నాగాలాండ్ ఎన్నికలు ఎవరికి సేఫ్?

Update: 2018-01-22 18:29 GMT

వచ్చే నెలలో ఎన్నికలు జరగనున్న మూడు ఈశాన్య రాష్ట్రాల్లో నాగాలాండ్ అత్యంత సమస్మాత్మకమైనది. రాష్ట్రం పేరుచెప్పగానే ముందుగా శాంతిభద్రతల సమస్య గుర్తుకు వస్తుంది. రాష్ట్రంలో నిత్యం ఏదోఒక చోట ఘర్షణలు తలెత్తడం అనివార్య పరిణామం. నాగాలు, నాగేతర వర్గాల అంతర్గతంగా గొడవల కారణంగా రాష్ట్రం నిత్యాగ్ని గుండంగా మారుతుంది. దశాబ్దాల తరబడి పరిష్కారం కాని నాగా సమస్య రాష్ట్రాన్ని రావణ కాష్టంగా మారుస్తోంది. ఈ నేపథ్యంలో వచ్చే నెల 27న జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. నాగా శాంతి ఒప్పందం తేలేంత వరకూ ఎన్నికలను వాయిదా వేయాలని వివిధ పార్టీలు, వర్గాలు డిమాండ్ చేసినప్పటికీ ఎన్నికల నిర్వహణకే కేంద్ర ఎన్నికల సంఘం మొగ్గుచూపింది. దీంతో వివిధ ప్రజాసంఘాలు నాగా వర్గాలు ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చాయి. అధికార నాగా పీపుల్స్ ఫ్రంట్, జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు ఎన్నికల బాయ్ కాట్ పిలుపుపై మౌనం వహించాయి. అధికారికంగా స్పందించడం లేదు.

త్రిముఖ పోటీ....

సుమారు 11.89 లక్షల ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం 2187 పోలింగ్ బూత్ లను ఏర్పాటు చేసింది. ఎన్నికలు జరగనున్న త్రిపుర, మేఘాలయ కన్నా నాగాలాండ్ సమస్యాత్మకం కావడంతో పెద్ద యెత్తున ఇక్కడ బలగాలను మొహరించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. రాష్ట్రంలో ప్రస్తుతం త్రిముఖ పోటీ జరగనుంది. అధికార నాగా పీపుల్స్ ఫ్రంట్, కాంగ్రెస్, బీజేపీల మధ్య గట్టి పోటీ నెలకొంది. 88 శాతం క్రిస్టియన్లు, ఎటువైపు మొగ్గు చూపితే వారు అధికారంలోకి రావడం ఖాయం. దీంతో అన్ని పార్టీలు వారిపై దృష్టి కేంద్రీకరించాయి. ముఖ్యమంత్రి టీ.ఆర్. జెలియాంగ్ అధికార నాగా పీపుల్స్ ఫ్రంట్ కు పెద్దదిక్కు. కాంగ్రెస్, బీజేపీలకు సమర్థులైన నాయకులు లేరు. కేంద్ర నాయకులపైనే ఆయా పార్టీలు ఆధార పడుతున్నాయి. ఆ పార్టీలకు ఇది ఒకరకంగా మైనస్సే.

కొత్త పార్టీతో బీజేపీ....

