూరు చేసింది. ఇంతగా ఒక పారిశ్రామిక సంస్థకు రాయితీలు ఇవ్వడం అరుదు. ఆచరణలో నానో కార్లు మార్కెట్ లో విజయవంతం కాకపోవడంతో ప్రభుత్వం ఇచ్చిన 33 వేల కోట్ల రూపాయల రాయితీ వృధా అయింది. ప్రజాధనం బూడిదలో పోసిన పన్నీరైంది. దీని ప్రభావం క్రమంగా ప్లాంట్ పై పడింది. ఫలితంగా ఉద్యోగాల్లో కోత పడింది. రాయితీలతో పాటు రూ.9570 కోట్ల రూపాయల రుణాన్ని తక్కువ వడ్డీకి ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో ముందుకు వచ్చింది. స్టాంప్ డ్యూటీలో రూ.20కోట్ల మేరకు రాయితీలు ఇచ్చింది. స్థల సేకరణకు సంబంధించిన రూ.400.65 కోట్లను 8 శాతం వడ్డీతో 8 సమాన వాయిదాల్లో చెల్లించేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో ఉదారంగా అంగీకరించింది.

నానో ఫెయిల్....

ఈ విషయమై అసెంబ్లీలో విపక్షాలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. ఇంత చేసినా నానో విఫలం కావడంతో ప్రభుత్వం మంజూరు చేసిన రాయితీలు, సబ్సిడీలు వృధా అయ్యాయి. పన్నుల రూపంలోని విలువైన ప్రజాధనం వృధా అయింది. ప్రస్తుత ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇదే విషయాన్ని సూటిగా ప్రస్తావిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ బహిరంగ సభల్లో మోడీపై ధ్వజమెత్తుతున్నారు. ప్రజల్లోకి తీసుకెళుతున్నారు. దీనిపై స్పందించేందుకు బీజేపీ వద్ద సరైన సమాధానం లేదు. అందుకే రాహుల్ విమర్శలను తిప్పికొట్టేందుకు పార్టీ నాయకులు ముందుకు రావడం లేదు. తగిన సమాధానం లేనందునే వెనకడుగు వేస్తున్నారన్న అభిప్రాయం ఉంది. మొత్తం మీద నానో ప్లాంట్ వ్యవహారం, దానికి మంజూరు చేసిన రాయితీలు ఎన్నికల ప్రచారంలో కీలకంగా మారనున్నాయి.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News