దేవెగౌడ కాచుక్కూర్చుంది ఇందుకేనా?

Update: 2018-03-13 16:30 GMT

కర్ణాటకలో కుటుంబ పార్టీగా ముద్రపడిన జనతాదళ్ (ఎస్) వచ్చే ఎన్నికల్లో కింగ్ మేకర్ గా చక్రం తిప్పాలని కలలు కంటోంది. మాజీ ప్రధాని హెచ్.డి.దేవెగౌడ సారథ్యంలోని ఈ పార్టీ ఈమేరకు ఇప్పటి నుంచే వ్యూహరచన చేసుకుంటోంది. కాంగ్రెస్, బీజేపీ పోటాపోటీగా తలపడుతున్న నేపథ్యంలో హంగ్ అసెంబ్లీ ఏర్పడితే తమదే కీలక పాత్ర అవుతుందని పార్టీ నాయకత్వం అంచనా వేస్తోంది. గత ఎన్నికల్లో 40 స్థానాలను సాధించినప్పటికీ కొంతమంది ఎమ్మెల్యేలు వలసలు పోవడంతో పారటీ ఇప్పుడు తృతీయ పక్షంగా మిగిలిపోయింది. వృద్ధాప్యం కారణంగా దేవెగౌడ వెనుకటి మాదిరిగా పార్టీ వ్యవహారాలపై దృష్టిపెట్టలేకపోతున్నారు. కుమారుడు, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి రకరకాల వ్యాపకాల కారణంగా పార్టీకి పూర్తి సమయాన్ని వెచ్చించలేకపోతున్నారు. ఫలితంగా ఒకప్పుడు రాష్ట్రాన్ని ఏలిన ఈ పార్టీ ప్రాధాన్యం తగ్గిపోయింది. అయినా కాలం కలిసి వస్తే చక్రం తిప్పాలని కలలు కంటోంది.

కొన్ని ప్రాంతాల్లోనే పట్టు....

పూర్వపు జనతాదళ్ చీలికలు, పేలికలైన నేపథ్యంలో 1999లో దేవెగౌడ జనతాదళ్ (సెక్యులర్) పేరుతో సొంత దుకాణాన్ని ప్రారంభించారు. అప్పటినుంచీ దాని ప్రస్థానంలో పెద్దగా ఎదుగుదల లేదు. అటు లోక్ సభ, ఇటు అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ప్రభావం పెద్దగా కనపడలేదు. దేవెగౌడ, కుమారుడు కుమారస్వామిల ప్రభావం కొన్ని ప్రాంతాలకే పరిమితమైంది. ప్రధానంగా బలమైన ఒక్కలింగ సామాజిక వర్గం అండదండలతో పార్టీ మనుగడ సాగిస్తోంది. కర్ణాటకలో ఒక్కలింగలు బలమైన సామాజిక వర్గం. రాష్ట్రంలో ఒక్కలింగ, లింగాయత్ ల మధ్య గట్టిపోటీ ఉంటుంది. లింగాయత్ లు బీజేపీ వైపు మొగ్గు చూపుతుంటారు. ఒక్కలింగలు జేడీఎస్ వైపు నిలబడుతుంటారు. దళితులు, ముస్లింలు, ఇతర వెనకబడిన వర్గాల మద్దతుతో కాంగ్రెస్ చక్రం తిప్పుతోంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కురుబ సామాజిక వర్గానికి చెందిన వారు. దేవెగౌడకు రాష్ట్ర వ్యాప్తంగా పెద్దగా పట్టులేదు. కొన్ని ప్రాంతాల్లోనే ఆయన ప్రాబల్యం ఉంది. ముఖ్యంగా దేవెగౌడ స్వస్థలం హసన్, మాండ్యా, చామరాజనగర్, బెంగుళూరు గ్రామీణ ప్రాంతం, తుముకూరు తదితర ప్రాంతాలతో పాటు పాత మైసూరు ప్రాంతంలోనూ పార్టీకి పట్టుంది. పార్టీకి అత్యధికంగా సీట్లు వచ్చేది ఇక్కడి నుంచే. రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిన ప్రాంతాల్లో వచ్చేది అరకొరే. దేవెగౌడ హసన్ నుంచి లోక్ సభ సభ్యుడిగా ఉన్నారు.

మనవడి ముచ్చటను తీర్చాలని....

