జ‌న‌సేన‌లోకి ఈ టాలీవుడ్ స్టార్లు..!

Update: 2017-12-08 10:30 GMT

జ‌న‌సేనాని 'ఊ' అంటే ఆయ‌న‌తో పాటు అడుగులు వేసేందుకు రాజ‌కీయ నాయ‌కులే కాదు.. సినీ న‌టులు కూడా ఎంతో ఉత్సాహం చూపుతున్నారు. సంప్ర‌దాయ రాజ‌కీయాల‌కు తాను భిన్న‌మని చెప్ప‌డ‌మే కాక‌.. ఆచ‌ర‌ణ‌లోనూ నిరూపిస్తు న్నాడు ప‌వ‌ర్ స్టార్ పవ‌న్ క‌ళ్యాణ్! ఇటీవ‌ల 'చ‌లొరే చ‌లొరే చ‌ల్‌' పేరిట ప్ర‌జ‌ల్లోకి వ‌చ్చిన ఆయ‌న‌.. త‌న ఆలోచ‌న‌ల‌ను ప్ర‌జ‌ల‌తో పంచుకుంటున్నారు. ప‌వ‌న్ ఆశ‌యాలు, ఆలోచ‌న‌లు నచ్చిన కొంత‌మంది జ‌న‌సేన‌లో చేరాల‌ని, పవ‌న్‌తో క‌లిసి ప‌నిచేయాల‌ని కోరుకుంటున్నారు. ఇప్ప‌టికే టాలీవుడ్ నుంచి ప‌లువురు హీరోలు, క్యారెక్ట‌ర్ ఆర్టిస్టులు.. ప‌వ‌న్‌కు మ‌ద్ద‌తు తెల‌ప‌గా ఇప్పుడు వీరి జాబితాలో విలక్ష‌ణ న‌టుడు కూడా చేరిపోయారు. ప‌వ‌న్ వ‌ల్ల ప్ర‌జ‌ల‌కు మేలు త‌ప్ప కీడు జ‌ర‌గ‌ద‌ని స్ప‌ష్టంచేస్తున్నారు. ప‌వ‌న్‌తో కలిసి ప‌నిచేసేందుకు కూడా సిద్ధం అని చెబుతున్నారు ప్ర‌కాష్ రాజ్‌!!

పొలిటికల్ స్క్రీన్ పై షేర్ చేసుకోవాలని....

సినిమాల్లో ఒక్క‌సారైనా ప‌వ‌న్‌తో క‌లిసి స్క్రీన్ షేర్ చేసుకోవాల‌ని కోరుకునే న‌టులు చాలామంది ఉంటారు. ఇప్పుడు పొలిటిక‌ల్ స్క్రీన్‌పై ఆయ‌న‌తో క‌లిసి ప‌నిచేయాల‌ని భావిస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. త్వ‌ర‌లోనే వీరంతా జ‌న సైన్యంలోకి చేరిపోతార‌నే ప్ర‌చారం కూడా జోరందుకుంది. ఇటీవ‌ల ప‌లు సామాజిక స‌మ‌స్య‌ల‌పై గ‌ళం విప్పుతూ.. కేంద్రాన్ని ప్ర‌శ్నిస్తూ.. త‌ర‌చూ వార్త‌ల్లో నిలుస్తున్నారు ప్ర‌కాష్‌రాజ్‌!! ఆయ‌న త్వరలోనే జనసేన పార్టీలో చేర‌బోతున్నారా అనే ప్ర‌శ్న అంద‌రిలోనూ మెదులుతోంది. పవన్ కళ్యాణ్‌ కొంత కాలంగా పార్టి కార్యకలాపాలను చక్కదిద్దుతూ, వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలను చర్చిస్తూ ముందుకు కదులుతున్నారు.

పెరుగుతున్న మద్దతు...

జనసేనకి రోజు రోజుకి సినీ నటుల మద్దతు పెరుగుతూ వస్తోంది. సినీ న‌టుడు, ప‌వ‌న్ మిత్రుడు అలీ, శివబాలాజీ, శివాజీ, నాగబాబు, సంపూర్ణేష్ బాబు, వీరితో పాటు కేరెక్ట‌ర్ ఆర్టిస్ట్ న‌రేష్‌.. ఇలా పవన్‌కు మద్దతు ఇస్తున్న వారి లిస్టు రోజు రోజుకి పెరుగుతోంది. ఇప్పుడు ప్రకాష్ రాజ్ కూడా ముందుకు వస్తున్నారు. జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజకీయాలు , సినిమాలు ఇలా కొన్ని రకాల ప్రశ్నలకి సమాధానం ఇచ్చాడు. జనసేన అధ్యక్షుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ.. పవన్ పార్టీ గురించి తెలుసుకున్నాన‌ని. ప‌వ‌న్ తీసుకుంటున్న నిర్ణయాలు ఎంతో బాగున్నాయ‌ని, తన వల్ల‌ ప్రజలకి మేలు జరుగుతుంది తప్ప కీడు జరగద‌ని బ‌లంగా న‌మ్ముతున్నాన‌ని చెప్పుకొచ్చారు.

కలిసి నడిచేందుకు సిద్ధం....

ఇక‌ పవన్ గురించి అంతా తెలుసని, ఆయన ఆశయాలు చాలా గొప్పవని కితాబిచ్చాడు. పవన్ పార్టీ విధానాలు నచ్చితే ఆయనతో పాటు పార్టీలో కలిసి నడవడానికి సిద్దం అని ప్ర‌క‌టించేశాడు ప్ర‌కాష్‌రాజ్‌. తన మద్దతు ఎప్పుడు పవన్ కళ్యాణ్‌కి ఉంటుందని తెలిపారు. కాగా, ప్రకాష్ రాజ్ సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం, త్వరలోనే ప్రకాష్ రాజ్ జనసేన లో చేరనున్నట్టు సమాచారం. ఏదేమైనా ప‌వ‌న్‌కు టాలీవుడ్ నుంచి రోజు రోజుకు మ‌ద్ద‌తు బాగా పెరుగుతోంది. మ‌రి ఎన్నిక‌ల నాటికి వీరిలో ఎంత‌మంది అధికారికంగా జ‌న‌సేన‌లో చేర‌తారో ? చూడాలి.

Similar News