జ‌న‌సేన‌ను చిత్తు చేస్తోందెవ‌రు..!

Update: 2017-11-09 15:30 GMT

జ‌నసేన రాబోయే సార్వ‌త్రిక‌ ఎన్నిక‌ల‌కు ముందే తేలిపోనుందా ? కీల‌క‌మైన స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో చేతులెత్తియ‌నుందా? అన్న ప్ర‌శ్న‌ల‌కు అవున‌నే స‌మాధానమే రాజ‌కీయ‌వ‌ర్గాల్లో వినిపిస్తున్న మాట‌. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో తెలుగుదేశం, వైకాపా పార్టీల మ‌ధ్య హోరాహోరీ పోరు న‌డుస్తోంది. ఇక్క‌డ జ‌న‌సేన రెండు ప్ర‌ధాన పార్టీల మ‌ధ్య ఒక పార్టీగానే క‌నిపిస్తోంది. తెలంగాణ‌లో తెరాస‌, కాంగ్రెస్ పార్టీల మ‌ధ్య జ‌రుగుతున్న హోరాహోరీ పోరులో భాజ‌పా ఉనికి చాటుతోంది. తెదేపా అంతంత‌మాత్రంగానే ఉంది. తెలంగాణ‌లో జ‌న‌సేన ప‌రిస్థితి చెప్పుకోద‌గ్గ ప‌రిస్థితిలో లేదు. ఏ రాజ‌కీయ ప‌క్షం రాష్ట్రంలో అధికారంలోకి రావాల‌న్నా ముందుగా స్థానిక సంస్థ‌ల్లో విజ‌యఢంకా మోగించాలి. గ్రామ పంచాయ‌తీలు, ఎంపీటీసీ స‌భ్యులు, జెడ్పీటీసీ స‌భ్య‌లు, మున్సిప‌ల్‌, కార్పొరేష‌న్ల‌ల‌లో ప‌ట్టు ఉంటేనే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఆయా పార్టీలు విజ‌యం సాధించే అవ‌కాశం ఉంటుంది. 2014 సార్వ‌త్రిక ఎన్నిక‌లకు ముందు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అధికార తెదేపా ఏక‌ప‌క్ష విజ‌యం సాధించింది. గ్రామ‌పంచాయ‌తీలు, మండ‌ల ప‌రిష‌త్తులు, జిల్లా ప‌రిష‌త్తులు, మున్సిపాల్టీలు, కార్పొరేష‌న్లు కైవ‌సం చేసుకుని సంస్థాగ‌తంగా త‌న‌కు తిరుగులేద‌ని పించింది. ఈ విష‌యంలో వైకాపా వెనుక‌బ‌డిపోయింది. తెలంగాణ‌లో తెరాస కూడా ఇదే రీతిలో విజ‌య‌బావుట ఎగ‌ర‌వేసింది.

ఏపీ, తెలంగాణ‌లో దూసుకుపోతోన్న పార్టీలు....

