ఎన్నికలు అసెంబ్లీకా..? లోక్ సభకా..?

Update: 2017-11-23 16:30 GMT

ప్రతిష్టాత్మకమైన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలు సరికొత్త సమస్యను ఎదుర్కొంటున్నాయి. ఎన్నికల ప్రచారాన్ని పరుగులెత్తించే, నాయకులను సమన్వయం చేసే, ప్రజలను ఆకట్టుకునే సమర్ధ నాయకత్వ లేమి స్పష్టంగా కనపడుతోంది. అన్నింటికీ ఢిల్లీ వైపు చూసే పరిస్థితి ఏర్పడుతోంది. టిక్కెట్లక పంపిణీ, నిధుల సర్దుబాటుతో పాటు కీలక కేంద్ర నాయకుల ప్రచారం సహజంగా కేంద్ర నాయకత్వం చూసుకుంటుంది. కాని ప్రస్తుత ఎన్నికల్లో పరిస్థితి పూర్తిగా మారింది. ప్రతి దానికీ ఢిల్లీ పైనే ఆధారపడటం అనివార్య మవుతోంది. సమర్ధులైన రాష్ట్ర స్థాయి నాయకుల లేమి స్పష్టంగా కనపడుతోంది. బీజేపీ, కాంగ్రెస్ రెండూ ఈ పరిస్థితిని ఎదుర్కొంటు న్నప్పటికీ కాంగ్రెస్ లో ఈ సమస్య ఒకింత ఎక్కువగా ఉంది. ఈ పరిస్థితికి జాతీయ నాయకత్వమే కారణమని చెప్పక తప్పదు. ఇటీవల ముగిసిన హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రచారం ముఖ్యమంత్రి వీరభద్రసింగ్ కనుసన్నల్లో సాగగా, బీజేపీ వ్యవహారాలను ముఖ్యమంత్రి అభ్యర్థి శాంతకుమార్ పర్యవేక్షించారు. ఇక్కడ రెండు పార్టీలు ఇంకా తమ ముఖ్యమంత్రి అభ్యర్థులను ప్రకటించక పోవడంతో రాష్ట్ర స్థాయి నాయకులు ఎవరికి వారే యమునా తీరే... అన్న చందంగా వ్యవహరిస్తున్నారు.

కాంగ్రెస్ లో లీడర్ల కొరత....

పార్టీ శ్రేణులను సమన్వయ పరచి, కదనరంగంలో కదం తొక్కించగల రాష్ట్రస్థాయి నాయకులు గుజరాత్ కాంగ్రెస్ లో కొరవడ్డారు. పట్టుమని నలుగురు నాయకులు కూడా లేరు. పీసీసీ అధ్యక్షుడు భరత్ సింగ్ సోలంకి అనుభవజ్ఞుడైన నాయకుడు అయినప్పటికీ అంతగా ప్రజాదరణ ఉన్న నేత కారు. ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండటంతో ఆయన ప్రచారం అన్యమనస్కంగానే సాగుతోంది. మూడుసార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు ఎంపీగా, యూపీఏ హయాంలో కేంద్రమంత్రిగా పనిచేసిన సోలంకి ప్రస్తుతం రెండో దఫా పీసీసీ చీఫ్ గా బాధ్యతలను నిభాయిస్తున్నారు. ఆయన తండ్రి మాధవ్ సింగ్ సోలంకి గతంలో ముఖ్యమంత్రిగా, పీవీ హయాంలో విదేశాంగ మంత్రిగా రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. ఆయన అనుసరించిన వ్యూహం ఖామ్ (KHAM) ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలుపు తీరాలకు చేర్చింది. ఖామ్ అంటే క్షత్రియ, హరిజనులు, ఆదివాసీలు, మైనార్టీలు. ఈ నాలుగు సామాజిక వర్గాలపై దృష్టి పెట్టిన మాధవ్ సింగ్ సోలంకి పార్టీకి విజయాన్ని అందించారు. ఆయన కుమారుడైన భరత్ సింగ్ సోలంకిలో ఆపాటి వ్యూహం, చొరవ కొరవడింది.

అహ్మద్ పటేల్ వంటి నేతలున్నా...

