దీదీ...దాదా

Update: 2018-03-19 15:30 GMT

వామపక్ష సామ్రాజ్యాన్ని ఛిన్నాభిన్నం చేసిన ఫైర్ బ్రాండ్ నాయకురాలు మమత చుట్టూ జాతీయ చర్చ సాగుతోంది. దేశంలోని పెద్ద రాష్ట్రాల్లో ఒకటైన పశ్చిమబంగకు ఆమె ప్రాతినిధ్యం వహించడం ఇందుకు ఒక కారణం. దేశంలోని మిగిలిన పెద్ద రాష్ట్రాల్లో భారతీయ జనతాపార్టీయే అధికారంలో ఉంది. ఇక కాంగ్రెసు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కర్ణాటక, పంజాబ్ మాత్రమే సంఖ్యాపరంగా చెప్పుకోదగినవి. ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ కీలకకేంద్రంగా రాజకీయనేతలు చక్కర్లు కొడుతున్నారు. బీజేపీకి, కాంగ్రెసుకు వ్యతిరేకంగా ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా ముందు ఫోన్ మమతకే వెళుతోంది. ఆమె మద్దతు ప్రకటన విపక్షాలకు కొండంత బలం. అందుకే ఇప్పుడు మూడో ఫ్రంట్ ప్రయత్నాలు చేస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమెతో మొదటగా మంతనాలు ప్రారంభించారు. బీజేపీ, కాంగ్రెసులకు వ్యతిరేకంగా రాష్ట్రాల హక్కులను పరిరక్షించుకునే ఒక నూతన సమాఖ్య రావాలంటూ కేసీఆర్ చేసిన ప్రకటనకు ముందుగా మద్దతు ప్రకటించింది మమతనే. తెలుగుదేశం అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించగానే ముందువరసలో నేనున్నానంటూ భరోసానిచ్చింది కూడా ఆమెనే. మరోవైపు కాంగ్రెసు పార్టీకి కూడా ఆమె స్నేహ సంకేతాలే పంపుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్షాలు, కాంగ్రెసు కలిసి తనకు వ్యతిరేకంగా పోటీ చేసినప్పటికీ మమత మాత్రం కాంగ్రెసును పూర్తిగా దూరం పెట్టాలని అనుకోవడం లేదు. పశ్చిమబంగలో బీజేపీ చాలావేగంగా విస్తరిస్తూ ఉండటము ఆమెను కలవరపరుస్తోంది. దీంతో దేశవ్యాప్తంగా బీజేపీని నిలువరించే ప్రతి ప్రయత్నానికి ఆమె తన సంఘీభావాన్ని ప్రకటిస్తోంది.

మూడువైపుల ముచ్చట...

దేశ రాజకీయాల్లో ప్రాంతీయంగా ముగ్గురు మహిళానాయకులు కీలకంగా వ్యవహరించేవారు. జయలలిత, మాయావతి,మమతా బెనర్జీ వీరు ముగ్గురికీ తమదైన రాజకీయ పంథా. పాలిటిక్స్ ను పల్టీలు కొట్టించగల నేర్పు ఉండేది. తమిళనాట ప్రజల అశేష ఆదరణతో ఎవరినీ లెక్కచేయని నాయకురాలిగా జయ పేరు పొందారు. ఎన్నికేసులు ఉన్నప్పటికీ తన రాష్ట్రంలో అధికారంలో ఉన్నంతకాలం తాను చెప్పిందే వేదమన్నట్లుగా సాగేది ఆమె విన్యాసం. ఇక ఉత్తరప్రదేశ్ అతిపెద్ద రాష్ట్రం కావడం, దళిత కార్డు కలగలిసి మాయావతి కూడా చాలా ప్రామినెన్స్ సాధించారు. జయ మరణం, ఉత్తరప్రదేశ్ లో బీఎస్పీ బలహీన పడటంతో ఇక మమత మాత్రమే ఈ కోవలో అగ్రనాయకురాలిగా మిగిలారు. ఒడిసాలో నవీన్ పట్నాయక్ తప్ప స్వతంత్రంగా వ్యవహరించగల ప్రాంతీయ నాయకుల సంఖ్య తగ్గిపోయింది. కేసీఆర్ బలమైన నాయకుడే అయినప్పటికీ తెలంగాణ చిన్న రాష్ట్రం. జేడీఎస్ కర్ణాటకలోనే ఎదురీదుతోంది. ఎన్సీపీ, శివసేన, అకాలీదళ్, ఎల్జేపీ వంటివన్నీ తోకపార్టీలైపోయాయి. ఆర్జేడీ అధినేత లాలూ కేసుల ముగ్గులో మునిగితేలుతున్నారు. ఏపీలో చంద్రబాబు సొంత సమస్యలతోనే సతమతమవుతున్నారు. అందుకే మమత సెంటర్ ఆఫ్ పొలిటికల్ అట్రాక్షన్ అయిపోయారు. పెద్ద రాష్ట్రమూ, సంఖ్యాబలమూ ఎక్కువే. పైపెచ్చు పోరాట పటిమ కలిగిన ప్రజాకర్షక నేత కావడంతో ఆమె కేంద్రంగా మారారు. తన కూటమిలో ఆమె ఒక ప్రధాన సభ్యురాలిగా ఉండాలని కాంగ్రెసు పార్టీ కోరుకొంటోంది. మమత రాజకీయ జీవితం ప్రారంభించి లోక్ సభ సభ్యురాలిగా ఎదిగింది కాంగ్రెసులోనే. అదే పార్టీతో విభేదించి 1997లో తృణమూల్ ను స్థాపించారు. కాంగ్రెసు , బీజేపీలు రెంటితోనూ కలిసి నడిచారు. ఎన్డీఏ , యూపీఏ రెండు ప్రభుత్వాల్లోనూ కేంద్రమంత్రిగా పనిచేశారు. ఆయా ప్రభుత్వాలతో విభేదించి బయటికి నడిచారు. అంటరానితనమూ లేదు. అంటకాగే తనమూ లేదు. మమత రాజకీయ చంచలత్వము తెలిసి కూడా కాంగ్రెసు ఆమె యూపీఏ కూటమిలో ఉండాలనుకుంటోంది. ఆమెకున్న ప్రజాదరణ, దేశవ్యాప్తంగా ప్రభావం చూపగల వాయిస్ ఇందుకు కారణం. మూడో ఫ్రంట్ జపం చేస్తున్న కేసీఆర్ మమతను కలవడం వెనక కారణమూ ఇదే. చంద్రబాబు నాయుడూ మమత తో టచ్ లో ఉన్నారు. ఇలా మూడు వైపుల నుంచీ ఆమెకు ఆఫర్లు ముంచుకువస్తున్నాయి. ఆమె ఎవరినీ కాదనకుండా అందరికీ అభయమిస్తున్నారు. మమత కు బీజేపీపై కోపం కంటే మోడీ అంటే ద్వేషమే ఎక్కువ. నాయకుడు మారితే ఎన్డీఏ కూటమితో కూడా ఆమెకు విభేదాలేమీ ఉండవనే చెప్పాలి.