రాష్ట్రంలో అధికారంలోకి రావాల‌న్న పార్టీ ముందుగా సంస్థాగ‌తంగా బ‌లోపేతానికి అత్య‌ధిక ప్రాధాన్యం ఇస్తాయి. 2014 ఎన్నిక‌ల‌కు ముందు వ‌చ్చిన స్థానిక ఎన్నిక‌ల‌కు ఆయా నియోజ‌క‌వ‌ర్గాల ప‌రిధిలో పోటీప‌డుతున్న ఎమ్మెల్యే, ఎంపీ అభ్య‌ర్థులే ఖ‌ర్చుని భ‌రించారు. అక్క‌డ త‌మ‌కు అనుకూలంగా అభ్య‌ర్థుల‌ను నిల‌బెట్టుకుని సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌ల్ని ప్ర‌భావితం చేయించి అనుకూల ఓటు వేయించుకున్నారు. 2018 ఆగ‌స్టు నెల నాటికి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ రాష్ట్రాల‌లో స్థానిక సంస్థ‌ల గ‌డువు కాలం ముగుస్తోంది. ఒక వేళ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో తెదేపా, తెలంగాణ‌లో తెరాస ప్ర‌భుత్వాలు సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ముందు త‌ల‌నొప్పి ఎందుకు అని భావిస్తే మాత్రం అసెంబ్లీ, పార్ల‌మెంట్ ఎన్నిక‌లు పూర్త‌య్యాక స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు నిర్వ‌హించుకొనే వ్యూహం అమ‌లు చేసే అవ‌కాశం ఉంది. ఒక వేళ గ‌డువు ప్ర‌కారం స్థానిక ఎన్నిక‌లు నిర్వ‌హిస్తే 2019 ఎన్నిక‌ల‌కు ముందే బ‌లబ‌లాలు తేలిపోతాయి. ప్ర‌స్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రాజ‌కీయ ప‌రిణామాలు చాలా వేగంగా మారిపోతున్నాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఇంటింటికీ తెలుగుదేశం పేరుతో అధికార తెదేపా త‌మ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల‌కు ఊపిరి ఆడ‌నివ్వ‌కుండా గ్రామాల్లో తిప్పుతోంది. జ‌గ‌న్ పాద‌యాత్ర‌ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో ఉన్న ప్ర‌తీ ఇంటికి వెళ్లేవిధంగా ప్ర‌త్యేక యాప్‌లు రూపొందించి స‌మ‌స్య‌లు తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి కృషి చేస్తోంది. మ‌రో వైపు వైకాపా అధినేత జ‌గ‌న్‌ ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వ‌ర‌కు 3 వేల కిలోమీట‌ర్ల సుదీర్ఘ‌యాత్ర ప్రారంభించారు. జ‌నం కూడా బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. తెలంగాణ‌లో కూడా కేసీఆర్‌, కాంగ్రెస్ పార్టీలు జ‌నంలోకి వెళ్తున్నాయి.

సంస్థాగ‌తంగా జ‌న‌సేన అడ్ర‌స్ ఎక్క‌డ‌...?

ఇక జ‌నసేన విష‌యానికొస్తే చెప్పుకోవ‌డానికి ఏం క‌నిపించ‌డంలేదు. 2009 సార్వ‌త్రిక ఎన్నిక‌ల ముందు ప్ర‌జారాజ్యం పార్టీ నిర్ణ‌యాలని త‌ల‌పిస్తోంది. అంతా గ‌ప్‌చిప్‌గా సినిమా స్థాయిలో టీజ‌ర్‌, ట్రైల‌ర్‌లా విష‌యాలు బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ట్లు అప్పుడ‌ప్పుడు కొన్ని విష‌యాలు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. ప్ర‌జారాజ్యం విష‌యంలో పేరు ద‌గ్గ‌ర నుంచి అభ్య‌ర్థుల ఎంపిక వ‌ర‌కు తీవ్ర గోప్య‌త పాటించేవారు. ఇందులో పెద్ద వ్యూహం దాగి ఉంద‌నుకొనేవారు. చివ‌రికి ఎన్నిక‌లు వ‌చ్చేస‌రికి ప్ర‌జారాజ్యం పార్టీ తేలిపోయింది. అభ్య‌ర్థుల నామినేష‌న్ గ‌డువు ఒక్క రోజు ముందు అనేక చోట్ల అభ్య‌ర్థులు ప్ర‌క‌టించారు. చివ‌రికి వారు నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్ర‌చారం చేసుకొనేలోపు పుణ్య‌కాలం కాస్తా అయిపోయింది. ఉమ్మ‌డి రాష్ట్రంలో 294 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో కేవ‌లం 18 సీట్లు మాత్ర‌మే సంపాదించ‌గ‌లిగింది. ముందుగా అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించి సంస్థాగ‌తంగా బ‌లోపేతం అయితే ప్ర‌జారాజ్యం పార్టీ ప‌రిస్థితి, చిరంజీవి భ‌విత‌వ్యం మ‌రోలా ఉండేది.

ప్ర‌జారాజ్యాన్ని గుర్తు చేస్తోన్న జ‌న‌సేన.....

