దాయాది పాక్ నీచ బుద్ధి మారదా?

Update: 2017-12-25 18:29 GMT

కడుపులో కత్తెర.. నోట్లో చక్కెర...అన్న సామెత దాయాది దేశం పాకిస్థాన్ కు చక్కగా వర్తిస్తుంది. భారత్ తో శాంతిని కోరుకుంటున్నామని పైకి చెప్పడం ఎంత సాధారణమో సరిహద్దుల్లో కాల్పులకు దిగడం దానికి అంతే సాధారణం. సైనిక, రాజకీయ, నాయకత్వాలది ఈ విషయంలో ఒకే మాట. భారత్ తో శాంతి చర్చలు జరిపేందుకు తమ ప్రభుత్వానికి మద్దతిస్తామని సైన్యాధ్యక్షుడు జనరల్ ఖ్వామర్ జావేద్ బజ్వా ప్రకటించారు. ఐఎస్ఐ అంతర్ సేవల ప్రజాసంబంధాల డైరెక్టర్ జనరల్ తో కలిసి భద్రత, ప్రాంతీయ అంశాలను నాలుగురోజుల క్రితం పాక్ సెనైట్ కు వివరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారత్ తో యుద్ధం కంటే శాంతిచర్చలే మేలని వ్యాఖ్యానించారు. జనరల్ బజ్వా ఇలా అన్న నాలుగు రోజులకే కాశ్మీర్ సరిహద్దుల్లో కాల్పులకు తెగపడటం పాక్ టెంపరితనానికి నిదర్శనం.

పాక్ కాల్పులకు బలవుతూ...

కాశ్మీర్ లోని రాజేది జిల్లా కెరి సెక్టార్ వద్ద నియంత్రణ రేఖ వద్ద పాక్ మూకలు ముగ్గురు భారత్ జవాన్లను, ఒక మేజర్ ను పొట్టనపెట్టుకున్నాయి. మేజర్ మెహర్కార్ ప్రపుల్లా అంబాదాస్ (32) గుర్మైల్ సింగ్ (34) సిపాయి పర్గత్ సింగ్ (30) మరో జవాను పాక్ కాల్పుల్లో వీరమరణం పొందారు. అంబాదాస్ మహారాష్ట్ర, గుర్మైల్ సింగ్ పంజాబ్, పర్గత్ సింగ్ హర్యానాకు చెందిన వారు. ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ రాజేదీ జిల్లాలో పర్యటిస్తున్న సమయంలోనే ఈ సంఘటన జరగడం గమనార్హం. ఇరు దేశాల మధ్య శాంతి స్థాపనల్లో భాగంగా 2003 నవంబరు 26న కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. అప్పటి ఇరు దేశాల ప్రధానులు అటల్ బిహారీ వాజ్ పేయి, జఫరుల్లాఖాన్ జమాలి ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందాన్ని గౌరవిస్తూ భారత్ ముందుకుసాగుతుంది. అదే సమయంలో ఒప్పందాలను ఉల్లంఘించడంలో పాక్ ఎప్పుడూ అగ్రభాగాన ఉంది. ఉభయ దేశాల మధ్య గల కీలకమైన 778 కిలోమీటర్ల నియంత్రణ రేఖ వెంట ఈ ఏడాది ఇప్పటి వరకూ 780 సార్లు పాక్ కాల్పులకు పాల్పడింది. సరిహద్దు భద్రతాదళం కాపలాకాసే 198 కిలోమీటర్ల అంతర్జాతీయ సరిహద్దును పాకిస్తాన్ దళాలు 120సార్లు దాటి రావడం గమనార్హం. ఈ ఏడాది ఇప్పటి వరకూ జరిపిన కాల్పుల్లో 33 మంది చనిపోయారు. వారిలో 12 మంది సాధారణ పౌరులున్నారు. కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటి నుంచి ఇంత భారీస్థాయిలో పాక్ ఉల్లంఘనలకు పాల్పడటం ఇదే ప్రధమం. 2014లో 153, 2015 లో 152 సార్లు పాక్ మూకలు కాల్పులకు దిగాయి. గత ఏడాది 228 సార్లు కాల్పులు జరిపాయి.

