దూర్వాసుల వారికి అరుదైన గౌరవం

Update: 2017-09-27 13:30 GMT

దూర్వాసుల వెంకట సుబ్రహ్మణ్య సోమయాజులు. ఈ పేరు ఎంత పెద్దతో ఆయన అంతటి పండితుడు. న్యాయశాస్త్రంలో నిష్టాతుడు. అందువల్లే ఏకంగా హైకోర్టు న్యాయమూర్తి కాగలిగారు. అదీ ప్రతిష్టాత్మకమైన ఉమ్మడి హైకోర్టుకు. జిల్లా కోర్టులో పనిచేస్తున్న ఓ న్యాయవాది హైకోర్టు న్యాయమూర్తి కావడం అత్యంత అరుదు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ ఇలాంటి అరుదైన గౌరవం ఐదుగురికే దక్కింది. వారిలో సోమయాజులు ఒకరు కావడం తెలుగు ప్రజలు గర్వించదగ్గ విషయం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో విభజన అనంతరం నియమితులైన వ్యక్తి సోమయాజులు మాత్రమే కావడం విశేషం. డివిఎన్ఎస్ సోమయాజులుగా న్యాయవర్గాల్లో సుపరిచుతుడైన ఆయన ఇకనుంచి తెలుగు రాష్ట్రాల్లో చారిత్రిక తీర్పులు ఇవ్వనున్నారు.

జిల్లా నుంచి హైకోర్టుకు......

సాధారణంగా హైకోర్టు న్యాయమూర్తుల నియామక ప్రక్రియ సంక్లిష్టమైంది. అనేక రకాల పరిశీలనలు, విచారణ అనంతరం వారిపేర్లు వెలుగులోకి వస్తాయి. రెండు రకాలుగా హైకోర్టు న్యాయమూర్తుల ఎంపిక జరుగుతుంది. జిల్లా న్యాయమూర్తులుగా పనిచేస్తున్న అనుభవజ్ఞులు, సమర్ధులను హైకోర్టు న్యాయమూర్తులుగా నియమిస్తారు. పేరుప్రతిష్టలున్న హైకోర్టు సీనియర్ న్యాయవాదులను కూడా నేరుగా హైకోర్టు న్యాయమూర్తులుగా ఎంపిక చేస్తుంటారు. సోమయాజులుతో పాటు ప్రస్తుతం నియమితులైన జస్టిస్ కొంగర విజయలక్ష్మి, మాంతోజ్ గంగారావు, కుమార్ షావిలి, పి.కేశవరావు, టి. అమర్ నాధ్ గౌడ్ లలో ఒక్క సోమయాజులు మాత్రమే జిల్లా కోర్టులో ప్రాక్టీస్ చేశారు. మిగిలిన వారు ఉమ్మడి హైకోర్టులో న్యాయవాదులు కావడం గమనార్హం.

కుటుంబమంతా న్యాయవాద వృత్తే......

సోమయాజులు కుటుంబమే న్యాయవాద కుటుంబం. ఆయన తండ్రి, తాత దిగ్గజాలైన న్యాయవాదులు. భార్య కూడా న్యాయవాదే. కుమారుడు కేతన్ కూడా న్యాయవిద్యను అభ్యసిస్తున్నారు. సోమయాజులు గురించి చెప్పుకునే ముందు ఆయన తండ్రి డి.వి.సుబ్బారావు పేరు ప్రతిష్టలు తప్పక ప్రస్తావించాలి. న్యాయవాద వర్గాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, ఉత్తరాంధ్రలో సుబ్బారావు పేరు గురించి తెలియని వారు ఉండరనడం అతిశయోక్తి కాదు. ఆయన విశాఖ బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా, ఏపీ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా, బీసీసీఐ లీగల్ కమిటీ సభ్యుడిగా, ఆంధ్రవిశ్వ విద్యాలయం సెనేట్ సభ్యుడిగా వివిధ పదవులను సమర్ధంగా నిర్వహించి ఆ పదవులకు వన్నె తెచ్చారు. పలు ప్రభుత్వ రంగ, ప్రయివేటు సంస్థలకు న్యాయసలహాదారుగా సేవలందించారు. భారత బార్ అసోసియేషన్ సభ్యుడిగా, విశాఖ నగర మేయర్ గా ఆయన బాధ్యతలను సమర్ధంగా నిర్వర్తించారు.