ఇప్పుడు జ‌న‌సేన పార్టీ ప‌రిస్థితి కూడా ప్ర‌జారాజ్యాన్నిగుర్తుచేస్తోంది. ఒక ప్ర‌ధాన రాజ‌కీయ పార్టీకి కావాల్సిన ఆయుధాలు ఏమి జ‌న‌సేన ద‌గ్గ‌ర‌లేవు. సంస్థాగ‌తంగా చాలా బ‌ల‌హీనంగా క‌నిపిస్తోంది. ప‌వ‌న్ చుట్టూ బ‌ల‌మైన కోట‌రీ ఏర్ప‌డింద‌న్న విమ‌ర్శ‌లు అప్పుడే రాజ‌కీయ‌వ‌ర్గాల్లో మొద‌ల‌య్యాయి. ఆ కోట‌రీ ప‌వ‌న్‌ని పూర్తిగా త‌ప్పుదారి ప‌ట్టిస్తుంద‌న్న ఆరోప‌ణ‌లు ఎక్కువగా ఉన్నాయి. ప్ర‌జా స‌మ‌స్య‌ల మీద పోరాటం అని చెబుతున్నారు. ప‌వ‌న్ వ‌ర‌కు మీడియా క‌వ‌రేజీ ఉంటుంది. ఆయ‌న ప్ర‌శ్నిస్తే ఆ రెండు రోజులు హ‌ల్‌చ‌ల్ అవుతుంది. రాజ‌కీయంగా కొంత వేడిపుడుతుంది. ఆ త‌ర్వాత అంతా చ‌ల్లారిపోతుంది. పార్టీ మొత్తానికి ఒకే వ్య‌క్తి ఆక‌ర్ష‌ణ శ‌క్తిగా ప‌వ‌న్‌ని చూపిస్తున్నారు. ప‌వ‌న్‌క‌ళ్యాణ్ పిలుపు మేర‌కు బ‌లమైన పోరాటాలు చేసే వ్య‌క్తులు, ప్ర‌జా స‌మ‌స్య‌ల విష‌యంలో రాజీలేకుండా ఎదురొడ్డి పోరాటం చేసే యువ‌కులు ముందుకొస్తే బ‌లైపోతున్నారు. త‌మ వెనుక ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఉన్నాడ‌నే న‌మ్మ‌కంతో ఎవ‌రైనా ముందుకొస్తుంటే అనేక కేసుల్లో ఇరికిస్తున్నారు.

ప‌వ‌న్ హామీ ఇచ్చినా అదే గ‌తా...?

ప్ర‌త్యేక హోదా విష‌యంలో విశాఖ‌ప‌ట్నం వేదిక‌గా ఉద్య‌మించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభిమానులను, జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల‌ను లాఠీల‌తో కొట్టి అనేక కేసుల్లో ఇరికించారు. ఈ విష‌యంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ నుంచి ఎటువంటి స్పంద‌న‌రాలేదు. వారికి జ‌రిగిన అన్యాయంపైన ఖండించే నాథుడే లేరు. ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ సొంత ప్రాంతంలో నిర్మిస్తున్న‌ గోదావ‌రి మెగా ఆక్వాపుడ్ పార్కు వ‌ల్ల జీవ జలాలు, గ్రామాలు కాలుష్యంతో నాశ‌నమైపోతాయ‌ని ప్ర‌జ‌లు పెద్ద ఎత్తున ఆందోళ‌న చేస్తున్నారు. కేవ‌లం అయిదు మండ‌లాల‌కి ప‌రిమిత‌మైన గోదావ‌రి మెగా ఆక్వాపుడ్ పార్కు వ్య‌తిరేక ఉద్య‌మాన్ని విశ్వ‌మాన‌వ‌వేదిక అధ్య‌క్షుడు మ‌ల్లుల సురేష్ రాష్ట్ర‌వ్యాప్తంగా బ‌య‌ట‌కు వ‌చ్చేలా చేశారు. ఇది తెలిసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్వ‌యంగా మ‌ల్లుల సురేష్‌తో మాట్లాడారు. తుందురు, బేత‌పూడి, భీమ‌వ‌రం, మొగ‌ల్తూరు, న‌ర‌సాపురం ప్రాంతాల‌కు చెందిన రైతుల‌ను మ‌ల్లుల సురేష్ ఆధ్వ‌ర్యంలో పిలిపించుకుని హైద‌రాబాద్‌లో ప్రెస్‌మీట్ పెట్టారు. ఉద్య‌మానికి అండ‌గా నిల‌బ‌డతాన‌ని ప‌వ‌న్‌క‌ళ్యాణ్ చెప్పారు.

