ట్రంప్ దూకుడికి కళ్లెం పడిందా?

Update: 2017-11-11 18:29 GMT

ఏ దేశమయినా... ఏ ప్రాంతమయినా ఓటర్లు వివేచనాపరులే. అక్షరాస్యులు కావచ్చు. నిరక్ష్యరాస్యులు కావచ్చు. ఓటర్లు అన్ని సందర్భాల్లో వివేకవంతమైన తీర్పునే ఇస్తుంటారు. మీడియా ప్రచారాలు, ఆర్భాటాలు, ఊకదంపుడు ఉపన్యాసాలు, ఇతర ప్రలోభాలు వారిముందు పనిచేయవు. చరిత్ర చెబుతున్న సత్యమిది. 1977లో ఇందిరాగాంధీని దారుణంగా ఓడించిన ప్రజలు తిరిగి రెండున్నర ఏళ్లకే ఆమెకు పట్టం కట్టారు. జనతా నేతల అనైక్యతను, అసమర్థతను, కీచులాటలను ఓటర్లు నిర్మొహమాటంగా తిరస్కరించారు. 1984లో నాలుగు వందలకు పైగా సీట్లను సాధించిన రాజీవ్ గాంధీ 1989లో అయిదేళ్లకే బొక్కాబోర్ల పడ్డారు. 1983లో పార్టీ పెట్టిన తొమ్మిది నెలలకే అధికారాన్ని అందుకున్న నందమూరి తారక రామారావును 1989లో ఆంధ్రప్రదేశ్ ఓటర్లు అధికారానికి దూరంగా పెట్టారు. ఇవన్నీ చరిత్ర చెబుతున్న చేదు నిజాలు. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొన్నారు. ఏడాది క్రితం డెమొక్రాట్లను ఓడించి అధికారాన్ని చేపట్టిన ఆయనను ప్రజలు అప్పట్లో మాదిరిగా ఆదరించడం లేదు. ఎన్నిమిదేళ్ల డెమొక్రాట్ల పాలనను అంతమొందించిన ట్రంప్ ఇప్పుడు ఓటర్ల తిరస్కారానికి గురవుతున్నట్లు తాజా పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి.

రెండు ఎన్నికల్లోనూ......

తాజాగా జరిగిన వర్జీనియా, న్యూజెర్సీ ఎన్నికల్లో ట్రంప్ రిపబ్లికన్ పార్టీకి చుక్కెదురైంది. రెండు రాష్ట్రాలకు మేయర్ల ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థులను డెమొక్రాట్ పార్టీ ఓడించడం విశేషం. ముఖ్యంగా రాజధాని నగరం పక్కనే గల వర్జీనియాలో ఓటమి రిపబ్లికన్ పార్టీ వర్గాలను ఆందోళనకు గురి చేస్తోంది. దేశ రాజకీయాల్లో వర్జీనియా అత్యంత కీలకమైంది. డెమొక్రాట్ అభ్యర్థి రాల్ఫ్ నోర్టహమ్ తన సమీప రిపబ్లికన్ అభ్యర్థి గిల్లెస్పై పై 9 శాతం ఆధిక్యం సాధించడం విశేషం. న్యూజెర్సీలో రిపబ్లికన్ పార్టీ దారుణ ఓటమిని చవి చూసింది. 13 శాతం ఓట్ల తేడాతో ఇక్కడ ఓడిపోయింది. డెమొక్రాట్ అభ్యర్థి ఫిల్ ముర్ఫీ తన సమీప ప్రత్యర్థి అయిన రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి క్రిస్ క్రిస్టీని మట్టికరిపించారు. ఈ ఎన్నికల ఫలితాలు డెమొక్రాట్లలో ఆనందాన్ని నింపుతుండగా, రిపబ్లికన్లలో విషాదాన్ని కల్గిస్తున్నాయి. ఈ ఎన్నికలు 2020 నాటి అధ్యక్ష ఎన్నికలకు దిక్సూచీ వంటి వని డెమొక్రాట్ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఇది కేవలం డెమొక్రాట్ల గెలుపు కాదని, ‘అమెరికా విలువల’పై ప్రజాభిప్రాయ సేకరణ వంటిదని ఆ పార్టీ జాతీయ కమిటీ ఛైర్మన్ టోమ్ పెరెజ్ పేర్కొన్నారు. తమ పార్టీ పేరులోనే ప్రజాస్వామ్యం ఉందని, రిపబ్లికన్ పార్టీ మాదిరిగా ఏకపక్ష విధానాలకు వ్యతిరేకమని, అందరి అభిప్రాయాలతోనే ముందుకెళతామని ఆయన తెలిపారు.

ఆలోచనలో రిపబ్లికన్ పార్టీ.....