అరవై స్థానాలున్న అసెంబ్లీలో గత ఎన్నికల్లో నాగా పీపుల్స్ ఫ్రంట్ 45 స్థానాలు సాధించింది. 8 స్థానాలను కాంగ్రెస్, 4 స్థానాలతో బీజేపీ ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి. నాటి ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టిన నాగా పీపుల్స్ ఫ్రంట్ నాయకుడు నిఫియు 2014 లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. దీంతో టీఆర్ జెలియాంగ్ కు అధికార పగ్గాలు అందాయి. అనంతరం తలెత్తిన రాజీకీయ పరిణామాల నేపథ్యంలో జెలియాంగ్ పదవి కోల్పోగా ఆయన స్థానంలో లిజెట్సు ముఖ్యమంత్రి అయ్యారు. ఈయన 2017 ఫిబ్రవరి నుంచి జులై వరకూ అధికారంలో కొనసాగారు. తిరిగి ముఖ్యమంత్రి పగ్గాలు అందుకున్న జెలియాంగ్ క్రమంగా రాజకీయంగా బలపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి నిఫియురియు, ముఖ్యమంత్రి జెలియాంగ్ తో విభేదాల కారణంగా పార్టీకి దూరమయ్యారు. నేషనల్ డెమొక్రటిక్ ప్రొగ్రసివ్ పార్టీ పేరుతో కొత్త పార్టీ పెట్టారు. నాగా పీపుల్స్ ఫ్రంట్ లో బీజేపీ భాగస్వామి. ఈ పార్టీతోనే ఎన్నికలకు వెళ్లాలని ముందు భావించింది. అయితే అందుకు నాగా పీపుల్స్ ఫ్రంట్ అంగీకరించకపోవడంతో మాజీ ముఖ్యమంత్రి నిఫియురియు పార్టీ ఎన్.డి.పి.పితో కలిసి ఎన్నికలనున ఎదుర్కొనేందుకు సిద్ధపడుతుంది. నిజానికి ఎన్పీఎఫ్, బీజేపీల మధ్య గత పదిహేనేళ్లుగా మంచి అనుబంధమే ఉంది. నాగా పీపుల్స్ ఫ్రంట్ పరిస్థితి అంత సజావుగా ఏమీ లేదు. పార్టీలో అంతర్గత సమస్యలు, ప్రభుత్వ వ్యతిరేకత, కూటమి నుంచి బీజేపీ బయటకు వెళ్లడం ఫలితాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని ఆందోలన చెందుతోంది. బీజేపీతో పాటు కలిసి వెళితే క్రిస్టియన్ ఓటు బ్యాంకు దూరమవుతుందన్న భయంతో దానిని పక్కన పెట్టింది. నాగా శాంతి ఒప్పందం వివరాలను ఇప్పటివరకూ వెల్లడించకపోవడం కూడా ఒక కారణం.

కాంగ్రెస్ ప్రభావం నామమాత్రమే....

గత ఎన్నికల్లో కేవలం నాలుగు స్థానాలనే సాధించిన బీజేపీ ఈసారి అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని ఆశిస్తోంది. కనీసం బలమైన విపక్షంగా అయినా ఆవిర్భవించడమే దాని లక్ష్యం. ఇందుకోసం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజును ఎన్నిలక పర్యవేక్షకుడిగా నియమించింది. అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన రిజిజు ఈశాన్య ప్రాంతంలో పార్టీకి కళ్లు, చెవులుగా పనిచేస్తున్నారు. మొత్తం ఈశాన్య రాష్ట్రాల పర్యవేక్షకుడు రామ్ మాధవ్ నాగాలాండ్ పై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అజోయ్ ఫుమ్ ప్రజల్లో పెద్దగా పట్టున్న నాయకుడు కాదు. మోడీ ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ వ్యతిరేకత, కాంగ్రెస్ వైఫల్యం తమకు కలిసి వస్తాయని కమలనాధుల అంచనా. ఇక ప్రధాన ప్రతిపక్షం పరిస్థితి దయనీయంగా ఉంది. 2013 ఎన్నికల్లో ఎనిమిది స్థానాలు సాధించిన హస్తం పార్టీ అచేతనంగా ఉంది. ఇటీవల ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎనిమిది మంది సభ్యులతో ఒక కమిటీ ఏర్పాటు చేశారు. ఇందులో సీ.పి. జోంగే, పీసీసీ అధ్యక్షుడు కె.తైరె, మాజీ ముఖ్యమంత్రి కె.ఎల్. బిషు, కె.జయకుమార్ తదితరులు సభ్యులు. ఎన్నిక కమిటీలు నియమించినా కాంగ్రెస్ ప్రభావం నామమాత్రమే అన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా. 2015లో నాగా సమస్య పరిష్కారానికి కేంద్రం, నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ (ఐఎం వర్గం) తో ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పందాలను వెల్లడించలేదు. దశాబ్దాల తరబడి నెలకొన్న సమస్య ఇప్పటికీ పరిష్కారం కాలేదు. ఎన్నికల అనంతరం అయినా నాగా సమస్య కొలిక్కి రావాలన్నది ప్రజల ఆకాంక్ష.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News