అరెస్ట్ చేసినా.....?

ప‌వ‌న్ క‌ళ్యాణ్ ని క‌లిసిన నేరానికి విశ్వ‌మాన‌వ‌వేదిక అధ్య‌క్షుడు మ‌ల్లుల సురేష్‌ని స్థానిక అధికార పార్టీ నేత‌లు 8 నెల‌లు కాలంలో 13 కేసుల్లో ఇరికించారు. గోదావ‌రి మెగా ఆక్వాపుడ్ పార్కుకి వ్య‌తిరేకంగా కులాల‌ను రెచ్చ‌గొడుతున్నాడ‌నే నెపంతో అత‌నిపై కేసు న‌మోదు చేయించి 38 రోజులు న‌ర‌సాపురం స‌బ్‌జైల్లో ఉంచారు. గ‌తంలో శ్రీకాకుళం జిల్లాలో సోంపేట థ‌ర్మ‌ల్ విద్యుత్కేంద్రానికి వ్య‌తిరేకంగా, క‌న్నెధార గిరిజ‌న ఉద్య‌మాల్లో మ‌ల్లుల సురేష్ చురుగ్గా పాల్గొన్నారు. ఆక్వాపుడ్ పార్కు విష‌యంలో మ‌ల్లుల సురేష్ క్రీయాశీల‌కంగా ఉంటే ఇబ్బంది త‌ప్ప‌ద‌ని గ్ర‌హించి త‌ప్పుడు కేసుల్లో ఇరికించ‌డంతో పాటు రౌడీషీట్‌, పీడీయాక్టులు తెర‌వ‌డానికి సిద్ధం చేస్తున్నారు. ఈ విష‌యంలో ప‌వ‌న్‌క‌ళ్యాణ్ నుంచి స్పంద‌న‌లేక‌పోవ‌డంతో బాధిత గ్రామాల్లో తీవ్ర ఆగ్ర‌వేశాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. మ‌రోవైపు జ‌న‌సేన త‌ర‌పున గోదావ‌రి మెగా ఆక్వాపుడ్ బాధిత గ్రామాల్లో ప‌ర్య‌టిస్తూ ప్ర‌జ‌ల్లో చైత‌న్యం నింపేందుకు ప్ర‌య‌త్నించిన సుంక‌ర క‌ళ్యాణ్ దిలిప్ అనే యువ‌కుడిని ల‌క్ష్యంగా చేసుకుని త‌ప్పుడు కేసులు బ‌నాయించార‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. గోదావ‌రి మెగా ఆక్వాపుడ్ ఉద్య‌మంలో ఇత‌నిపై ఒక కేసు న‌మోదైన త‌ర్వాత ప‌వ‌న్ క‌ళ్యాణ్ కి ఇత‌నిపై త‌ప్పుడు రిపోర్టులు ఇచ్చి త‌ప్పుదారి ప‌ట్టించార‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. స్వ‌చ్ఛందంగా ఉద్య‌మం చేస్తున్న విశ్వ‌మాన‌వ‌వేదిక అధ్య‌క్షుడు మ‌ల్లుల సురేష్ ని పిలిపించుకోవ‌డంతో అత‌ను బ‌లైపోయాడు. జ‌న‌సేన‌లో క్రీయాశీలకంగా ప‌నిచేసిన సుంక‌ర క‌ళ్యాణ్ దిలిప్‌ త‌ప్పుడు కేసుల్లో ఇరుక్కుని ఇబ్బంది ప‌డుతున్నారు. ఇలాంటి వారిని ర‌క్షించి అండ‌గా నిల‌బ‌డాల్సిన జ‌న‌సేన నాయ‌క‌త్వం ముందుకు రావ‌డంలేదు. ప్ర‌తీ విష‌యంలోనూ ప‌వ‌న్ స్పందించ‌లేక‌పోయినా ఆయ‌న త‌ర‌పున ఎవ‌రో ఒక‌రు స్పందిస్తే పార్టీ శ్రేణుల‌కు ఒకింత అండ దొరుకుతుంది.