తండ్రికి తగ్గ తనయుడిగా......

తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్న సోమయాజులు 1961 సెప్టంబరు 26న విశాఖలో జన్మించారు. బీకాం, ఎల్ఎల్బీ అనంతరం 1985 జులై 5న న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. నర్సరీ విద్యను స్థానిక మహంకాళిపేట శారదా బాలవిహార్, ప్రాధమిక, ప్రాధమికోన్నత విద్యను సెయింట్ అలోసియస్ లో, ఇంటర్ ఏవీఎన్ కళాశాలలో, బీకాం పుల్లయ్య కళాశాలలో, న్యాయశాస్త్రాన్ని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చదివారు. రెండేళ్ల పాటు సివిల్స్ సాధనకు ప్రయత్నించి మెయిన్స్ వరకూ వెళ్లారు. చివరకు 1988లో పూర్తి స్థాయి న్యాయవాదిగా వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. తండ్రి వద్దే శిష్యరికం చేసి వృత్తిపరమైన మెలుకువలను తెలుసుకున్నారు. అనేక సంక్లిష్టమైన కేసులను వాదించారు. బ్యాంకులు, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రముఖ ప్రయివేటు సంస్థలకు న్యాయసలహాదారుగా సేవలందించారు. వృత్తిపరమైన విలువలకు కట్టుబడి ఉంటారన్న పేరును తెచ్చుకున్నారు. క్రమశిక్షణ, అంకిత భావం, నిజాయితీగా వ్యవహరించి కక్షిదారుల ప్రయోజనాలను పరిరక్షణకు సాయపడతారన్న గుర్తింపు పొందారు. విశాఖ స్టీల్ ప్లాంట్, పోర్ట్ ట్రస్ట్, హెచ్.పి.సి.ఎల్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తదితర ప్రభుత్వ రంగ సంస్థలకు న్యాయసలహాదారుగా వ్యవహరించారు.

అంతర్జాతీయ కేసులు కూడా......

సోమయాజుల ప్రతిభాపాటవాలు స్థానికంగానే పరిమితం కాలేదు. ప్రపంచ వ్యాప్తంగా పేరున్న న్యాయవాదిగా గుర్తింపు పొందారు. అంతర్జాతీయ కేసులను వాదించిన తొలి విశాఖ న్యాయవాది ఆయనే కావడం విశేషం. అమెరికా, సింగపూర్, హాంకాంగ్ లలో అనేక మధ్యవర్తిత్వ కేసులను వాదించారు. సోమయాజులు సతీమణి శర్వాణి కూడా న్యాయవాదే. భర్త దగ్గరే ఆమె కొంతకాలం ప్రాక్టీస్ చేశారు. ఎంఎ (సైకాలజీ), ఎంఫిల్ పూర్తి చేశారు. మహిళాభ్యున్నతే లక్ష్యంగా వివిధ సమస్యలతో ఇబ్బంది పడుతున్న మహిళలకు ఆమె కౌన్సెలింగ్ ఇస్తున్నారు. సోమయాజులు కుమారుడు కేతన్ పూనే లోని ప్రఖ్యాత కళాశాలలో న్యాయశాస్త్రాన్ని అభ్యసిస్తున్నారు. ఎమ్మెస్సీ చదివిన కూతురు సాయి వల్లి ప్రస్తుతం ఓ ప్రయివేటు సంస్థలో పనిచేస్తున్నారు. ఏపీ బీజేపీ శాసనసభ పక్ష నేత విష్ణుకుమార్ రాజు, సోమయాజులు మంచి మిత్రులు. ఇంటర్ వరకూ ఇద్దరూ కలిసి చదువుకున్నారు. విష్ణుకుమార్ రాజు ఇంజినీరింగ్ లో చేరగా, సోమయాజులు న్యాయశాస్త్రం వైపు మొగ్గు చూపారు. అపారమైన న్యాయపరిజ్ఞానం ఉన్నప్పటకీ, తండ్రికి సేవలందించే ఉద్దేశంతో విశాఖకే పరిమితమయ్యారు. తమ నికార్సయిన, మేలైన తీర్పుల ద్వారా న్యాయవ్యవస్థకు పేరు తీసుకురాగలరన్న నమ్మకం ఆయన గురించి తెలిసిన ప్రతి ఒక్కరికీ ఉంది.

 

- ఎడిటోరియల్ డెస్క్

Similar News