టిడిపిలో అంతా గోల్ మాల్... బీజేపీ ఫైర్

Update: 2017-10-19 08:30 GMT

దీపావళి నాడు ఎమ్యెల్సీ బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు టిడిపి పై బాంబుల వర్షమే కురిపించారు. తెలుగు పోస్ట్ కి సోము ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో అనేక సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్ట్ కధా కమామిషు , ఉపాధి హామీలో గోల్ మాల్, ఇసుక సొమ్ములు ఎవరి జేబులు నింపుతున్నాయి ? మిత్రధర్మానికి విరుద్ధంగా వాజపేయి ప్రభుత్వం నుంచి మోడీ ప్రభుత్వం వరకు తెలుగుదేశం వెన్నుపోట్లు చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల పొత్తు హై కమాండ్ చూసుకుంటుందని తాము మాత్రం అమిత్ షా ఆదేశాల ప్రకారం 175 నియోజకవర్గాల్లో బూత్ స్థాయి యంత్రాంగంతో సిద్ధంగా ఉంటామని వీర్రాజు వెల్లడించారు. పోలవరం మోడీ వరమని , మోడీ మాటే చంద్రన్న బాట అంటూ కేంద్రం ఇస్తున్న నిధుల కు రాష్ట్రం పెత్తనాన్ని గట్టిగానే నిలదీశారు.

వైఎస్ దమ్మున్న లీడర్ అందుకే పోలవరం ...

తొమ్మిదేళ్లు సీఎం గా ఉండి తాడిపూడి , పుష్కర ఎత్తిపోతల పథకాలతో చంద్రబాబు సరిపెట్టారు. పోలవరం సాధ్యం కాదని అయినా ఆయన భావించాలి లేదా నిధులు అసాధ్యం అని అయినా ఎత్తిపోతలతో సరిపెట్టి ఉండాలి. వాస్తవం చెప్పుకోవాలి అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే పోలవరం చేపట్టారు. ఆయనకు దమ్ముంది. ఏమున్నా లేకపోయినా రంగంలోకి దిగారు. కుడి ఎడమ కాలువ నిర్మాణాలు ప్రాజెక్ట్ నిర్మించకుండా ఏమిటి అంటూ ఆయనను విమర్శించారు. డబ్బు కోసమే వైఎస్ ఇది చేశారనేది ప్రజల్లో ఇప్పటికి వుంది. కానీ ఆయన ఆ కాలువలు నాడు నిర్మించకపోతే పట్టిసీమ, పురుషోత్తమపట్నం ఎత్తిపోతలు సాధ్యం ఆయ్యేవా అన్నారు వీర్రాజు.2005 న పోలవరం అంచనా వ్యయం 10 వేల కోట్ల రూపాయలు. కిరణ్ కుమార్ రెడ్డి సీఎం అయ్యాక 2013 లో ప్రాజెక్ట్ అంచనా వ్యయం 8 ఏళ్ళలో 16 వేలకోట్ల రూపాయలు. 2013 నుంచి 2017 కి 58 వేలకోట్ల రూపాయలు ఏ లెక్కన పెరిగిందో కేంద్రానికి చెప్పాలి. కాలువలు దాదాపు వైఎస్ పూర్తి చేశారు . సుమారుగా కాంగ్రెస్ ప్రభుత్వమే 6 వేలకోట్ల రూపాయలు ప్రాజెక్ట్ కి ఖర్చు పెట్టింది. ఇక ఖర్చు తగ్గాలి కానీ పోలవరం అంచనా వ్యయం ఎందుకు పెరిగింది అని ప్రశ్నలు గుప్పించారు అధికారపార్టీపై సోము.

ఆర్డినెన్స్ నా కృషి వల్లే....

ప్రధాని ప్రమాణ స్వీకారానికి ముందు నేను చంద్రబాబు ను కలిశాను. పోలవరం పూర్తి కావాలి అంటే తెలంగాణాలో ఏడు మండలాలు ఏపీలో కలవాలి అని చెప్పా. అలా కాకపోతే ప్రాజెక్ట్ కి కేసీఆర్ అడ్డుపడే ప్రమాదం శంకించి ముందుగా హెచ్చరించా. ఆర్డినెన్స్ ఇస్తేనే ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తా లేదా చేయలేను అని మోడీ కి చెప్పమన్నది నేనే అన్నారు సోము వీర్రాజు. బిజెపి ప్రాజెక్ట్ పట్ల చూపుతున్న చిత్త శుద్ధికి అదే నిదర్శనమన్నారు. చంద్రబాబు మోడీకి అదే చెప్పారు. ప్రధాని అయిన వెంటనే తొలి కేబినెట్ 2014 ఏప్రిల్ 27 న తెలంగాణలోని ఏడు మండలాలు కలుపుతూ తీర్మానం చేశారు. ఏప్రిల్ 28 న ఆర్డినెన్స్ తెచ్చారు. అలా మోడీ పోలవరం పై సంకల్పం వహించారు. బాధ్యత తీసుకున్నారు.

టిడిపి ఎంపీ పోలవరానికి వ్యతిరేకంగా గళం కాంగ్రెస్ మౌనం ...

