ధూళిపాళ్లకు ఓటమి తప్పదా? వెంటాడుతున్న బ్యాడ్ సెంటిమెంట్...!

Update: 2017-11-04 13:30 GMT

గుంటూరు జిల్లాలో ధూళిపాళ్ల న‌రేంద్ర ప్ర‌త్య‌ర్థుల‌కు సింహ‌స్వ‌ప్నం. పొన్నూరు నియోజ‌క‌వ‌ర్గంలో త‌న తండ్రి వేసిన బ‌ల‌మైన పునాదిని బేస్ చేసుకుని ఐదుసార్లుగా న‌రేంద్ర ఇక్క‌డ తిరుగులేని విజ‌యాలు సాధిస్తున్నారు. 1994లో ప్రారంభ‌మైన న‌రేంద్ర జైత్ర‌యాత్ర వ‌రుస‌గా 1999 - 2004 - 2009 - 2014లో ఎక్క‌డా బ్రేక్ లేకుండా కంటిన్యూ అయ్యింది. 2004లో వైఎస్ గాలిలో జిల్లాలో 19 నియోజ‌క‌వ‌ర్గాల్లోను టీడీపీ అభ్య‌ర్థులు ఓడిపోయినా పొన్నూరులో మాత్రం న‌రేంద్ర గెలిచి ఒకేఒక్క‌డిగా రికార్డుల‌కు ఎక్కాడు. 2004 నుంచి గ‌త ఎన్నిక‌ల వ‌ర‌కు ప్ర‌తి ఎన్నిక‌ల‌కు ముందు న‌రేంద్ర ఈ సారి గెల‌వ‌డం క‌ష్ట‌మే అన్న చ‌ర్చ న‌డుస్తుంటుంది. అయితే ఫైన‌ల్‌గా మాత్రం గెలుపు న‌రేంద్ర‌దే అవుతుంది. అలాంటి న‌రేంద్ర వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుపు కోసం మ‌రింత‌గా క‌ష్ట‌ప‌డాల‌న్న టాక్ న‌డుస్తోంది.

23 ఏళ్ల పాలనపై అసంతృప్తి....

వ‌రుస‌గా గెలుస్తుండ‌డంతో ఆయ‌న‌పై నియోజ‌క‌వ‌ర్గంలో కాస్త వ్య‌తిరేక‌త ఏర్ప‌డింది. ఇక మంత్రి ప‌ద‌వి రాక‌పోవ‌డంతో అల‌క‌తో ఉన్న న‌రేంద్ర రాజ‌కీయంగా పూర్తిగా స్త‌బ్దుగా ఉన్నారు. ఆయ‌న ప్ర‌తిప‌క్షంలో ఉన్నప్పుడు ఎప్పుడూ మీడియాలో నానేవారు. అయితే ఇప్పుడు నియోజ‌క‌వ‌ర్గంలో కూడా ఆయ‌న స‌రిగా తిర‌గ‌డం లేద‌న్న టాక్ ఉంది. ఇదిలా ఉంటే ఇప్ప‌టికే ఐదుసార్లు గెలిచిన న‌రేంద్ర వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుస్తాడా ? లేదా ? అన్న‌ది ప‌క్క‌న పెడితే గుంటూరు జిల్లాలో ఉన్న ఓ బ్యాడ్ సెంటిమెంట్ మాత్రం న‌రేంద్ర‌కు ఈ సారి ఓట‌మి త‌ప్ప‌దా ? అన్న సందేహాలు రేకెత్తిస్తోంది.

ఐదు సార్లు గెలిస్తే అంతేనా...?

గుంటూరు జిల్లాలో గ‌తంలో ఐదుసార్లు ఎమ్మెల్యేలుగా గెలిచిన కొంద‌రు నాయ‌కులు ఆరో ప్ర‌య‌త్నంలో మాత్రం ఓడిపోయారు. ఇప్పుడు న‌రేంద్ర కూడా ఐదుసార్లు గెలిచారు. దీంతో ఇప్పుడు ఆరో ప్ర‌య‌త్నంలో నరేంద్ర జిల్లాలో సీనియ‌ర్ నాయ‌కుల విష‌యంలో రిపీట్ అయిన బ్యాడ్ సెంటిమెంట్‌ను చిత్తు చేసి గెలుస్తాడా ? లేదా ఆ బ్యాడ్ సెంటిమెంట్ వ‌ల‌లో చిక్కుకుని ఓట‌మి పాల‌వుతాడా ? అన్న‌దానిపై జిల్లాలో ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. జిల్లాలో గ‌తంలో సీనియ‌ర్ నాయ‌కులు అయిన మాకినేని పెదర‌త్త‌య్య‌, క‌న్నా ల‌క్ష్మీ నారాయ‌ణ‌, కోడెల శివప్ర‌సాద్ రావు వ‌రుస‌గా ఐదుసార్లు గెలిచి ఆరోసారి ఓడిపోయారు.

