నాని మ‌ళ్లీ గెలుస్తాడా.... వైసీపీ క్యాండెట్ ఎవ‌రు?

Update: 2017-12-13 14:30 GMT

ఏపీలో విజ‌య‌వాడ పేరు చెపితే రాజ‌కీయంగా ఎన్నో సంచ‌ల‌నాల‌కు మారుపేరు. మూడు ద‌శాబ్దాల క్రితం రెండు కులాల మ‌ధ్య ఆధిప‌త్య పోరుకు వేదిక‌గా మారిన విజ‌య‌వాడ దేశవ్యాప్తంగా అంద‌రి చూపును త‌న వైపున‌కు తిప్పుకుంది. న‌గ‌రంలో ఎమ్మెల్యేల విష‌యంలో రెండు, మూడు ప్రధాన కులాల‌కు అన్ని పార్టీలు ఎమ్మెల్యే సీట్లు ఇస్తున్నా కీల‌క‌మైన విజ‌య‌వాడ లోక్‌స‌భ సీటు విష‌యంలో మాత్రం కొన్ని ద‌శాబ్దాలుగా ఇక్కడ క‌మ్మ సామాజిక‌వ‌ర్గానికి చెందిన వ్యక్తుల‌కే ప్రధాన పార్టీలు టిక్కెట్ ఇవ్వడం, వారే ఇక్కడ ఎంపీలుగా గెలుస్తూ రావ‌డం జ‌రుగుతోంది. ఏపీ రాష్ట్ర రాజ‌కీయాల‌కు కేంద్ర బిందువు అయిన విజ‌య‌వాడ లోక్‌స‌భ ప‌రిధిలో ప్రస్తుత రాజ‌కీయ వాతావ‌ర‌ణం ఎలా ఉంది ? ప‌్రధాన పార్టీల ప‌రిస్థితి ఏంటి ? వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ప‌రిస్థితులు ఎలా ఉన్నాయో ? విజ‌య‌వాడ లోక్‌స‌భ సీటుపై తెలుగుపోస్ట్.కామ్ ప్రత్యేక స‌మీక్షలో చూద్దాం.

జనాల్లో నాని....

విజ‌య‌వాడ సీటు నుంచి 2004, 2009 ఎన్నిక‌ల్లో ఆంధ్రా అక్టోప‌స్‌గా పేరున్న ల‌గ‌డ‌పాటి రాజ్‌గోపాల్ రెండుసార్లు కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున ఎంపీగా గెలిచారు. 2004లో లక్ష ఓట్ల తేడాతో గెలిచిన రాజ్‌గోపాల్‌, 2009లో మాత్రం వ‌ల్లభ‌నేని వంశీమోహ‌న్ నుంచి గ‌ట్టి పోటీ ఎదుర్కొని 13 వేల ఓట్ల స్వల్ప తేడాతో గెలిచారు. గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన కేశినేని ట్రావెల్స్ అధినేత కేశినేని నాని వైసీపీ అభ్యర్థి కోనేరు రాజేంద్రప్రసాద్‌పై 74 వేల ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. మాస్ లీడ‌ర్ అయిన నాని జ‌నాల్లో బాగానే దూసుకుపోతున్నారు. విజ‌య‌వాడ న‌గ‌ర అభివృద్ధితో పాటు నియోజ‌క‌వ‌ర్గంలో కొన్ని అభివృద్ధి ప‌నుల కోసం ఆయ‌న బాగానే కృషి చేశారు. రాజ‌ధాని ఏరియా కావ‌డంతో నానికి సంబంధం లేకుండానే ఎక్కువ అభివృద్ధి జ‌రుగుతోంది.

నేతల మధ్య విభేదాలు....

అయితే గ‌త యేడాదిన్నర కాలంగా నాని దూకుడుగా ముందుకు వెళ్లడం, మంత్రి ఉమాతో గ్యాప్‌, నారా లోకేష్‌తో సైతం కొన్ని విష‌యాల్లో తీవ్రంగా విబేధించ‌డం, ర‌వాణాశాఖ కార్యాల‌యంలో అధికారుల‌తో గొడ‌వ ప‌డ‌డం, చివ‌ర‌కు చంద్రబాబు సైతం నానికి వార్నింగ్ ఇవ్వడం లాంటి అంశాలతో అటు పార్టీ అధిష్టానానికి, నానికి మ‌ధ్య గ్యాప్‌కు కార‌ణ‌మైంది. పై ప‌రిణామాల త‌ర్వాత నాని సైలెంట్ అయ్యాడు. ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో కూడా నాని ఎక్కడా క‌న‌ప‌డ‌లేదు. నాని ఇంత‌కు ముందున్న అంత యాక్టివ్‌గా అయితే లేడ‌న్నది బెజ‌వాడ టాక్‌. ఇక వ‌చ్చే ఎన్నిక‌ల్లో నానిని ప‌క్కన పెట్టేస్తార‌ని కూడా వార్తలు వ‌స్తున్నాయి. బాబు కోడ‌లు నారా బ్రాహ్మణి పేరుతో పాటు మాజీ ఎంపీ రాజ్‌గోపాల్ టీడీపీ త‌ర‌పున పోటీ చేస్తార‌న్న ప్రచారం కూడా జ‌రుగుతోంది.