సరిహద్దుల్లో...భారత్....

భారత్ పాక్ మధ్యగల రమారమి 3,323 కిలోమీటర్ల సరిహద్దులో కాశ్మీర్ అత్యంత కీలకం. పాక్ తో కాశ్మీర్ 1225 కిలోమీటర్లు, రాజస్థాన్ 1037 కిలోమీటర్లు, పంజాబ్ 553 కిలోమీటర్లు, గుజరాత్ 505 కిలోమీటర్లు సరిహద్దు కలిగి ఉన్నాయి. గుజరాత్ తీరసరిహద్దు కూడా కలిగి ఉంది. మిగిలిన మూడు రాష్ట్రాలు భూ సరిహద్దులు కలిగి ఉన్నాయి. నాలుగు రాష్ట్రాల్లో కాశ్మీర్ సరిహద్దు అత్యంత కీలకమైనది. సున్నితమైంది. ఇందులో కూడా నియంత్రణ రేఖ ముఖ్యమైంది. కశ్మీర్ పై కన్నేసిన పాక్ ఉగ్రవాదులు తరచూ అక్రమ చొరబాట్లు, కాల్పులకు తెగపడటం సర్వ సాధారణంగా మారింది. భారత్ దళాలు ఎంత నిర్దిష్టంగా ఉన్నప్పటికీ రెచ్చగొట్టడం పాక్ కు అలవాటుగా మారింది. రాష్ట్రంలోని సాంబా, కార్గిల్, ద్రాస్, రాజౌరి, పూంఛ్ ప్రాంతాలు పాక్ సరిహద్దుకు సమీపంలో ఉన్నాయి. నియంత్రణ రేఖ ప్రపంచంలోని అత్యంత సున్నితమైన, సమస్యాత్మక సరిహద్దుగా గుర్తింపు పొందింది. సరిహద్దుల్లో కంచె నిర్మాణం, కంచె వెంట రహదారుల నిర్మాణంతో పాటు రాత్రివేళల్లో అక్రమ చొరబాట్లను అడ్డుకునేందుకు ఫ్లడ్ లైట్లను ఏర్పాటు చేశారు. రాత్రివేళల్లో కూడా పాక్, భారత్ సరిహద్దు పట్టపగల్లా కన్పిస్తోంది. మిగిలిన మూడు రాష్ట్రాల కన్నా కాశ్మీర్ లోనే ఎక్కువ సైన్యాన్ని మొహరించారు. రాజస్థాన్ లోని బికనీర్, జైసల్మీర్, పర్మర్, శ్రీగంగానూర్ ప్రాంతాలు పాక్ సరిహద్దుకు సమీపంలో ఉన్నాయి. ఇక్కడ పెద్దగా ఉల్లంఘనలు, కాల్పులు లేవు. గుజరాత్ లోని కచ్ బనసకాంత్, పటాన్ ప్రాంతాలు పాక్ తో సరిహద్దును కలిగి ఉన్నాయి. ఇక్కడ కూడా పాక్ పెద్దగా దృష్టి పెట్టడం లేదు. అయితే అరేబియా సముద్రం ఆవలితీరంలో పాక్ లోని కరాచీ నగరం ఉంది. సముద్ర మార్గంలో అప్పడుప్పుడూ ఉగ్రవాదులు చొరబాట్లు, నాటుపడవల్లో సంచరిస్తుంటారు. సరిహద్దుల్లో నిఘాను పెంచడం, రక్షణ కంచెను పటిష్టం చేయడం పాక్ అకృత్యాలను అంతర్జాతీయ వేదికలపై సమర్థంగా ఎండగట్టడం ద్వారా దాయాది దేశానికి అడ్డుకట్ట వేయాలి. అదే సమయంలో చర్చల ప్రక్రియను కొనసాగించడం భారత్ ముందున్న మార్గాలు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News