‘న.మో’ ‘రా.గా’ల్లో నవ పల్లవి....!

Update: 2018-01-22 15:30 GMT

రాహుల్ గాంధీ మాటల తూటాలు పేలుస్తున్నారు. ప్రధానిని నిలదీసే ఏ అవకాశాన్ని జారవిడవడం లేదు. గుజరాత్ ఎన్నికల తర్వాత కొంత శాంతించినట్లు కనిపించిన విమర్శల పర్వం తిరిగి మొదలైంది. ఈ సంవత్సరంలో తొలిసారిగా ఈనెల 28 న ప్రసంగించనున్న ప్రధాని మన్ కీ బాత్ పై గురిపెట్టారు రాహుల్ గాంధీ. నరేంద్రమోడీ వివిధాంశాలపై ప్రజల నుంచి మన్ కీ బాత్ నిమిత్తం సూచనలు, సలహాలను ఆహ్వానించారు. ఇదే అదను అనుకుంటూ కేంద్రప్రభుత్వం విఫలమైన రంగాలను ప్రస్తావిస్తూ రాహుల్ గాంధీ రాజకీయ ట్వీట్లతో వాతావరణాన్ని కొంత వేడెక్కించారు. రాహుల్ చేసిన సూచనలను స్వీకరిస్తారా? లేదా? వాటికి ప్రధాని వద్ద సరైన సమాధానం ఉందా? లేవనెత్తిన అంశాలు రాజకీయ కోణంతో ముడిపడినవే అయినప్పటికీ వాటన్నిటికీ బదులివ్వాల్సిన బాధ్యత మాత్రం కేంద్రంపై ఉంది.

‘కీ’లెరిగి వాత పెట్టిన రాహుల్...

ప్రధాని నరేంద్రమోడీ,భారతీయ జనతాపార్టీ ఎన్నిరకాలుగా తమ పాలన వైభవాలను కీర్తించుకున్నప్పటికీ కొన్నిచోట్ల బలహీనతలు వెన్నాడుతున్నాయి. ఉపాధి, శాంతిభద్రతలు, రక్షణ, వాణిజ్య రంగాల్లో సమస్యలు ముసురుకుంటున్నాయి. వీటిని ప్రస్తావిస్తూ రాహుల్ చేసిన ట్వీట్ భవిష్యత్తులో కాంగ్రెసు పార్టీ వ్యూహం ఏవిధంగా ఉండబోతుందో సూచనప్రాయంగా వెల్లడించింది. దేశంలో 50 శాతం పైగా యువత ఉన్నారు. పారిశ్రామిక,వాణిజ్య, సేవారంగాలు మందగమనంలో కొనసాగుతుండటంతో ఉపాధి అవకాశాలు క్షీణించాయి. మేకిన్ ఇండియా వంటి ఆర్భాటాలు నినాదాలుగానే మిగిలిపోయాయి. ఒకవైపు కొత్తగా పరిశ్రమలు నెలకొల్పడం సాధ్యం కావడంలేదు. మరోవైపు ఉన్న పరిశ్రమలు మూతపడుతున్నాయి. విదేశాల నుంచి వెల్లువలా వచ్చిపడుతున్న చౌకరకం వస్తువులతో దేశీయ ఉత్పత్తి రంగం పడకేసింది. సెల్ ఫోన్లు, టీవీలు, ఎలక్ట్రానిక్ పరికరాలు చైనా వంటి దేశాల నుంచి మన మార్కెట్ లో తిష్ఠవేసి వేల కోట్ల రూపాయలను కొల్లగొడుతున్నాయి. ప్రభుత్వం ప్రచారానికి అత్యధిక ప్రాముఖ్యం ఇస్తోంది. అంతే తప్ప విదేశీ వస్తువులను అడ్డుకోవడానికి , దేశీయంగా పరిశ్రమలకు రాయితీలతో ప్రోత్సాహం ఇచ్చేందుకు ప్రయత్నించడం లేదు. అదేవిధంగా రక్షణ పరంగానూ లోపాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. శాంతిభద్రతలు రాష్ట్రప్రభుత్వాల పరిధిలోని అంశమే అయినప్పటికీ సంఘ్ పరివార్ శక్తుల జోక్యంతో వివిధ రాష్ట్రాల్లో అసహనం నెలకొంటోంది. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని రాహుల్ గాంధీ ప్రధాని మన్ కీ బాత్ లో ఆయా అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఇది రాజకీయ విమర్శ. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ చేసిన ఆరోపణ.

ముంచుకొస్తున్న ముప్పు....