వైసీపీకి నేత కరువు....

ఇక వైసీపీ నుంచి గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఓడిపోయిన కోనేరు రాజేంద్రప్రసాద్ త‌ర్వాత వైసీపీకి దూర‌మ‌య్యారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీ నుంచి ఎవ‌రు పోటీ చేస్తార‌న్నది ఇప్పట‌కీ క్లారిటీ లేదు. జ‌గ‌న్ స‌రైన అభ్యర్థి కోసం చూస్తున్నారు. ఇక జ‌న‌సేన నుంచి ప్రముఖ పారిశ్రామిక‌వేత్త పీవీపీ పేరు వినిపిస్తోంది. వాస్తవానికి గ‌త ఎన్నిక‌ల‌కు ముందే పీవీపీ వైసీపీ నుంచి పోటీ చేయాల‌నుకున్నారు. ఆ త‌ర్వాత వైసీపీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన పీవీపీ జ‌న‌సేన నుంచి పోటీ చేయాల‌నుకున్నారు. అయితే జ‌న‌సేన పోటీ చేయ‌క‌పోవ‌డంతో టీడీపీలోకి వెళ్లి పోటీ చేయాల‌ని విశ్వప్రయ‌త్నాలు చేశారు. అయితే బాబు నానికి మాట ఇచ్చి ఉండ‌డంతో నాని త‌ప్పుకునేందుకు ఇష్ట‌ప‌డ‌క‌పోవ‌డంతో పీవీపీ ఆశ‌లు నెర‌వేర‌లేదు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కూడా పీవీపీ పోటీకి ప్రయ‌త్నాలు ఆప‌లేదు.

ఎవరి బలం ఎంత?

ఇక ఎంపీ సీటు ప‌రిధిలోని ఏడు సెగ్మెంట్ల‌లో విజ‌య‌వాడ సెంట్రల్‌, ఈస్ట్ సెగ్మెంట్ల‌లో టీడీపీ చాలా బ‌లంగా ఉండ‌గా వైసీపీ చాలా చాలా వీక్‌గా ఉంది. వెస్ట్‌లో టీడీపీ నాయ‌కులు ఉన్నా క్షేత్రస్థాయిలో వైసీపీకి గ‌ట్టి ప‌ట్టే ఉంది. ఇక మైల‌వ‌రంలో మంత్రి ఉమ ఉండ‌డంతో అక్కడ టీడీపీ స్ట్రాంగ్‌గానే ఉంది. నందిగామ‌లో టీడీపీ చాలా బ‌లంగా ఉంది. అయితే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేపై వ్యతిరేక‌త ఉంది. జ‌గ్గయ్యపేట‌లో టీడీపీ రోజు రోజుకు మ‌రింత బ‌ల‌ప‌డుతుంటే, వైసీపీ డౌన్ అవుతోంది. తిరువూరులో వైసీపీ ఎమ్మెల్యే ఉన్నా అక్కడ టీడీపీయే బ‌లంగా క‌నిపిస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ+జ‌న‌సేన పొత్తుతో పోటీ చేస్తే ఆ పార్టీ అభ్యర్థికే గెలుపు అవ‌కాశాలు ఎక్కువ‌. అలా కాకుండా జ‌న‌సేన ఒంట‌రిగా పోటీ చేస్తే గెలుపు ఓట‌ముల సంగ‌తి ఎలా ఉన్నా క‌నీసం ఎంపీ సీటు ప‌రిధిలో సులువుగా 2 ల‌క్షల పై చిలుకు ఓట్లు చీలుస్తుంది. అప్పుడు ఆ ఎఫెక్ట్ టీడీపీ మీదే ఎక్కువుగా ఉండే ఛాన్సులు ఉన్నాయి. ఇక నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ రోజు రోజుకు వీక్ అవుతోంది. చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో స‌రైన నాయ‌కులు లేరు. ఉన్నవారు కూడా యాక్టివ్‌గా ఉండ‌డం లేదు.

 

-స్పెషల్ రిపోర్ట్ విజయవాడ నుంచి.....

Similar News