జేపీ... ఉండవల్లి మధ్యలో జనసేనాని...!

Update: 2018-02-10 15:30 GMT

పవన కల్యాణ్ వ్యూహాత్మకంగానే కదులుతున్నారా? ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం సంయుక్త పోరాటం చేసేందుకు వేస్తున్నఎత్తుగడలు జనసేన బలపడేందుకు తోడ్పడతాయా? తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఒకబలమైన జనాకర్షక పార్టీగా జనసేన నిలబడేందుకు తాజా ప్రయత్నాలు మార్గం సుగమం చేస్తాయా? అన్నీ ప్రశ్నలే. ఆశావహ ద్రుక్పథంతో సానుకూల ఫలితాలు రాబట్టేందుకు పవన్ కల్యాణ్ ఇప్పటికే ఒక కార్యాచరణ ప్రణాళికను సిద్దం చేసుకున్నట్లు ఉన్నతస్థాయిలోని జనసేన వర్గాల సమాచారం. 2014 లో తాను పోటీ చేయకుండా తెలుగుదేశం పార్టీకి సహకరించడం మొదలు ఇప్పుడు జేఎసీ ఏర్పాటు వరకూ ఒక పద్ధతిలోనే పక్కాప్లాన్ తోనే జనసేనాని కదులుతున్నారని ఆ పార్టీలోని ప్రముఖులు చెబుతున్నారు. అది రాష్ట్రానికి మంచి చేసే దిశలోనే ఉంటుందంటున్నారు. అంతేకాకుండా తాను అభిమానించే జయప్రకాశ్ నారాయణ, ఆంధ్రప్రదేశ్ విభజనకు వ్యతిరేకంగా పోరాడి కాంగ్రెసు నుంచి వెలివేతకు గురైన రాజకీయ మేధావి ఉండవల్లి అరుణ్ కుమార్ లను కూడా ఇన్వాల్వ్ చేయడం ద్వారా పార్టీకి ఒక క్రెడిబిలిటీని తీసుకురావాలని భావిస్తున్నారంటున్నారు.

స్థిరత్వం ...చిత్తశుద్ధి.....

పవన్ కల్యాణ్ కున్న జనాకర్షణ విషయంలో ఎవరికీ ఎటువంటి అనుమానాలు లేవు. ఆంధ్రప్రదేశ్లోని 175 నియోజకవర్గాలకు గాను ఇప్పటికిప్పుడు సొంతంగా పోటీచేసినా ఉభయగోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్ర, కృష్ణా, గుంటూరు, చిత్తూరు , అనంతపురం జిల్లాల్లోని 70 నియోజకవర్గాల్లో జనసేన ఒక ప్రధానమైన రాజకీయపక్షంగా నిలవగలదని అంచనా. వాటిలోని 30 స్థానాల వరకూ గెలుచుకునే అవకాశం ఉంటుందని అంచనా. మరో 22 నియోజకవర్గాల్లో ద్వితీయ స్థానంలో నిలవగల సామర్థ్యం ఉందంటున్నారు. ఇంకో 18 నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీల ఫలితాలను శాసించగలదని పార్టీ విశ్వాసం. అయితే పార్టీలో ఒక అపనమ్మకం కూడా నెలకొంది. బీజేపీ, టీడీపీతో గతంలో కలిసి నడవడం వల్ల కొంత అపఖ్యాతిని మూటగట్టుకోవాల్సి వచ్చిందనే భావన పార్టీలో ఏర్పడింది. అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో తెలుగుదేశం పార్టీని సపోర్టు చేస్తున్నట్లుగా పవన్ మాట్లాడటం కూడా జనంలోకి తప్పుడు సంకేతాలు పంపింది. అటు కేంద్రంలోని బీజేపీని, వైసీపీని విమర్శించినట్లుగా తెలుగుదేశం ప్రభుత్వాన్ని పవన్ విమర్శించడంలేదు. దీంతో టీడీపీ, జనసేనల మధ్య లోపాయికారీ అవగాహన, ఒప్పందం ఉందనే ప్రచారం కూడా సాగుతోంది. పవన్ ప్రసంగాల్లోనూ, నిర్ణయాల్లోనూ స్థిరత్వం లేదని రాజకీయ విమర్శకులు పేర్కొంటున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ హక్కులకు సంబంధించి స్పష్టమైన కార్యాచరణతో జేపీ, ఉండవల్లి వంటివారిని భాగస్వాములను చేయడం ద్వారా తన చిత్తశుద్ధిని నిరూపించుకోవచ్చనేది పవన్ ఆలోచన. దీంతో ఆటోమేటిక్ గానే జనసేన ఉద్యమానికి స్థిరత్వం వస్తుందని , ప్రజావిశ్వాసం చూరగొనగలమని పార్టీఆశిస్తోంది.