భారతీయ జనతాపార్టీకి తొలి నుంచి కూడా ఇతర దేశాలతో భారత్ కున్న వైరం రాజకీయంగా కలిసొచ్చే అంశం. దేశభక్తి, సెంటిమెంటును రగిలించడం ద్వారా ప్రజలను ఏకోన్ముఖంగా నడిపించేందుకు దానిని ఓట్ల రూపంలో మలచుకునే ఎత్తుగడ ఆ పార్టీకి బాగా వంటబట్టింది. ఉనికి లేని ప్రాంతాల్లో సైతం కార్గిల్ యుద్ధం తర్వాత భారతీయ జనతాపార్టీ గెలుపు సాధ్యమైంది. పాకిస్తాన్ పై సర్జికల్ దాడులు 2017 ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో కలిసొచ్చాయి. రక్షణ అవసరాలను రాజకీయంతో ముడిపెట్టడంలోనూ బీజేపీ రాటుతేలింది. అయితే ఇదే విషయాన్ని యాంటీ సెంటిమెంటుగా ప్రయోగిస్తున్నారు రాహుల్. భారత్ చైనా మధ్య డోక్లాం సరిహద్దు వివాదం కొనసాగుతూనే ఉంది. చైనా సైనికులు వందల సంఖ్యలో తిష్ట వేసినా వారిని ఖాళీ చేయించడం భారత్ కు సాధ్యం కావడం లేదనేది రక్షణ వర్గాల సమాచారం. దేశ రక్షణ విషయంలో తమ ప్రభుత్వాన్ని మించిన వారు లేరని క్లెయిం చేసుకునే బీజేపీ చైనా విషయంలో ఎటువంటి చర్య తీసుకోలేకపోతోందనే బలహీనతను తన ట్వీట్ ద్వారా రాహుల్ బయటపెట్టారు. మరోవైపు పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక వంటి దేశాల్లో చైనా భారీ ప్రాజెక్టులు చేపడుతోంది. రక్షణ ఒప్పందాలకూ దిగుతోంది. నౌకాశ్రయాలు, స్థావరాల ఏర్పాటుకు ప్రయత్నిస్తోంది. భారత్ ను నాలుగు వైపుల నుంచి ముట్టడించి ఉంచే వ్యూహాల్లో మునిగి తేలుతోంది. నిన్నామొన్నటివరకూ భారత్ ను పెద్దన్నగా భావించిన సార్క్ దేశాలు(పాక్ మినహా) క్రమేపీ దూరం జరుగుతూ చైనా వైపు మొగ్గు చూపుతున్నాయి. పాకిస్తాన్ తో దాయాది వైరం ఎలాగూ కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే గతంలో ఎన్నడూ లేనంత అభద్రతాభావం భారత్ ను వేదిస్తోంది. ఇరుగుపొరుగును విస్మరించి ఇజ్రాయల్, అమెరికా వంటి దేశాలతో పటిష్ఠ బంధం వైపు కేంద్రం ప్రయత్నాలు చేయడం కూడా విమర్శలకు తావిస్తోంది.

కాంగ్రెసు కదన కుతూహలం...

ఉపాధి కల్పనలో తీవ్ర నైరాశ్యం, రక్షణ రంగంలో పటిష్టత సాధించలేకపోవడం, డోక్లాం వంటి వివాదాలకు సమీప భవిష్యత్తులో పరిష్కారం కనిపించకపోవడం వంటి అంశాలను ప్రాతిపదికగా చేసుకుంటూ బీజేపీని టార్గెట్ చేయాలని కాంగ్రెసు యోచిస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తిస్థాయి అధ్యయనంతో కాంగ్రెసు నివేదికలు కూడా తయారుచేస్తున్నట్లు తెలుస్తోంది. ఆయా అంశాలు తమ అజెండాలో ఉన్నాయన్న విషయాన్ని గుర్తు చేసేందుకు సూచన ప్రాయంగా ప్రధానిని రాహుల్ సవాల్ చేశారని కాంగ్రెసు వర్గాలు చెబుతున్నాయి. ఉపాధి కల్పనపై ఎండగట్టేందుకు కొందరు అధికార ప్రతినిధులకు శిక్షణ కూడా ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. బీజేపీకి ప్లస్ పాయింట్ గా నిలుస్తున్న రక్షణ రంగంలో లోపాలు వెలికి తీసి సమర్థ వాదనను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కూడా కాంగ్రెసు తయారవుతోంది. వీటన్నిటిపై బడ్జెట్ సెషన్ చివరి నాటికి కసరత్తు పూర్తి కావచ్చని తెలుస్తోంది. బడ్జెట్ తర్వాత పూర్తిగా రాజకీయం వైపే కాంగ్రెసు దృష్టి సారించనుంది. సబ్జెక్టుల వారీ నిపుణులైన అధికార ప్రతినిధులతో వాతవరణాన్ని హాట్ హాట్ చేసేందుకు కాంగ్రెసు వ్యూహరచన సాగిస్తోంది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News