పొత్తుల పేరుతో చిత్తు చేసే వ్యూహం?

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ని రాజ‌కీయంగా, మాన‌సికంగా బ‌ల‌హీన‌ప‌ర‌చ‌డానికి వ్యూహం సిద్ధ‌మైన‌ట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా పొత్తుల పేరుతో ప్ర‌చారం న‌డిపి జ‌న‌సేన‌ని రాజ‌కీయంగా దెబ్బ‌తీసేలా ప‌థ‌కం అమ‌లు చేస్తున్నార‌న్న ప్ర‌చారం రాజ‌కీయ వ‌ర్గాల్లో న‌డుస్తోంది. 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో జ‌న‌సేన‌కు 35 నుంచి 40 అసెంబ్లీ సీట్లు, 3 పార్ల‌మెంట్ సీట్లు ఇవ్వ‌డానికి తెదేపా మొగ్గుచూపుతుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రోవైపు జ‌గ‌న్‌కు ప‌వ‌న్ మ‌ద్ద‌తుగా నిలిచేలా మాట‌లు జ‌రుగుతున్నాయ‌ని మ‌రో ప్ర‌చారం సోష‌ల్ మీడియాలో విస్తృత‌మ‌వుతుంది. ఇంకోవైపు భాజ‌పాతో క‌లిసి జ‌న‌సేన పోటీచేస్తుంద‌న్న ప్ర‌చారం ఊపందుకుంటుంది. తెలంగాణ విష‌యంలోకి వ‌స్తే సీపీఎం పార్టీ ఏర్పాటు చేస్తున్న తృతీయ కూట‌మిలో జ‌న‌సేన చేరుతుంద‌ని ప్ర‌చారం మొద‌లు పెట్టారు. అన్ని చోట్ల ఏదో ఒక పార్టీతో క‌లుస్తార‌ని లేదా కొన్ని సీట్ల‌లో పోటీ చేస్తార‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఉన్న 175 అసెంబ్లీ సీట్లని దృష్టిలో పెట్టుకుని మొత్తం సీట్ల‌లో పోటీచేస్తామ‌ని జ‌న‌సేన పార్టీ సోష‌ల్ మీడియాలో అధికారికంగా పోస్టు చేసిన‌ ప‌ది నిమిషాల్లో ఆ పోస్టు తొల‌గించారు. ఇవ‌న్నీ జ‌న‌సేన శ్రేణుల‌కు మింగుడు ప‌డ‌డంలేదు. ఎన్నిక‌ల స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతున్నా ప‌వ‌న్ చురుగ్గా వ్య‌వ‌హ‌రించ‌క‌పోవ‌డం, వివిధ ప్ర‌చారాల్లో ఏది నిజ‌మో తెలిపే నాయ‌క‌త్వం లేక‌పోవ‌డం రోజు రోజుకి జ‌న‌సేన‌ని బ‌ల‌హీన‌ప‌రుస్తున్నాయి. 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ సీఎం అభ్య‌ర్థిగా బ‌రిలో ఉంటారా? లేదా? అన్న‌దే అంద‌ర్ని వేధిస్తున్న ప్ర‌శ్న‌. రాజ‌కీయ పార్టీలో ఇటువంటి అస్ప‌ష్ట‌త అనేది బ‌ల‌హీన‌త‌కు చిహ్నమ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు. జ‌న‌సేన వ్యూహ‌త్మ‌క‌మైన వైఖ‌రి బ‌లం కాదు.. బ‌ల‌హీనం అనే స్థాయిలో ప్రచారం ఊపందుకోవ‌డం ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభిమానుల్ని నిరాశ‌కి గురిచేస్తోంది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News