ఉండవల్లితో ఉత్సాహం...

రాజకీయ మేధావి ఉండవల్లి, వైఎస్ రాజశేఖరరెడ్డికి కీలకమైన సలహాలు ఇచ్చేవారు. ప్రతిపక్షాలకు దీటైన సమాధానాలిచ్చేలా ఛలోక్తులు పంపడం, మీడియాకు, అధిష్టానానికి లేఖలు రాయడంలో వైఎస్ ఉండవల్లిని లేఖకునిగా వినియోగించుకునేవారు. కేవీపీ అనుసంధానకర్తగా వ్యవహరించేవారు. 1999లో ఈనాడు వైఖరిని ప్రశ్నిస్తూ వైఎస్ లేఖాస్త్రం సంధించారు. ఇందులో ఈనాడు పాత్రికేయ ప్రమాణాలు, మీడియా విలువలనే వైఎస్ ప్రశ్నించారు. ఈ వ్యాసకర్త ఉండవల్లి అరుణ్ కుమార్. ఇందులో మీడియా నైతికవిలువలకు సంబంధించి అనేక ప్రశ్నలు సంధించారు. దీంతో ఈనాడు ఆత్మావలోకనం చేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. ఆ తర్వాత కాలంలో వైఎస్ కు ప్రతిపక్ష నాయకునిగా ఈనాడు సమప్రాధాన్యం ఇస్తూ వచ్చింది. సామాజిక పరమైన బలం, బలగం, ఆర్థిక దన్ను లేకపోయినా రెండుసార్లు రాజమండ్రి ఎంపీగా ఉండవల్లి ఎన్నికయ్యేందుకు వైఎస్ అన్నీ తానై చూసుకున్నారు. అవినీతి, అక్రమాలకు పాల్పడకుండా పదేళ్ల పాటు పనిచేశారు. మంచి అనువాదకుడు, వక్త అయిన ఉండవల్లి రాజకీయ విద్యార్థి. నిరంతర అధ్యయనశీలి. అనువాదకుడు. ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంగా కాంగ్రెసుతో తీవ్రంగా విభేదించారు. ప్రస్తుతం ఏ పార్టీతోనూ అనుబంధం కొనసాగించడం లేదు. ఏవిషయాన్ని అయినా లాజికల్ గా విశ్లేషించి చెప్పడం, పరిష్కారాలు సూచించడం ఉండవల్లి ప్రత్యేకత. జనాకర్షణతో కూడిన వాగ్ధాటి కూడా సొంతం. ఎనిమిది, తొమ్మిది దశకాల్లో ప్రజా,రాజకీయ అంశాలపై రాజమండ్రి సుబ్రహ్మణ్యమైదానంలో ఏకవక్త సభావేదికలు ఏర్పాటు చేసి వేలాదిమందిని ఆలోచింప చేసేవిధంగా ప్రసంగించేవారు. రాష్ట్రవిభజన తర్వాత మీడియాలోనూ బాగా పాపులర్ అయ్యారు. ఉండవల్లి లోని ఆకట్టుకునే ప్రసంగం , ఆలోచనాధోరణిని ఆసరాగా చేసుకుంటూ జనసేన ఉద్యమ వ్యూహరచన చేయాలనుకొంటోంది. దీంతో రాజకీయంగా లాభించడంతోపాటు మేధోపరమైన దిశానిర్దేశం లేదని విమర్శలు ఎదుర్కొంటున్న జనసేనకు ఆ లోటు తీరుతుంది.

జేపీ విజన్....