1991, 1998లో ఇక్కడి నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. మళ్లీ 2004 నుంచి వరుసగా గెలుస్తూ వస్తున్నారు. 2014 ఎన్నికల్లో లక్ష ఓట్లకు పైగా మెజారిటీతో విజయం సాధించారు. గత లోక్ సభ ఎన్నికల్లో హసన్ తో పాటు మాండ్యాలోక్ సభ స్థానాన్ని కూడా జేడీఎస్ కైవసం చేసుకుంది. రాష్ట్రం నుంచి ఒకేఒక రాజ్యసభ సభ్యుడు పార్టీ నుంచి ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి బెంగళూరు గ్రామీణ ప్రాంతంలోని రామనగర నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన సోదరుడు రేవణ్న హసన్ జిల్లాలోని హోలెనరసిపుర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. రేపటి అసెంబ్లీ ఎన్నికల్లో కుమారస్వామి భార్య అనిత కూడా బెంగుళూరు గ్రామీణ ప్రాంతం లోని చెన్నపట్న నియోజకవర్గం నుంచిఅసెంబ్లీకి ఎన్నిక కావాలని ఆసక్తిగా ఉన్నారు. అయితే కుటుంబం నుంచి తాను, సోదరుడు రేవణ్న మాత్రమే రంగంలో ఉంటామని కుమారస్వామి స్పష్టం చేశారు. అయినప్పటికీ చివరి నిమిషంలో అనిత కు టిక్కెట్ ఇస్తారని పార్టీవర్గాలు చెబుతున్నాయి. దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్న బెంగళూరు నగరంలోని ఆర్ ఆర్ నగర్ నుంచి అసెంబ్లీకి వెళ్లాలని ఆసక్తిగా ఉన్నారు. మనవడి ముచ్చటను తీర్చడానికి దేవెగౌడ సిద్ధంగా ఉన్నారని సమాచారం.

40 స్థానాలను నిలబెట్టుకోవాలని....

జనతాదళ్ ప్రస్థానాన్ని పరిశీలిస్తే ఆవిర్భావం నుంచి అనూహ్య పనితీరును కనబర్చిన దాఖలాలు లేవు. 1999 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం పది స్థానాలకే పరిమితమైంది. పార్టీ చరిత్రలో 2004 అసెంబ్లీ ఎన్నికలు సువర్ణయుగం వంటివి. ఆ ఎన్నికల్లో 59 స్థానాలను సాధించి బీజేపీతో పొత్తుపెట్టుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కర్ణాటక రాష్ట్ర 18వ ముఖ్యమంత్రిగా కుమారస్వామి పగ్గాలు చేపట్టారు. 2006 ఫిబ్రవరి నుంచి2007 అక్టోబరు వరకూ అధికారంలో కొనసాగారు. అనంతరం 2008లో జరిగిన ఎన్నికల్లో 28 స్థానాలకే పరిమితమైంది. 2013 అసెంబ్లీ ఎన్నికల్లోకొంతవరకూ పుంజుకుంది. బీజేపీతో పాటు తానూ 40 స్థానాలను సాధించి ధీటుగా నిలబడింది. బీజేపీ, జేడీఎస్ లకు చెరి 40 స్థానాలు రావడంతో ఎవరికీ విపక్ష స్థానం కట్టబెట్టాలో తెలియని తికమక పరిస్థితి ఏర్పడింది. రేపటి ఎన్నికల్లో పోటీ ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ మధ్యనే ఉంటుంది. జేడీఎస్ ది మూడో స్థానమే. అయితే హంగ్ అసెంబ్లీ ఏర్పడితే తమకు మంచిరోజులు వస్తాయన్నది దేవెగౌడ పార్టీ ఆశాభావంతో ఉంది. బలం పెంచుకోకపోయినా ఉన్న 40 స్థానాలను కాపాడుకుంటే చాలన్నది దాని వ్యూహం. ఇందుకోసమే మాయావతి సారథ్యంలోని బహుజన్ సమాజ్ పార్టీ, అఖిలేష్ సారథ్యంలోని సమాజ్ వాదీ పార్టీతో పొత్తు పెట్టుకుంది. బీఎస్పీ వల్ల దళితుల ఓట్లు రాబట్టుకోవచ్చన్నది ఆశ. అయితే దళిత ఓటు బ్యాంకు కాంగ్రెస్ వైపు మొగ్గుచూపుతున్న తరుణంలో జేడీఎస్ ఆశలు ఎంతవరకూ నెరవేరతాయన్నది ప్రశ్నార్థకమే. కర్ణాటకలో సమాజ్ వాదీ పార్టీ ప్రభావం పూజ్యం. మైసూరు విశ్వవిద్యాలయంలో ఇంజినీరింగ్ చదివిన అఖిలేష్ కు రాష్ట్రంలో పరిచయాలు ఉన్నప్పటికీ అవి ఓట్లను రాల్చే పరిస్థితి లేదు. 2013 ఎన్నికల్లో పార్టీకి 20.9 శాతం ఓట్లు లభించాయి. వాటిని కాపాడుకుంటే చాలన్నది పార్టీ వ్యూహం. అయితే అది ఎంతవరకూ సాధ్యపడుతుందన్నది ప్రశ్నార్థకమే. మరో రెండు నెలల్లో అదీ తేలనుంది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News