ఎన్నికల ఫలితాలతో రిపబ్లికన్ పార్టీ వర్గాలను ఆలోచనలో పడేశాయి. ముఖ్యంగా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. వర్జీనియాలో పార్టీ అభ్యర్థి ఓటమికి తన బాధ్యత ఏమీ లేదనే తీరులో ట్రంప్ మాట్లాడటం ఆశ్చర్యం కలిగిస్తోంది. గెల్లెస్పై బాగా కష్టపడి ప్రచారం చేశారని చెబుతున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ బాగానే ఉందని, గెలుపు కోసం కృషి చేస్తూనే ఉంటానని ట్రంప్ ట్వీట్ చేయడం విశేషం. ఫలితాలతు డెమొక్రాట్ల ప్రభావాన్ని చాటుతున్నాయని, అదే సమయంలో రిపబ్లికన్ల వైఫల్యాలను ఎత్తి చూపుతున్నాయని ఫ్లోరిడా విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ మెక్ డొనాల్డ్ వ్యాఖ్యానించడం విశేషం. వలసలు, తుపాకుల సంస్కృతి నానాటికీ దేశంలో విస్తరించడం వంటి అంశాలు ఎన్నికల్లో ప్రభావం చూపాయని గిల్లెస్పై విశ్లేషిస్తున్నారు. సమన్వయ లోపం, ప్రచార లోపం వంటి అంశాలు ఉన్నప్పటికీ ఎన్నికల ఫలితాలు ట్రంప్ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బే. అధికారం చేపట్టినప్పటి నుంచి ఆయన అనుసరిస్తున్న విధానాలు, చేస్తున్న వ్యాఖ్యలు, విదేశాంగ విధానంలో వైఫల్యాలు మున్ముందుపార్టీని మరింతగా దెబ్బతీస్తాయని విశ్లేషకులు చెబుతున్నారు.

ట్రంప్ వైఖరి వల్లనే.....

వివిధ దేశాల నుంచి వలసలపై ట్రంప్ కఠిన వైఖరి తాత్కాలికంగా లబ్ది కలుగుతున్నట్లు కన్పించినప్పటికీ భవిష్యత్తులో దేశంపై ప్రభావం చూపుతాయి. వలసల వల్లే అమెరికా అభివృద్ధి చెందింది. వివిధ దేశాల నుంచి నైపుణ్యాన్ని వలసల ద్వారా పొంది, ఆ నైపుణ్యాన్ని వినియోగించుకుని అభివృద్ధి చెందింది. వలస వచ్చే ఉద్యోగులకు ఇచ్చే వేతనాలు, ఇతర సౌకర్యాలు కూడా తక్కువే. ఇదే పనిచేసే అమెరికన్లకు ఇంతకన్నా పెద్దమొత్తంలో వేతనాలు ఇవ్వాల్సి ఉంటుంది. మెక్సికో సరిహద్దుల్లో గోడ నిర్మాణం వంటి నిర్ణయాలు ట్రంప్ అపరిపక్వతకు నిదర్శనమన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. గోడ నిర్మాణం ద్వారా కాకుండా విస్తృతమైన తనిఖీలు, కఠినమైన నిబంధనలతో మెక్సికో నుంచి వలసలను అరికట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. ‘అమెరికా ఫస్ట్’ అన్నది అమెరికన్లు విశ్వసించే సూత్రం. ప్రపంచంలో తామే అందరికన్నా ముందుండాలన్నది వారి ఆశ...ఆకాంక్ష. ఇప్పటి వరకూ అదే జరుగుతోంది. కాని ట్రంప్ హయాంలో అంతర్జాతీయంగా అమెరికా ప్రభావం క్రమంగా తగ్గుతోంది. అదే సమయంలో చైనా శక్తి వంతమైన దేశంగా ఎదుగుతోంది. దాన్ని నిలువరించడానికి ట్రంప్ చేస్తున్నది ఏమీ లేదన్న భావన ప్రజల్లో ఉంది. కేవలం భారత్ ను ప్రోత్సహించడం ద్వారానే చైనాను నిలువరించలేమని, ఇది పరిష్కారంలో ఒక భాగమని, దీని ద్వారానే అంతా అయిపోదని విదేశాంగ నిపుణులు చెబుతున్నారు. అన్నింటికీ మించి అమెరికా అధ్యక్షుడికి ఉండాల్సినంత పరిణితి, అవగాహన, సమన్వయం ట్రంప్ లో లోపించిందని అటు పార్టీలో, ఇంటాబయటా పలువురు భావిస్తున్నారు. పరిస్థితులను నిష్పక్షపాతంగా విశ్లేషించుకోకపోతే పార్టీ, ట్రంప్ భవితవ్యం ప్రశ్నార్థకం కాగలదన్న ఆందోళన వ్యక్త మవుతోంది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News