టిడిపి కాంగ్రెస్ పార్టీలు విభజన సమయంలో పార్లమెంట్ లో చర్చ జరుగుతుంటే మౌనం వహించాయి . పోలవరానికి వ్యతిరేకంగా టిడిపి ఎంపీ గుండు సుధారాణి గొడవ చేస్తుంటే సుజనా చౌదరి , సీఎం రమేష్ నోటికి గుడ్డలు కట్టుకుని సమన్యాయం ప్లే కార్డులు పట్టుకున్నారు. రాజ్యసభలో వెంకయ్యనాయుడు ఒక్కరే పోలవరం ప్రాజెక్ట్ అవసరాన్ని నొక్కి చెప్పారు. సాధించారు. అంతకుముందు 99 లోనే బిజెపి ఏపీ, తెలంగాణ , రాయలసీమ సస్యశ్యామలం కావాలంటే పోలవరం ప్రాజెక్ట్ మాత్రమే అవసరమని గుర్తించి ఉమ్మడి రాష్ట్రంలో నాలుగు ప్రాంతాల్లో యాత్రలు నిర్వహించింది. ఏపీలోని శ్రీకాకుళం లో కృష్ణం రాజు, వరంగల్ నుంచి బంగారు లక్ష్మణ్, కరీంనగర్ నుంచి విద్యా సాగర్, హైదరాబాద్ నుంచి బండారు దత్తాత్రేయ పోలవరం కోసం ప్రజల్లోకి వచ్చి పోరాడారు. వారిలో చైతన్యం నింపారు. వాస్తవానికి బ్రిటిష్ కాలంలోనే పోలవరం నిర్మాణం ఆలోచన వుంది . అంజయ్య 1980 లో శంఖుస్థాపన చేశారు. ఆ తరువాత 2005 లో వైఎస్ సంకల్పించి పని మొదలు పెట్టారు. ఆయనకు ప్రొఫెసర్ శేషగిరి రావు స్ఫూర్తి . ఇప్పుడు మోడీ చిత్తశుద్ధితో ఈ ప్రాజెక్ట్ బాధ్యత తీసుకున్నారు . రాష్ట్ర ప్రయోజనాల రీత్యా చంద్రబాబు కోరిక మేరకు అప్పగించారు. అన్నారు సోము వీర్రాజు.

పోలవరం క్రెడిట్ మోడిదే .....

పోలవరానికి నిధులు ఇవ్వలిసింది కేంద్రం . ఇది జాతీయ ప్రాజెక్ట్ . పనులు వేగవంతంగా చేయించాలిసింది అందుకు ఒప్పుకుని రంగంలోకి దిగిన రాష్ట్ర ప్రభుత్వానిది. గడ్కరీ పోలవరం పై చాలా సీరియస్ గా దృష్టి పెట్టారు . ఆయన స్వయంగా వచ్చి పనులు చూసి వెళ్లారు. ప్రభుత్వం చేసిన పనులకు బిల్లులు పెడితే తక్షణం మంజూరుకు సిద్ధంగా ఉన్నామని కూడా ప్రకటించారు. పోలవరం క్రెడిట్ ఒక్క టీడీపీది ఏమి కాదు . ఇందులో అందరి పాత్ర వుంది. బిజెపి శ్రేణులకు వివరించి ప్రజలకు ఈ అంశాలు తెలియచేస్తాం.

ఉపాధి హామీలో అవకతవకలు ....

రాష్ట్రంలో ఉపాధి హామీ పధకంలో పెద్దఎత్తున అక్రమాలు సాగుతున్నాయి . దీనికి సంబంధించి నా దగ్గర పూర్తి ఆధారాలు వున్నాయి. అందుకే బాధ్యతగా కేంద్రానికి లేఖ రాశా. విచారణ జరపమని కోరాను కానీ నిధులు ఆపమని నేను కోరలేదు . వైసిపి ని అన్నట్లు బిజెపి ని విమర్శించడం సరికాదు. బిజెపి అవినీతి రహిత పాలన కోసమే శ్రమిస్తోంది. అందుకు ఎవరితో అయినా పోరాడతాం. వైసీపీతో మాకు అంటగట్టకండి. ఇసుక ద్వారా వేలకోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది . లోటు బడ్జెట్ లో వున్న రాష్ట్రానికి ఆ నిధులు ఎంతో ప్రయోజనం . ఉచిత ఇసుక పేరుతో ఆ సొమ్ము ఎవరి జేబులోకి పోతుంది ? చెప్పాలని డిమాండ్ చేస్తున్నా. ఇక మా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా విజయవాడలో ఇచ్చిన ఆదేశాల ప్రకారం 175 నియోజక వర్గాల్లో బూత్ స్థాయి యంత్రాంగంతో దేనికైనా రెడీ అని తొడగొట్టారు బిజెపి నేత సోము వీర్రాజు . ఆయన సంచలన వ్యాఖ్యలపై టిడిపి స్పందన చూడాలిక.

 

-రాజమండ్రి నుంచి స్పెషల్ రిపోర్ట్

Similar News