మమత మామూలు లీడర్ కాదు...

అత్యంత సామాన్యురాలిగా కనిపించే మమత ఆషామాషీ నాయకురాలు కాదు. ఎన్నెన్నో డక్కామొక్కీలు తిన్నారామె. అవిచ్ఛిన్నంగా సాగిపోతున్న వామపక్ష సామ్రాజ్యమైన పశ్చిమబంగలో ఎన్నెన్నో పోరాటాలు చేశారు. విద్యార్థి ఉద్యమాలు నడిపారు. దశాబ్దాల పాటు ఆందోళనలు నడిపారు. 1984లో తొలిసారిగా సోమనాథ్ చటర్జీ వంటి వామపక్ష అగ్రనేతను జాదవ్ పూర్ లోక్ సభ స్థానంలో ఓడించడంతో ఆమెకు జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. 1984, 91,96,98, 99, 2004, 2009లలో ఏడుసార్లు లోక్ సభకు ఎన్నికయ్యారు. కాంగ్రెసు క్రమేపీ బలహీనపడి, వామపక్షాలపై పోరాటంలో రాజీ పడుతోందని గ్రహించిన దీదీ 1997లో సొంత పంథా అనుసరించేందుకు తృణమూల్ ను స్థాపించుకున్నారు. ఎడతెగని తెగువ, పోరాట తత్వానికి ఇది నిదర్శనం. 1999లొ మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్నాడన్న కారణంతో సమాజ్ వాదీ పార్టీ సభ్యుడిని లోక్ సభ వెల్ నుంచి లాగి కాలర్ పట్టుకున్నారు మమత. అంతటి తెగింపు ఆమెది. నందిగ్రామ్, సింగూరుల్లో రైతుల కోసం వామపక్షాలకు వ్యతిరేకంగా చేసిన పోరాటం దేశం యావత్తు దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాతనే 2011లో 34 ఏళ్ల లెఫ్ట్ పాలనకు మమత చరమగీతం పాడగలిగారు. వజ్రాన్ని వజ్రంతోనే కోయాలన్నట్లుగా మోడీ వంటి అథారిటేరియన్ లీడర్ కు మమత వంటి ఫైర్ బ్రాండ్ అయితేనే దీటుగా సమాధానం చెప్పగలరన్న భావనతో కాంగ్రెసు, కేసీఆర్, చంద్రబాబూ మాటామంతీ మమతతోనే ముందుగా సాగిస్తున్నారు. మూడో ఫ్రంట్ కు ఎవరు నాయకత్వం వహించాలనే విషయంలో దేశంలో చర్చోపచర్చలు సాగుతున్నాయి. ఏడుసార్లు లోక్ సభ ఎంపీగా, ఉద్యమనాయకురాలిగా, ఒక పార్టీ వ్యవస్థాపకురాలిగా, 1991లోనే కేంద్రమంత్రిగా పనిచేసిన మమతను మించిన లీడర్ లేరనేది తృణమూల్ వాదన. అటు కేంద్రంలో మంత్రిగా దశాబ్దం పైగా అనుభవం, ముఖ్యమంత్రిగా ఆరున్నరేళ్ల అనుభవం, ప్రాంతీయ నాయకులందరితో పరిచయాలున్నాయి. అయితే దురదృష్టం ఏమిటంటే ఆమెను నాయకత్వం వహించమని ఎవరూ కోరరు. ఆమె మరో మోడిలా ప్రవర్తిస్తారేమోననేది వారందరి భయం. ఆమె సాయం కావాలి. ఆమె పోరాటం చేయాలి. కానీ ఆమె నాయకత్వం మాత్రం మాకు వద్దు అనేది ఇప్పుడు అంతరాంతరాల్లో ప్రాంతీయ నేతల అంతరంగం.

- ఎడిటోరియల్ డెస్క్

Similar News