ఐఏఎస్ సర్వీసును, ఉన్నతస్థాయి హోదాను త్యాగం చేసి లోక్ సత్తా పేరిట ప్రజాచైతన్య వేదికను ఏర్పాటు చేశారు జయప్రకాశ్ నారాయణ. పంచాయతీ రాజ్ పై ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించేందుకు పెద్ద ఎత్తున సదస్సులు నిర్వహించారు. ఎన్నికల్లో పోటీపడుతున్న అవినీతిపరులు, అక్రమార్కులపై 2004లో జాబితాలు విడుదల చేసి పార్టీల గుండెల్లో గుబులు రేకెత్తించారు. తర్వాత సోనియా నేతృత్వంలోని జాతీయ సలహామండలితో కలిసి పనిచేశారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం, సమాచార హక్కుచట్టం వంటి వాటి రూపకల్పనలో కీలకంగా వ్యవహరించారు. 2009లో లోక్ సత్తాను రాజకీయ పార్టీగా మార్చి ఎన్నికల బరిలో తలపడ్డారు. ఆశించిన స్థాయి ఫలితం దక్కలేదు. ఆయనది విధానాల రూపకల్పనలో అందె వేసిన చేయి. స్వచ్ఛత, నిజాయతీ కలిగిన నేతగా ప్రత్యర్థి పక్షాలు సైతం గుర్తించి గౌరవిస్తాయి. ప్రభుత్వ పనితీరుపై పట్టు , కార్యనిర్వాహకవర్గాలను పనిచేయించే విధానం తెలిసిన నేత. దీర్ఘకాలిక దృష్టి కలిగిన విజనరీ. రెండు తెలుగు రాష్ట్రాల్లోని పార్టీలు కూడా జేపీ చిత్తశుద్ధిని శంకించవు. అయితే ఎలక్టోరల్ పాలిటిక్స్ లో జేపీని అనుసరించడం , ఆయన చెప్పిన విధానాలను పాటించడం సాధ్యంకాదు కాబట్టి పార్టీలు ఆయనకు దూరంగా ఉంటాయి. జేపీతో పవన్ కల్యాణ్ కు బలమైన వ్యక్తిగత సంబంధాలున్నాయి. 2014 లో మల్కాజ్ గిరి నుంచి ఎంపీ అభ్యర్థిగా జేపీ పోటీ చేసినప్పుడు ఆయనకు మద్దతుగా ప్రచారం చేయాలని పవన్ కల్యాణ్ భావించారు. అయితే టీడీపీ, బీజేపీతో జనసేన పొత్తులో ఉండటంతో తప్పుడు సంకేతాలు వెళతాయని చంద్రబాబు నాయుడు పవన్ కల్యాణ్ ఇంటికి వెళ్లి మరీ రిక్వెస్టు చేయడంతో తన నిర్ణయాన్ని పవన్ ఉపసంహరించుకున్నారు. తిరిగి జేపీతో కలిసి పనిచేసేందుకు 2019 నాటికి రంగం సిద్దం చేసుకుంటున్నారు. పైపెచ్చు ఇప్పుడు లోక్ సత్తా మనుగడలో లేనట్లే లెక్క. జేపీ విజన్, ఉండవల్లి రాజకీయ చతురత తన జనాకర్షణతో కలగలిసి వస్తే .. వచ్చే సార్వత్రిక ఎన్నికలను ప్రభంజనంగా మార్చుకోవచ్చనేది పవన్ ఆలోచనగా పార్టీ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. భిన్నమైన రంగాల నుంచి వచ్చిన ఈ ముగ్గురూ ఒకే పంథాను అనుసరిస్తూ ఒకే పథంలో పయనించడం సాధ్యమా? అనే సందేహాలు కూడా ఉన్నాయి. ఏ అంశంపై అయినా ఈ ముగ్గురికీ కూడా స్థిరమైన అభిప్రాయాలు ఉంటాయి. అవి భిన్నంగా కూడా ఉండవచ్చు. రాజీ పడే తత్వం కూడా తక్కువ. ఇగో, ఈర్ష్యాసూయలను పక్కనపెట్టి భిన్నధృవాలు కలిసి నడుస్తాయో లేదో రేపటి రాజకీయమే తేల్చాలి.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News