తెరవెనుక మంత్రాంగంలో కాంగ్రెస్ లో కీలకంగా ఉన్న ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్ గుజరాత్ వాసి అయినప్పటికీ క్షేత్రస్థాయిలో ఆయన ప్రభావం శూన్యం. 1977 నుంచి 89 వరకూ సబర్ కాంత్ ఎంపీగా, 1993 నుంచి రాజ్యసభ సభ్యుడిగా పనిచేస్తున్న ముస్లిం మైనారిటీ వర్గానికి చెందిన అహ్మద్ పటేల్ కనీసం ఆ వర్గాన్ని కూడా ప్రభావితం చేసే స్థితిలో లేరు. నిన్న మొన్నటి దాకా కాంగ్రెస్ శాసనసభా పక్ష నాయకుడిగా వ్యవహరించిన శంకర్ సింగ్ వాఘేలా రాజీనామాతో కాంగ్రెస్ కు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. మధుసూధన్ మిస్త్రీ వంటి ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పే నాయకులు ఉన్నప్పటికీ వారికి ప్రజాబలం పూజ్యం.

ఢిల్లీ వైపు చూస్తూనే...

పీసీసీ మాజీ అధ్యక్షుడు అర్జున్ మొధ్ వాడియా, సీఎల్పీ మాజీ నాయకుడు, ప్రస్తుత ఏఐసీసీ కార్యదర్శి శక్తిసింగ్ గోహిల్ వంటి నాయకులు ఉన్నప్పటికీ వారికి ప్రజా క్షేత్రంలో పట్టులేదు. దీంతో ప్రతి చిన్న విషయానికి ఢిల్లీ వైపు చూడాల్సి వస్తోంది. ప్రచారానికి రాహుల్ పై ఆధారపడాల్సి వస్తోంది. అర్జున్ మొధ్ వాడియా నుంచి 2015 మార్చిలో పీసీసీ చీఫ్ గా బాధ్యతలను చేపట్టిన సోలంకి పంచాయతీ, నగర పాలకసంస్థ ఎన్నికల్లో పార్టీని విజయ పథాన నడిపించారు. కానీ ప్రస్తుతం అంత చొరవ చూపడం లేదు. పార్టీ చేపట్టిన నవ సర్జన్ యాత్ర (పునరుత్తేజ యాత్ర) కు మంచి స్పందన లభిస్తున్నప్పటికీ దానిని మరింత సమర్ధంగా ముందుకు తీసుకెళ్లే నాయకుడు కరువయ్యారు. అందువల్లే పటేదార్ల నాయకుడైన హార్థిక్ పటేల్, ఓబీసీ నాయకుడైన అల్ఫేశ్ ఠాకూర్, దళిత నాయకుడైన జిగ్నేశ్ మెవానీ వంటి వారి చుట్టూ పార్టీ తిరుగుతోంది. కాని వారిలో ఏ ఒక్కరికీ రాష్ట్ర స్థాయిలో పలుకుబడి లేదు. కొన్ని ప్రాంతాలకు, వర్గాలకు పరిమితమైన నాయకులు వారు. కానీ అవసరం కోసం వారిని చేరదీయక తప్పడం లేదు.

బీజేపీ కూడా అంతే....

బీజేపీ పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా లేదు. అన్నింటికీ మోడీ, అమిత్ షా ద్వయంపైనే పార్టీ ఆధారపడుతోంది. రాష్ట్ర స్థాయిలో సమర్థ నాయకులు లేరు. ప్రచారాన్ని, కార్యకర్తలను సమన్వయం చేసుకుని ముందుకు నడిపించే వారు లేరు. మోడీ స్థానంలో 2014 మేలో ముఖ్యమంత్రి బాధ్యతలను చేపట్టిన ఆనందీ బెన్ పటేల్ ప్రస్తుత ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. పార్టీ నియమావళి ప్రకారం 75 సంవత్సరాలు దాటిన తాను ఎన్నికల రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించారు. రాజ్ కోట్ వెస్ట్ నుంచి పోటీ చేస్తున్న విజయ్ రూపానీకి పట్టు అంతంత మాత్రమే. అత్త చాటు కోడలు, తల్లి చాటు బిడ్డలా ఉంది ఆయన పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావం చూపగల పరిస్థితిలో ఆయన లేరు. దీంతో మొత్తం ప్రచారం, వ్యూహం మోడీ, షా చుట్టూనే తిరుగుతోంది. బీజేపీ, కాంగ్రెస్ లు రాష్ట్ర స్థాయి నాయకత్వాన్ని ఎదగనివ్వకపోవడమే ప్రస్తుత పరిస్థితికి కారణంగా చెప్పవచ్చు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News