కోడెల శివ‌ప్ర‌సాద్ రావు :

1983లో టీడీపీ పుట్టిన‌ప్ప‌టి నుంచి న‌ర‌సారావుపేట‌లో వ‌రుస‌గా గెలుస్తోన్న కోడెల అక్క‌డ కంటిన్యూగా ఐదుసార్లు విజ‌యం సాధించారు. ఆయ‌న ఆరో ప్ర‌య‌త్నంలో 2004లో తొలిసారిగా ఓడిపోయారు. కాసు వెంక‌ట కృష్ణారెడ్డి చేతిలో ఓడిపోయిన 2009లో కూడా ఆయ‌న చేతిలోనే మ‌రోసారి ఓడిపోయారు. 2014లో మాత్రం కోడెల న‌ర‌సారావుపేట వ‌దిలి ప‌క్క‌నే ఉన్న స‌త్తెన‌ప‌ల్లి నుంచి పోటీ చేసి అంబ‌టి రాంబాబును ఓడించి ఆరోసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు.

మాకినేని పెద‌ర‌త్త‌య్య :

టీడీపీ ఆవిర్భావం నుంచి కోడెల‌తో పాటు 1983 నుంచి 2004 వ‌ర‌కు వ‌రుస‌గా ఐదుసార్లు గెలిచిన పెదర‌త్త‌య్య 2004లో మాత్రం తొలిసారిగా రావి వెంక‌ట‌ర‌మ‌ణ చేతిలో ఓడిపోయారు. 2009లో ప్ర‌త్తిపాడు ఎస్సీల‌కు రిజ‌ర్వ్ కావ‌డంతో ఆయ‌నకు మ‌రోచోట సీటు రాలేదు. ఆ త‌ర్వాత వైసీపీలోకి వెళ్లిన ర‌త్త‌య్య ఆ త‌ర్వాత ఆ పార్టీకి కూడా గుడ్ బై చెప్పేసి ప్ర‌స్తుతం రాజ‌కీయంగా సైలెంట్‌గా ఉన్నారు.

క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ :

గుంటూరు జిల్లాకే చెందిన మ‌రో సీనియ‌ర్ పొలిటిషీయ‌న్ అయిన కాంగ్రెస్ నేత‌, ప్ర‌స్తుత బీజేపీ నేత, మాజీ మంత్రి క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ కూడా వ‌రుస‌గా ఐదుసార్లు గెలిచారు. 1989 నుంచి 2004 వ‌ర‌కు పెద‌కూర‌పాడు నుంచి వ‌రుస‌గా నాలుగుసార్లు గెలిచిన క‌న్నా 2009లో గుంటూరు వెస్ట్‌కు మారి ఐదోసారి గెలిచారు. గ‌త ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ నుంచి అదే నియోజ‌క‌వ‌ర్గంలో పోటీ చేసి ఓడిపోయారు. పై ముగ్గురు సీనియ‌ర్ లీడ‌ర్లు వ‌రుస‌గా ఐదుసార్లు గెలిచి ఆరో ప్ర‌య‌త్నంలో ఓడిపోయారు. ఇప్పుడు న‌రేంద్ర ముందు కూడా ఇదే అగ్నిప‌రీక్ష ఉంది. మ‌రి ఈ ప్ర‌య‌త్నంలో న‌రేంద్ర ఏం చేస్తాడ‌న్న‌దానిపై జిల్లాలో పెద్ద చ‌ర్చ జ‌రుగుతోంది. మ‌రో ట్విస్ట్ ఏంటంటే పెద‌ర‌త్త‌య్యకు గ‌తంలో ఆరో సారి ప్ర‌త్య‌ర్థిగా త‌ల‌ప‌డి గెలిచిన రావి వెంక‌ట‌ర‌మ‌ణే న‌రేంద్ర‌కు ప్ర‌త్య‌ర్థిగా ఉండం విశేషం. మ‌రి న‌రేంద్ర 2019లో ఏం చేస్తాడో ? చూడాలి.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News